• facebook
  • whatsapp
  • telegram

సంక్షోభంలో చైనా బ్యాంకులు

డ్రాగన్‌ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది?

 

 

కొన్నాళ్లుగా చైనాలో వేలమంది బ్యాంకు ఖాతాదారులు ఆందోళనకు దిగుతున్నారు. తాము దాచుకున్న నగదును ఉపసంహరించుకొనే వెసులుబాటు కల్పించాలని నినదిస్తున్నారు. వారిని అదుపు చేయడానికి డ్రాగన్‌ దేశం యుద్ధ ట్యాంకులను సైతం మోహరించిందంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చైనా మీడియా కథనాల ప్రకారం నాలుగు గ్రామీణ బ్యాంకుల ఖాతాదారులకు చెందిన దాదాపు రూ.48 వేల కోట్లను స్తంభింపజేశారు. దానిపై పెద్దయెత్తున ఆందోళనలు చెలరేగాయి. జులై 10న వెయ్యి మందికి పైగా డిపాజిటర్లు చైనా సెంట్రల్‌ బ్యాంక్‌ ‘పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా’ ముందు నిరసన చేపట్టారు. వారిని శాంతింపజేయడానికి వచ్చిన భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. పరిస్థితి చేయిదాటిపోతోందని గమనించిన చైనా బ్యాంకింగ్‌, బీమా నియంత్రణ సంస్థ (సీబీఐఆర్‌సీ)- త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని ఖాతాదారులకు అభయమిచ్చింది. 50 వేల యువాన్లలోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసిన వారికి జులై 15 నుంచి నగదు అందజేస్తామని ప్రకటించింది. గడువు ముగిసినా నగదు కొద్ది మందికే అందింది. జులై 25 నుంచి లక్ష యువాన్లు డిపాజిట్లు చేసినవారికీ మొత్తం అందజేస్తామని ప్రకటించింది. ఆ మాటలను నమ్మే పరిస్థితి లేకపోవడంతో ఆందోళనలు ఆగడం లేదు.

 

చైనాలో దాదాపు నాలుగు వేల దాకా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా రుణ సంస్థలున్నాయి. సీఐబీఆర్‌సీ గణాంకాల ప్రకారం దేశం మొత్తం ఆర్థిక లావాదేవీల్లో వాటి వాటా 29శాతం. సాధారణంగా అవి సీఐబీఆర్‌సీ, పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా నియంత్రణలో ఉంటాయి. కానీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వాటిలో స్థానిక నేతల పెత్తనం కొనసాగుతోంది. హెనన్‌ ప్రావిన్స్‌లోని నాలుగు గ్రామీణ బ్యాంకుల్లో ‘హెనన్‌ న్యూ ఫార్చ్యూన్‌’ అనే సంస్థ ప్రధాన వాటాదారుగా ఉంది. ఆ కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా పెద్దమొత్తం వడ్డీ ఆశ చూపి అక్రమ పద్ధతుల్లో డిపాజిట్లు సేకరించినట్లు సీఐబీఆర్‌సీ విచారణలో తేలింది. ఆ డిపాజిట్లను బ్యాంకు అధికారులతో కుమ్మక్కై అక్రమంగా ఇతర చోట్లకు తరలించింది. నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాలకు చెందినవారి నుంచీ బ్యాంకులు డిపాజిట్లు సేకరించాయి. ఆ బ్యాంకుల్లో మరో వాటాదారు అయిన షుచాంగ్‌ సిటీ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రూప్‌- మనీలాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ అక్రమాలకు తోడు, స్థానిక ప్రభుత్వాల తీరు సైతం బ్యాంకుల పాలిట శాపంలా మారింది. సాధారణంగా చైనాలో స్థానిక ప్రభుత్వాలు స్థిరాస్తి వ్యాపారులు, భవన నిర్మాణదారులకు స్థలాలను లీజుకు ఇచ్చి, భూములను విక్రయించి ఆదాయం సమకూర్చుకొంటాయి. కొన్నేళ్లుగా చైనాలో స్థిరాస్తి రంగం కుదేలవడంతో నిర్మాణాలు ఆగిపోయాయి. పూర్తయిన ఇళ్లనూ కొనుగోలు చేసేవారు లేరు. దాంతో స్థానిక ప్రభుత్వాల ఆదాయం గణనీయంగా పడిపోయింది. విధిలేని పరిస్థితుల్లో అవి గ్రామీణ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకోసాగాయి. గతేడాదిలోనే హెనన్‌ ప్రభుత్వం నలభై చిన్న బ్యాంకుల నుంచి రూ.30 వేల కోట్ల అప్పు తీసుకుంది. అందులో ఒక్క గ్రామీణ వాణిజ్య బ్యాంకు నుంచే రెండున్నర వేల కోట్ల రూపాయల రుణం మంజూరైంది. అవినీతి నాయకులు అందులోనూ చేతివాటం ప్రదర్శించారు. తీసుకున్న రుణాలనూ సక్రమంగా చెల్లించడంలేదు. ఫలితంగా గ్రామీణ బ్యాంకులు దివాలా దశకు చేరుకున్నాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో బ్యాంకులు ఖాతాలను స్తంభింపజేశాయి. పైసాపైసా కూడబెట్టి దాచుకున్న తమ కష్టార్జితం ఎక్కడ అందకుండా పోతుందో అనే భయంతో ఖాతాదారులు ఆందోళన బాట పట్టారు.

 

చైనాలో 2022 ప్రథమార్ధం నాటికి 4.60 లక్షల సంస్థలు మూతపడ్డాయి. 31 లక్షల పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేమని చేతులెత్తేశాయి. తొమ్మిది కోట్ల మంది నిరుద్యోగంతో అల్లాడుతున్నారు. అతిపెద్ద స్థిరాస్తి సంస్థ ఎవర్‌గ్రాండ్‌ సంక్షోభంతో రియల్‌ రంగమే కుదేలైంది. మరోవైపు ఇళ్ల ధరలు అమాంతం పడిపోవడంతో గృహ రుణాలు తీసుకున్నవారు సైతం కిస్తీలు కట్టకుండా మొండికేస్తున్నారు. ఫలితంగా చైనా ఆర్థిక వ్యవస్థ పతనానికి జారుకుంటోందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇటీవలి కాలంలో చైనా జీడీపీ దారుణంగా తెగ్గోసుకుపోయింది. జీరో కొవిడ్‌ విధానం వల్ల ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఈ గడ్డు పరిస్థితుల్లో చైనా బ్యాంకింగ్‌ రంగం ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

 

- బి.శ్రీనివాస్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ తీర ప్రాంతానికి ప్రకృతి కాపలా!

‣ అత్యున్నత పీఠంపై ఆదివాసీ మహిళ

‣ ప్రజాస్వామ్యానికి ఊపిరులూదిన ఓటుహక్కు

‣ డ్రాగన్‌ చక్రబంధానికి విరుగుడు వ్యూహం

‣ వేగంగా చౌకగా... రవాణా!

‣ ‘కాట్సా’ కోరల నుంచి మినహాయింపు?

Posted Date: 29-07-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం