• facebook
  • whatsapp
  • telegram

టెక్‌ కంపెనీల కట్టడికి అడుగులు

డిజిటల్‌ చట్టాలకు ఐరోపా ఆమోదం

 

 

బడా టెక్‌ కంపెనీల గుత్తాధిపత్యాన్ని కట్టడి చేయడానికి తెచ్చిన రెండు కీలక చట్టాలకు ఐరోపా పార్లమెంటు ఇటీవల ఆమోద ముద్ర వేసింది. దీంతో 2020 డిసెంబరులో ఐరోపా కమిషన్‌ ప్రతిపాదించిన ‘డిజిటల్‌ విపణుల చట్టం (డీఎంఏ), డిజిటల్‌ సేవల చట్టం (డీఎస్‌ఏ)’ ఇక కార్యరూపం దాల్చనున్నాయి. అంతర్జాలంలో చట్టవిరుద్ధమైన సమాచారం, వ్యాఖ్యలు, విమర్శలు చొరబడి వ్యాపించకుండా గూగుల్‌, ఆపిల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌, ట్విటర్‌ వంటి బడా టెక్‌ కంపెనీలు ద్వారపాలకుల్లా వ్యవహరించాలని డీఎస్‌ఏ నిర్దేశిస్తోంది. బాలలపై గురిపెట్టిన వాణిజ్య ప్రకటనలను నిషేధిస్తోంది. లింగ, మత, జాతి, రాజకీయ పరంగా సున్నితమైన భావాలను దెబ్బతీసే ప్రచారాన్ని, ప్రకటనలను కూడా డీఎస్‌ఏ నిరోధిస్తుంది. అమెరికా, చైనాల తరవాత అత్యధిక జీడీపీ ఉన్నది ఐరోపా సమాఖ్య (ఈయూ) దేశాలకే కాబట్టి, అక్కడ వ్యాపారం దెబ్బతింటే బడా టెక్‌ కంపెనీలకు తీరని నష్టం కలుగుతుంది. అయినా కొత్త చట్టాలు తమ ఉనికికి ప్రమాదకరమని టెక్‌ కంపెనీలు భావిస్తున్న సూచనలూ కనిపిస్తున్నాయి.

 

తీరు మారేనా?

తాజా డిజిటల్‌ చట్టాల ప్రభావం ఐరోపాలో అతి పెద్ద టర్నోవరు కలిగిన ఆపిల్‌పై ఎక్కువగా పడుతుంది. డీఎంఏ ప్రకారం వినియోగదారులు బడా టెక్‌ కంపెనీల మెసేజింగ్‌ సేవల్లో ఒకదాని నుంచి మరొకదానికి మారే వెసులుబాటు ఉండాలి. టెక్‌ కంపెనీల ఆన్‌లైన్‌ వేదికలపై వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులను పోటాపోటీగా ప్రచారం చేసుకొని అంతర్జాలానికి వెలుపల (ఆఫ్‌లైన్‌లో) వినియోగదారులతో బేరాలు కుదుర్చుకునే వీలుండాలి. టెక్‌ కంపెనీల యాప్‌లను ఎప్పుడంటే అప్పుడు తొలగించడానికి, ఇతర సంస్థల యాప్‌ స్టోర్ల నుంచి యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకోవడానికి వినియోగదారులకు సౌలభ్యం ఉండాలని డీఎంఏ నిర్దేశిస్తోంది. యాప్‌లలో థర్డ్‌ పార్టీ చెల్లింపు వ్యవస్థలను పొందుపరచడానికి, ద్వారపాలక సంస్థల వేదికలకు సంబంధం లేని వస్తుసేవలను ప్రచారం చేయడానికి వీలుండాలని సూచించింది. ద్వారపాలక టెక్‌ కంపెనీలు- వినియోగదారులు తాము సూచించిన వెబ్‌ బ్రౌజర్లను మాత్రమే వాడాలంటూ నిర్బంధించకూడదని డీఎంఏ స్పష్టీకరిస్తోంది. ఈయూ చట్టాలకు అనుగుణంగా తాము నడుచుకొంటున్నదీ లేనిదీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవడానికి టెక్‌ కంపెనీలు స్వతంత్ర నిఘా బృందాన్ని ఏర్పరచుకోవాలని డీఎంఏ నిర్దేశిస్తోంది. ఇతర కంపెనీలను స్వాధీనం చేసుకొన్నా, వాటిలో విలీనమైనా ఐరోపా కమిషన్‌కు తెలియజేయాలి. ద్వారపాలకుడిలా వ్యవహరించాల్సిన ఏదైనా బడా టెక్‌ కంపెనీ డీఎంఏ నిబంధనలను ఉల్లంఘిస్తే తన ప్రపంచ టర్నోవరులో 10శాతాన్ని జరిమానాగా చెల్లించాలి. పదేపదే అదే ఉల్లంఘనకు పాల్పడితే 20శాతం జరిమానా చెల్లించాలి. నిర్ణీత కాలావధిలో అయిదు శాతం చొప్పున జరిమానా చెల్లిస్తూ ఉండాలి. ఇంతవరకు ప్రభుత్వ నియంత్రణను వ్యతిరేకిస్తూ వచ్చిన బడా టెక్‌ కంపెనీలు ఇకనైనా తీరు మార్చుకుంటాయా అన్నది చూడాల్సి ఉంది. ఉదాహరణకు- ఆపిల్‌ కంపెనీ తమ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, సేవల్లో ప్రభుత్వాలు నిర్దేశించిన విధంగా మార్పులు చేయడానికి నిరాకరిస్తూ వచ్చింది. నెదర్లాండ్స్‌లో ఆపిల్‌ డేటింగ్‌ యాప్స్‌లో ఇతర కంపెనీల డిజిటల్‌ చెల్లింపు సేవలను అంగీకరించేది లేదు పొమ్మన్నది. దీనికి జరిమానాగా నెలల తరబడి వారం వారం 55 లక్షల డాలర్ల చొప్పున చెల్లించడానికి సిద్ధపడిందే తప్ప అధికారిక నియంత్రణకు తలొగ్గలేదు.

 

కచ్చితమైన అమలు సవాలే!

భారత ప్రభుత్వం ట్విటర్‌ నుంచి పలు ట్వీట్లను తొలగించాలని ఆదేశించినా దానికి సమ్మతించకుండా- ట్విటర్‌ కర్ణాటక హైకోర్టులో సర్కారుపై దావా వేసింది. ప్రభుత్వం కొన్ని రాజకీయ పార్టీల అధికార ట్విటర్‌ ఖాతాల్లోని రాజకీయ ట్వీట్లనూ తొలగించాలని డిమాండ్‌ చేసిందంటూ ఆరోపించింది. వాటిని తొలగించడం భావప్రకటన హక్కుకు విఘాతం కలిగించడమేనని వాదించింది. కేంద్రం గత ఏడాది నుంచి అమలులోకి తెచ్చిన కొత్త ఐటీ నిబంధనల ప్రకారం ప్రభుత్వం తొలగించమన్న ట్వీట్లు, ఖాతాలను ఆ సంస్థ తొలగించక తప్పదు. కానీ, ట్విటర్‌ ఈ కొత్త నిబంధనల్లో కొన్నింటిని పాటించి, మిగతా వాటి మీద కోర్టులో పోరాడుతోంది. ఐరోపా సమాఖ్య చట్టాలను పాటించడానికి కూడా టెక్‌ కంపెనీలు మొరాయిస్తాయని నెదర్లాండ్స్‌లో ఆపిల్‌ అనుభవమే చెబుతోంది. తాజా డీఎంఏ, డీఎస్‌ఏ చట్టాలను కచ్చితంగా అమలుచేయడం తేలిక కాదు. దీనికోసం ఐరోపా కమిషన్‌ ఒక కార్యబృందాన్ని ఏర్పాటుచేసింది. అందులో 85మంది అధికారులు చేరబోతున్నా, ఈ సిబ్బంది ఏ మూలకూ చాలరని నిపుణులు అంటున్నారు. కొత్త నిబంధనలు అమలయ్యేలా చూడటానికి వేర్వేరు బృందాలను నియమిస్తామని ఈయూ పారిశ్రామిక విభాగాధిపతి థియెరీ బ్రెటాన్‌ వెల్లడించారు. డేటా సైంటిస్టులు, అల్గొరిథమ్‌ సైంటిస్టులతో ప్రత్యేక కేంద్రాన్ని నెలకొల్పబోతున్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన బడా టెక్‌ కంపెనీలు కొత్త డిజిటల్‌ చట్టాలపై కోర్టుల్లో వ్యాజ్యాలు నడపడం ఖాయం. ఈ దావాలు చట్టాల అమలును కుంటువరుస్తాయి. దీన్ని నిరోధించడమెలాగన్న అంశాన్ని ఐరోపా పార్లమెంటు పరిశీలించి తగు చర్యలు తీసుకోదలచింది.

 

- ఆర్య
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ లొసుగులమయం... జీఎస్టీ విధానం!

‣ ఇంటిపోరుతో సతమతమవుతున్న ఇజ్రాయెల్‌

‣ గదిలోపల పొంచిఉన్న ముప్పు

‣ మరో ప్రచ్ఛన్న యుద్ధానికి నాంది

‣ అప్పుల కుప్పతో లంక తిప్పలు

Posted Date: 08-07-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం