• facebook
  • whatsapp
  • telegram

ఇంటిపోరుతో సతమతమవుతున్న ఇజ్రాయెల్‌

నాలుగేళ్లలో అయిదోసారి సార్వత్రిక ఎన్నికలు

కొన్నాళ్లుగా అస్థిరత్వంతో డోలాయమానంలో ఉన్న ఇజ్రాయెల్‌ పార్లమెంటు చివరికి రద్దయింది. జూన్‌ నెలాఖరులో సమావేశమైన చట్టసభ సభ్యులు పార్లమెంటును రద్దుచేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఎనిమిది పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ గతేడాది జూన్‌లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నఫ్తాలీ బెన్నెట్‌ పదవికి రాజీనామా చేశారు. కూటమి ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించిన విదేశాంగ మంత్రి యాయిర్‌ లపిడ్‌ ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. గత నాలుగేళ్లలో ఇజ్రాయెల్‌ పార్లమెంటు రద్దు కావడం ఇది నాలుగోసారి. వచ్చే నవంబరు ఒకటో తేదీన అయిదోసారి జాతీయ ఎన్నికలను ఎదుర్కోనుంది. ఈ పరిస్థితి అక్కడి ప్రభుత్వ అస్థిరతకు అద్దం పడుతోంది. 120 స్థానాలున్న పార్లమెంటులో దేశ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ ఏ ఎన్నికల్లోనూ ఒక పార్టీ సొంతంగా మెజారిటీ మార్కు (61 స్థానాలు) అందుకోలేదు. సంకీర్ణ ప్రభుత్వాలే పాలన సాగించాయి. గతేడాది జూన్‌లోనూ మాజీ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ నేతృత్వంలోని మితవాద లికుడ్‌- పార్లమెంటులో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మెజారిటీ నిరూపించుకోలేకపోయింది. ఆ సమయంలో లపిడ్‌ చూపిన చొరవ కారణంగా యూదు జాతీయవాదులతో పాటు ముస్లిం, అరబ్‌ నేపథ్యం గల పక్షాలు కూడా జట్టు కట్టి బెన్నెట్‌ నాయకత్వాన ప్రభుత్వం కొలువుదీరింది. ఈ కలహాల కాపురం మూణ్నాళ్ల ముచ్చటే అయి ఏడాదికే కూలిపోయింది. దేశ చరిత్రలో అతితక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన రికార్డు బెన్నెట్‌ ఖాతాలో జమ అయింది!

తన బుద్ధిబలంతో పశ్చిమాసియాలోనే కాకుండా, అంతర్జాతీయ సంబంధాల్లో గణనీయ ప్రాభవాన్ని సంపాదించుకున్న ఇజ్రాయెల్‌- ఇంటిపోరుతో సతమతమవుతోంది. సుమారు 92 లక్షల జనాభా గల దేశంలో అత్యున్నత చట్టసభలో ఉన్న స్థానాలు 120. నెతన్యాహూ నేతృత్వంలోని లికుడ్‌ పార్టీ బలంగా ఉండగా, ప్రధాని లపిడ్‌ నాయకత్వంలోని యెష్‌ అటిడ్‌ వేగంగా ఎదుగుతోంది. బ్లూ అండ్‌ వైట్‌, జాయింట్‌ లిస్ట్‌ వంటి దేశీయ భావజాలంగల పక్షాలు, ఇజ్రాయెలీ అరబ్బుల గొంతుక రామ్‌ పార్టీ కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపుతున్నాయి. ఏకైక అతిపెద్ద పార్టీగా ఏది అవతరించినా సగానికి పైగా సీట్లు గెలుచుకోవడం ఇప్పటిదాకా అసంభవంగానే మారింది. 1990వ దశకం నుంచి ఇజ్రాయెల్‌ పాలనలో తనదైన ముద్ర వేసిన బెంజమిన్‌ నెతన్యాహూ ఇప్పటికే అయిదుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 12 ఏళ్ల సుదీర్ఘకాలం పాలించినప్పటికీ అవినీతి, బంధుప్రీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలు వెల్లువెత్తడంతో పదవికి దూరమయ్యారు. చిన్నపార్టీల్లోని అనైక్యత, కూటముల విఫల ప్రయోగాలు, తరచూ ఎన్నికలతో విసుగెత్తిపోయిన ఇజ్రాయెలీలు ఈ దఫా మళ్లీ నెతన్యాహూకే పట్టం కట్టవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. నెతన్యాహూ దేశాన్ని ప్రగతి పథంలో నడిపారని, పశ్చిమాసియా గడ్డపై తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దారన్న అభిప్రాయం ఉంది. పూర్వాశ్రమంలో టీవీ వ్యాఖ్యాతగా, కళాకారుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆపద్ధర్మ ప్రధాని లపిడ్‌కూ విజయావకాశాలు కొట్టిపారేయలేమన్నది అక్కడి మీడియా విశ్లేషణ.

ట్రంప్‌ హయాము(2020)లో కుదిరిన అబ్రహాం అకార్డ్‌ ఒప్పందం- పశ్చిమాసియాలో కొత్త సమీకరణాలకు తెరదీసింది. అయితే, అంత పెద్ద పరిణామాన్ని తమతో కనీసం పంచుకోలేదన్న భాగస్వామ్య పక్షాల అలకతో అప్పటి నెతన్యాహూ ప్రభుత్వంలో లుకలుకలు మొదలై పతనానికి దారితీసింది. తాజాగా, పార్లమెంటు రద్దయి, నాయకత్వం మారిన తరుణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ నెలలోనే ఇజ్రాయెల్‌లో పర్యటిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌-ఇజ్రాయెల్‌ దౌత్య సంబంధాలకు ఈ ఏడాదితో 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఇరుదేశాల నడుమ పలు రక్షణ, సాంకేతిక, వాణిజ్య ఒప్పందాలకు రంగం సిద్ధమైంది. వాస్తవానికి గత మార్చిలోనే నాటి ప్రధాని బెన్నెట్‌ దిల్లీ, బెంగళూరును సందర్శించాల్సి ఉన్నా, కరోనా బారిన పడటంతో ఆఖరి క్షణంలో పర్యటన వాయిదా వేసుకున్నారు. ఆపద్ధర్మ ప్రధాని లపిడ్‌ బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘నిజమైన మిత్రుడు’ అంటూ అభినందించిన భారత ప్రధాని మోదీ- ఇరుదేశాల సంబంధాలు ద్విగుణీకృతం కావాలని ఆకాంక్షించారు. ఈ దఫా విస్పష్ట మెజారిటీతో నెతన్యాహూ అధికారం చేపట్టవచ్చని, లేదంటే మరోసారి ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదనేది పశ్చిమాసియా రాజకీయ విశ్లేషకుల అంచనా. నవంబరులో జరిగే ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా భారత్‌తో సంబంధాలు కొనసాగించడం ఉభయులకూ ఉపయోగకరం.

- బి.అశోక్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ గదిలోపల పొంచిఉన్న ముప్పు

‣ మరో ప్రచ్ఛన్న యుద్ధానికి నాంది

‣ అప్పుల కుప్పతో లంక తిప్పలు

‣ కష్టకాలంలో ఆదుకోని పంటల బీమా

‣ సోనియా కుటుంబానికే పాదాక్రాంతం

‣ వసుధైక కుటుంబానికి అసలైన ఆలంబన

‣ కశ్మీర్‌పై అల్‌ఖైదా దుష్టనేత్రం

Posted Date: 08-07-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం