• facebook
  • whatsapp
  • telegram

విపత్తులతో ప్రపంచం విలవిల

ముందస్తు సన్నద్ధత కీలకం

ప్రపంచవ్యాప్తంగా వాతావరణం శరవేగంగా మారుతోంది. భూతాపం ఊహించిన దానికంటే అధికమవుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2030 నాటికి ప్రపంచంలో ఏటా 560 ఘోర విపత్తులు సంభవిస్తాయని ఐక్యరాజ్య సమితి ఇటీవలి నివేదిక హెచ్చరిస్తోంది. అంటే సగటున రెండు రోజులకు మూడు అన్నమాట! తాజాగా అమర్‌నాథ్‌ క్షేత్రం సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో పలువురు మృతి చెందారు. చాలామంది గల్లంతయ్యారు. ఇలాంటి విపత్తులు ప్రపంచవ్యాప్తంగా లక్షల ప్రాణాలను హరిస్తూ, జీవనోపాధులనూ తీవ్రంగా దెబ్బతీస్తాయి. 2015 నాటికి ప్రపంచంలో సంవత్సరానికి 400 విపత్తులు మాత్రమే సంభవించేవి. ఆ తీవ్రత క్రమంగా ఇతోధికమవుతోంది. ఇప్పటికీ ప్రతి ఏటా తుపానులు, వరదలు, రసాయన, అగ్ని ప్రమాదాలు, వాటికితోడు మహమ్మారులు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పర్యావరణ మార్పుల కారణంగా వాతావరణ సంబంధిత ముప్పులు తరచూ సంభవిస్తున్నాయి. వాటి తీవ్రత సైతం పెరుగుతోంది. ఫలితంగా అభివృద్ధి లక్ష్యాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఐరాస నివేదిక తెలిపింది.

పేదలపైనే అధిక ప్రభావం

ప్రపంచంలో 1970 నుంచి 2000దాకా ఏడాదికి 90 నుంచి 100 వరకు మాత్రమే పెద్దస్థాయి విపత్తులు సంభవించాయి. ఆ తరవాతి నుంచి వాటి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఐరాస హెచ్చరించింది. 2001తో పోలిస్తే 2030 నాటికి తీవ్రమైన వడగాలులు మూడు రెట్లు అధికమవుతాయని, కరవు పరిస్థితులు 30శాతం పెచ్చరిల్లుతాయని వెల్లడించింది. వాతావరణ మార్పుల వల్ల కేవలం ప్రకృతి విపత్తులే కాకుండా మహమ్మారుల విజృంభణ, ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితులు, ఆహార కొరత వంటివీ తలెత్తుతాయి. ప్రకృతి విపత్తుల విషయంలో ప్రభుత్వాలకు సరైన సన్నద్ధత లోపించడం, విపత్తుల అనంతరమూ తగిన స్థాయిలో స్పందించకపోవడం వంటి వాటి వల్ల నష్ట తీవ్రత అంతకంతకూ అధికమవుతోంది. కొన్ని సమయాల్లో విపత్తుల విషయంలో ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటీవల మణిపుర్‌లో సైనిక శిబిరాలు ఉన్నచోట భారీ కొండచరియలు విరిగిపడి మన జవాన్లు మరణించిన ఘటన ఇలాంటిదే. ప్రకృతి విపత్తులు తరచూ సంభవించే ప్రాంతాల్లో జనాభా పెరగడంవల్ల వాటి బారిన పడేవారి సంఖ్యా అధికమవుతోంది. విపత్తుల భారం తమపై ఎంతగా పడుతోందన్న విషయాన్ని చాలామంది ప్రజలు ఇంకా గ్రహించడం లేదని ఐరాసకు చెందిన విపత్తు నివారణ కార్యాలయం అధిపతి మామి మిజుతోరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విపత్తులపై వివిధ దేశాలు చేస్తున్న మొత్తం ఖర్చులో 90శాతం సహాయ కార్యకలాపాలకే వెచ్చిస్తున్నాయి. కేవలం నాలుగు శాతమే నిరోధానికి, ఆరు శాతం పునర్నిర్మాణానికి ఖర్చు పెడుతున్నాయి. 1990లో విపత్తులపై ప్రపంచ దేశాలన్నీ కలిసి చేసిన ఖర్చు దాదాపు రూ.5.5 లక్షల కోట్లు. ఇప్పుడది ఏడాదికి రూ.13.49 లక్షల కోట్లకు చేరింది. సంపన్న రాజ్యాలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ స్థూల దేశీయోత్పత్తిలో అధికశాతం వెచ్చిస్తున్నాయి. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో నష్ట తీవ్రత అత్యధికంగా ఉంటోంది. ఆ ప్రాంతంలోని దేశాలు సగటున తమ జీడీపీలో 1.6శాతాన్ని విపత్తు సహాయానికి ఖర్చు చేస్తున్నాయని ఐరాస నివేదిక వెల్లడించింది. ప్రపంచంలో వివిధ దేశాలు, ప్రాంతాలు, వర్గాల మధ్య అసమానతలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. విపత్తుల వల్ల పేదలే ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. అన్ని స్థాయుల్లోనూ అసమానతలను ఎంతో కొంత తగ్గిస్తేనే నష్ట తీవ్రతను అధిగమించే అవకాశం ఉంటుంది. గత డిసెంబరులో వచ్చిన రాయ్‌ టైఫూన్‌ నుంచి ఫిలిప్పీన్స్‌ నేటికీ కోలుకోలేదు. తుపానులు, వరదలు సంభవించినప్పుడు పక్కా ఇళ్లలో ఉండేవారి కంటే పూరిళ్ల నివాసులే ఎక్కువ ఇబ్బంది పడటం భారత్‌లో కనిపిస్తుంది. ఆ అంశాన్నీ ఐరాస నివేదిక ప్రస్తావించింది.

వనరుల కొరత

ఒక్కో విపత్తును ఒక్కో ప్రత్యేక సందర్భంగా చూడటాన్ని దేశాలు మానుకోవాలని రెడ్‌క్రాస్‌ క్రిసెంట్‌ క్లైమేట్‌ సెంటర్‌ సంచాలకులు మార్టెన్‌ వాన్‌ సూచిస్తున్నారు. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సంభవించే విపత్తులను ఎదుర్కొని, వాటివల్ల వచ్చే నష్టాలను అధిగమించేందుకు ఆయా దేశాలు సన్నద్ధతను పెంపొందించుకోవాలని చెబుతున్నారు. వాతావరణ మార్పులవల్ల తలెత్తుతున్న విపత్తుల నుంచి ప్రజలను రక్షించడానికి అవసరమైన వ్యవస్థలను ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలనీ అంటున్నారు. ఈ విపత్తుల వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే దేశాల వద్ద వాటిని ఎదుర్కొనేందుకు కావల్సిన వనరులు అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం. ఇప్పటికే కొవిడ్‌ మహమ్మారి ప్రభావం, ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితుల వల్ల ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి. శ్రీలంక, పాకిస్థాన్‌ వంటివి తీవ్రంగా అప్పుల్లో కూరుకుపోయాయి. అటువంటి దేశాల్లో ఏవైనా విపత్తులు సంభవిస్తే ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అభివృద్ధి చెందిన రాజ్యాలు పెద్దమనసుతో ముందుకొచ్చి ఆదుకోవాలని ఐరాస సూచిస్తోంది. వీలైనంత వరకు ముందస్తు సన్నద్ధతకు చేయూతనివ్వాలని చెబుతోంది. ఆ దిశగా ఆయా దేశాలు ముందడుగు వేస్తేనే భవిష్యత్తులో విపత్తుల నుంచి ప్రజలకు కొంతవరకైనా రక్షణ లభిస్తుంది.

- కామేశ్వరరావు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సమాన హక్కులే ప్రజాబలం

‣ బడుగులపై ఆగని అకృత్యాలు

‣ టెక్‌ కంపెనీల కట్టడికి అడుగులు

‣ లొసుగులమయం... జీఎస్టీ విధానం!

Posted Date: 12-07-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం