• facebook
  • whatsapp
  • telegram

ప్రజాస్వామ్యానికి ఊపిరులూదిన ఓటుహక్కు

ఆధునిక భారతావనికి అదే దిక్సూచి

ప్రపంచ చరిత్రలో ఓటు హక్కు పరిణామక్రమం ఆసక్తికరం. మొదట్లో కొందరికే పరిమితమైన ఈ హక్కు- కాలక్రమంలో అందరి చేతిలో ఆయుధమై మెరిసింది. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న ఓటు- ఆధునిక కాలంలో ప్రజాస్వామ్యానికి కీర్తికిరీటంగా మారింది. సామాన్యుల గొంతుకు బలం పెంచింది. ఐరోపాలో సుదీర్ఘకాలం నడచిన సామాజిక, రాజకీయ ఉద్యమాల వల్ల రాచరికాలు అంతరించి ప్రజలకే సార్వభౌమాధికారం అందించే ప్రజాస్వామ్యం అవతరించింది. కానీ ప్రజాస్వామ్య పాలన వేళ్లూనుకోవడమనేది అంత తేలిగ్గా జరగలేదు. అది అనేక బాలారిష్టాలను ఎదుర్కోవాల్సివచ్చింది. మనుషులంతా సమానులేనని ఉద్ఘోషించిన అమెరికా రాజ్యాంగం కూడా దీర్ఘకాలంపాటు జాతి, రంగు భేదాలను పాటించి జనాభాలో పెద్ద భాగానికి ఓటుహక్కు నిరాకరించింది. నల్లజాతి వారికి శతాబ్దాలుగా కనీస హక్కులను నిరాకరించింది. అనేక దేశాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడిన తరవాతా ఎన్నో దశాబ్దాలపాటు మహిళలకు ఓటు హక్కు నిరాకరిస్తూ వచ్చాయి. ఓటు హక్కును ప్రవేశపెట్టిన కొత్తల్లో అది పురుషులకు, ముఖ్యంగా ధనిక వర్గాల పురుషులకే పరిమితం. 1789లో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ నినాదాలతో ఫ్రెంచి విప్లవం సంభవించినప్పటి నుంచి పరిస్థితి మారసాగింది. ప్రపంచం క్రమంగా వయోజన ఓటుహక్కును తలకెత్తుకుంది. ప్రపంచంలో తొలిసారిగా న్యూజిలాండ్‌ స్త్రీ పురుష భేదంకాని, ఇతర అంతరాలుకాని పాటించకుండా వయోజనులందరికీ 1893లో ఓటుహక్కు కల్పించింది. తరవాత పొరుగు దేశం ఆస్ట్రేలియా అదే బాట పట్టింది.

రాజ్యాంగ వరప్రసాదం

భారతదేశం 1858లో ఈస్టిండియా కంపెనీ పాలన నుంచి బ్రిటిష్‌ పార్లమెంటు పాలనలోకి వెళ్ళినప్పుడే ఓటుహక్కుకు బీజం పడింది. 1885లో భారత జాతీయ కాంగ్రెస్‌ తొలి మహాసభ భారతీయులకూ దేశ పాలనలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని వలస పాలకులను డిమాండ్‌ చేసింది. దోపిడి పైనే దృష్టి పెట్టిన వలస పాలకులు సామాన్య ప్రజలకు నేరుగా ఓటు హక్కు కల్పించడానికి సిద్ధంగా లేరు. 1892 ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టంలో పరోక్ష పరిమిత ఎన్నికల ద్వారా గవర్నర్‌ జనరల్‌, గవర్నర్ల పాలన మండళ్లలో భారతీయులు అధికారేతర సభ్యులుగా ప్రవేశించడానికి వెసులుబాటు కల్పించారు. 1909 మింటో మార్లే సంస్కరణలు, 1919 మాంటెగ్‌ చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల ద్వారా, 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా దశలవారీగా భూస్వాములకు, ఆదాయపన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఓటుహక్కు కల్పించారు. మహిళలకు, అసంఖ్యాక పేద ప్రజలకు ప్రాతినిధ్యమే లేదు. మొదట్లో భారత జనాభాలో ఒకటి నుంచి రెండు శాతం ధనిక వర్గాలకే పరిమితమైన ఓటుహక్కు 1935 నాటికి 10శాతానికి పెరిగింది. అయితే, బ్రిటిష్‌ వలస పాలకులు ఇక్కడ కూడా విభజించి పాలించు విధానాన్ని అనుసరించారు. 1909 ఇండియన్‌ కౌన్సిల్స్‌ చట్టం ముస్లిములకు కేటాయించిన నియోజకవర్గాల్లో వారు మాత్రమే ఓట్లు వేయడానికి అర్హులని నిర్దేశించింది. తరవాత ఇదే సూత్రాన్ని క్రైస్తవులు, సిక్కులు, ఆంగ్లో ఇండియన్లకు వర్తింపజేశారు. ఆధునిక నాగరికతను విస్తరింపజేయడానికే వచ్చామని చెప్పుకొన్న వలసవాదులు వాస్తవంలో స్వార్థం కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టారు.

వలస పాలన నుంచి స్వాతంత్య్రం వచ్చిన తరవాత ప్రజల మధ్య ఎటువంటి భేదాలూ పాటించని ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలని భారతీయులు నిశ్చయించారు. ప్రతి భారతీయుడికి ఒక ఓటు అనే సూత్రాన్ని ఆచరణలో పెట్టాలని లక్షించారు. 1928నాటి మోతీలాల్‌ నెహ్రూ నివేదిక, 1931లో కరాచీలో భారత జాతీయ కాంగ్రెస్‌ మహాసభ తీర్మానం, 1945లో బహదూర్‌ సప్రూ కమిటీ నివేదిక భారతీయులందరూ సమానులని ఉద్ఘాటిస్తూ స్వతంత్ర భారతంలో పౌరులందరికీ ప్రాథమిక హక్కులు, సార్వజన ఓటుహక్కు కల్పించాలని ఉద్ఘాటించాయి. తదనుగుణంగా భారత రాజ్యాంగంలో 326వ అధికరణ లోక్‌సభ, శాసనసభలకు వయోజన ఓటుహక్కు ప్రాతిపదికపై ఎన్నికలు జరపాలని నిర్దేశిస్తోంది. దిగువ స్థాయిలో పంచాయతీ రాజ్‌ సంస్థలు మొదలుకొని పై స్థాయిలో పార్లమెంటు వరకు ఓటుహక్కు ఆధారంగా ఎన్నికలు జరపాలని నిర్ధారించింది.

గాడి తప్పుతున్న ఎన్నికల ప్రక్రియ

స్వతంత్ర భారతంలో పార్లమెంటు, శాసనసభలకు తొలిసారి 1951లో ఎన్నికలు జరిగాయి. ప్రజలు ఉత్సాహంగా ఓటు వేశారు. 1988 నాటి 61వ రాజ్యాంగ సవరణ లోక్‌సభ, శాసనసభలకు ఓటింగ్‌ వయసును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించింది. రాజకీయ నాయకుల ఇష్టాయిష్టాలకు తావు లేని విధంగా రాజ్యాంగం భారతీయుల ఓటుహక్కుకు భరోసా ఇచ్చింది. కులం, మతం, నిరక్షరాస్యత, పేదరికం, అజ్ఞానాల వల్ల భారతీయ ఓటర్లు పరిణత దృక్పథంతో ఓటు వేయలేరనే ప్రతికూల భావనలు, అంచనాలు పటాపంచలయ్యాయి. భారతీయ ఓటర్లు ఎంతో పరిపక్వత, పరిణతి, ముందుచూపు, వివేకం ప్రదర్శిస్తూ వచ్చారు. నిరంకుశ ప్రభుత్వాలను కూలదోశారు. కానీ, ఇటీవలి కాలంలో ధన ప్రాబల్యం, మద్యం పంపిణీ, దాదాగిరి, మతతత్వం, ప్రాంతీయ తత్వాలకు చాలామంది ఓటర్లు ప్రభావితులవుతున్నారు. ఈ పెడ ధోరణులను అరికట్టకపోతే ఎన్నికలు ప్రహసనప్రాయంగా మారి, యావత్‌ ప్రజాస్వామ్య ప్రక్రియే ప్రమాదంలో పడుతుంది. ఈ గండాన్ని తప్పించాలంటే ఓటర్లను చైతన్యవంతుల్ని చేయాలి. రాజ్యాంగ ధర్మాన్ని, ఉన్నత నైతిక విలువలను పాటిస్తేనే ప్రజాస్వామ్యం చిరకాలం సుస్థిరంగా మనగలుగుతుందని తెలియజెప్పాలి. ప్రజాస్వామ్యం లేనిదే ఆధునిక భారతానికి మనుగడ ఉండదని నూరిపోయాలి. ఎన్నికల ప్రక్రియలో అవినీతిని ప్రజలే అంతం చేసేలా కార్యోన్ముఖుల్ని చేయాలి. ఈ బృహత్తర కృషిలో పౌర సంఘాలు, సమాచార సాధనాలు, విజ్ఞులు పాలు పంచుకోవాలి. రాజకీయ పార్టీలు స్వాతంత్య్రోద్యమ కాలంనాటి స్ఫూర్తిని, ఉన్నత విలువలను మళ్ళీ పుణికిపుచ్చుకోవాలి. ఈ విధంగా భారతీయ సామాజిక, రాజకీయ జీవనం చైతన్యవంతం అయినప్పుడు- నిజమైన రాజ్యాంగకర్తలు కలగన్న నవ భారతం సాకారమవుతుంది.

జీవన ప్రమాణాల మెరుగుదల

కుల, మత, జాతి, లింగ, వర్గ భేదాలు లేకుండా ప్రజలందరికీ ఓటుహక్కు కల్పించి, వారు ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొన్నప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ఓటుహక్కు లేని దేశాల్లో ప్రజాస్వామ్యం కాకుండా నిరంకుశత్వం రాజ్యమేలుతుంది.

సామాన్యుడి విచక్షణాశక్తి మీద నమ్మకం ఉంచి వయోజన ఓటు హక్కు కల్పించాలని, అది భారత్‌లో ప్రజాస్వామ్య పాలన ఘన విజయానికి పునాది వేస్తుందని రాజ్యాంగ నిర్మాణ సభ నిశ్చయించినట్లు రాజ్యాంగ కర్తల్లో ఒకరైన అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌ ఆనాడే వివరించారు.

ఓటుహక్కు వినియోగించి ప్రజలు అధికారంలోకి తెచ్చిన ప్రజాస్వామ్య ప్రభుత్వం పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని, సామాన్యుడు కూడా హుందాగా జీవించే అవకాశాన్ని కల్పిస్తుందని, దేశం ప్రగతి పథంలో దూసుకెళుతుందని రాజ్యాంగ నిర్మాణ సభ భావించింది.

ఐరోపా దేశాల్లో ప్రజాస్వామ్య విజయం భారత జాతీయ నాయకులను ప్రభావితం చేసింది. స్వతంత్ర భారతం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అవలంబించాలని వారు తీర్మానించుకున్నారు.

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ డ్రాగన్‌ చక్రబంధానికి విరుగుడు వ్యూహం

‣ వేగంగా చౌకగా... రవాణా!

‣ ‘కాట్సా’ కోరల నుంచి మినహాయింపు?

‣ పర్యావరణ లక్ష్యాలకు తూట్లు

‣ సాగు లాభానికి సూక్ష్మ సాంకేతికత

‣ న్యాయ వ్యవస్థపై కేసుల భారం

‣ జోరెత్తుతున్న పార్టీ ఫిరాయింపులు

Posted Date: 29-07-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం