• facebook
  • whatsapp
  • telegram

ఏటా తప్పని విత్తన గండం

కష్టాల సేద్యంతో రైతు బేజారు

 

 

తొలకరి జల్లులు పడినప్పటి నుంచే నాసిరకం విత్తనాలు విపణులను ముంచెత్తడం మొదలవుతోంది. అధికార బృందాలు అంతంతమాత్రంగా జరుపుతున్న దాడుల్లోనే క్వింటాళ్ల కొద్దీ నాసిరకం విత్తనాలు దొరుకుతున్నాయి. దీన్నిబట్టి అవి రైతులను ఎంతగా దెబ్బతీస్తున్నాయో అర్థమవుతుంది. ఈ ఆర్థిక సంవత్సరం ఖరీఫ్‌, రబీ సీజన్లలో కలిపి 32.80 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 3.8శాతం అధికం. వానాకాలం పంటలు మరింత కీలకమని, ఒక్క ఖరీఫ్‌లోనే 16.31 కోట్ల టన్నులు పండించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఉన్న భూముల్లో అధిక ఉత్పాదకత సాధిస్తేనే దిగుబడుల లక్ష్యాలు నెరవేరతాయి. ఉత్పాదకత పెరగాలంటే రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలి. కానీ దేశీయంగా వ్యాపారులు చెప్పింది నమ్మి విత్తితే... పంట వస్తే దేవుడి దయ అన్నట్లుగా పరిస్థితి తయారయింది. కొత్త విత్తన చట్టం తెస్తామని పాలకులు గొప్పలు చెబుతున్నా, దానికి సంబంధించిన బిల్లు పార్లమెంటు దాటకుండా అదృశ్యశక్తులు అడ్డుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి.

 

ప్రైవేటు దందా

అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇండియాలో పంటల ఉత్పాదకత తక్కువగా ఉండటానికి నాణ్యమైన విత్తనాల కొరతే ప్రధాన కారణం. భారత్‌లో రాష్ట్రాలమధ్యా ఉత్పాదకతలో చాలా వ్యత్యాసం ఉంటోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో మొక్కజొన్నలు హెక్టారుకు 2123 కిలోలు పండుతున్నాయి. తమిళనాడులో 7036 కిలోల ఉత్పాదకత వస్తోంది. పలుదేశాల్లో అది 10 వేల కిలోలకు పైమాటే! భారత్‌లో ప్రైవేటు కంపెనీలే ఎక్కువగా విత్తనాలను విక్రయిస్తున్నాయి. నాణ్యతనూ అవే ధ్రువీకరిస్తున్నాయి. ఫలితంగా నాసిరకం విత్తనాలు కొన్న రైతులు నష్టపోతున్నారు. గతేడాది పంజాబ్‌లో నాసిరకం పత్తి విత్తనాలతో తెగుళ్లు వ్యాపించి 60శాతం పంట నాశనమైంది. నష్టపోయిన రైతులకు పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ నష్టపరిహారం అందజేశారు. కొన్ని రాజకీయ పార్టీలు, కొందరు నేతలు డబ్బుపై వ్యామోహంతో నాసిరకం విత్తనాలు, పురుగుమందుల విక్రయాలకు అండగా నిలుస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

 

ఇండియాలో మొత్తం 540 ప్రైవేటు విత్తన కంపెనీలున్నాయి. వాటిలో 80 మాత్రమే విత్తన పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాలలను కలిగి ఉన్నాయని పార్లమెంటరీ స్థాయీసంఘం ఇటీవలి నివేదికలో వెల్లడించింది. మిగిలిన కంపెనీలన్నీ ప్రభుత్వ పరిశోధనా సంస్థలు విడుదల చేసే వంగడాలను ఉత్పత్తి చేసి తమ సొంత బ్రాండ్లతో అధిక ధరలకు అమ్ముకుంటున్నాయి. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) అంచనాల ప్రకారం రైతులకు విక్రయించే వంగడాల రకాల్లో ప్రభుత్వ పరిశోధనా సంస్థలు విడుదల చేసినవే 53.25 శాతం. 1969 నుంచి ప్రభుత్వ పరిశోధనా సంస్థలే వివిధ పంటలకు సంబంధించి 5700 రకాల విత్తనాలను విడుదల చేశాయి. 2005-06లో భారత్‌లో రైతులు కొనుగోలు చేసిన మొత్తం విత్తనాల్లో 60శాతానికి పైగా ప్రభుత్వ సంస్థలు అభివృద్ధి చేసినవే. 2020-21నాటికి ప్రైవేటు కంపెనీల విత్తనాలు 64.46శాతానికి చేరాయి!

 

భారత్‌లో విత్తనాల కొరతా తీవ్రంగా వేధిస్తోంది. దాన్ని ఆసరాగా చేసుకొని అక్రమార్కులు నాసిరకం విత్తనాలను అందమైన ప్యాకెట్లలో నింపి అన్నదాతలకు అంటగడుతున్నారు. దేశీయంగా నూనెగింజ పంటల సాగు విస్తీర్ణం, దిగుబడులు పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను కోరుతున్నాయి. ప్రస్తుత ఖరీఫ్‌లో దేశంలో సోయాచిక్కుడు పంటను సాధారణ విస్తీర్ణంలో సాగుచేయాలంటే 37.21 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం. అవి 2.18 లక్షల క్వింటాళ్లకు పైగా తక్కువగా ఉన్నాయని కేంద్ర వ్యవసాయశాఖ నిర్వహించిన ఖరీఫ్‌ సదస్సులో రాష్ట్రాల వ్యవసాయ శాఖలు నివేదికలిచ్చాయి. మొక్కజొన్న విత్తనాల విషయంలోనూ 4162 క్వింటాళ్ల కొరత ఉందని కేంద్ర వ్యవసాయశాఖ వెల్లడించింది.

 

ప్రోత్సాహం అందించాలి

ఒకప్పుడు ఇండియాలో రైతులు సొంతంగా విత్తనాలు పండించుకొని, మళ్ళీ వాటినే తరవాతి పంట సాగుకు ఉపయోగించేవారు. ప్రస్తుతం సంకరజాతి విత్తనాలు పెరిగాయి. వాటి విత్తనాలను తరవాతి సీజన్‌లో మళ్ళీ విత్తే అవకాశం లేకపోవడంతో విపణిలోనే కొనాల్సి వస్తోంది. ఈ తరుణంలో విత్తన పంటల సాగును ప్రోత్సహిస్తే రైతుల ఆదాయం పెరుగుతుందని నెదర్లాండ్స్‌, ఇజ్రాయెల్‌ వంటి దేశాలు నిరూపిస్తున్నాయి. తెలంగాణలో సైతం అంకాపూర్‌ వంటి చిన్న గ్రామంలోని రైతులు విత్తన పంటలతో అధిక ఆదాయం పొందుతున్నారు. నాణ్యమైన విత్తనాల పంటలను సాగుచేసేందుకు ఏడాది ముందు నుంచే పక్కా ప్రణాళిక అవసరం. నాణ్యమైన విత్తన పంటల సాగుకు తెలుగు రాష్ట్రాల భూములు, వాతావరణం అనుకూలమని పరిశోధనా సంస్థలు చెబుతున్నాయి. వాటి సాగువైపు మళ్ళిస్తే వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని తెలుగు రైతులకు అందించవచ్ఛు పైగా స్థానికంగా సేద్యం కోసం నాణ్యమైన వంగడాలను అందుబాటులోకి తేవడానికీ అవకాశం లభిస్తుంది. గ్రామాల వారీగా రైతులను ఎంపిక చేసి విత్తన పంటల సాగును ప్రోత్సహిస్తే దేశ ఆహార భద్రతకు భరోసా దక్కుతుంది.

 

ఎగుమతుల్లో వెనకబాటు

దేశీయంగా విత్తన పరిశ్రమల వార్షిక వ్యాపార విలువ రూ.19 వేల కోట్లకు చేరి, ఏటా స్థిరంగా అభివృద్ధి చెందుతోందని భారత విత్తన పరిశ్రమల సమాఖ్య స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో భారత్‌ విత్తన కంపెనీల ఎగుమతులు పెద్దగా కనిపించవు. ప్రపంచ విత్తన ఎగుమతుల వ్యాపార విలువ ఏటా రూ.11 వేల కోట్ల దాకా ఉంది. అందులో భారత్‌ వాటా కేవలం వెయ్యి కోట్ల రూపాయల లోపేనని సమాఖ్య తెలిపింది. మరింత ప్రోత్సహిస్తే 2028 నాటికి అంతర్జాతీయ మార్కెట్లో ఇండియా విత్తన ఎగుమతుల వాటా 10శాతానికి చేరడానికి అవకాశం ఉంది.

 

కొరవడిన ప్రణాళిక

విత్తన పంటలపై ముందస్తు ప్రణాళికలు సరిగ్గా లేకపోవడం, ఒకవేళ ఉన్నా రైతులను ప్రోత్సహించేలా వాటిని అమలు చేయకపోవడం విత్తనాల కొరతకు దారితీస్తోంది. ప్రస్తుత ఖరీఫ్‌లో నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించాలంటే 2020లోనే ప్రణాళిక తయారుచేసి 2021లో పంటలు పండించాలి. అనంతరం విత్తనాలు సేకరించి, శుద్ధిచేసి, నాణ్యతను పరీక్షించి విక్రయాలకు వ్యవసాయ శాఖలు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి. అది సక్రమంగా సాగడంలేదు. భూసారం పెంచే జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి పైర్ల విత్తనాలనూ ఉత్తరాది రాష్ట్రాల విత్తన కంపెనీల నుంచే తెలుగు రాష్ట్రాల కోసం కొనాల్సి వస్తోంది. ఏపీలో నాణ్యమైన విత్తనాలు అందించడానికి ప్రారంభించిన ‘విత్తన గ్రామం’ పథకం సరిగ్గా అమలు కావడంలేదు.

 

- మంగమూరి శ్రీనివాస్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పోరుబాటలో ఆకాశనేత్రం

‣ కడగండ్ల సేద్యం

‣ దేశ రక్షణలో మేలిమి పథమేనా?

‣ ముసురుతున్న అణుభయాలు

‣ వైద్యరంగంలో సాంకేతిక విప్లవం

Posted Date: 25-06-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం