• facebook
  • whatsapp
  • telegram

మరో ప్రచ్ఛన్న యుద్ధానికి నాంది

బాల్టిక్‌ సముద్రంపై పట్టుబిగిస్తున్న నాటో

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఐరోపా భౌగోళిక రాజకీయ స్వరూపాన్నే మార్చేస్తోంది. ఆ పోరుతో ఆందోళనకు గురైన ఫిన్లాండ్‌, స్వీడన్‌ ప్రస్తుతం నాటో సైనిక కూటమిలో సభ్యత్వం కోసం వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ఇటీవల మాడ్రిడ్‌లో జరిగిన నాటో సమావేశంలో ఆ రెండు దేశాల సభ్యత్వానికి ఉన్న అడ్డంకులు నాటకీయ పరిస్థితుల్లో తొలగిపోయి కూటమిలో చేరేందుకు అంగీకారం లభించింది. ఆ సమావేశం క్రెమ్లిన్‌ను ప్రధాన ప్రత్యర్థిగా తేల్చింది. తొలిసారి ఇండో-పసిఫిక్‌ వ్యూహానికి పదును పెడుతూ చైనాను వ్యవస్థీకృత సవాలుగా పేర్కొంది. ఐరోపాలోని నాటో తక్షణ ప్రతిస్పందన దళం సభ్యుల సంఖ్యను మూడు లక్షలకు పెంచాలని భేటీలో నిర్ణయించారు. ఆ నిర్ణయాలపై గుర్రుగా ఉన్న క్రెమ్లిన్‌ ప్రతిస్పందనకు సిద్ధమవుతోంది.

ఉద్రిక్తంగా తీరం

నాటోలో చేరాలన్న ఫిన్లాండ్‌ నిర్ణయం వాస్తవ రూపం దాలిస్తే రష్యాతో నాటో కూటమి సరిహద్దులు 754 మైళ్ల నుంచి 1586 మైళ్లకు పెరుగుతాయి. మాస్కోకు కీలకమైన ‘కోలా’ ద్వీపకల్పంలోని ముర్మాన్స్క్‌ను ప్రధాన భూభాగంతో కలిపే రైలు, రోడ్డు మార్గాలు ఫిన్లాండ్‌ సరిహద్దులకు సమాంతరంగా సాగుతాయి. రష్యాకు ముర్మాన్స్క్‌ అతిపెద్ద ఉత్తర నౌకాదళ ప్రధాన కేంద్రం. భవిష్యత్తులో ఎప్పుడైనా నాటో దళాలు ఆ రైలు, రోడ్డు మార్గంపై దాడి చేస్తే కోలా ద్వీపకల్పానికి రష్యా ప్రధాన భూభాగం నుంచి సరఫరాలు నిలిచిపోతాయి. బారెంట్స్‌ సముద్రంలో క్రెమ్లిన్‌ పట్టు సడలుతుంది. స్వీడన్‌ సైతం నాటోలో చేరితే బాల్టిక్‌ సముద్రం నడిబొడ్డున ఉన్న గాట్లాండ్‌ ద్వీపంపై పశ్చిమ దేశాల పట్టు పెరిగిపోతుంది. రష్యా నౌకాదళ స్థావరం ఉన్న కలినన్‌గ్రాడ్‌ అక్కడకు 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ నౌకల ప్రతి కదలికా ముందుగానే నాటోకు చేరిపోతుంది. దాంతోపాటు ఫిన్లాండ్‌ ప్రాదేశిక జలాల్లో అమర్చే నిఘా పరికరాలు సెయింట్‌పీటర్స్‌బర్గ్‌- కలినన్‌గ్రాడ్‌ మధ్య రష్యా దళాల కదలికలను గుర్తిస్తాయి. బాల్టిక్‌ సముద్రం నుంచి ఉత్తర సముద్రంలోకి రష్యా నౌకలు వెళ్ళాలన్నా డెన్మార్క్‌ అధీనంలోని డానిష్‌ జలసంధులే మార్గం.

స్వీడన్‌, ఫిన్లాండ్‌లు ఇన్నేళ్లు తటస్థంగా ఉన్నా, నాటోలోని చాలా బాల్టిక్‌ దేశాలతో పోలిస్తే బలమైన సైనిక దళాలను తయారు చేసుకున్నాయి. పశ్చిమ దేశాలకు చెందిన ఆయుధాలు, యుద్ధవిమానాలను ఫిన్లాండ్‌ కొనుగోలు చేసింది. 2.5 లక్షల మందితో దళాలను సిద్ధం చేసుకుంది. నాటో చేపట్టిన అఫ్గాన్‌, లిబియా ఆపరేషన్లలో భాగస్వామి అయింది. స్వీడన్‌ దళాల సంఖ్య తక్కువైనా, అత్యున్నత స్థాయి సైనిక సాంకేతికత దాని సొంతం. అవన్నీ నాటోకు అదనపు బలంగా మారనున్నాయి. స్వీడన్‌, ఫిన్లాండ్‌లకు నాటో సభ్యత్వాన్ని తుర్కియే మొదటి నుంచీ వ్యతిరేకించింది. తమ దేశంలో ఉగ్ర సంస్థలకు ఆ రెండు దేశాలు ఆశ్రయం ఇస్తున్నాయని తుర్కియే ఆరోపించింది. స్వీడన్‌, ఫిన్లాండ్‌లు తుర్కియేతో సంయుక్త భద్రతా ఒప్పందం కుదుర్చుకోవడంతో అడ్డంకులు తొలగిపోయాయి. అగ్రరాజ్యం సైతం ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్‌లను అందిస్తానని హామీ ఇవ్వడంతో తుర్కియే శాంతించింది. స్వీడన్‌, ఫిన్లాండ్‌ల నాటో సభ్యత్వంపై క్రెమ్లిన్‌ ఆచితూచి స్పందించింది. ఉక్రెయిన్‌తో ఆ దేశాలను పోల్చలేమని, అయితే నాటో ఆయుధాలు రష్యా సరిహద్దులకు చేరితే సహించబోమని హెచ్చరించింది. మరోవైపు బాల్టిక్‌ తీరంలో ఉద్రిక్తత పెరుగుతోంది. జూన్‌ 5-17 మధ్య నాటో 45 నౌకలను మోహరించి యుద్ధ విన్యాసాలను నిర్వహించింది. ఇటీవల మాస్కో సైతం 60 నౌకలతో యుద్ధ విన్యాసాలు చేపట్టింది. భారీ సైనిక సంపత్తిని కలిగిన కలినన్‌గ్రాడ్‌ స్థావరంపై నాటో ఒత్తిడిని తగ్గించేందుకు సువాల్కీ కారిడార్‌ను మాస్కో ఆక్రమిస్తుందనే భయాలు ఐరోపాలో పెరిగిపోయాయి. పోలండ్‌-లిథువేనియా మధ్య ఉన్న 62 మైళ్ల పొడవైన ఆ కారిడార్‌- కలినన్‌గ్రాడ్‌ను రష్యా మిత్రదేశమైన బెలారస్‌తో కలుపుతుంది.

రష్యా ఏకాకి

చైనా నుంచి నాటో కూటమికి సవాళ్లు ఎదురవుతున్నాయని మాడ్రిడ్‌ తీర్మానంలో స్పష్టంగా పేర్కొన్నారు. డ్రాగన్‌తో వివాదాలున్న ఆస్ట్రేలియా, జపాన్‌, దక్షిణ కొరియా, న్యూజిలాండ్‌లూ మాడ్రిడ్‌ సదస్సులో భాగస్వాములయ్యాయి. ఇండో-పసిఫిక్‌పై నాటో ముందస్తు వ్యూహానికి పదును పెడుతోందనే విషయాన్ని ఆ పరిణామాలు సూచిస్తున్నాయి. ఇక మాస్కో దాడులను సమర్థంగా ఎదుర్కొనేలా ఉక్రెయిన్‌కు అండగా నిలవాలని అమెరికా నిర్ణయించింది. ఉక్రెయిన్‌ సైతం వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. ఇప్పటిదాకా ఫలితాన్ని పరిశీలిస్తే ఖేర్సాన్‌, మరియుపోల్‌, డాన్‌బాస్‌ ప్రాంతాలను క్రెమ్లిన్‌ దక్కించుకొంది. అజోవ్‌ రెజిమెంట్‌ను బంధించింది. స్నేక్‌ ఐలాండ్‌నుంచి మాస్కో సేనలను తరిమి కొట్టడం ఒక్కటే కీవ్‌కు ఊరట. భౌగోళిక రాజకీయాల పరంగా ఈ యుద్ధంతో రష్యా కొంత దెబ్బతింది. దాదాపు ఆరువేల అణ్వాయుధాలున్న క్రెమ్లిన్‌ ఆర్థిక వ్యవస్థను అమెరికా ఏకాకిని చేసింది. అది ప్రపంచానికి పెనుముప్పుగా మారే ప్రమాదముంది. సమీప భవిష్యత్తులో యుద్ధభయం అనే ఊబి నుంచి ఐరోపా బయటపడే అవకాశాలు స్వల్పంగానే కనిపిస్తున్నాయి.

- ఫణికిరణ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అప్పుల కుప్పతో లంక తిప్పలు

‣ కష్టకాలంలో ఆదుకోని పంటల బీమా

‣ సోనియా కుటుంబానికే పాదాక్రాంతం

‣ వసుధైక కుటుంబానికి అసలైన ఆలంబన

‣ కశ్మీర్‌పై అల్‌ఖైదా దుష్టనేత్రం

Posted Date: 08-07-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం