• facebook
  • whatsapp
  • telegram

లొసుగులమయం... జీఎస్టీ విధానం!

సంస్కరిస్తేనే ప్రయోజనకరం

 

 

వరసగా 11 నెలలపాటు వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు నెల నెలా లక్షన్నర కోట్ల రూపాయల స్థాయికి చేరాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నెల స్థూల వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లకు చేరువయ్యాయి. కేంద్ర ప్రభుత్వానికి ఇది ఎంతో ఊరట కలిగించే విషయం. 17 రకాల కేంద్ర, రాష్ట్ర పన్నులను కలిపి 2017 జులై ఒకటో తేదీ నుంచి జీఎస్టీని అమలులోకి తెచ్చారు. ఇంధనం, మద్యం, స్టాంపు సుంకాలపై ఎక్సైజు పన్ను విధించుకోవడానికి మాత్రమే రాష్ట్రాలకు పరోక్ష స్వయంనిర్ణయాధికారమిచ్చారు. జీఎస్టీ రంగ ప్రవేశం చేసి ఇప్పటికి అయిదేళ్లయినా, అది ఇంకా మార్పుచేర్పులకు లోనవుతూనే ఉంది. ఇటీవల చండీగఢ్‌లో జరిగిన 47వ జీఎస్టీ మండలి సమావేశం అసంఘటిత రంగానికి చేయూతనిచ్చే చర్యలను ప్రకటించింది. ఆన్‌లైన్‌లో విక్రయాలు జరిపే చిన్న వ్యాపారులకు తప్పనిసరి జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ నిబంధనను తొలగించింది. చిన్న రాష్ట్రాల్లో రూ.20లక్షల వరకు, ఇతర రాష్ట్రాల్లో రూ.40లక్షల వరకు వార్షిక టర్నోవరు కలిగిన ఆన్‌లైన్‌ చిరు విక్రేతలకు వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి ఈ రాయితీ లభిస్తుంది. దీనివల్ల 1,20,000 మంది చిన్న వ్యాపారులు లబ్ధి పొందుతారు.

 

మార్పుచేర్పులు

ఆన్‌లైన్‌ గేమింగ్‌, క్యాసినోలు, గుర్రపు పందేలను జూదంగా పరిగణించి 28శాతం వస్తుసేవల పన్ను విధించాలనే ప్రతిపాదన వచ్చినా- దీనిపై మరింత లోతుగా పరిశీలన జరిపి నిర్ణయం తీసుకోవాలని జీఎస్టీ మండలి భావించింది. పన్ను రేట్ల క్రమబద్ధీకరణపై మూడు నెలల్లో నివేదిక సమర్పించే బాధ్యతను ప్రత్యేక బృందానికి అప్పగించారు. కొన్ని వస్తువులకు గతంలో ఇచ్చిన పన్ను మినహాయింపును ఉపసంహరించగా, మరికొన్ని వస్తువుల పన్ను రేట్ల శ్లాబులను మార్చింది. ఇంతవరకు రోజుకు హోటల్‌ గది అద్దె రూ.1,000లోపు ఉంటే జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ మినహాయింపును తొలగించారు. రూ.5,000కు మించిన ఆస్పత్రి గది అద్దెలకు, రిజర్వు బ్యాంకు, ఐఆర్‌డీఏఐ, సెబీ సేవలకు ఇచ్చిన మినహాయింపునూ రద్దుచేశారు. పోస్టు కార్డులు, ఇన్‌ల్యాండ్‌ లెటర్లు, బుక్‌ పోస్ట్‌, 10 గ్రాములకన్నా తక్కువ బరువున్న ఎన్వెలప్‌లు తప్ప మిగతా తపాలా సేవలన్నింటిపై పన్ను వేయాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది. ఇంధన ఖర్చుతో కలిపి ట్రక్కుల కిరాయిపైనా పన్ను తగ్గించారు. రెండు లక్షల రూపాయలకు మించిన బంగారం, విలువైన రాళ్ల రవాణాను ఈ బిల్లుల పరిధిలోకి తీసుకురావాలని మంత్రుల బృందం సిఫార్సుచేయగా, దీనిపై నిర్ణయం తీసుకునే వెసులుబాటును జీఎస్టీ మండలి రాష్ట్రాలకు ఇచ్చింది.

 

అపరిష్కృత సమస్యలు

ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ పేరిట జరుగుతున్న మోసాలు తక్కువేమీ కాదు. వీటిని అరికట్టడానికి జీఎస్టీ మండలి కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. స్థిరాస్తి క్రయవిక్రయాలు ప్రస్తుతం జీఎస్టీ పరిధిలో లేవు. వాణిజ్యపరంగా స్థిరాస్తులను అద్దెకు ఇచ్చి ఆదాయం ఆర్జిస్తున్నవారు మాత్రమే దానిపై జీఎస్టీ చెల్లించాలి. కానీ, బాడుగకు లేదా లీజుకు ఇవ్వడం కోసం తమ స్థిరాస్తిని అభివృద్ధి చేయడానికయ్యే ఖర్చులపై ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ)ను అనుమతించడం లేదు. ఈ లోపాన్ని సరిదిద్దితే కరోనా మహమ్మారివల్ల దెబ్బతిన్న స్థిరాస్తి రంగం కోలుకొనే వీలు కలుగుతుంది. ఐటీసీ క్లెయిముపై ధన రూపేణా ఏకపక్ష పరిమితి విధించడాన్ని పన్ను చెల్లింపుదారులు నిరసిస్తున్నారు. జీఎస్టీలో కొంత భాగాన్ని నగదు రూపంలో చెల్లించాలన్న నిబంధనపైనా ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి నిబంధనలు నిజాయతీగా పన్ను చెల్లించేవారిని ఇబ్బందిపెడుతున్నాయి. జీఎస్టీని ప్రవేశపెట్టిన కొత్తల్లో మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 12శాతం, 18శాతం శ్లాబులను విలీనం చేసి మొత్తం పన్ను శ్లాబులను మూడుకు తగ్గిస్తామని మాట ఇచ్చారు. ఆ హామీ ఇంతవరకు నెరవేరలేదు. కొవిడ్‌వల్ల పన్ను ఆదాయాలు పడిపోవడంతో ఈ సంస్కరణ వాయిదా పడుతూ వస్తోంది. అనేక వస్తువులు ఇప్పటికీ అధిక పన్ను శ్లాబులో ఉండిపోయాయి. జీఎస్టీ నిబంధనల్లోని అస్పష్టత వల్ల కోర్టు వ్యాజ్యాలు పెరిగిపోతున్నాయి. వీటిని వేగంగా పరిష్కరించి కోర్టులపై పని భారం తగ్గించడానికి ప్రభుత్వం జీఎస్టీ ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయాలి. కేంద్రం సెస్సుల రూపంలో గణనీయంగా పన్ను ఆదాయాన్ని సొంతం చేసుకొంటోందని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. తమకు పరిహారం చెల్లింపు గడువును మరికొంతకాలం పొడిగించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ ఏడాది జీఎస్టీ పరిహార మొత్తాన్ని నిర్ణయించడానికి జీఎస్టీ మండలి మళ్ళీ సమావేశం కానుంది. కేంద్రానికి, రాష్ట్రాలకు, పన్ను చెల్లింపుదారులకు వెసులుబాటు కలిగేలా జీఎస్టీని సంస్కరించాలి.

 

రాష్ట్రాల వినతి

2017 నుంచి జీఎస్టీ అమలులోకి వచ్చినప్పుడు దానివల్ల రాష్ట్రాలు కోల్పోయే ఆదాయానికి అయిదేళ్లపాటు పరిహారమివ్వాలని ప్రతిపాదించారు. ఆ గడువు ఈ ఏడాది జూన్‌ 30తో తీరిపోయింది. కొవిడ్‌ మూలంగా రెండేళ్లపాటు రాష్ట్రాల ఆదాయానికి భారీ గండి పడింది.

జీఎస్టీ వల్ల తాము కోల్పోయిన ఆదాయానికి గడువు తరవాత కూడా పరిహారం చెల్లించాలని 16 రాష్ట్రాలు కోరాయి. వీటిలో మూడు నాలుగు రాష్ట్రాలు జీఎస్టీ పరిహార యంత్రాంగం నుంచి వేరుపడి సొంతంగా అదనపు ఆదాయం సమకూర్చుకునే అవకాశమివ్వాలని డిమాండ్‌ చేశాయి.

ఫలితం: పరిహారం పొడిగింపుపై నిర్ణయం తీసుకోకుండానే జీఎస్టీ మండలి సమావేశం ముగిసింది.

 

లోపాలతో తిప్పలు

జీఎస్టీ అమలులోకి వచ్చినప్పటి నుంచి ట్యాక్స్‌ క్రెడిట్‌ పొందడంలో తీవ్ర ఆలస్యం జరుగుతోంది. అవసరమైన పత్రాల సమర్పణ సుదీర్ఘ ప్రక్రియగా మారడమేకాదు, సాంకేతిక అంతరాయాలు ఎదురవుతున్నాయి.

84శాతం పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ పత్రాలను సవ్యంగా సమర్పించలేకపోతున్నారు.ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్ల(ఐటీసీ)ను క్లెయిము చేయడమూ సమస్యగా ఉంది.

చాలామంది పన్ను చెల్లింపుదారులు ఐటీసీని పొందలేక నష్టపోయారు.సరఫరాదారులు చేసే పొరపాట్లవల్ల కూడా పన్ను చెల్లింపుదారులకు ఐటీసీ అందకుండా పోతోంది.

పరిష్కారం: ఇటువంటి లోపాలన్నింటినీ తక్షణం సరిదిద్దాలి.

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇంటిపోరుతో సతమతమవుతున్న ఇజ్రాయెల్‌

‣ గదిలోపల పొంచిఉన్న ముప్పు

‣ మరో ప్రచ్ఛన్న యుద్ధానికి నాంది

‣ అప్పుల కుప్పతో లంక తిప్పలు

Posted Date: 08-07-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం