• facebook
  • whatsapp
  • telegram

‘కాట్సా’ కోరల నుంచి మినహాయింపు?

భారత్‌కు అనుకూల వాతావరణం

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం భౌగోళిక రాజకీయాన్ని పూర్తిగా మార్చివేసింది. ఈ యుద్ధంపై తటస్థ వైఖరితో ఉన్న భారత్‌కు అనుకూలంగా పరిస్థితులు మారుతున్నాయి. న్యూదిల్లీ అవసరాలను పట్టించుకోకుండా గుడ్డిగా ఒత్తిడి చేసే వైఖరిని అమెరికా, పశ్చిమ దేశాలు వీడుతున్నాయి. రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణి వ్యవస్థ కొనుగోళ్లకు సంబంధించి ‘కాట్సా’ (అమెరికా శత్రువులను ఆంక్షలతో నిరోధించే చట్టం) పరిధి నుంచి భారత్‌కు మినహాయింపు ఇచ్చేలా ప్రతినిధుల సభ సభ్యుడు రో ఖన్నా (రోహిత్‌ ఖన్నా) ప్రతిపాదించిన సవరణకు 330-99 ఓట్ల తేడాతో ఆమోదముద్ర పడింది. అధికార డెమోక్రాట్లలో కేవలం అయిదుగురు మినహా మిగిలిన వారంతా దానికి మద్దతివ్వడం విశేషం. అమెరికా రక్షణ బడ్జెట్‌ బిల్లుపై చర్చ సందర్భంగా ఖన్నా ఈ సవరణను ప్రవేశపెట్టారు. చైనా దూకుడును నిలువరించడానికి ఇది భారత్‌కు ఉపయోగపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఫలితంగా ‘కాట్సా’ ఆంక్షల నుంచి ఇండియాకు మినహాయింపు లభించే దిశగా తొలి అడుగు పడినట్లయింది. ఓటింగ్‌కు లభించిన ఆధిక్యం చూశాక- సెనేట్‌, అధ్యక్షుడి ఆమోదముద్రకూ పెద్దగా ఆటంకాలు ఉండకపోవచ్చునన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

అగ్రరాజ్య వ్యూహాత్మక విధానం

క్రిమియా ఆక్రమణ, సిరియా అంతర్యుద్ధంలో జోక్యం, 2016 అమెరికా ఎన్నికలను ప్రభావితం చేయడం వంటి అంశాలను చూపుతూ రష్యాను కట్టడి చేయడానికి 2017లో అమెరికా కాంగ్రెస్‌ ‘కాట్సా’కు ఊపిరి పోసింది. ఇరాన్‌, ఉత్తర కొరియాలనూ దాని పరిధిలోకి తెచ్చారు. ఆ చట్టంలో చాలా లోపాలున్నాయంటూ సంతకం సమయంలో నాటి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పెదవి విరిచారు. రష్యా నుంచి రక్షణ వ్యవస్థలను, యుద్ధ విమానాలను కొనుగోలు చేసినందుకు చైనా రక్షణ పరికరాల అభివృద్ధి విభాగం, దాని సంచాలకుడు లీ షాంగ్‌పై తొలిసారి ‘కాట్సా’ ఆంక్షలను విధించారు. నాటో సభ్య దేశమైన తుర్కియే సైతం 250 కోట్ల డాలర్ల విలువైన ఎస్‌-400 వ్యవస్థలను రష్యా నుంచి కొనుగోలు చేసింది. అగ్రరాజ్య ప్రతినిధుల సభ దానిపైనా ఆంక్షల బిల్లును సిద్ధం చేసింది. అధ్యక్షుడు ట్రంప్‌ దాన్ని ఆలస్యం చేసేందుకు విఫలయత్నం చేశారు. చివరికి 2020 డిసెంబర్‌లో ఆంక్షలు విధించారు. తుర్కియేతో పోలిస్తే భారత్‌ పరిస్థితి పూర్తిగా భిన్నమైంది. తనను గద్దె దింపడానికి ఫెతుల్లా గులేన్‌ పన్నిన తిరుగుబాటు కుట్ర వెనక శ్వేతసౌధం హస్తం ఉందన్న అనుమానం తుర్కియే అధ్యక్షుడు ఎర్డగాన్‌లో ఉంది. అందుకే క్రెమ్లిన్‌ అధినేత పుతిన్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ఆయుధ వ్యవస్థలను కొనుగోలు చేశారు. తుర్కియే ఆయుధాలు నాటోలోని ఇతర సభ్య దేశాల శస్త్రాలతో సమన్వయం చేసుకొనే విధంగా ఉండేవి. ఎస్‌-400 రాకతో ఆ సమన్వయం దెబ్బతినే పరిస్థితి నెలకొంది. ఫలితంగా, ‘కాట్సా’ ఆంక్షలను ప్రయోగించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం విషయంలో భారత్‌ పూర్తిగా తటస్థ వైఖరిని అవలంబిస్తోంది. కొన్ని దశాబ్దాలుగా ఆయుధాల కోసం రష్యాపై ఇండియా ఆధారపడింది. ఆయుధ శక్తిలో చైనాకు దీటుగా నిలిచేందుకు ఎస్‌-400 క్షిపణి వ్యవస్థను ఇండియా కొనుగోలు చేసింది. భారత్‌, అమెరికాల ఉమ్మడి ప్రత్యర్థి డ్రాగన్‌ దేశం. ఇండో-పసిఫిక్‌లో చైనా దురాక్రమణను నిలువరించేందుకు ఏర్పాటైన ‘క్వాడ్‌’ కూటమిలో వాషింగ్టన్‌, దిల్లీలు భాగస్వాములు. ఇటీవల పశ్చిమాసియాలో అగ్రరాజ్యం నేతృత్వంలో మొదలైన ‘ఐ2యూ2’ కూటమిలోనూ ఇండియా ముఖ్య భాగస్వామి. ముఖ్యంగా డ్రాగన్‌తో తీవ్ర సరిహద్దు వివాదాన్ని ఎదుర్కొంటున్న భారత్‌పై ‘కాట్సా’ ఆంక్షల ప్రయోగం వికటించే అవకాశం ఉంది. దానివల్ల తప్పనిసరి పరిస్థితుల్లో దిల్లీని మాస్కోవైపు నెట్టినట్లవుతుంది. 1998లో పోఖ్రాన్‌ అణుపరీక్షల తరవాత భారత్‌పై అగ్రరాజ్యం ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించింది. ఫలితంగా మాస్కోతో భారత్‌ సంబంధాలు పటిష్ఠమయ్యాయి. ఇప్పుడు మరోసారి ‘కాట్సా’తో భారత్‌ను ఇబ్బంది పెడితే ఇండో-పసిఫిక్‌ వ్యూహం దెబ్బతిని చైనా బలపడే ప్రమాదం ఉంది.

బలమైన మైత్రీ సంకేతం

చైనా 2020 నాటికే ప్రపంచంలో అతిపెద్ద నావికాదళ వ్యవస్థను సిద్ధం చేసుకుంది. కంబోడియా, మయన్మార్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, మాల్దీవులు, పాకిస్థాన్‌, జిబూటీ, కెన్యా, టాంజానియా, యూఏఈల నౌకాశ్రయాల్లో పట్టుకోసం ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో అమెరికా, ఇండియా పరస్పర సహకారంతో డ్రాగన్‌ను కట్టడి చేయాలి. అణ్వాయుధ నియంత్రణ ఒప్పందాలపై భారత్‌ సంతకాలు చేయలేదు. అయినా శ్వేతసౌధం ప్రత్యేక మినహాయింపులు కల్పించి ఇండియాతో ‘పౌర అణు ఒప్పందం’ చేసుకుంది. ఆ తరవాతి నుంచి భారత్‌ పెద్ద మొత్తంలో ఆయుధాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది. రక్షణ సామగ్రి కోసం రష్యాపై భారత్‌ ఆధారపడటాన్ని తగ్గించేందుకు వాషింగ్టన్‌ సహకారం మరింత పెరగాల్సిన అవసరం ఉంది. అందువల్ల బైడెన్‌ సర్కారు ‘కాట్సా’ ఆంక్షల నుంచి ఇండియాకు మినహాయింపునిచ్చే అవకాశం ఉంది. దానివల్ల భారత్‌-అమెరికా మైత్రి మరింతగా బలపడిందని చైనాకు తెలియజెప్పినట్లు అవుతుంది.

- ఫణికిరణ్
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పర్యావరణ లక్ష్యాలకు తూట్లు

‣ సాగు లాభానికి సూక్ష్మ సాంకేతికత

‣ న్యాయ వ్యవస్థపై కేసుల భారం

‣ జోరెత్తుతున్న పార్టీ ఫిరాయింపులు

Posted Date: 22-07-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం