• facebook
  • whatsapp
  • telegram

భారత్‌తో సంబంధాలు... జాన్సన్‌ ముద్ర

బ్రిటన్‌ కొత్త ప్రధానిపై ఉత్కంఠ

బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం ముదరడంతో ప్రధాని పదవి నుంచి వైదొలగేందుకు బోరిస్‌ జాన్సన్‌ ఎట్టకేలకు అంగీకరించారు. దాదాపు మూడేళ్లుగా ఆ పీఠంపై ఉన్న ఆయన జాతీయంగా, అంతర్జాతీయంగా అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. బ్రెగ్జిట్‌ ప్రక్రియ సాఫీగా పూర్తవడంలో కీలక పాత్ర పోషించారు. దౌత్య వ్యవహారాల్లో తనదైన శైలిని ప్రదర్శించారు. ముఖ్యంగా భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు అగ్రస్థాయి ప్రాధాన్యమిచ్చారు. దశాబ్దాలుగా ఊగిసలాడుతున్న ద్వైపాక్షిక సంబంధాలను పూర్తిస్థాయిలో పురోగతి పట్టాలెక్కించారు. దిల్లీ-లండన్‌ బంధం ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయి నుంచి ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ హోదాకు చేరుకోవడంలో ఆయన కృషి మరువలేనిది. ఇప్పుడు జాన్సన్‌ నిష్క్రమణ ఖాయం కావడంతో- బ్రిటన్‌తో భారత్‌ సంబంధాల్లో పురోగతి మందగించే అవకాశముందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

కలిసివచ్చిన స్నేహబంధం

గతంలో బ్రిటన్‌ ప్రధానులుగా పనిచేసిన వారందరికంటే జాన్సన్‌కు ఇండియాతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన మాజీ భార్య మరీనా వీలర్‌- భారత్‌కు చెందిన ప్రముఖ రచయిత, దౌత్యవేత్త కుశ్వంత్‌ సింగ్‌ మేనకోడలు. జాన్సన్‌, వీలర్‌ దాదాపు పాతికేళ్లపాటు వివాహ బంధంలో కొనసాగారు. ఆ సమయంలో ఆయన చాలాసార్లు ఇండియాకు వచ్చారు. ప్రధాని మోదీతో జాన్సన్‌కు బలమైన స్నేహబంధం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత పర్యటనకు వచ్చినప్పుడు మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో ఆయన పర్యటించారు. గత ఏడాది గ్లాస్గోలో నిర్వహించిన కాప్‌-26 సదస్సులో మోదీని ప్రపంచ నేతలకు జాన్సన్‌ పరిచయం చేసినతీరు వారి మధ్య ఎంతటి సాన్నిహిత్యం ఉందో చాటిచెప్పింది. ద్వైపాక్షిక వాణిజ్య బంధాన్ని కొత్త ఎత్తులకు చేర్చే దిశగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై సంప్రతింపులను దిల్లీ, లండన్‌ ఇటీవల ముమ్మరం చేశాయి. గత ఏడాది మేనెలలో ‘మెరుగైన వాణిజ్య భాగస్వామ్యం(ఈటీపీ)’ కుదుర్చుకున్నాయి.2021 నాటికి ఇండియా-బ్రిటన్‌ వాణిజ్య బంధం విలువ దాదాపు 2,400 కోట్ల పౌండ్లు. 2030కల్లా ఆ విలువను కనీసం రెట్టింపు చేయాలన్నది ఈటీపీ లక్ష్యం. ఇరు దేశాల మధ్య వచ్చే ఏడాది సమగ్ర ఎఫ్‌టీఏ కుదురుతుందని అంచనాలున్నాయి. ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి ‘2030 రోడ్‌మ్యాప్‌’పైనా మోదీ, జాన్సన్‌ గత ఏడాది సంతకం చేశారు. ఆరోగ్య సేవలు, వాణిజ్యం-పెట్టుబడులు, రక్షణ, భద్రత, పర్యావరణ మార్పుల వంటి రంగాల్లో పరస్పర సహకారంతో ముందుకు వెళ్ళాలని అందులో తీర్మానించారు. 1990ల్లో ఇండియా బ్రిటన్‌కు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండేది. 2019 నాటికి ఆ స్థానం 17కు పడిపోయింది. ‘2030 రోడ్‌మ్యాప్‌’తో వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో పూర్వవైభవం సాధించాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. ప్రపంచ భౌగోళిక రాజకీయాలకు కేంద్రంగా నిలుస్తున్న ఇండో-పసిఫిక్‌లో భారత్‌ తమకు అతిపెద్ద భాగస్వామి అని జాన్సన్‌ గతంలో విస్పష్ట ప్రకటన చేశారు. అందుకు తగ్గట్లే ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరచుకొనేందుకు చిత్తశుద్ధితో కృషిచేశారు. బ్రిటన్‌లో తాజా పరిణామాలు ఆ దేశ అంతర్గత వ్యవహారాలని, ద్వైపాక్షిక సంబంధాలపై అవి ప్రతికూల ప్రభావం చూపబోవని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ అంటున్నారు. 2030కల్లా అంతర్జాతీయ జీడీపీలో భారత్‌ వాటా 7.97 శాతానికి చేరుకుంటుందని అంచనా. 2050కల్లా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించడమూ లాంఛనప్రాయమే! బ్రెగ్జిట్‌ నేపథ్యంలో ఈయూ దేశాలతో యూకే లావాదేవీలు మునుపటి స్థాయిలో సాఫీగా సాగే అవకాశాలు పెద్దగా లేవు.

ఎవరికి దక్కినా...

బ్రిటన్‌లో భారత సంతతి వ్యక్తుల ప్రాబల్యమూ ఎక్కువే. దేశ జనాభాలో బ్రిటిష్‌ ఇండియన్లు 1.8శాతం ఉన్నారు. బ్రిటన్‌ నాయకత్వ బాధ్యతలు ఎవరు చేపట్టినా- భారత్‌ వంటి భారీ విపణిని దూరం చేసుకునేందుకు సాహసించరు. కన్జర్వేటివ్‌ పార్టీ ఎన్నుకోబోయే కొత్త నేత ప్రధాని పీఠాన్ని అధిష్ఠించేందుకు దాదాపు రెండు నెలల సమయం పట్టవచ్చు. అప్పటివరకు జాన్సన్‌ తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతారు. యూకే తదుపరి ప్రధాని పీఠం రేసులో భారత సంతతికి చెందిన రుషి సునాక్‌, సుయెలా బ్రావెర్మన్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో ఎవరు పదవి దక్కించుకున్నా ద్వైపాక్షిక సంబంధాలు కొత్తపుంతలు తొక్కే అవకాశాలుంటాయి. వీసాల మంజురులో ప్రాధాన్యమివ్వాలని యూకేను దిల్లీ కోరుతోంది. భారతీయ ఉత్పత్తుల దిగుమతిపై సుంకాలను తగ్గించాలని అడుగుతోంది. బ్రిటన్‌ కేంద్రంగా సాగుతున్న ఖలిస్థానీలు, వేర్పాటువాదుల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్‌ చేస్తోంది. వీటన్నింటిపై నూతన ప్రధాని సానుకూలంగా స్పందిస్తే ద్వైపాక్షిక బంధం మునుపెన్నడూ లేనంత పటిష్ఠంగా మారుతుందనడంలో సందేహం లేదు.

- నవీన్‌ కుమార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ విపత్తులతో ప్రపంచం విలవిల

‣ సమాన హక్కులే ప్రజాబలం

‣ బడుగులపై ఆగని అకృత్యాలు

‣ టెక్‌ కంపెనీల కట్టడికి అడుగులు

‣ లొసుగులమయం... జీఎస్టీ విధానం!

Posted Date: 16-07-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం