• facebook
  • whatsapp
  • telegram

అత్యున్నత పీఠంపై ఆదివాసీ మహిళ

మోదీ నిబద్ధతకిది తార్కాణం

రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ఎన్నిక భారత ప్రజాస్వామ్యంలో చరిత్రాత్మక ఘట్టం. ఒడిశాలో నిరుపేద కుటుంబ నేపథ్యం నుంచి, అదీ అత్యంత వెనకబడిన సంతాల్‌ గిరిజన వర్గం నుంచి దేశ అత్యున్నత రాజ్యాంగ పదవి దాకా ముర్ము అద్భుత ప్రయాణం సాగింది. ఆమె పోరాటం, కఠోరమైన నిబద్ధతకు ఆ ప్రయాణం అద్దం పడుతుంది. రాష్ట్రపతి స్థానానికి ఆమె ఎదగడం దేశ ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా ఆదివాసులకు ఎంతో సంతోషం కలిగిస్తోంది. ఓ గిరిజన మహిళ ఈ భారత భూమిలో అత్యున్నత స్థానానికి చేరడానికి 70 ఏళ్ల సుదీర్ఘ కాలం వేచిచూడాల్సి వచ్చింది. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహిస్తుండటం మన ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి మరో విజయ చిహ్నంగా నిలుస్తుంది.

భారీగా నిధులు

ఇండియా జనాభాలో గిరిజనులు తొమ్మిది శాతం ఉన్నారు. భారత స్వాతంత్య్రోద్యమంలో వారి పోరాటాలు మరపురానివి. స్వాతంత్య్రానంతరం గిరిజనుల అభివృద్ధి, అభ్యున్నతి కోసం ఏ ప్రభుత్వమూ సరైన చర్యలు తీసుకోలేదన్నది విషాదకర వాస్తవం. ఆదివాసుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి భరోసా కల్పించి జాతీయ స్థాయిలో ప్రధాన స్రవంతిలోకి వారిని తీసుకురావడానికి గత ప్రభుత్వాలు ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. అదే సమయంలో వారికి సరైన రాజకీయ ప్రాతినిధ్యమూ దక్కలేదు. గిరిజనుల ఆకాంక్షలను సాకారం చేయడానికి మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ మొదటిసారిగా సరైన కార్యాచరణకు ఉపక్రమించారు. గిరిజనుల సాధికారత, అభివృద్ధి కోసం 1999లో వాజ్‌పేయీ తొలిసారి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. 2003లో 89వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ ఎస్టీ కమిషన్‌ను నెలకొల్పారు. వాజ్‌పేయీ హయాములో ప్రారంభమైన గిరిజనుల సంక్షేమాన్ని ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ మరింత ప్రభావవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ‘సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌, సబ్‌కా ప్రయాస్‌’ అన్న నినాదంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం గిరిజనుల ఆశలు, ఆకాంక్షలను సాకారం చేయడానికి వరస కార్యక్రమాలను చేపట్టింది. ఆదివాసుల సంక్షేమం, పురోగతితో ముడివడిన కార్యక్రమాలకు గత ఎనిమిదేళ్లలో నిధులను భారీగా పెంచింది. 2021-22 బడ్జెట్‌లో ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను గతంలోకంటే నాలుగురెట్లు- రూ.21 వేల కోట్ల నుంచి రూ.86 వేల కోట్లకు పెంచారు. జల్‌ జీవన్‌ మిషన్‌ కింద 1.28 కోట్ల గిరిజన ఇళ్లకు ప్రస్తుతం కొళాయిల ద్వారా నీరు అందుతోంది. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద 38 లక్షల ఇళ్లు, 1.45 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద 82 లక్షల ఆరోగ్య కార్డుల పంపిణీ జరిగింది. గిరిజన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఏకలవ్య ఆదర్శ పాఠశాలల బడ్జెట్‌ రూ.278 కోట్లనుంచి రూ.1,418 కోట్లకు పెరిగింది. గిరిజన విద్యార్థుల ఉపకార వేతనాల కోసం కేటాయించే నిధులు రూ.978 కోట్ల నుంచి రూ.2,546 కోట్లకు చేరాయి. పరిశ్రమల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రూ.327 కోట్లతో 3,110 వన్‌ధన్‌ వికాస్‌ కేంద్రాలు, 53 వేల వన్‌ధన్‌ స్వయం సహాయక సంఘాలు ఏర్పాటయ్యాయి.

గనుల తవ్వకాల వల్ల గిరిజనులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. గనుల ద్వారా వచ్చిన ఆర్థిక ప్రయోజనాలను ఎన్నడూ ఆదివాసులకు పంచలేదు. ఆ లోపాన్ని సరిదిద్దడానికి మోదీ ప్రభుత్వం జిల్లా ఖనిజ నిధిని ఏర్పాటు చేసింది. తద్వారా గనుల తవ్వకాల ద్వారా వచ్చే ఆదాయంలో 30శాతం స్థానిక గిరిజన ప్రాంతాల అభివృద్ధికి వెచ్చిస్తోంది. ఇప్పటిదాకా దానికింద జమ అయిన రూ.57వేల కోట్లను పలు అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తోంది. గిరిజనులు రూపొందించే ఉత్పత్తుల విక్రయం, మార్కెటింగ్‌ బాధ్యతలను చూసుకోవడానికి ట్రైఫెడ్‌ ఆధ్వర్యంలో నడిచే ట్రైబ్స్‌ ఇండియా అవుట్‌లెట్స్‌ 29 నుంచి 116కి పెరిగాయి.

అభివృద్ధి, శాంతి

కశ్మీర్‌ నుంచి ఈశాన్య రాష్ట్రాల దాకా, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, రాజస్థాన్‌, గుజరాత్‌లలోని గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన జనాభా పెద్ద సంఖ్యలో ఉంది. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్‌ పార్టీ వారిని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకొంది. ఆదివాసీ ప్రాబల్యం అధికంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలను విస్మరించింది. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరవాత ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ‘యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ’ని రూపొందించారు. గత ఎనిమిదేళ్లలో ఈశాన్య రాష్ట్రాలు విజయవంతంగా జాతీయ స్రవంతితో అనుసంధానమయ్యాయి. దేశ అభివృద్ధి, పురోగతిలో భాగస్వాములుగా నిలుస్తున్నాయి. దశాబ్దాల తరబడి పేదరికం, సామాజిక అభద్రతలు ఆదివాసులకు తీవ్ర ఆటంకంగా నిలిచాయి. ఈ భయం, అనిశ్చితి కొన్ని రాష్ట్రాల్లో గిరిజన యువతను తీవ్రవాదంవైపు మళ్ళించాయి. దాని ఫలితంగా ఆయా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి స్తంభించింది. తీవ్రవాదాన్ని ఏమాత్రం సహించకూడదన్న మోదీ విధానంతో నక్సలిజం దాదాపు అంత్య దశకు చేరుకుంది. గతంలో గిరిజన ప్రాంతాల్లో చెలరేగిన హింస, అశాంతి స్థానాలను ఈరోజు అభివృద్ధి, శాంతి ఆక్రమించాయి. ఆదివాసుల సామాజిక, ఆర్థిక అభివృద్ధి, సాధికారత, వారి రాజకీయ ప్రాతినిధ్యం భాజపా సిద్ధాంతాల్లో ఎప్పుడూ అంతర్భాగంగానే ఉంటాయి. ఈరోజు ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ద్రౌపదీ ముర్మును తన ప్రథమ పౌరురాలిగా ఎన్నుకొంది. గిరిజన సమాజానికి సాధికారత కల్పించాలన్న ప్రధాని దృఢ నిశ్చయానికి ఇదో ప్రబల ఉదాహరణ.

సంస్కృతికి పట్టం

సమున్నతమైన గిరిజన సంస్కృతి, వారసత్వానికి ప్రధాని మోదీ జాతీయస్థాయి కీర్తిని తీసుకొచ్చారు. గిరిజన కళలు, సాహిత్యం, సంప్రదాయ విజ్ఞానం, నైపుణ్యాలను పాఠ్యాంశాల్లో చేర్చారు. స్వాతంత్య్ర సంగ్రామానికి ప్రసిద్ధ గిరిజన నాయకులు అందించిన సేవలను జాతీయ స్థాయిలో చాటిచెప్పడానికి ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహించారు. ఏటా నవంబర్‌ 15న వచ్చే భగవాన్‌ బిర్సా ముండా జయంతిని జాతి యావత్తు గిరిజన గౌరవ దినోత్సవంగా జరుపుకొంటోంది. దేశవ్యాప్తంగా రూ.200 కోట్లతో గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల సంగ్రహాలయాలను ప్రభుత్వం నెలకొల్పుతోంది. ప్రస్తుత తరంలో స్ఫూర్తి నింపడానికి ప్రధాని తన ప్రసంగాల్లో ప్రఖ్యాత ఆదివాసీ నేతలను స్మరించుకుంటూ దేశానికి వారు అందించిన సేవలను తెలియజేస్తున్నారు. గిరిజనుల గౌరవం, సాధికారత కోసం మోదీ ప్రభుత్వం నిర్విరామంగా ఎలా పనిచేస్తోందనడానికి ఇవన్నీ నిదర్శనాలు.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రజాస్వామ్యానికి ఊపిరులూదిన ఓటుహక్కు

‣ డ్రాగన్‌ చక్రబంధానికి విరుగుడు వ్యూహం

‣ వేగంగా చౌకగా... రవాణా!

‣ ‘కాట్సా’ కోరల నుంచి మినహాయింపు?

Posted Date: 29-07-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం