• facebook
  • whatsapp
  • telegram

సాధించాల్సింది కొండంత...

పటిష్ఠ ప్రణాళికతోనే రక్షణ ఎగుమతుల్లో వృద్ధి

ఇండియా రక్షణ రంగ ఎగుమతులు 2021-22 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.13 వేల కోట్లకు చేరాయి. ఈ మేరకు రక్షణ ఉత్పత్తుల విభాగం (డీడీపీ) అదనపు కార్యదర్శి సంజయ్‌ జాజు ఇటీవల వెల్లడించారు. రక్షణ శాఖ గణాంకాల ప్రకారం 2016-22 మధ్య కాలంలో భారత్‌ సాయుధ సామగ్రి ఎగుమతులు రూ.1,522 కోట్ల నుంచి దాదాపు ఎనిమిది రెట్లు పెరిగాయి. క్షిపణులు, అత్యాధునిక తేలికపాటి హెలికాప్టర్లు, తీరప్రాంత గస్తీ నౌకలు, వ్యక్తిగత రక్షణ సామగ్రి, నిఘా వ్యవస్థలు, పలు రకాల రాడార్లు ఇతర పరికరాలు, సాంకేతికతలను భారత్‌ విదేశాలకు ఎగుమతి చేస్తోంది. బ్రహ్మోస్‌ క్రూయిజ్‌ క్షిపణులకు సంబంధించి ఈ జనవరిలో ఫిలిప్పీన్స్‌తో ఇండియాకు రూ.2,800 కోట్ల విలువైన చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. 2025 నాటికి అయిదు బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.40 వేల కోట్ల) రక్షణ ఎగుమతులు సాధించాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది. అది సాకారం కావాలంటే పటిష్ఠ ప్రణాళికతో వడిగా అడుగులు వేయాలి. 

రక్షణ రంగంలో దశాబ్దాలుగా దిగుమతులపైనే భారత్‌ ఆధారపడింది. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తరవాత దేశీయంగా తయారీపై దృష్టి సారించారు. సాయుధ సామగ్రి ఎగుమతులను ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఆ క్రమంలో భారత్‌ ఆయుధ దిగుమతులు 2012-16, 2017-21 మధ్య కాలంలో 21శాతం తగ్గాయి. అయినా, 2017-21లో అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకున్న దేశంగా ఇండియా నిలిచినట్లు స్టాక్‌హోమ్‌ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ (సిప్రి) తెలిపింది. ప్రపంచ ఆయుధ దిగుమతిలో భారత్‌ వాటా 11శాతం. అదే సమయంలో ఎగుమతుల్లో ఇండియా వాటా 0.17శాతమే. ఎగుమతుల పరంగా 2015-19 మధ్య కాలంలో 25 దేశాల జాబితాలో భారత్‌ 23వ స్థానంలో నిలిచింది. సిప్రి వార్షిక నివేదిక 2021 ప్రకారం 2016-20 మధ్య ప్రపంచ ఆయుధ విపణిలో చైనా, ఫ్రాన్స్‌, జర్మనీ, రష్యా, అమెరికాల వాటా 76శాతం. అత్యాధునిక ఆయుధాలను రూపొందిస్తూ ఇజ్రాయెల్‌, ఇటలీ, దక్షిణ కొరియా, స్పెయిన్‌, బ్రిటన్‌లు రక్షణ ఎగుమతుల్లో 15శాతం వాటాను గుప్పిటపట్టాయి. దాని ప్రకారం చూస్తే ఆయుధ సామగ్రి ఎగుమతుల్లో పది దేశాలే తొంభై శాతం వాటాను చేజిక్కించుకున్నాయి. వాటికి పోటీగా ఆయుధ వ్యాపారంలో రాణించాలంటే చవక ధరలో నాణ్యమైన, అధునాతన ఆయుధాలను ఇండియా రూపొందించి, నిర్దేశిత సమయానికి సరఫరా చేయడం తప్పనిసరి. వరస ఒప్పందాలు, రక్షణ పరికరాల జీవితకాల నిర్వహణ కాంట్రాక్టులు వంటి వాటితో అగ్ర రాజ్యాలు ఆయుధ విపణిలో దూసుకుపోతున్నాయి. అలాంటి వాటి గురించి భారత్‌ ఆలోచించాలి. రక్షణ ఉత్పత్తుల్లో నమ్మకం ప్రధాన అంశం. ఇండియా సరఫరా చేసిన ఇన్సాస్‌ రైఫిళ్లు సరిగ్గా పనిచేయలేదని 2005లో నేపాల్‌ ఆరోపించింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) రూపొందించిన అధునాతన తేలికపాటి ధ్రువ్‌ హెలికాప్టర్లు నాలుగు అనతి కాలంలోనే కూలిపోవడంతో ఈక్వెడార్‌ ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఇలాంటి వైఫల్యాలకు తావులేకుండా రక్షణ సామగ్రిని పకడ్బందీగా రూపొందించాలి. భారత్‌ రక్షణ ఎగుమతుల్లో చిన్న పరికరాలు, విడిభాగాలే అధికంగా ఉంటున్నట్లు రక్షణ శాఖ వర్గాల జాబితాను చూస్తే అర్థమవుతుంది. కేవలం వాటి ద్వారానే ప్రపంచంలో ప్రధాన ఆయుధ ఎగుమతిదారుగా అవతరించడం సాధ్యపడదు. 2025 నాటికి దేశీయ రక్షణ పరికరాల ఉత్పత్తిని 2,500 కోట్ల డాలర్లకు తీసుకెళ్ళాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం వివిధ దశల్లో 310 ఆయుధ, రక్షణ వ్యవస్థల దిగుమతులపై నిషేధం విధించింది. భవిష్యత్తులో వాటిని భారత్‌లోని సంస్థల నుంచే కొనుగోలు చేయనున్నారు. మరోవైపు ఆయుధ సముపార్జన నిధుల్లో 68శాతాన్ని స్థానిక పరిశ్రమల నుంచి కొనుగోలుకే కేటాయించాలని నిర్ణయించారు.

పరిశోధనలు కీలకం

రాబోయే మూడేళ్లలో ఎగుమతులను అయిదు బిలియన్‌ డాలర్లకు తీసుకెళ్ళాలంటే మూడు రెట్ల వృద్ధి నమోదవ్వాలి. అది సాధ్యం కావాలంటే పరిశోధనలను చురుకెత్తించి, మేలిమి ఆయుధాల తయారీలో ఇండియా తన ప్రత్యేకతను చాటుకోవాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా రక్షణ రంగంలోనూ కృత్రిమ మేధ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తోంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తాజాగా 75 ఏఐ పరికరాలు, సాంకేతికతలను ఆవిష్కరించారు. భవిష్యత్తులో వాటిపై పరిశోధనలు మరింతగా ఊపందుకోవాలి. కొంత కాలంగా దేశీయంగా రక్షణ రంగ ఎగుమతుల్లో 90శాతాన్ని ప్రైవేటు సంస్థలే సమకూరుస్తున్నాయి. 2021-22లో ప్రభుత్వ రంగ పరిశ్రమల వాటా 30శాతం ఉండటం హర్షణీయం. సాయుధ పరిశోధనలకు ఊతమిచ్చేందుకు ఈ ఏడాది బడ్జెట్లో డీఆర్‌డీఓ రక్షణ నిధిని సైతం అయిదు రెట్లు పెంచారు. రక్షణ ఎగుమతుల్లో ఆలస్యంగా ప్రయాణం ప్రారంభించిన భారత్‌- రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల విశ్వసనీయ భాగస్వామిగా ఎదగాలంటే ప్రభుత్వ విధానాలు ఎప్పటికప్పుడు పదును తేలాల్సిందే!

- మైత్రేయ
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ న్యాయవ్యవస్థకు సాంకేతిక హంగులు

‣ సుబాబుల్‌ రైతుల కష్టాల సాగు

‣ నదీ తీరాల పరిరక్షణపై నిర్లక్ష్యం

‣ భారత్‌తో సంబంధాలు... జాన్సన్‌ ముద్ర

‣ విపత్తులతో ప్రపంచం విలవిల

Posted Date: 16-07-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం