• facebook
  • whatsapp
  • telegram

డ్రాగన్‌ చక్రబంధానికి విరుగుడు వ్యూహం

‘వజ్రాల హారం’తో భారత్‌ నిఘా

ప్రపంచ భవిష్యత్తు హిందూ మహాసముద్ర జలాలపైనే ఆధారపడుతుందని 19వ శతాబ్దపు వ్యూహకర్త ఆల్ఫ్రెడ్‌ థాయర్‌ మహాన్‌ వ్యాఖ్యానించారు. దాన్ని దృష్టిలో ఉంచుకునే భారతదేశం తన సాగర శక్తిని హిందూ మహాసముద్ర ప్రాంతానికి విస్తరిస్తోంది. ఆర్థిక, వ్యూహాత్మక కారణాల రీత్యా ఈ ప్రాంతంపై పట్టు అవసరమైనందువల్ల భారత్‌ను అన్ని వైపులనుంచీ చుట్టుముట్టాలన్నది చైనా లక్ష్యం. హిందూ మహాసముద్రం ఇండియా కడలి కాదని చైనా జనరల్‌ చి హయోతిన్‌ వ్యాఖ్యానించడానికీ కారణమదే. కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో ‘ముత్యాల తీగ’, ‘రుణ వల’ వ్యూహాలను చైనా అమలుచేస్తోంది. ముత్యాల తీగ వ్యూహం ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్న డ్రాగన్‌కు అడ్డుకట్ట వేయడానికి ప్రతివ్యూహాలను రూపొందించడంలో భారత్‌ నిమగ్నమైంది. ఇందులో భాగంగా ‘వజ్రాల హారం’ పేరిట చైనా చుట్టూ నావికాదళ స్థావరాలను విస్తరిస్తోంది. ఏడెన్‌, హోర్ముజ్‌ జలసంధి నుంచి మలక్కా జలసంధి వరకు నిఘాను ఏర్పాటు చేస్తోంది.

తూర్పు దేశాలపై దృష్టి

ప్రధాని మోదీ 2016లో ‘సాగర్‌’ (అందరికీ వృద్ధి, భద్రత) పేరిట ప్రారంభించిన వ్యూహాత్మక పథకం ద్వారా హిందూ మహాసముద్రం పరిధిలోని ప్రాంతీయ ప్రభుత్వాలతో కలిసి ఇండియా పనిచేస్తోంది. తూర్పు దేశాలపై భారత్‌ దృష్టి సారించడం బహుళ ప్రయోజనకరం. సింగపుర్‌తో చేసుకున్న ఒప్పందం వల్ల చాంగీ నౌకా స్థావరానికి భారత నావికాదళం నేరుగా ప్రవేశించే అవకాశం కలిగింది. దక్షిణ చైనా సముద్రం గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఈ స్థావరంలో భారత నౌకలు ఇంధనాన్ని నింపుకోవచ్చు. ఇండొనేసియాతో ఒప్పందం వల్ల మలక్కా జలసంధి ప్రవేశద్వారంలోని సబాంగ్‌ రేవుకు భారత సైన్యం ప్రవేశించే అవకాశం లభించింది. భారత రుణ సాయంతో ద్వైపాక్షిక వాయు మార్గాన్ని అభివృద్ధి చేయడానికి ఇండియా, మంగోలియాలు అంగీకరించాయి. వియత్నాంతోనూ భారత్‌ సత్సంబంధాలను కొనసాగిస్తోంది. బ్రహ్మోస్‌ క్షిపణి, పెట్రోలింగ్‌ బోట్లను ఆ దేశానికి విక్రయించింది. ఇండియా, జపాన్‌ల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం హిందూ, పసిఫిక్‌ మహాసముద్రాల వెంబడి రవాణా మద్దతు, ఉమ్మడి విన్యాసాల కోసం పరస్పర సైనిక స్థావరాల్లో దళాల ప్రవేశానికి అవకాశం ఉంది. ఆసియా-ఆఫ్రికా వృద్ధి నడవా (ఏఏజీసీ)ను నిర్మించనున్నట్లు భారత్‌, జపాన్‌లు సంయుక్తంగా ప్రకటించాయి. ఆర్థిక రాయితీలు, సైనిక దౌత్యం ద్వారా మారిషస్‌, మాల్దీవులు, సీషెల్స్‌, మడగాస్కర్‌ దీవులు, దక్షిణాఫ్రికా, టాంజానియా, మొజాంబిక్‌ దేశాలను హిందూ మహాసముద్ర పశ్చిమ భాగంలో తన ప్రయోజనాలకు వినియోగించుకోవాలని నిర్ణయించింది. మారిషస్‌కు ద్వంద్వ పన్ను మినహాయింపును కల్పించింది. వాణిజ్య అనుసంధానానికి ‘ఇండియన్‌ ఓషన్‌ రిమ్‌ అసోసియేషన్‌ ఫర్‌ రీజినల్‌ కోఆపరేషన్‌ (ఐఓఆర్‌-ఏఆర్‌సీ), ఇండియా-బ్రెజిల్‌-దక్షిణాఫ్రికా (ఐబీఎస్‌ఏ)’ ఫోరాల్లో భారత్‌ చేరింది. తీరప్రాంత నావికా గస్తీ నౌకలను పంపడంతో పాటు సిబ్బంది, శిక్షణ సదుపాయాలను కల్పిస్తోంది. ఐఓఆర్‌లోని ద్వీప దేశాలకు నావికాదళ హైడ్రోగ్రాఫిక్‌ మద్దతు అందించింది. భవిష్యత్తులో ఈ ప్రాంతంపై డ్రాగన్‌ ప్రభావాన్ని భారత హైడ్రోగ్రాఫిక్‌ విధానంతో నిరోధించవచ్చు. మారిషస్‌లోని ఆగలెగా దీవుల్లో ఎయిర్‌ ఫీల్డ్‌, రేవులకు వెళ్ళే అవకాశం లభించింది. ఈ ఎయిర్‌ ఫీల్డ్‌ న్యూదిల్లీకి నిఘా అవుట్‌ పోస్టుగా పనిచేస్తోంది. సముద్ర సమాచారాన్ని అడ్డగించడానికి మడగాస్కర్‌లో లిజనింగ్‌ పోస్టును, రాడార్‌ సదుపాయాన్ని, సీషెల్స్‌లో తీరప్రాంత నిఘా రాడార్‌ను భారత్‌ ఏర్పాటుచేసింది. సీషెల్స్‌లో అజంప్షన్‌ ద్వీపంలోకి భారత సైనిక దళాల ప్రవేశానికి అవకాశముంది. సముద్ర మార్గం ద్వారా ఆఫ్రికా ఖండంలో ఉనికిని చాటుకోవడానికి చైనా ప్రయత్నిస్తున్నందువల్ల ఈ స్థావరం ఇండియాకు వ్యూహాత్మకంగా ప్రధానంగా మారింది. ఒమన్‌లోని డకం పోర్టులో భారత సైన్యం ప్రవేశానికి వీలుండటంతో హోర్ముజ్‌, ఏడెన్‌లలోని కడలి సమాచార వ్యవస్థలపై దృష్టి సారించవచ్చు. ఆఫ్రికాలోని జిబూటీ, పాకిస్థాన్‌లోని గ్వాదర్‌లో చైనా ఏర్పాటుచేసిన ముత్యాల తీగ మధ్య- ఈ సదుపాయం ఇండియాకు లభించినట్లయింది. అఫ్గానిస్థాన్‌ మీదుగా తజికిస్థాన్‌లోని ఫర్ఖోర్‌ ఎయిర్‌ బేస్‌కు రవాణా సదుపాయాన్ని ఇరాన్‌లోని చాబహార్‌ పోర్టు కల్పిస్తోంది.

సత్సంబంధాలే కీలకం

శ్రీలంక, ఫ్రాన్స్‌, అమెరికా తదితర దేశాలతోనూ భారత్‌ మంచి సంబంధాలనే కొనసాగిస్తోంది. 2018లో చైనా నౌకాదళంపై నిఘాకు హంబన్‌టోటలోని శ్రీలంక ఎయిర్‌బేస్‌ను కొనుగోలు చేసింది. ఇది పూర్తిస్థాయి ఎయిర్‌బేస్‌గా మారితే చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయవచ్చు. భారత సైనిక నౌకలు, విమానాలు అమెరికా, ఫ్రాన్స్‌ స్థావరాలను ఉపయోగించుకునే అవకాశముంది. చతుర్భుజ భద్రతా కూటమి (క్వాడ్‌)లో ఇండియా బలమైన భాగస్వామి అయినందువల్ల సముద్ర భద్రత, ఉగ్రవాద నిరోధం, నావిగేషన్‌ స్వేచ్ఛ వంటి అంశాల్లో జపాన్‌, ఆస్ట్రేలియా, అమెరికాలతో చర్చలు, సంప్రతింపులకు వీలవుతుంది. వ్యూహాత్మక చర్యల్లో భాగంగా అండమాన్‌, నికోబార్‌ ట్రైసర్వీస్‌ కమాండ్‌ను ఇండియా ఏర్పాటుచేసింది. మలక్కా జలసంధికి చైనా ప్రవేశాన్ని నిరోధించడానికి అండమాన్‌, నికోబార్‌ దీవులు ‘ఖనిజ గొలుసు’గా ఉపయోగపడతాయి. చైనాకు వ్యతిరేకంగా మలక్కా జలసంధిపై నిఘా పెట్టడానికి ఇది అనుకూలమైన స్థానం. దాన్ని దృష్టిలో ఉంచుకొని హిందూ మహాసముద్రంలో ‘ఇనుప తెర’ పేరిట సమాచార నిరోధానికి ఓ విధానాన్ని ఇండియా అమలుచేస్తోంది. చైనా సరిహద్దుల్లోని అన్ని దేశాలతో సత్సంబంధాలను కొనసాగించడం భారత్‌కు వ్యూహాత్మక విజయాన్ని ఇవ్వడమే కాకుండా జిత్తులమారి డ్రాగన్‌కు అడ్డుకట్ట వేయడానికి ‘వజ్రాల హారం’ వ్యూహం దోహదపడుతుందన్నది నిర్వివాదం.

పొంచి ఉన్న ముప్పు

ముత్యాల తీగ సిద్ధాంతం ప్రకారం... హిందూ మహాసముద్రంలో కడలి సమాచార వ్యవస్థ(ఎస్‌ఎల్‌ఓసీ)ను, సైనిక, వాణిజ్య స్థావరాలను చైనా తన ప్రధాన భూభాగం నుంచి ఆఫ్రికాలోని పోర్టు సూడాన్‌ వరకు విస్తరిస్తోంది. అవి మాండేబ్‌, మలక్కా, హోర్ముజ్‌, లాంబక్‌ జలసంధుల మీదుగా సాగుతాయి. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌, పాకిస్థాన్‌లోని కరాచీ, గ్వాదర్‌ రేవు, శ్రీలంకలోని కొలంబో, హంబన్‌టోట, మాల్దీవులు, సోమాలియా, ఆఫ్రికాలోని జిబూటీకి చెందిన వ్యూహాత్మక ప్రాంతాలనూ డ్రాగన్‌ వాడుకుంటోంది. పాకిస్థాన్‌లోని గ్వాదర్‌ పోర్టులో చైనా తన విదేశీ నావికాదళ స్థావరాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఉన్నందువల్ల, ఆ ప్రాంతం భారత్‌కు ముప్పుగా తయారయ్యే ప్రమాదముంది. చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవాతో పాటు ఇతర ప్రాంతాల్లో చేపట్టిన రహదారుల విస్తరణ భారతదేశ జాతీయ భద్రతకు పెనుముప్పుగా పరిణమించనుంది. అందుకే డ్రాగన్‌ చుట్టుపక్కల ఉన్న దేశాలతో భారత్‌ సత్సంబంధాలను కొనసాగిస్తూ నిఘా వ్యవస్థను, సైనిక, నావికా శక్తిని విస్తరిస్తోంది. ‘రుణ వల’ విధానం ద్వారా భారత్‌ చుట్టుపక్కల ఉన్న దేశాలను మౌలిక సదుపాయాల కల్పన పేరిట డ్రాగన్‌ అప్పుల ఊబిలోకి దించుతోంది. అనంతరం తన భౌగోళిక, వ్యూహాత్మక ప్రయోజనాలకు మద్దతు ఇవ్వాలని ఆ దేశాలపై ఒత్తిడి తెస్తోంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వేగంగా చౌకగా... రవాణా!

‣ ‘కాట్సా’ కోరల నుంచి మినహాయింపు?

‣ పర్యావరణ లక్ష్యాలకు తూట్లు

‣ సాగు లాభానికి సూక్ష్మ సాంకేతికత

‣ న్యాయ వ్యవస్థపై కేసుల భారం

‣ జోరెత్తుతున్న పార్టీ ఫిరాయింపులు

Posted Date: 23-07-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం