• facebook
  • whatsapp
  • telegram

గదిలోపల పొంచిఉన్న ముప్పు

‣ ఆరోగ్యాలను హరిస్తున్న కాలుష్యం

 

 

వాయు కాలుష్యం అనగానే వాహనాలు, కర్మాగారాల నుంచి వెలువడే పొగ, దుమ్ము, ధూళి మాత్రమే మనకు గుర్తుకొస్తాయి. కానీ, నాలుగు గోడలమధ్యా కాలుష్యం ఉంటుందని, మన ఇంట్లో ఉండే కలుషిత వాయువు అత్యంత ప్రమాదకరమని ఎప్పుడైనా గుర్తించారా? గది లోపలి (ఇండోర్‌) వాయు కాలుష్యం కారణంగా తలెత్తే వ్యాధులతో ప్రపంచవ్యాప్తంగా ఏటా 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. భారత్‌లోనూ వారి సంఖ్య అధికంగానే ఉంది. గదుల్లో వాయు ప్రసరణ సరిగ్గా లేకపోతే గాలి ద్వారా సంక్రమించే వ్యాధులు విస్తరిస్తాయి. కేవలం ఇళ్లలోనే కాకుండా సినిమాహాళ్లు, షాపింగ్‌ మాళ్ల లాంటి చోట్లా ఈ ముప్పు అధికంగా ఉంటుంది. ఆరుబయట కంటే నాలుగు గోడల మధ్యలోనే రెండు నుంచి అయిదు రెట్లు ఎక్కువ వాయు కాలుష్యానికి అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇల్లు, కార్యాలయాలు, పాఠశాలలు, దుకాణాలు, రెస్టారెంట్ల లాంటి నాలుగు గోడల మధ్యే ప్రజలు రోజులో అధిక సమయం గడుపుతారు. అలాంటిచోట వాయు నాణ్యత సరిగ్గా లేకపోతే ఆస్థమా, ఊపిరితిత్తులు, హృదయ వ్యాధులు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

వంట కోసం కట్టెలు, బొగ్గును వినియోగించే ఇళ్లలో పీఎం2.5గా పిలిచే అతి సూక్ష్మ ధూళికణాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పట్టణాల్లోని కార్యాలయాలు, సినిమాహాళ్లు వంటి వాటిలో ఆస్బెస్టాస్‌, ఫార్మాల్డీహైడ్‌, గోడలకు వేసిన రంగుల నుంచి వెలువడే రసాయన వాయువుల వల్ల కాలుష్యం ఏర్పడుతుంది. గాలి, వెలుతురు తగినంతగా ప్రసరిస్తుంటే ఆ కాలుష్యమంతా చాలావరకూ బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. బయటి నుంచి దుమ్ము, ధూళి వస్తుందని కిటికీలు, తలుపులను మూసి ఉంచడం వల్ల కాలుష్యం మరింతగా పెరుగుతోంది. మరోవైపు ఐసీయూలో చేరే రోగులు చాలా సున్నితమైన పరిస్థితిలో ఉంటారు. ఆ గదిలో ఉండే వారిలో ఏ ఒక్కరికి ఇన్ఫెక్షన్‌ ఉన్నా, అది మిగిలినవారికీ సోకే అవకాశాలు ఎక్కువ. ఆస్పత్రిలో చేరిన వారికి ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తున్న ఘటనలు కొంతకాలంగా పెరుగుతున్నాయి. ఆస్పత్రులు, ఆరోగ్య సంరక్షణ సేవలు అందించేవారి జాతీయ గుర్తింపు మండలి వాటిని నివారించడానికి పలు సూచనలు చేసింది. గది లోపలి గాలిని ఎప్పటికప్పుడు బయటకు పంపేలా వాయు నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నది వాటిలో ఒకటి.

 

ధనిక, పేద సంబంధం లేకుండా అన్ని కుటుంబాలు గృహ వాయు కాలుష్యానికి ప్రభావితమవుతున్నట్లు షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ఇంధన విధాన సంస్థ ఆధ్వర్యంలో దిల్లీలో జరిగిన సర్వేలో తేలింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), జాతీయ స్థాయిలో శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి (సీఎస్‌ఐఆర్‌) ఇండోర్‌ వాయు కాలుష్య నియంత్రణకు పలు మార్గదర్శకాలను జారీ చేశాయి. కొవిడ్‌ మహమ్మారి గాలి ద్వారానూ వ్యాపిస్తున్న నేపథ్యంలో సీఎస్‌ఐఆర్‌ తన సూచనలను నవీకరించింది. ఇంధన, వనరుల సంస్థ (టెరీ)కి చెందిన గ్రీన్‌ రేటింగ్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ హాబిటాట్‌ ఎసెస్‌మెంట్‌ సైతం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. చట్టాల మాదిరిగా వాటిని పటిష్ఠంగా అమలు చేయడం సాధ్యం కావడంలేదు.

 

గది లోపలి వాయు కాలుష్య నియంత్రణకు ఇండియాలో సరైన చట్టాలే లేవు. ఈ తరహా గృహ వాయు కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని 2016లో తొలిసారిగా జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ)లో కేసు దాఖలైంది. రెండేళ్లలోగా దానిపై నివేదిక సమర్పించాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖను ట్రైబ్యునల్‌ ఆదేశించింది. ఇప్పటిదాకా నివేదిక అందలేదు. దిల్లీకి చెందిన రాజాసింగ్‌ అనే పరిశోధక విద్యార్థి 2021లో సాంక్రామిక వ్యాధుల నియంత్రణలో గది లోపలి వాయు నాణ్యత ప్రాధాన్యంపై ఎన్‌జీటీలో మరో కేసు దాఖలు చేశారు. ఇటీవల ఎన్‌జీటీ ఆ కేసుపై విచారణ జరిపింది. పర్యావరణ పరిరక్షణ చట్టం కింద సినిమాహాళ్లు, షాపింగ్‌ మాళ్లు వంటి వాటిలో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు తగిన మార్గదర్శకాలను సూచించాలని కేంద్ర పర్యావరణ, పట్టణాభివృద్ధి, ఆరోగ్య మంత్రిత్వ శాఖలను, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)ని ఆదేశించింది. గది లోపలి కాలుష్యానికి గల కారణాలన్నింటినీ గుర్తించి, వాటిని నివారించడానికి పాలకులు, భవనాల యజమానులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. జీవిత కాలంలో అధికభాగం నాలుగు గోడల మధ్యలోనే గడిపే ప్రస్తుత కాలంలో అది అత్యావశ్యకం.

 

- రఘురామ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మరో ప్రచ్ఛన్న యుద్ధానికి నాంది

‣ అప్పుల కుప్పతో లంక తిప్పలు

‣ కష్టకాలంలో ఆదుకోని పంటల బీమా

‣ సోనియా కుటుంబానికే పాదాక్రాంతం

‣ వసుధైక కుటుంబానికి అసలైన ఆలంబన

‣ కశ్మీర్‌పై అల్‌ఖైదా దుష్టనేత్రం

Posted Date: 08-07-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం