• facebook
  • whatsapp
  • telegram

సాగు లాభానికి సూక్ష్మ సాంకేతికత

సేద్యంలో నానో ఎరువుల విప్లవం

హరిత విప్లవం రైతులను సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల నుంచి దూరం చేసినా, వ్యవసాయోత్పత్తుల దిగుబడిలో స్వయంసమృద్ధి సాధనకు తోడ్పడింది. అయితే, నియంత్రణ లేకుండా ఇష్టానుసారంగా ఎరువులు, ఇతర పోషకాల వాడకం వల్ల పర్యావరణానికి చాలానష్టం వాటిల్లింది. చాలా నేలలు సారాన్ని కోల్పోయాయి. ప్రస్తుత తరుణంలో నిత్యహరిత విప్లవం దిశగా అడుగులు వేయాల్సిన అవసరముంది. ఈ క్రమంలో సేద్యానికి అవసరమైన మేరకే ఎరువుల వినియోగంపై రైతుల్లో అవగాహన పెంచడానికి కేంద్రం భూసార పరీక్ష కార్డులను ప్రవేశపెట్టింది. ఇప్పటికీ చాలామంది శాస్త్రీయ విధానంలో ఎరువుల వాడకానికి ఇష్టపడటం లేదు. మట్టి, దాని పోషక స్థితిని తెలుసుకోవడానికి భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించాలని, ఎరువులు పోషకాల వినియోగంలో వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు తీసుకోవాలని ఇటీవల ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. అధిక ఉష్ణోగ్రత, పీడనాల వద్ద వాతావరణంలోని నత్రజనిని అమ్మోనియాగా మార్చడానికి రసాయన శాస్త్రవేత్తలు ప్రత్యేక ప్రక్రియను అభివృద్ధి చేశారు. ఆ ప్రక్రియలో రూపొందే యూరియా ఖరీదు ఎక్కువగా ఉంటోంది. అందుకే రైతులకు అవసరమైన నత్రజని వంటి పోషకాలు అందుబాటులో ఉంచేందుకు దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం ఎరువులను రాయితీ ధరకే అందిస్తోంది. కొన్ని సూక్ష్మజీవుల సమూహాల్లో లభ్యమయ్యే నత్రజని సంబంధిత ఎంజైమ్‌ ద్వారా నేల, నీరు, మొక్కల్లోని వేళ్ల బుడిపెల్లో జీవ నత్రజనిని స్థిరీకరించవచ్చు. అది మొక్కలు యూరియా, డై అమ్మోనియం ఫాస్ఫేట్‌ (డీఏపీ) వంటి సింథటిక్‌ ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. వాటితో రూపొందించిన అనేక ఉత్పత్తులు జీవ ఎరువులుగా మార్కెట్లో అందుబాటులో ఉన్నా రైతులు మాత్రం ఇప్పటికీ రసాయన ఎరువులవైపే మొగ్గుతున్నారు.

బ్యాక్టీరియా జాతుల రూపకల్పన

వివిధ రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తూ నానో టెక్నాలజీగా వ్యవహరిస్తున్న అతిసూక్ష్మ సాంకేతికత వ్యవసాయంలో ఎరువుల తయారీకీ ఉపయోగపడుతోంది. భారత వ్యవసాయదారులు, ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) వంటి దిగ్గజ ఎరువుల తయారీ కంపెనీలు నానో లిక్విడ్‌ యూరియాను రూపొందించాయి. ఒక బస్తా యూరియా అవసరాన్ని లీటరు నానోయూరియా ద్రవం తీరుస్తుంది. ఇది రవాణా, సరఫరా ప్రక్రియలనూ సులభతరం చేస్తుంది. నానో యూరియా విజయవంతం కావడంతో కొన్ని సంస్థలు నానోటెక్నాలజీని ఉపయోగించి నానో డీఏపీ తదితర ప్రత్యామ్నాయాల తయారీపై దృష్టిసారించాయి. ఇఫ్కో అభివృద్ధి చేసిన నానో డీఏపీ ప్రస్తుతం క్షేత్ర పరీక్షల్లో ఉంది. ప్రత్యామ్నాయ నానో సాంకేతికతల ద్వారా కొన్ని సంస్థలు తయారు చేసిన నానో డీఏపీ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. నానో డీఏపీ భావన ఆధారంగా ఒక ఉత్పత్తిని రూపొందించడంలో శాస్త్రవేత్తలు ఇప్పటికే నిమగ్నమై ఉన్నారు. రెండు దశాబ్దాల కిందటే భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం హైపర్‌ నైట్రోజన్‌ స్థిరీకరణ, నత్రజని- భాస్వరం లోపాలను రెండింటినీ పరిష్కరించగల బ్యాక్టీరియా జాతుల రూపకల్పనకు జాతీయ స్థాయి ప్రాజెక్టులను అనుమతించింది. ప్రయోగశాలల్లో ఈ పథకాలు సాధించిన విజయాన్ని క్షేత్రస్థాయిలో పరీక్షించడానికి తగిన మార్గదర్శకాలు లేకపోవడంతో అవి ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ఇటీవల వాతావరణంలోని నత్రజనిని అమ్మోనియాగా మార్చగల బ్యాక్టీరియా జాతులను జన్యు ఇంజినీరింగ్‌ సహాయంతో రూపొందించారు. అవి స్థిరంగా అమ్మోనియాను ఉత్పత్తి చేయడంతో పాటు పర్యావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా అధిక సాంద్రతల్లో విసర్జిస్తాయి. ఈ అమ్మోనియా వరి మొక్కలకు బాగా ఉపయోగపడుతుంది. వివిధ పంటలకు నత్రజని అవసరం ఒకే విధంగా ఉండదు. అందువల్ల వేర్వేరు స్థాయుల్లో అమ్మోనియాను విసర్జించే బ్యాక్టీరియా జాతుల రూపకల్పనలో శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారు.

బహుళ ప్రయోజనాలు

సేద్యం కోసం జన్యుపరంగా అభివృద్ధి చేసిన బ్యాక్టీరియా జాతులను అధికంగా వినియోగించడం వల్ల కాలుష్యం తగ్గుదల, నేలలో నత్రజని చక్రాన్ని స్థిరపరచడం, వ్యవసాయ ఖర్చులు దిగిరావడం, రైతులకు లాభాలు వంటి బహుళ ప్రయోజనాలున్నాయి. భూసారాన్ని పెంచడం ద్వారా స్థిరమైన ఉత్పత్తులను సాధించవచ్చు. నానో టెక్నాలజీని అనుసరించడం వల్ల డీఏపీ దిగుమతులను గణనీయంగా తగ్గించవచ్చు. ఎరువుల వినియోగాన్ని, రవాణా ఖర్చులను, సేద్య పెట్టుబడులను తగ్గించుకునే అవకాశముంది. ఈ సాంకేతికతలను అనుసరించడానికి తగిన మార్గదర్శకాలను నియంత్రణ సంస్థలు రూపొందిస్తే భారత వ్యవసాయ రంగం సుస్థిరమవుతుంది. నేలలోని పోషకాల స్థితికి అనుగుణంగా ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడంతో పాటు అధిక రసాయనాల వినియోగాన్ని బాగా తగ్గించేలా చూడాల్సిన అవసరమూ ఉంది.

- ఆచార్య అప్పారావు పొదిలె

(హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ న్యాయ వ్యవస్థపై కేసుల భారం

‣ జోరెత్తుతున్న పార్టీ ఫిరాయింపులు

‣ విరుచుకుపడుతున్న విపత్తులు

‣ సహకార బలిమి... రైతుకు కలిమి!

‣ పశ్చిమాసియాతో బలపడుతున్న బంధం

‣ గర్భ విచ్ఛిత్తి నిర్ణయాధికారం ఆమెదే!

Posted Date: 22-07-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం