• facebook
  • whatsapp
  • telegram

విరుచుకుపడుతున్న విపత్తులు

దీర్ఘకాలిక ప్రణాళికలే పరిష్కారం

ప్రకృతి విపత్తుల్ని ఎదుర్కోవడం భారత్‌కు  కొత్తేమీ కాదు. కాకపోతే, ఇటీవలి కాలంలో విపత్తుల సంఖ్య, వాటివల్ల జరిగే నష్టం అంతకంతకూ పెరిగిపోతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులో అవి మరింత ఎక్కువ కానున్నాయి. దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 27 తరచూ ప్రకృతి ఉత్పాతాలకు గురవుతున్నాయి. దేశ భూభాగంలో 58.6శాతం ఓ మోస్తరు నుంచి తీవ్ర భూకంపాలకు లోనయ్యే ప్రమాదం పొంచి ఉంది. 12శాతం భూభాగం వరదలు, నదుల కోత బారిన పడుతోంది. 5,700 కిలోమీటర్ల మేర సముద్ర తీరం తుపానులకు లోనవుతూ ఉంటుంది. సునామీల ప్రమాదమూ ఎక్కువే. సాగు భూమిలో 68శాతం అనావృష్టి బారిన పడుతోంది. 15శాతం భూభాగంలో మట్టి పెళ్లలు విరిగి పడుతుంటాయి. 5,161 పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థలు వరద ముంపును ఎదుర్కొంటున్నాయి. ముంబయితోపాటు పలు నగరాలు ఏటా భారీ వర్షాలతో ముంపునకు గురవడం చూస్తూనే ఉన్నాం. మున్ముందు ఇలాంటివి మరింత తరచుగా జరిగే ప్రమాదం ఉందని తెలిసి కూడా ప్రభుత్వాలు ముందుచూపుతో తగిన ప్రణాళికలను చేపట్టడం లేదు. ప్రకృతి విపత్తుల వల్ల ఆర్థిక నష్టం పెరిగిపోతోంది. విపత్తుల వల్ల కలిగే నష్టం ఆర్థికంగా, తద్వారా సామాజికంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు 1790లలో ఆఫ్రికా ఖండ పశ్చిమ ప్రాంతంలో సుదీర్ఘ కరవు ఏర్పడినప్పుడు అనేక మంది ప్రజలు ఆహారం, ఆశ్రయం కోసం బానిసలుగా అమ్ముడుపోయారని స్కాట్లాండ్‌కు చెందిన పర్యాటకుడు మంగో పార్క్‌ వెల్లడించారు.

భారీ వర్షాలతో అతలాకుతలం

అస్సామ్‌లోని 32 జిల్లాల్లో ఈ ఏడాది జూన్‌లో కురిసిన భారీ వర్షాలకు 110 మంది మరణించారు. 45 లక్షల మందికిపైగా నిర్వాసితులయ్యారు. తాజాగా జులైలో వరసగా మూడు రోజులపాటు కురిసిన కుండపోత వర్షాలు గుజరాత్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో 200 మందికిపైగా ప్రజల ప్రాణాలను బలిగొన్నాయి. పారిశ్రామిక రాష్ట్రాలైన గుజరాత్‌, మహారాష్ట్రలలో ఆర్థికంగా తీరని నష్టం సంభవించింది. ఇటీవలి గోదావరి వరదలతో నదీపరీవాహక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. వాతావరణ మార్పులతో వర్షాకాలంలో కుండపోత వానలు, వేసవిలో తీక్షణ ఉష్ణోగ్రతలు, వడగాలులు, శీతాకాలంలో తీవ్రమైన చలి పెరిగిపోతున్నాయి. ఐక్యరాజ్యసమితి ఉత్పాత ప్రమాద నిరోధక కార్యాలయ అంచనా ప్రకారం 2000-2019 మధ్య అమెరికా, చైనాల తరవాత భారతదేశంలోనే అత్యధిక ప్రకృతి విపత్తులు సంభవించాయి. పైన తెలిపిన కాలంలో భారత్‌లో సగటున ఏటా 321 విపత్తులు సంభవించాయి. 2030కల్లా వీటి సంఖ్య ఏడాదికి 530కి చేరుతుందని సమితి అనుబంధ సంస్థ ఐపీసీసీ లెక్కగట్టింది. మున్ముందు ఎండలు మండిపోయి ఉక్కపోసే రోజులు పెరిగిపోయి కూలీలు పనికి వెళ్ళలేని దుస్థితి ఏర్పడుతుంది. ఉష్ణ మండల దేశాల్లో దీనివల్ల సగటున ఏటా 22,800 కోట్ల పని గంటల దాకా నష్టం వాటిల్లుతుంది. విపరీతమైన ఎండలకు తోడు, సముద్ర మట్టాలు, వాయు కాలుష్యం పెరగడం కూడా దినసరి కూలీల స్థితిగతులను దెబ్బతీస్తాయి. వారి ఉత్పాదకత దెబ్బతిని యావత్‌ ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావం చూపుతుంది.

సమస్యను గుర్తించలేని దుస్థితి

భారత్‌లో ఇప్పటికే నీటి ఎద్దడి ఉన్నా ప్రభుత్వాలు, ప్రజలు సమస్యను తీవ్రంగా పరిగణించడంలేదు. దీని గురించి ప్రపంచ బ్యాంకు హెచ్చరించినా మనం మేల్కోవడం లేదు. భారత ద్వీపకల్ప భాగానికి వర్షాలే ఆధారం. ఏడాదిలో కొన్ని రోజులపాటు కుండపోత వర్షాల వల్ల అందుబాటులోకి వచ్చే నీటిని నిల్వ చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు లేవు. భారత్‌ భారీ ఆనకట్టలపైనే దృష్టిపెట్టి చెక్‌ డ్యామ్‌లు, చెరువులు, వాన నీటి సంరక్షణ ఆవశ్యకతను విస్మరించింది. పైగా పట్టణాల విస్తరణ వల్ల స్థిరాస్తి వ్యాపారులు రాజకీయ నేతలు కుమ్మక్కై చెరువులను కబ్జా చేయడం చూస్తూనే ఉన్నాం. ఈ కారణాల వల్ల మన నీటి నిల్వ సామర్థ్యం తీసికట్టుగా ఉంది. అమెరికాలో తలసరిన 5000 ఘనపు మీటర్ల నీటి నిల్వ వసతులు ఉంటే చైనా, దక్షిణాఫ్రికా, మెక్సికోలలో అది 1000 ఘనపు మీటర్లు. భారత్‌లో అది కేవలం 200 ఘనపు మీటర్లు. 2005నాటి విపత్తుల నిర్వహణ చట్టం కింద కేంద్ర, రాష్ట్ర స్థాయులలో ప్రకృతి విపత్తులను నిభాయించడానికి ప్రాధికార సంస్థలు ఏర్పాటయ్యాయి. వీటికి జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు సారథ్యం వహిస్తారు. జాతీయ ప్రకృతి విపత్తుల సంస్థ (ఎన్‌డీఎంఏ) వివిధ రకాల ఉత్పాతాలను గుర్తించి తగిన నిరోధక చర్యలు సూచించినా అవి అమలుకు నోచుకోవడం లేదు. ఇకనైనా చిత్తడి నేలల పరిరక్షణ, నదుల కరకట్టలను పటిష్ఠం చేయడం, కాలువలలో పూడిక తీసి చెరువుల్లోకి నీరు ధారాళంగా ప్రవహించే ఏర్పాట్లు చేయడం ద్వారా వరద ఉద్ధృతిని తట్టుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విపత్తులు వచ్చి పడినప్పుడు మాత్రమే స్పందించే అలవాటు మానుకుని నిరంతర అప్రమత్తత, ముందుచూపుతో సమర్థ కార్యనిర్వహణ చేపట్టాలి. 2020-21 బడ్జెట్‌లో ఎన్‌డీఎంఏకి కేవలం రూ.376.45 కోట్లు కేటాయించి, అందులోనూ సగం మాత్రమే ఖర్చుపెట్టారు. ఈ పద్ధతి మారాలి. ఏడాది పొడవునా చిత్తడి నేలల సంరక్షణ, చెరువులు, కాలువలలో పూడిక తీయడం, కాలుష్య పదార్థాలను తొలగించడం, కరకట్టల పునర్నిర్మాణం, పటిష్ఠీకరణ వంటి కార్యక్రమాలను ఎన్‌డీఎంఏ నిర్వహించాలి. దీనికోసం ఆ సంస్థకు కేటాయించే నిధులు పెంచాలి. గ్రామ, మండల స్థాయుల నుంచే ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే కృషి జరగాలి.

తీవ్ర నష్టం

ప్రకృతి వైపరీత్యాల వల్ల భారత్‌కు ఏటా రూ.70 వేల కోట్ల నష్టం సంభవిస్తోందని 2018నాటి ఆర్థిక సర్వే వెల్లడించింది. వివిధ విపత్తులు, కాలుష్యాలవల్ల ప్రత్యక్ష, పరోక్ష మరణాలు పెరిగిపోతున్నాయి.

విపత్తుల వల్ల 2019లో సంభవించిన మరణాలు 8,145. వరదల వల్ల 15 లక్షల ఇళ్లు కొట్టుకుపోవడమో, భారీగా దెబ్బతినడమో జరిగింది. 2019లో అన్ని రాష్ట్రాలు ప్రకృతి ఉత్పాతాలు కలిగించిన నష్టాన్ని ఎదుర్కోవడానికి రూ.35వేల కోట్లు వెచ్చించినట్లు రిజర్వు బ్యాంకు గణాంకాలు సూచిస్తున్నాయి. ముందస్తు ప్రణాళికతో విపత్తులను ఎదుర్కోవలసిన ఆవశ్యకతను ఆ గణాంకాలు గుర్తుచేస్తున్నాయి.

పట్టణాలు, నగరాల్లో కేవలం 54శాతం కుటుంబాలకు, గ్రామాల్లో 12.7 శాతం కుటుంబాలకు మాత్రమే భూగర్భ డ్రైనేజీ సౌకర్యం ఉంది. అత్యధికులకు ఈ వసతి లేకపోవడం వల్ల భూగర్భ జలాలు, నదులు, కాలువలు, చెరువులు మురుగుతో కలుషితమైపోతున్నాయి. నగరాల్లో విడుదలయ్యే మురుగు నీటిలో సగభాగాన్ని మాత్రమే శుద్ధి చేస్తున్నారు.

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సహకార బలిమి... రైతుకు కలిమి!

‣ పశ్చిమాసియాతో బలపడుతున్న బంధం

‣ గర్భ విచ్ఛిత్తి నిర్ణయాధికారం ఆమెదే!

‣ డ్రాగన్‌తో సఖ్యత సాధ్యమేనా?

‣ పట్టాలు తప్పిన ప్రపంచ ప్రగతి

‣ హక్కుల సాకుతో ‘ఆకస్‌’ అక్కసు!

‣ కొత్తపుంతలు తొక్కుతున్న రోదసి శోధన

Posted Date: 22-07-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం