• facebook
  • whatsapp
  • telegram

పట్టాలు తప్పిన ప్రపంచ ప్రగతి

సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సుదూరం

ప్రపంచ దేశాలన్నీ కలిసి నిర్దేశించుకొన్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన ఆచరణలో చతికిలపడింది. కొవిడ్‌-19, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ సమాజంలో పెరుగుతున్న సంఘర్షణలు... ఇవన్నీ కలిసి గత రెండేళ్లుగా ప్రపంచ పురోగతిని దెబ్బ తీశాయి. కరోనా విలయం కోట్ల మందిని తీవ్ర పేదరికంలోకి నెట్టేసింది. ద్రవ్యోల్బణం అన్ని దేశాలనూ కమ్మేసింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం కలిగిస్తోంది. ఆహార సరఫరా వ్యవస్థల అనుసంధానం దెబ్బతిని- ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతోంది. ఐక్యరాజ్యసమితి ఇటీవల విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ 17) నివేదిక ఈ విషయాలను కూలంకషంగా వివరించింది. పేదరిక నిర్మూలన, వైద్య, విద్యావసతుల అభివృద్ధి, లింగ సమానత్వం, రక్షిత నీరు-పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, అసమానతల తగ్గింపు, కాలుష్య కారకాల తొలగింపు వంటి 17 లక్ష్యాల సాధనకు ఉద్దేశించిందే ఎస్‌డీజీ. ఇందుకోసం 2015 నవంబరులో ఐరాస సర్వప్రతినిధి సభలో ప్రవేశపెట్టిన అజెండాను భారత్‌ సహా ఐరాస సభ్యదేశాలన్నీ ఆమోదించాయి. ఆయా లక్ష్యాలను 2030 నాటికి నిర్దేశించుకొన్నాయి. పరస్పర సహకారంతో గుణాత్మక అభివృద్ధి సాధిస్తూ ప్రపంచాన్ని సరికొత్త పథంలో పయనింపజేస్తామని ప్రతిన బూనాయి. ‘ఎవరినీ విడిచిపెట్టవద్దు’ అనే సూత్రం ఆధారంగా అందరూ సుస్థిర అభివృద్ధి సాధించేలా ఎస్‌డీజీ 17లో సమగ్ర విధానాన్ని రూపొందించారు.

ఆహార సంక్షోభం

కరోనా మహమ్మారి సృష్టించిన విలయంవల్ల రెండు దశాబ్దాల్లో తొలిసారిగా 2020లో పేదరికం పెరిగింది. ఒక తరంలో సాధించిన పురోగతిని ఈ మహమ్మారి మటుమాయం చేసింది. 2019లో 6.7శాతంగా ఉన్న తీవ్రస్థాయి పేదరికం రేటు 2020లో 7.2శాతానికి హెచ్చింది. సుదీర్ఘకాలం పాఠశాలలు మూతపడటంతో ప్రాథమిక విద్యలో అంతరాలు తీవ్రమయ్యాయి. 15 కోట్ల మంది పాఠశాల విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు దూరమయ్యారు. ఇందులో 2.4 కోట్ల మంది పూర్తిగా చదువు మానేశారు. విపత్తు సంబంధిత మరణాలు 2020లో ఆరు రెట్లు పెరిగాయి. 2022 ప్రథమార్ధం నాటికి ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మందికి పైగా కొవిడ్‌ బారిన పడగా, అందులో అధికారిక లెక్కల ప్రకారమే 63 లక్షల మందికి పైగా మృతి చెందారు. 2020-21 మధ్యకాలంలో 1,15,500 మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. 92శాతం దేశాల్లో ఆరోగ్య సంరక్షణ సేవలకు అంతరాయం కలిగింది. క్షయ, మలేరియా మరణాలు అనూహ్యంగా పెరిగాయి. కొవిడ్‌ శరాఘాతం నుంచి ప్రపంచం కోలుకోకముందే రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం దాపురించడంతో ఆహారం, ఇంధనం, ఎరువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. అతిపెద్ద శరణార్థుల సంక్షోభం తలెత్తింది. మధ్యఆసియా, ఆఫ్రికా దేశాల్లోనూ అంతర్యుద్ధాలు కొనసాగుతుండటంతో 2022 మే నాటికి 10 కోట్ల మంది ప్రజలు స్వస్థలాలను వీడాల్సి వచ్చింది. వారిలో 41శాతం పిల్లలున్నారు. సరఫరా వ్యవస్థలు నిలిచిపోయి 47శాతం దేశాల్లో ఆహారం ధరలు ఎగబాకాయి. ప్రపంచ ఆహార ఎగుమతుల్లో రష్యా, ఉక్రెయిన్‌లకు కలిపి గోధుమల్లో 30శాతం, మొక్కజొన్నలో 20శాతం, పొద్దుతిరుగుడు ఉత్పత్తుల్లో 80శాతం వాటా ఉంది. వీటిపై ప్రధానంగా ఆధారపడిన ఆఫ్రికాలో ఆహార సంక్షోభం తలెత్తింది. గత ఏడాది ప్రపంచంలో 82.8 కోట్ల మంది ఆకలి బాధలు అనుభవించారని అంచనా. దీనికి తోడు కరోనా కొత్త ఉత్పరివర్తనాల భయం అలాగే ఉండటంతో 2022లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 0.9 శాతానికే పరిమితం అవుతుందని ఐరాస అంచనా వేసింది. ప్రపంచం వాతావరణ విపత్తు అంచున ఉంది. వాతావరణ మార్పులతో వేడిగాలులు, వరదలు, కరవు పరిస్థితులు పెరిగిపోతున్నాయి. 2020లో లాక్‌డౌన్‌లతో కనిష్ఠ స్థాయికి చేరిన వాతావరణ కాలుష్యం 2021లో ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణతో అమాంతంగా పెరిగిపోయింది. భూగోళం సగటు ఉష్ణోగ్రతను 1.5 డిగ్రీల స్థాయికి కట్టడి చేసేలా కుదిరిన ప్యారిస్‌ ఒప్పందం కట్టుబాట్లను చాలా దేశాలు పక్కనపెట్టేశాయి.

మేల్కొనకపోతే ముప్పే!

ఇప్పుడున్న పోకడలే కొనసాగితే 2030 నాటికి 160 కోట్ల మందికి రక్షిత నీరు ఉండదు. 280 కోట్ల మంది సరైన పారిశుద్ధ్య వసతులు ఉండవు. 190 కోట్ల మందికి కనీసం చేతుల శుభ్రత వంటి వసతులూ లభించవు. 11 కోట్ల మంది బాలికలకు బాల్య వివాహాలు జరుగుతాయి. కరోనా మునుపు ఉన్న అంచనాల కంటే ఈ సంఖ్య కోటి ఎక్కువ. ఏటా 560 వరకు మధ్యస్థ, భారీ విపత్తులు సంభవిస్తాయి. రేపటి తరం వాతావరణ విపరిణామాలను చవిచూస్తుంది. 76శాతం ప్రజలకే కాలుష్యరహిత వంట ఇంధనం, సాంకేతికతలు అందుబాటులోకి వస్తాయి. కరోనా లక్షల మందిని ఏ విధంగా పేదలుగా మార్చిందో ఐరాస నివేదిక కూలంకషంగా వివరించింది. మానవ చర్యలతో వాతావరణ మార్పులు మునుపెన్నడూ లేనంత దారుణంగా మారాయని గుర్తుచేసింది. ప్రస్తుత పరిణామాలతో ఆహార సంక్షోభం తలెత్తే దేశాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ తిరుగుబాట్లు తప్పవని హెచ్చరించింది. భారత్‌ సహా అంతర్జాతీయ సమాజం ఈ నివేదికను తీవ్రంగా పరిగణించి పరిస్థితి తీవ్రతను తగ్గించేందుకు వేగంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది!

చేదు  వాస్తవాలు

నేడు ప్రపంచంలో ప్రతి 10 మందిలో ఒకరు ఆకలితో బాధపడుతున్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరికి సరిపడా ఆహారం అందడం లేదు. కరోనా పర్యవసానాలతో 80 లక్షల మంది పారిశ్రామిక కార్మికులు ఉపాధి కోల్పోయి పేదరికంలోకి జారుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2020లో ఆందోళన, కుంగుబాటు సమస్యలు 25శాతం ఎక్కువయ్యాయి. బాధితుల్లో అధికశాతం యువత, మహిళలే.

మహమ్మారి సంక్షోభ సమయంలో పేద దేశాల్లోని నిరుద్యోగుల్లో కేవలం ఒక్క శాతానికే ప్రభుత్వాల నుంచి నగదు సాయం అందింది. అభివృద్ధి చెందిన దేశాల్లో 52శాతానికి పైగా నగదు బదిలీ జరిగింది. 2019 నాటికి మొత్తం ఉద్యోగుల్లో 39శాతం మహిళలు ఉండగా, 2020లో ఉద్యోగాలు కోల్పోయిన వారిలో 45శాతం మహిళలే.

సానుకూల  పరిణామాలు

ఇంటర్‌నెట్‌ వినియోగదారులు గణనీయంగా పెరిగారు. 2019లో సుమారు ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల మంది వినియోగదారులు ఉండగా; 2021 నాటికి 490 కోట్లకు చేరారు.

భారత్‌లో 2010-20 మధ్యకాలంలో వంటగ్యాస్‌, స్వచ్ఛ ఇంధనం, సాంకేతికతల లభ్యత విస్తృతం కావడంతో వంటగది కాలుష్యం చాలావరకు తగ్గింది. చైనా, పాకిస్థాన్‌, బ్రెజిల్‌, ఇండొనేసియాలోనూ ఇదేతరహా ప్రగతి నమోదైంది.

- సీహెచ్‌.మదన్‌ మోహన్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ హక్కుల సాకుతో ‘ఆకస్‌’ అక్కసు!

‣ కొత్తపుంతలు తొక్కుతున్న రోదసి శోధన

‣ రూపాయి నేలచూపులు

‣ హిమగిరులకు కాలుష్యం కాటు

‣ సాధించాల్సింది కొండంత...

‣ న్యాయవ్యవస్థకు సాంకేతిక హంగులు

Posted Date: 18-07-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం