• facebook
  • whatsapp
  • telegram

న్యాయవ్యవస్థకు సాంకేతిక హంగులు

ఆధునిక విధానాలకు పెరుగుతున్న ప్రాధాన్యం

నాలుగున్నర కోట్లకు పైగా పెండింగ్‌ కేసులు... దాదాపు అన్ని హైకోర్టుల్లోనూ న్యాయమూర్తుల కొరత... దేశంలో సత్వర న్యాయానికి సవాలుగా మారుతున్న వేళ... ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్‌   ఎన్‌.వి.రమణ ఆ అవరోధాలన్నీ ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ముందుకెళుతున్నారు. న్యాయమూర్తుల ఖాళీలపై ప్రధానంగా దృష్టి సారించి, వాటిని భారీయెత్తున భర్తీ చేయిస్తున్నారు. మరోవైపు న్యాయవ్యవస్థలో సాంకేతికత పెరగాల్సిన అవసరాన్ని ఆయన పదేపదే ప్రస్తావిస్తున్నారు. సుప్రీంకోర్టు జారీ చేసే మధ్యంతర, స్టే, బెయిల్‌ ఉత్తర్వులను వేగంగా చేరవేసేందుకు ‘ఫాస్ట్‌ అండ్‌ సెక్యూర్డ్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆఫ్‌ ఎలెక్ట్రానిక్‌ రికార్డ్స్‌ (ఫాస్టర్‌)’ పేరుతో కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఆయన సహచర న్యాయమూర్తులతో కలిసి ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీన ప్రారంభించారు. ‘ఫాస్టర్‌’ ద్వారా న్యాయవ్యవస్థకు సాంకేతిక హంగులు అద్దడం ఓ కీలకమైన ముందడుగు.

వేగంగా ఉత్తర్వులు

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఆగ్రా జైలులో ఉన్న నిందితులకు బెయిల్‌ మంజూరు చేస్తూ 2021 జులై 8న ఉత్తర్వులిస్తే మూడు రోజులు దాటినా వారిని విడుదల చేయలేదంటూ పత్రికల్లో కథనాలు వచ్చాయి. అదేమంటే ఆ ఉత్తర్వులు తమకు అందలేదని అధికారులు సమాధానమిచ్చారు. ఈ కథనాలను సుమోటోగా స్వీకరించిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం జులై 16న దీనిపై విచారణ చేపట్టింది. ‘ప్రస్తుత సాంకేతిక యుగంలోనూ కోర్టు ఉత్తర్వులను చేరవేయడానికి ఆకాశం వైపు ఎందుకు చూడాలి?’ అని సీజేఐ ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్య- సాంకేతికపరంగా పురోగతికి నోచని మన న్యాయవ్యవస్థ తీరుకు అద్దం పట్టింది. సాంకేతికత సాయంతో వేగంగా ఉత్తర్వులు అందించే వ్యవస్థను రెండు వారాల్లోగా రూపొందించాలని ధర్మాసనం ఆదేశించడంతో యంత్రాంగం ఆగమేఘాలమీద కదిలింది. ‘నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ)’తో కలిసి యుద్ధప్రాతిపదికన ఫాస్టర్‌ను అభివృద్ధి చేశారు. ఈ వ్యవస్థను దేశవ్యాప్తంగా విస్తరించడానికి 73 మంది నోడల్‌ అధికారులను నియమించారు. ఉత్తర్వులను వేగంగా, సురక్షితంగా చేరవేయడానికి వీలుగా 1,887 మెయిల్‌ ఐడీలు సృష్టించారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫాస్టర్‌ సెల్‌ కోర్టు ప్రొసీడింగ్స్‌, బెయిల్‌, మధ్యంతర ఉత్తర్వులను ఈ-మెయిల్‌ ద్వారా నోడల్‌ అధికారులకు పంపిస్తుంది. ఫలితంగా క్షణాల్లో ఆ ఉత్తర్వులు... వాటిని అందుకోవాల్సిన చిట్టచివరి అధికారికి చేరతాయి. బెయిళ్లు జారీ చేసే అంశంపై సంస్కరణలతో కూడిన ప్రత్యేక చట్టం అవసరం ఉందని తాజాగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బెయిల్‌ మంజూరులో యూకే తరహాలో ప్రత్యేక చట్టం తెచ్చే అవకాశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి పిలుపిచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగానే కాక కేరళలో న్యాయశాఖామంత్రిగా పని చేసి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న జస్టిస్‌ కృష్ణయ్యర్‌- అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన న్యాయవ్యవస్థ 200 సంవత్సరాలు వెనక ఉందని తన పుస్తకం ‘లా, లాయర్స్‌ అండ్‌ జస్టిస్‌’లో పేర్కొన్నారు. జస్టిస్‌ లోథా నుంచి ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ వరకు ఎందరో ప్రధాన న్యాయమూర్తులు కోర్టుల్లో పెరుగుతున్న పనిభారానికి అనుగుణంగా జడ్జీలు, సిబ్బంది లేకపోవడంపై అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల కొద్దీ పెండింగ్‌ కేసులున్న మన న్యాయవ్యవస్థలో వాటన్నింటినీ సత్వరం విచారించి, న్యాయం చేయాలంటే మానవ వనరులు, మౌలిక వసతులతోపాటు సాంకేతికతకు కూడా పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. కేసుల వర్గీకరణ, దస్త్రాలను ఎప్పటికప్పుడు నవీకరించడం, కావాల్సినప్పుడు వాటిని సులువుగా వెతికి తీసుకోవడం, తీర్పుల నమోదు... ఇలాంటి వాటన్నింటికీ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడటమే కాదు- మానవ వనరుల అవసరాన్నీ తగ్గిస్తుంది. తద్వారా పనిభారం తగ్గి మరిన్ని కేసుల సత్వర పరిష్కారానికి దోహదం చేస్తుంది.

కరోనా కాలంలో కలిసివచ్చిన వైనం

కరోనాతో దాదాపు ఏడాదిన్నర కాలం కోర్టుల్లో భౌతిక విచారణలు జరగలేదు. ఈ నేపథ్యంలో సాంకేతికతే ఆ లోటు తీర్చింది. వర్చువల్‌ విచారణలతో న్యాయమూర్తులు వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడం న్యాయవ్యవస్థలో టెక్నాలజీకి పెరుగుతున్న ప్రాధాన్యాన్ని చాటిచెప్పింది. జైళ్లలో విచారణ ఖైదీలను అక్కడి నుంచే విచారించేందుకు కారాగారాల్లో వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయాన్ని తీసుకురావాలని 2020 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు సూచించింది. కానీ, 40 శాతానికి పైగా జైళ్లలో వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యం లేకపోవడంపై పలువురు న్యాయమూర్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. విచారణ ఖైదీలకు న్యాయం జరగడంలో జాప్యానికి ఇది కారణమవుతుందని అభిప్రాయపడ్డారు. అన్ని రంగాల్లో మాదిరిగానే న్యాయవ్యవస్థలోనూ కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌ల ఆవశ్యకత పెరుగుతోంది. ఒకే తరహా కేసులు ఎన్నో వివిధ కోర్టుల్లో విచారణ జరిగి, తీర్పులు వెలువడుతుంటాయి. అలాంటిదే కొత్త కేసు వచ్చినప్పుడు పాత కేసులు ఎప్పుడు నమోదయ్యాయి, వాటి విచారణలో ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు... వంటి వివరాలు వెంటనే తెలుసుకోవచ్చు. న్యాయమూర్తులు ఎలాంటి తీర్పులిచ్చారో కూడా క్షణాల్లో తెలుసుకోవడానికి ఏఐ తోడ్పడుతుంది. సుప్రీంకోర్టు తీర్పులను దేశంలోని తొమ్మిది ప్రాంతీయ భాషల్లోకి అనువదించి భద్రపరుస్తారు. దీన్ని ధ్రువీకృత నిపుణులతో చేయించాలంటే కొన్ని నెలలు పడుతుంది. ఇప్పుడు సాంకేతికత సహాయంతో ఈ పని చాలా వేగంగా సులువుగా పూర్తవుతోంది. కోర్టు రికార్డుల నిర్వహణ, తీర్పులు, వారంట్లు, నేరచరిత్రలను భద్రపరచే ప్రక్రియలో ‘బ్లాక్‌ చైన్‌’ సాంకేతికత కూడా అక్కరకొస్తోంది. ఇలా న్యాయవ్యవస్థలో సాంకేతికత రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వం కూడా న్యాయవ్యవస్థలో టెక్నాలజీకి మరింత ప్రాధాన్యం ఇచ్చి, అవసరమైన మౌలిక వసతులు సమకూరిస్తే సకాలంలో న్యాయం అందించాలన్న లక్ష్యసాధన వేగంగా సుగమమవుతుంది.

ఆది నుంచీ వెనకబాటే

కోర్టుల్లో పరిపాలనా వ్యవహారాలు, సిబ్బంది హాజరు వంటివన్నీ నమోదు చేసేందుకు 1991-92లోనే కంప్యూటర్లు ప్రవేశపెట్టారు. తరవాత పదిహేనేళ్లదాకా సాంకేతికత వినియోగం పట్టాలకు ఎక్కలేదు.

అందరికీ అందుబాటులో వివరాలు ఉండటం, పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండేలా వ్యవస్థను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో 2007లో ఈ-కోర్టుల ప్రాజెక్టు తొలి దశకు రూ.935 కోట్లతో శ్రీకారం చుట్టారు. ఎనిమిదేళ్ల సుదీర్ఘ కాలం తరవాత గానీ అది పూర్తికాలేదు.

2016లో తొలిసారిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల ఉమ్మడి హైకోర్టులో ఈ-కోర్టుల విధానాన్ని ప్రారంభించారు. రెండో దశ 2015లో ఆమోదం పొందితే మూడేళ్ల తరవాత అందుబాటులోకి వచ్చింది.

కేసులు, కోర్టు రికార్డులు, తీర్పులు వంటివన్నీ కంప్యూటరైజ్‌ చేసి, అవసరమైనప్పుడు క్షణాల్లో అందించగలిగే ఈ-కోర్టుల వ్యవస్థతో మరింత సమర్థంగా, సకాలంలో న్యాయం అందించవచ్చు.

- శిశిర
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సుబాబుల్‌ రైతుల కష్టాల సాగు

‣ నదీ తీరాల పరిరక్షణపై నిర్లక్ష్యం

‣ భారత్‌తో సంబంధాలు... జాన్సన్‌ ముద్ర

‣ విపత్తులతో ప్రపంచం విలవిల

Posted Date: 16-07-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం