• facebook
  • whatsapp
  • telegram

గర్భ విచ్ఛిత్తి నిర్ణయాధికారం ఆమెదే!

చట్టాల్లో సవరణలు అత్యవసరం

ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా సంపన్న దేశాల్లో గడచిన యాభై ఏళ్లలో గర్భస్రావ చట్టాలను సరళీకరిస్తూ వచ్చారు. 1973లో రో వర్సెస్‌ వేడ్‌ కేసులో అమెరికా సుప్రీంకోర్టు అనివార్య పరిస్థితుల్లో గర్భస్రావం చేయించుకొనే హక్కు రాజ్యాంగపరంగా మహిళలకు ఉందని తీర్పు చెప్పింది. ఈ ఏడాది జూన్‌లో అదే అత్యున్నత న్యాయస్థానం తన పాత తీర్పును కొట్టివేసింది. ఈ తరుణంలో భారత్‌లో, ఇతర దేశాల్లో అమలవుతున్న గర్భస్రావ చట్టాలను పరిశీలించడం సముచితంగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం అంతర్జాతీయంగా ఏటా సుమారు 7.3 కోట్ల గర్భస్రావాలు జరుగుతున్నాయి. సగటున ప్రతి వెయ్యిమంది మహిళల్లో 39 మందికి గర్భస్రావాలు అవుతున్నాయి. ప్రపంచంలో తొలిసారి ఆ చట్టాన్ని సోవియట్‌ యూనియన్‌ సంస్కరించింది. 1920 అక్టోబరులో మహిళల ఆరోగ్య సంరక్షణలో భాగంగా గర్భస్రావాన్ని అనుమతిస్తూ సోవియట్‌ ప్రభుత్వం ఒక ఆదేశం జారీ చేసింది.

వైద్యుల ధ్రువీకరణతో...

పశ్చిమ ఐరోపా దేశాల్లో 1970ల నుంచి గర్భస్రావ చట్టాలను సడలిస్తూ వచ్చారు. 2000 సంవత్సరం నుంచి 38 దేశాలు ఆ చట్టాలను సరళీకరించాయి. పోలాండ్‌ మాత్రం 2020లో గర్భస్రావంపై తీవ్ర ఆంక్షలు విధించింది. గర్భస్థ శిశువు అవకరాలతో పుట్టే ప్రమాదం ఉన్నప్పటికీ, గర్భస్రావం చేయించుకోవడానికి వీల్లేదని పోలాండ్‌ రాజ్యాంగ ట్రైబ్యునల్‌ తీర్మానించింది. ఇటీవల అమెరికా సుప్రీం కోర్టూ అటువంటి తీర్పునే వెలువరించింది. ప్రస్తుతం 24 దేశాల్లో గర్భవిచ్ఛిత్తిపై నిషేధం ఉందని పునరుత్పత్తి హక్కుల కేంద్రం తెలిపింది. మహిళల ప్రాణాలను కాపాడటానికి 42 దేశాలు గర్భస్రావాన్ని అనుమతిస్తున్నాయి. మూడు నెలల్లోపు అధికారిక అనుమతితో అబార్షన్‌ చేయించుకోవడానికి 72 దేశాలు సమ్మతిస్తున్నాయి. మహిళల ఆరోగ్యంతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితినీ దృష్టిలో ఉంచుకొని అనివార్య సందర్భాల్లో గర్భవిచ్ఛిత్తికి భారత్‌ సహా పలు దేశాలు అనుమతిస్తున్నాయి. చైనాలో అధిక జనాభా కట్టడికి 1979 నుంచి గర్భస్రావాలను అంగీకరిస్తున్నారు. రష్యాలో ప్రభుత్వాధినేత మారినప్పుడల్లా అబార్షన్‌ చట్టాన్ని సడలించడమో లేదా కఠినతరం చేయడమో పరిపాటిగా మారింది. భద్రత లేని పరిస్థితుల్లో గర్భస్రావం చేయకూడదని కైరోలో 1994లో జరిగిన అంతర్జాతీయ సదస్సు తీర్మానించింది. దానిపై 179 దేశాలు సంతకం చేశాయి.

అనివార్య పరిస్థితుల్లో మాత్రమే గర్భస్రావానికి భారతీయ చట్టాలు అనుమతిస్తున్నాయి. అయితే, అది తప్పనిసరి అని వైద్యులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. గర్భస్రావానికి 20 వారాల పరిమితిని 1971లో విధించారు. ఆ తరవాతా గర్భవిచ్ఛిత్తికి అనుమతి కోరుతూ హైకోర్టుల్లో పలు అర్జీలు దాఖలయ్యాయి. బడుగు వర్గాల మహిళలు కోర్టులకు వెళ్ళలేరు కాబట్టి, నాటు వైద్యులతో చట్టవిరుద్ధంగా గర్భస్రావాలు చేయించుకోవాల్సిన దుస్థితి తలెత్తుతోంది. భారత్‌లో ప్రమాదకర పరిస్థితుల్లో జరుగుతున్న గర్భస్రావాల వల్ల రోజుకు    10 మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నట్లు అంచనా. 2021 మార్చి నుంచి అమలులోకి వచ్చిన ‘వైద్య సాయంతో గర్భస్రావ సవరణ చట్టం’ 20 వారాల పరిమితిని 24 వారాలకు పెంచింది. వైద్య శాస్త్ర, సాంకేతిక పరంగా వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకుని ఈ మార్పు చేశారు. గర్భస్థ శిశువు అవకరాలతో పుట్టే అవకాశం ఉంటే, మెడికల్‌ బోర్డు అనుమతితో 24 వారాల లోపే గర్భస్రావం చేయించుకోవచ్చు. గర్భస్రావం జరిగిన మహిళ పేరు, ఇతర వివరాలను వైద్యులు గోప్యంగా ఉంచకపోతే శిక్షార్హులవుతారని ఆ చట్టం పేర్కొంటోంది. వైద్య సహాయంతో గర్భస్రావం చేయించే గడువును కొన్ని దేశాల్లో 28 వారాలకు పెంచారు. మానభంగం, హెచ్‌ఐవీ సోకిన కేసుల్లో 28 వారాలదాకా వైద్యుల సాయంతో గర్భస్రావం చేయించుకోవడానికి నేపాల్‌ అనుమతిస్తోంది. కెనడా అయితే అనివార్య కారణాల వల్ల ఏ దశలోనైనా గర్భవిచ్ఛిత్తికి అంగీకరిస్తోంది. బిడ్డను కనడమా, మానడమా అన్నది నిర్ణయించుకొనే స్వేచ్ఛ మహిళలకు ఉందని సుచితా శ్రీవాత్సవ వర్సెస్‌ చండీగఢ్‌ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అది రాజ్యాంగంలో 21వ అధికరణ ప్రసాదిస్తున్న వ్యక్తి స్వేచ్ఛాహక్కులో భాగమని ఉద్ఘాటించింది.

ఒత్తిళ్లతో నష్టం

గర్భస్రావ చట్టాల సంస్కరణ- ఆరోగ్య, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలతో ముడివడిన అంశం. మొదట సరళీకరణకు, సంస్కరణకు అనువైన అంశాలేవో పరిశీలించాలి. తరవాత మహిళలు, వైద్య సిబ్బంది, పార్లమెంటు సభ్యులు, న్యాయ నిపుణులు కలిసి సమగ్ర సంస్కరణలు తీసుకురావాలి. అవాంఛిత గర్భాన్ని సాధ్యమైనంత త్వరగా తొలగించుకొనే సౌకర్యం మహిళలకు ఉండాలి. రాజకీయ, మత నాయకులు గర్భస్రావాన్ని ఖండిస్తూ ప్రజాభిప్రాయాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తే- ఎంత ఉదార చట్టాలను తీసుకొచ్చినా ప్రయోజనం ఉండదు. మరింత మంది పిల్లలను కనాలని కుటుంబ పరంగా, సామాజికంగా ఒత్తిళ్లు ఉన్నంతకాలం చట్టాలు చేయగలిగిందీ ఏమీ ఉండదు. తప్పనిసరైనప్పుడు గర్భస్రావం చేయించుకోవడానికి ఎలాంటి అడ్డంకులూ ఉండకూడదు. ఆ విషయంలో మహిళల ఇబ్బందులను గుర్తించి, వారి హక్కులను గౌరవించాల్సిందే.

ఆంక్షలు లేకుండా...

అసలు గర్భస్రావాన్ని నేరంగా పరిగణించి, క్రిమినల్‌ చట్టాలను వర్తింపజేయాల్సిన అవసరం ఉందా అని ప్రభుత్వాలు ఆలోచించాలి. గర్భవిచ్ఛిత్తిని ఆరోగ్యానికి సంబంధించిన అంశంగా పరిగణించి మహిళలకు తోడ్పడే విధంగా చట్టాలను రూపొందించాలి. ప్రస్తుతం గర్భిణులకు ఉచిత సౌకర్యాలను అందిస్తున్నట్లే, గర్భస్రావానికీ రుసుములు అవసరం లేకుండా సేవలు అందించాలి. బిడ్డను కనాలా, వద్దా అన్నది నిర్ణయించుకొనే హక్కు మహిళలకు మాత్రమే ఉండాలి. చట్టపరంగా ఇతరత్రా అనుమతులు, ఆంక్షలు లేకుండా కేవలం గర్భిణి విజ్ఞప్తిపైనే గర్భస్రావం జరిగే పద్ధతిని ప్రవేశపెట్టాలి.

మైనర్లకు రక్షణ

భారత్‌ 1971లో తెచ్చిన చట్టం వైద్య సాయంతో గర్భవిచ్ఛిత్తికి అనుమతిస్తోంది. మహిళలు ఏయే సందర్భాల్లో గర్భస్రావం చేయించుకోవడానికి అవకాశం ఉందో అది నిర్దేశిస్తోంది. తల్లి ప్రాణాలకు, ఆమె మానసిక, శారీరక స్వస్థతకు ప్రమాదం ఉందని వైద్యులు నిర్ధారిస్తే గర్భధారణ జరిగిన 20 వారాల్లోగా గర్భస్రావానికి అనుమతి లభిస్తుంది. అనంతరం దాన్ని సవరించి కాలావధిని పెంచారు. లింగ నిర్ధారణ పరీక్షలను నిషేధిస్తూ తెచ్చిన చట్టం- గర్భస్రావం ఏ కాల వ్యవధిలో చేయించుకోవాలనేదానిపై ఆంక్షలు విధించింది. లైంగిక నేరాల నుంచి బాలికలకు రక్షణగా తీసుకొచ్చిన చట్టం చిన్న వయసులోనే తల్లులయ్యే ప్రమాదం నుంచి మైనర్ల భద్రతపై దృష్టి సారించింది.

- పీవీఎస్‌ శైలజ 

(సహాయ ఆచార్యులు, మహాత్మాగాంధీ న్యాయ కళాశాల, హైదరాబాద్‌)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ డ్రాగన్‌తో సఖ్యత సాధ్యమేనా?

‣ పట్టాలు తప్పిన ప్రపంచ ప్రగతి

‣ హక్కుల సాకుతో ‘ఆకస్‌’ అక్కసు!

‣ కొత్తపుంతలు తొక్కుతున్న రోదసి శోధన

Posted Date: 19-07-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం