• facebook
  • whatsapp
  • telegram

సమాన హక్కులే ప్రజాబలం

ప్రపంచ జనాభా దినోత్సవం

‘ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లకు చేరువ కావడం నిజంగా ఒక మైలురాయివంటిదే. కానీ, మన దృష్టి ప్రజల మీదే కేంద్రీకృతమై ఉండాలి. వారంతా గౌరవప్రదమైన, సంతృప్తికరమైన జీవనం సాగించే దిశగా ప్రపంచాన్ని నిర్మించే ప్రయత్నాలు జరగాలి. అందుకోసం ఎనిమిది వందల కోట్ల అవకాశాలు ఉన్నాయని గ్రహించాలి’ - ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్‌ ఆంటొనియో గుటెరస్‌

ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరిగిపోతున్న జనాభావల్ల కలిగే దుష్పరిణామాలు అన్నీయిన్నీ కావు. భూమిపై ఉన్న వనరులు మానవ అవసరాలకు చాలడంలేదు. అడవులు క్రమంగా క్షీణిస్తున్నాయి. పట్టణీకరణ వేగవంతమైంది. కాలుష్యం పెచ్చరిల్లింది. గాలి, నీరు తీవ్రంగా కలుషితమవుతున్నాయి. పరిశ్రమల విస్తరణతో ఉద్గారాల విడుదల హెచ్చి, పర్యావరణం ప్రమాదంలో పడింది. ఈ పరిణామాలపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఏటా జులై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. 1990లో సుమారు 90 దేశాలు జనాభా పెరుగుదలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాయి. భూమిపై సుమారు 800 కోట్ల ప్రజలు జీవిస్తున్నా, అందరికీ హక్కులు, అవకాశాలు సమానంగా లభించడంలేదు. అవి అందరికీ అందుబాటులోకి రావాలనేదే ఈ ఏడాది ప్రపంచ జనాభా దినోత్సవ నినాదం.

అత్యధిక జనాభా పరంగా చైనా, భారత్‌, అమెరికా వరసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. జనాభా విస్తరణ వల్ల పట్టణీకరణ వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచ జనాభాలో పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు 56.61శాతం. 2050 నాటికి పట్టణ జనాభా 68శాతానికి పెరగవచ్చని అంచనా. ప్రస్తుతం భారతదేశంలో పట్టణ జనాభా 34శాతం. గ్రామీణం నుంచి పట్టణాలకు పెద్దయెత్తున చోటు చేసుకొంటున్న వలసల వల్ల మౌలిక వసతుల కల్పన ప్రభుత్వాలకు సవాలుగా మారింది. అందరికీ విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, తాగునీటి వసతులు కల్పించాల్సి రావడంతో యంత్రాంగాలపై ఒత్తిడి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో పేదరికం, నిరుద్యోగం పెచ్చరిల్లి, శాంతి భద్రతల సమస్య తలెత్తుతోంది. పట్టణాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, వైద్య సదుపాయాలు, నైపుణ్య శిక్షణా కేంద్రాల స్థాపన, పరిశ్రమల విస్తరణ ఊపందుకొన్నా- అవి అందరి అవసరాలనూ తీర్చలేకపోతున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారత్‌ సగటు అక్షరాస్యత రేటు 77.70శాతం. పురుష అక్షరాస్యత 84శాతం; మహిళల అక్షరాస్యత సుమారు 70శాతం. దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య అక్షరాస్యత రేటులో వ్యత్యాసాలు ఉన్నాయి. స్త్రీల అక్షరాస్యతను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది. ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబానికి తద్వారా సమాజానికి ఎంతో మేలు కలుగుతుంది. ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా- మహిళా అక్షరాస్యతలో పురోగతి అంతంతమాత్రమే. ప్రపంచ జనాభాలో 17.70 శాతం ప్రజలు భారతదేశంలో ఉన్నారు. ఇండియా జనాభా ప్రస్తుతం 135 కోట్లకు పైమాటే. 2030 నాటికి జనాభాలో చైనాను అధిగమించి భారత్‌ మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుందని అంచనా.

పరిమాణాత్మకంగా కాకుండా గుణాత్మకంగా హెచ్చుగా జనాభా కలిగిన దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. నాణ్యమైన మానవ వనరులతోనే భారత్‌ ప్రస్థానం అభివృద్ధి దిశగా సాగుతుంది. అందుకోసం యువతకు నైపుణ్య శిక్షణ అవసరం. వాతావరణ మార్పులవల్ల సంభవిస్తున్న ప్రకృతి విపత్తులు, విజృంభిస్తున్న వ్యాధులు, యుద్ధాలు మానవాళిని కబళిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాధినేతలు- మానవ మనుగడకు భద్రత, భరోసాను కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. విచ్చలవిడిగా పెరుగుతున్న జనాభాచర్యలతో వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. జీవజాలం మనుగడకు ముప్పు ముంచుకొస్తోంది. పర్యావరణ సమతౌల్యం, జీవవైవిధ్యం దెబ్బతింటున్నాయి. జనాభా విస్ఫోటం ప్రపంచ దేశాలకు పెను సమస్యగా మారిన నేపథ్యంలో- ప్రభుత్వాలు పరిష్కారానికి నడుం బిగించాలి. యుద్ధప్రాతిపదికన జనాభా పెరుగుదలను కట్టడి చేసే విధానాలను అమలు చేయాలి. ప్రజలు స్వచ్ఛందంగా జనాభా నియంత్రణ పద్ధతులను స్వాగతించాల్సిన అవసరం ఉంది. దానివల్ల రాబోయే తరాలకు సహజ వనరుల కొరత ఎదురుకాకుండా జాగ్రత్త పడినట్లవుతుంది.

- ఆచార్య కొండపల్లి పరమేశ్వరరావు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ బడుగులపై ఆగని అకృత్యాలు

‣ టెక్‌ కంపెనీల కట్టడికి అడుగులు

‣ లొసుగులమయం... జీఎస్టీ విధానం!

‣ ఇంటిపోరుతో సతమతమవుతున్న ఇజ్రాయెల్‌

‣ గదిలోపల పొంచిఉన్న ముప్పు

‣ మరో ప్రచ్ఛన్న యుద్ధానికి నాంది

‣ అప్పుల కుప్పతో లంక తిప్పలు

Posted Date: 12-07-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం