• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణ లక్ష్యాలకు తూట్లు

సవరణలతో చట్టాలు నిర్వీర్యం

పర్యావరణ, అటవీ చట్టాల్లో కీలక సవరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పర్యావరణ చట్టం ప్రకారం హానికర పరిశ్రమల ఉల్లంఘనలను, భారత అటవీ చట్టం ప్రకారం రక్షిత అటవీ భూముల్లో నిషేధించిన కార్యకలాపాలను నేరంగా పరిగణిస్తున్నారు. ఇకపై అలాంటి నేరాలపై శిక్షలను తొలగించి, కేవలం అపరాధ రుసుము మాత్రమే విధించేందుకు వీలుగా వివిధ అటవీ, పర్యావరణ చట్టాల్లో సవరణలు తీసుకురావాలని కేంద్రం తలపెట్టింది. ఇందుకోసం ప్రజల అభిప్రాయాలను స్వీకరించేందుకు అందుబాటులో ఉంచిన ప్రతిపాదిత సవరణలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పరిశ్రమలు, ప్రాజెక్టులకు అనుమతి ప్రక్రియ మొదలు వాటి ఏర్పాటు, నిర్వహణ, నిరంతర పర్యవేక్షణ వంటి విషయాల్లో పర్యావరణ చట్టాల అమలులో చిత్తశుద్ధి కొరవడిందనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుత హరిత చట్టాల్లో లోపాలను తొలగించేందుకు చర్యలు తీసుకోకుండా, వాటిని మరింతగా నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

జరిమానాలకు పరిమితం

పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, అటవీ భూముల సంరక్షణకు సంబంధించిన చట్టాల్లో సవరణలను ప్రతిపాదిస్తూ ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించేందుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల ముసాయిదాను వెబ్‌సైట్‌లో ఉంచింది. మూడు పర్యావరణ చట్టాల సవరణలపై అభిప్రాయాల స్వీకరణకు జులై 21, అటవీ చట్టంపై సవరణలకు జులై 31 వరకు గడువు విధించింది. ఈ చట్టాల సవరణలో భాగంగా కొన్ని సెక్షన్ల కింద నేరంగా పరిగణించి వేస్తున్న శిక్షలను పూర్తిగా తొలగించి, వాటి స్థానంలో భారీ జరిమానాలు విధించాలని నిర్ణయించారు. జరిమానాల ద్వారా రాబట్టిన సొమ్ముతో జాతీయ స్థాయిలో ఆయా చట్టాలకు అనుబంధంగా ప్రత్యేక నిధుల్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పర్యావరణ చట్టం పరిధిలో వసూలయ్యే జరిమానాలతో ‘పర్యావరణ పరిరక్షణ నిధి’, నీటి కాలుష్య నియంత్రణ చట్టం పరిధిలో ‘నీటి కాలుష్య నివారణ నిధి’, వాయు కాలుష్య చట్ట పరిధిలో ‘వాయు కాలుష్య నివారణ నిధి’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ నష్టపరిహారాన్ని బాధిత వర్గాలకు అందించాలన్నది కీలక ఉద్దేశంగా చెబుతున్నారు. మనదేశంలో భోపాల్‌ దుర్ఘటన తరవాత మేల్కొన్న ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ చట్టం అమలును ప్రారంభించి, తదనుగుణంగా వ్యవస్థలను బలోపేతం చేయాలని నిర్ణయించింది. దీనికి అదనంగా ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ నిబంధనలు, ప్రజా భద్రత చట్టం, పర్యావరణ మదింపు మార్గదర్శకాలు, కోస్తా నియంత్రణ నిబంధనలు, జీవవైవిధ్య పరిరక్షణ చట్టం, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ వంటివి అమలులోకి వచ్చాయి. వీటన్నింటి అమలుకు కేంద్రంలోని పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర కాలుష్య మండలి, రాష్టాల్లో కాలుష్య నియంత్రణ మండళ్లు, జీవవైవిధ్య సంస్థలు వంటి వ్యవస్థలను ఏర్పాటు చేసినా- వాటికి తగిన సిబ్బంది, వనరులు కల్పించి, పటిష్ఠం చేయడంలో విఫలమైంది. రెండేళ్ల క్రితం విశాఖలో ఎల్జీ పాలిమర్‌ పరిశ్రమలో జరిగిన దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పర్యావరణ అనుమతుల ప్రక్రియ, కాలుష్య కారక పరిశ్రమలపై నిరంతరాయంగా సాగాల్సిన పర్యవేక్షణ లోపాలు ఈ ప్రమాదంతో మరోసారి బయటపడ్డాయి. ఆ దుర్ఘటన తరవాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ వేర్వేరుగా జరిపిన అధ్యయన నివేదికలు- పర్యావరణ అనుమతుల ప్రక్రియలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాయి.

పకడ్బందీ అమలుతోనే ప్రయోజనం

పరిశ్రమలు, గనుల తవ్వకం, డ్యామ్‌ల నిర్మాణం వంటి ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టులు- అనుమతుల మంజూరు ప్రక్రియ మొదలైనప్పటి నుంచి వివిధ దశల్లో షరతుల అమలు తీరుపై మంత్రిత్వ శాఖకు నివేదికలు సమర్పిస్తుండాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా, కారాగార శిక్ష విధించే వెసులుబాటు ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు తక్కువే. పైగా ప్రస్తుతం అనుమతుల ప్రక్రియ కోసం అమలు చేస్తున్న పర్యావరణ మదింపు మార్గదర్శకాలను మరింత సరళతరం చేసేందుకు పర్యావరణ ప్రభావ మదింపు (ఇ.ఐ.ఎ.) నోటిఫికేషన్‌-2020 ముసాయిదాను రూపొందించారు. అభివృద్ధి ప్రాజెక్టులు, పరిశ్రమలకు భూసేకరణ పూర్తి చేయకుండానే పర్యావరణ అనుమతుల మంజూరుకు వీలు కల్పించడంతోపాటు ప్రాజెక్టు ప్రభావిత ప్రజలతో సంప్రదింపుల ప్రక్రియను నిర్వీర్యం చేసేందుకు ఉద్దేశించిన ఈ నోటిఫికేషన్‌ వివాదాస్పదంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం పర్యావరణ చట్టాలకు తాజాగా సవరణలకు ప్రయత్నించడం ఆందోళనకరం. ప్రాజెక్టులు, పరిశ్రమలకు అవసరమైన అటవీ భూములను బదలాయించే క్రమంలో నష్టపరిహారం వసూలు చేసి అడవులను పెంచేందుకు ప్రత్యామ్నాయ వనీకరణ నిధి(కంపా) ఏర్పాటు చేశారు. గడచిన మూడు దశాబ్దాల కాలంలో లక్షల ఎకరాల్లో అటవీ భూములకు నష్టం వాటిల్లినా, ఆ స్థాయిలో ప్రత్యామ్నాయ వనీకరణ సాగడం లేదని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అమలులో ఉన్న చట్ట నియమాలను నిర్వీర్యపరచే ప్రయత్నాలకు స్వస్తి పలకడమే మేలు. పర్యావరణ చట్టాలను పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా చర్యలు తీసుకుంటేనే అధికార, పాలన వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం ఇనుమడిస్తుంది.

కాగితాల్లోనే సిఫార్సులు...

వనరులు, వనాల విధ్వంసానికి తావివ్వకుండా లైసెన్స్‌రాజ్‌ వ్యవస్థ సమగ్ర ప్రక్షాళనకు పటిష్ఠ చర్యలు చేపడతామంటూ ప్రభుత్వాలు ఇచ్చే హామీలు నీటిమూటలుగానే మిగిలిపోతున్నాయి.

పర్యావరణ, అటవీ చట్టాలపై 2014లో కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ సమగ్ర అధ్యయనం జరిపి అందించిన కీలక సిఫార్సులూ అమలుకు నోచుకోలేదు.

ప్రస్తుతం అమలులో ఉన్న పర్యావరణ, అటవీ చట్టాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి, అనుమతుల ప్రక్రియలో పారదర్శకత పెంచాలని ఆ కమిటీ సూచించింది. జాతీయ పర్యావరణ యాజమాన్య అథారిటీ (ఎన్‌ఈఎంఏ) పేరిట చట్టబద్ధ సంస్థను ఏర్పాటు చేసి వివిధ స్థాయుల్లోని అనుమతుల ప్రక్రియను ఏకగవాక్ష పద్ధతిలోకి తీసుకురావాలని పేర్కొంది.

అనుమతుల ప్రక్రియతో పాటు నిర్వహణలో పరిశ్రమలు, ప్రాజెక్టుల యాజమాన్యాలు హరిత చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్ర నేరంగా పరిగణించి శిక్షలు వేసేలా నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని కమిటీ సూచించింది. ఇందుకోసం ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.

కీలకమైన ఈ సూచనలు, సిఫార్సులను పక్కనపెట్టి, ఇప్పుడు ఏకంగా శిక్షలు వేసే పద్ధతే లేకుండా కేవలం జరిమానాలకే పరిమితమయ్యే ప్రయత్నాలకు దిగడం సమంజసం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సాగు లాభానికి సూక్ష్మ సాంకేతికత

‣ న్యాయ వ్యవస్థపై కేసుల భారం

‣ జోరెత్తుతున్న పార్టీ ఫిరాయింపులు

‣ విరుచుకుపడుతున్న విపత్తులు

‣ సహకార బలిమి... రైతుకు కలిమి!

‣ పశ్చిమాసియాతో బలపడుతున్న బంధం

‣ గర్భ విచ్ఛిత్తి నిర్ణయాధికారం ఆమెదే!

Posted Date: 22-07-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం