• facebook
  • whatsapp
  • telegram

వసుధైక కుటుంబానికి అసలైన ఆలంబన

లౌక్యం, దౌత్యమే విదేశాంగ విధాన విశిష్టతలు

 

 

స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే విదేశీ విధాన రూపకల్పనలో భారత్‌ తన ప్రత్యేకతను చాటుకుంది. రెండో ప్రపంచ యుద్ధానంతరం అగ్రరాజ్యాలుగా ఆవిర్భవించిన అమెరికా, నాటి సోవియట్‌ యూనియన్‌లలో ఏదో ఒక దాని వైపు చేరకుండా, తటస్థంగా ఉండాలని సమకాలీన స్వతంత్ర దేశాలకు మార్గనిర్దేశం చేసింది. అలీనోద్యమ రూపకర్తలు నెహ్రూ, గామెల్‌ అబ్దుల్‌ నాసర్‌, సుకర్ణో ప్రభృతుల కృషి ఫలితంగా పలు కామన్‌వెల్త్‌, వర్ధమాన దేశాలు ఒక గొడుగు కిందకు చేరడంతో భిన్నధ్రువ ప్రపంచం ఆవిష్కృతమైంది. 75 ఏళ్ల స్వతంత్ర ప్రస్థానంలో మూడు ముఖ్యమైన సంధి దశలను ఎదుర్కొన్న భారత్‌- సమయానుకూలంగా తన ప్రాథమ్యాలను మార్చుకుంది. 1947 నుంచి నలభై ఏళ్ల పాటు స్థిరమైన తటస్థతతోపాటు కొద్దిగా రష్యా అనుకూల వైఖరిని అనుసరించింది. 1990ల్లో ప్రపంచీకరణ, సరళీకరణ ప్రభావంతో అమెరికాకూ చేరువై మిశ్రమ పంథాలో నడిచింది. 2008 నాటి ఆర్థిక మాంద్యం, అమెరికాతో పౌర అణు ఒప్పందం, కేంద్రంలో నాయకత్వ మార్పిడి తరవాత ప్రాంతీయ, దౌత్య, వాణిజ్య సంబంధాల్లో ఇండియా కొత్త సమీకరణలకు తెరతీస్తోంది.

 

‘యాక్ట్‌ ఈస్ట్‌’ విధానంతో...

‘ఇండియా ఒక్కటే కాదు, కొత్తగా స్వాతంత్య్రం సిద్ధించిన దేశాలు ఏదో ఒక శక్తిసంపన్న కూటమి చెంతకు చేరడం శ్రేయస్కరం కాదు. ఆర్థిక, వాణిజ్య, భద్రత, రాజకీయ అవసరాల మేరకు సంబంధాలు నెరపడం సముచితం’ అన్న నెహ్రూ ఆలోచనలే నేటికీ విదేశాంగ విధానం పరంగా దిల్లీ నాయకత్వాన్ని చుక్కానిగా నడిపిస్తున్నాయి. అంతర్గత పాలనాంశాలతో పాటు బాహ్య ప్రపంచంతో సంబంధాలను విదేశాంగ విధానాలే నేరుగా, వేగంగా ప్రభావితం చేస్తాయి. వాణిజ్య అవసరాలే ప్రధాన అజెండాగా పరిణమించిన ప్రస్తుత తరుణంలో విదేశాలతో ఒప్పందాలు దేశీయంగా విపణిని, ప్రజల ఆర్థిక స్థితిగతులను నిర్దేశిస్తున్నాయి. బ్రెటన్‌వుడ్స్‌ సిద్ధాంతం నుంచి పుట్టుకొచ్చిన ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌లు నేడు ప్రపంచ ఆర్థిక గమనాన్ని శాసిస్తున్నాయి. ఆ ప్రయోజనాలు పొందేందుకు ఇండియా ఖండాంతరంగా భిన్న కూటముల్లో భాగస్వామి అయ్యింది. దక్షిణాసియా ప్రాంతీయ పురోగతికి సహకరించుకోవాలన్న లక్ష్యంతో ఢాకా వేదికగా 1985లో సార్క్‌ కూటమి ఆవిర్భవించింది. పాక్‌ కుటిల బుద్ధి కారణంగా ఆ కూటమి మనుగడ ప్రశ్నార్థకమైంది. బంగాళాఖాతం చుట్టూ ఉన్న దేశాలతో ఏర్పడిన ‘బిమ్స్‌టెక్‌’లో భారత్‌ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. తూర్పు ఆసియా, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని వనరులు కొత్త అవకాశాలు కల్పిస్తాయని ఆశించిన పీవీ నరసింహారావు ‘లుక్‌ ఈస్ట్‌’ నినాదమిచ్చారు. దాన్ని సాకారం చేయాలన్న సంకల్పంతో మోదీ ‘యాక్ట్‌ ఈస్ట్‌’గా మార్చారు. 2004 నాటి సునామీ విలయం తరవాత ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో సహాయక చర్యల నిమిత్తం ఏర్పాటైన క్వాడ్‌- కాలక్రమంలో రక్షణ, భద్రత సహకార వేదికగా రూపాంతరం చెందింది. చైనా దూకుడుకు కళ్ళెం వేయడమే లక్ష్యంగా క్వాడ్‌ ముందుకు సాగుతోంది.

 

పీవీ హయాము ముందుదాకా పాలస్తీనాకు అనుకూలంగా ఉన్న దిల్లీ, అనంతరం ఇజ్రాయెల్‌కూ స్నేహహస్తం అందించింది. మోదీ 2017లో ఇజ్రాయెల్‌, 2018లో పాలస్తీనా భూభాగాలను సందర్శించారు. రక్షణ, సమాచార, వ్యవసాయ రంగాల్లో అద్భుత ప్రగతి సాధించిన ఇజ్రాయెల్‌- ఆ సాంకేతికతను ఇండియాతో పంచుకుంటోంది. అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్‌తో సంబంధాలు బలహీనపడటం దీర్ఘకాలంలో భారత్‌కు నష్టదాయకమే. యూఏఈ, ఆస్ట్రేలియాలతో ఇటీవలే ఇండియాకు స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. ఈ సంవత్సరాంతానికి బ్రిటన్‌, ఐరోపా సమాఖ్య (ఈయూ)లతోనూ అలాంటి ఒడంబడికలు ఒక కొలిక్కి రానున్నాయి. ఇండియా జీ-7లో భాగస్వామి కాకపోయినా తరచూ ఆహ్వానం అందుకొంటోంది. అందులో భారత్‌ క్రియాశీలంగా వ్యవహరిస్తోంది. ఇంధన అవసరాల కోసం మధ్య ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని చమురు, సహజవాయు సంపన్న దేశాలతో స్నేహం చేస్తోంది.

 

పెరిగిన దూరం

ఎన్నికలు, పార్లమెంటరీ, సైనిక కార్యకలాపాల్లో విదేశీ జోక్యాన్ని లేశమాత్రమైనా అనుమతించకపోవడం భారత్‌ విదేశాంగ విధానంలోని విశిష్టత. పాక్‌, చైనాలతో ఘర్షణలు, బంగ్లా విమోచనం, పోఖ్రాన్‌ అణుపరీక్షలు, పలుచోట్ల వరస బాంబు పేలుళ్ల వంటి ఘటనలెన్నో అంతర్జాతీయంగా మన దౌత్య సంబంధాలను మలుపు తిప్పాయి. ‘నైబర్‌హుడ్‌ ఫస్ట్‌’ అంటూ దిల్లీ నాయకత్వం సార్క్‌ దేశాలకు అంతరిక్ష ప్రయోగ ఫలాలు సహా పలు వరాలు ప్రకటించినప్పటికీ, ఇటీవల దూరం పెరిగిందన్నది వాస్తవం. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించాలా, వద్దా అన్న మీమాంసను వీడి అక్కడ శాంతి, సౌభ్రాతృత్వాన్ని పాదుకొల్పేందుకు చొరవ తీసుకోవడం ఇండియాకు అత్యావశ్యకం. డ్రాగన్‌ కారణంగా గతంలో నేపాల్‌, ఇండియా మధ్య విభేదాలు నెలకొన్నాయి. తాజాగా దేవ్‌బా నాయకత్వంలో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్‌ఆర్‌సీ, సీఏఏ చట్టాలు బంగ్లాదేశ్‌ను అసంతృప్తికి గురిచేశాయి. శ్రీలంక అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చి రాజీవ్‌ గాంధీని కోల్పోయిన భారత్‌ తదనంతరం సంబంధాలను పునరుద్ధరించుకుంది. శ్రీలంక తాజా ఆర్థిక సంక్షోభంలో ఇంధన, ఆహార, వైద్య సహాయం అందిస్తూ అండగా నిలుస్తోంది. ఈ పరంపరను కొనసాగిస్తూ పొరుగు దేశాలతో మైత్రిని నిలబెట్టుకోవడానికి భారత్‌ కృషి చేయాలి. శక్తిమంతమైన అమెరికా, రష్యా, చైనా, ఈయూలతోనూ ఆర్థిక, వాణిజ్య బంధాలను పటిష్ఠం చేసుకోవడం లక్ష్యంగా ఇండియా ముందుకు సాగాలి.

 

శాంతికే ప్రాధాన్యం

‘ఒక దేశానికి చేరువ కావడం అంటే, మరో దేశానికి దూరమైనట్లు కాదు’ అన్న వాజ్‌పేయీ సూత్రీకరణ పాలస్తీనా-ఇజ్రాయెల్‌, అమెరికా-రష్యాలతో మన సంబంధాల్లో ప్రతిబింబిస్తోంది. విరుద్ధ భావజాలం కలిగిన దేశాలతో ఏకకాలంలో సమతుల్యత పాటించడం భారత్‌ లౌక్యనీతికి, దౌత్యరీతికి నిదర్శనం. తాజాగా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలోనూ తటస్థ వైఖరినే అవలంబిస్తూ, బాధిత పక్షానికి మానవతా సహాయాన్ని అందిస్తోంది. దశాబ్దాలుగా గల్ఫ్‌ దేశాలతో ఉమ్మడి ప్రయాణం సాగిస్తున్న భారత్‌ మైత్రి నేటికీ చెక్కుచెదరలేదు. అరబ్‌ నేలపై విభిన్న తెగల మధ్య రగులుతున్న అంతర్యుద్ధాల్లో ఏ పక్షమూ వహించకుండా శాంతి స్థాపనకే ఇండియా ప్రాధాన్యమిస్తోంది. భాషలు, మతాలు, చారిత్రక గాథలు, ఆహారం, సినిమా, పర్యాటకం, వాణిజ్య రంగాల్లోని సారూప్యతలు పర్షియన్‌, అరబ్‌,  పశ్చిమాసియాతో దిల్లీ చెలిమిని పటిష్ఠంగా నిలిపాయి.

 

సరిహద్దుల్లో రగడ

అంతర్జాతీయ యవనికపై ‘విశ్వగురు’ స్థానాన్ని ఆశిస్తున్న భారత్‌కు పొరుగు దేశాలతో సరిహద్దు వివాదాలు ఇబ్బందికరంగా మారాయి. స్వాతంత్య్రం పొందిన తొలినాళ్లలోనే ఇండియాపై చైనా దురాక్రమణకు దిగి- ‘హిందీ చీనీ భాయీభాయీ’ అన్న నెహ్రూ విశాల దృక్పథానికి తూట్లు పొడిచింది. ఇప్పటికీ లద్దాఖ్‌ నుంచి అరుణాచల్‌ వరకు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రాజేస్తోంది. అభివృద్ధి ప్రాజెక్టులు, ఆర్థిక సాయం పేరిట దక్షిణాసియాలోని చిన్న దేశాలను డ్రాగన్‌ గుప్పిట పడుతూ ఇండియాకు సవాళ్లు విసురుతోంది. తాజాగా దిల్లీకి చిరకాల మిత్రదేశమైన రష్యాకూ చైనా చేరువవుతుండటం ఏమాత్రం ఆహ్వానించదగినది కాదు. ఇండియాతో పలుమార్లు కయ్యానికి దిగి పరాభవాన్ని చవిచూసిన పాక్‌- డ్రాగన్‌ అండతోనే ఐరాస సహా భిన్న వేదికలపై భారత్‌ లక్ష్యంగా ఎగిరిపడుతోంది. ఐరాస భద్రతా మండలిలో భారత్‌ శాశ్వత సభ్యత్వానికి సైతం చైనా అడ్డుపడుతోంది. ప్రబల శక్తిగా ఎదుగుతున్న డ్రాగన్‌కు దీటుగా నిలవడంతోపాటు, ప్రాంతీయ  వివాదాలను భారత్‌ సామరస్యంగా పరిష్కరించుకోవాలి.

 

- బోండ్ల అశోక్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కశ్మీర్‌పై అల్‌ఖైదా దుష్టనేత్రం

‣ ఆర్థిక పురోగమనానికి బ్రిక్స్‌ భరోసా

‣ వరదల బీభత్సం... జనజీవనం అస్తవ్యస్తం!

‣ అఫ్గాన్‌కు భారత్‌ ఆపన్నహస్తం

‣ 5జీ రాకకు వేళాయె...

Posted Date: 04-07-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం