• facebook
  • whatsapp
  • telegram

కదన రంగాన కొదమ సింహాలు

దేశ రక్షణలో త్రివిధ దళాలు

 

 

స్వతంత్ర భారత్‌ 75 ఏళ్ల ప్రస్థానంలో త్రివిధ సాయుధ దళాల విజయాలు, త్యాగాలు చిరస్మరణీయం. స్వాతంత్య్రానికి ముందునాటి సిపాయి, అశ్విక దళాలే కాలక్రమంలో త్రివిధ సాయుధ బలగాలుగా రూపాంతరం చెందాయి. బ్రిటిష్‌ వలస పాలనలో భారత సైన్యం మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో వీరవిహారం చేసి సాటిలేని మేటి సేనగా పేరుపడింది. ఆ విజయాలతో తాము ఎవరికీ తీసిపోమనే ఆత్మవిశ్వాసం పెరిగింది. అందుకే 1946లో రాయల్‌ భారతీయ నౌకాదళ సభ్యులు వలస పాలకులపై తిరుగుబాటు చేశారు. దాంతో బ్రిటిష్‌ పాలకులు రెండో ప్రపంచ యుద్ధంలో రాణించిన భారతీయ దళాలను రద్దు చేసి, మొత్తం సేనా బలగాలను తగ్గించి, దేశ విభజన తరవాత భారత్‌, పాకిస్థాన్‌లకు విడదీసి అప్పగించారు. దేశానికి స్వాతంత్య్రం రాగానే 500 పైచిలుకు రాజ సంస్థానాలను స్వతంత్ర భారతంలో విలీనం చేసే బాధ్యతను కొత్త ప్రభుత్వం చేపట్టింది. ఆ పని శాంతియుతంగానే పూర్తయినా హైదరాబాద్‌, జమ్మూకశ్మీర్‌, జునాగఢ్‌ సంస్థానాల విషయంలో కొంత ఆలస్యం జరిగింది. ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ పట్టుదలగా ఆ మూడింటినీ దారికి తెచ్చారు. దానికి కొంత సైనిక బలప్రయోగం అవసరమైంది. 1948లో ఆపరేషన్‌ పోలో పేరిట హైదరాబాద్‌ను, 1961లో ఆపరేషన్‌ విజయ్‌ పేరిట పోర్చుగీస్‌ పాలనలోని గోవా, డయ్యూ డామన్‌లను సైన్యం భారత్‌లో అంతర్భాగాలుగా చేసింది.

 

అద్భుత పోరాట పటిమ

స్వాతంత్య్రానంతరం భారత్‌ పాకిస్థాన్‌తో నాలుగు యుద్ధాలు చేసింది. వాటిలో 1999 నాటి కార్గిల్‌ యుద్ధం ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో జరిగిన సమరంగా చరిత్రకెక్కింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లోనే, పాకిస్థాన్‌ జమ్మూకశ్మీర్‌ను ఆక్రమించాలని చూసింది. 1947 అక్టోబరులో పాక్‌ సైన్యం అండతో గిరిజన శక్తులు జమ్మూకశ్మీర్‌ సంస్థానంలో కొన్ని భాగాలను ఆక్రమించాయి. అప్పటి కశ్మీర్‌ మహారాజు భారత్‌లో విలీనం కావడానికి, సైనిక సాయం అర్థించడానికి మీనమేషాలు లెక్కించారు. ఫలితంగా పాక్‌ సైన్యం శ్రీనగర్‌ విమానాశ్రయాన్ని ఆక్రమించి బారాముల్లా దాకా చొచ్చుకెళ్ళింది. ఆలోగా మహారాజు అభ్యర్థనపై భారత సైన్యం రంగంలోకి దిగింది. 1948 చివరికల్లా భారత్‌ సైన్యం పాక్‌ సేనలను కశ్మీర్‌ ప్రధాన భూభాగం నుంచి వెళ్ళగొట్టి మొత్తం సంస్థానాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఉపక్రమించింది. అప్పటి భారత ప్రభుత్వం 1949 జనవరి ఒకటో తేదీన ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన కాల్పుల విరమణకు అంగీకరించడంతో జమ్మూకశ్మీర్‌లో మూడో వంతు భూభాగం పాక్‌ చేతుల్లోనే ఉండిపోయింది.

 

క్యూబాలో 1962లో క్షిపణుల మోహరింపు వల్ల అమెరికా-సోవియట్‌ యూనియన్‌ మధ్య అణు యుద్ధం జరుగుతుందేమోనని ఆందోళన రేగింది. అదే సమయంలో చైనా ఇండియా సరిహద్దులను ఆక్రమించింది. రక్షణ పరంగా సరైన సన్నద్ధత లేకపోవడంతో భారత్‌ వైఫల్యం చవిచూడాల్సి వచ్చింది. దానినుంచి గుణపాఠం నేర్చుకున్న భారత ప్రభుత్వం సాయుధ బలగాల ఆధునికీకరణకు నడుం బిగించింది. చైనా తరవాత 1965లో దురాక్రమణకు దిగిన పాకిస్థాన్‌ను భారత సైన్యం చావుదెబ్బ తీసింది. మొట్టమొదటిసారి భారత వాయుసేన రంగంలోకి దిగి పాక్‌ స్థావరాలను దెబ్బతీసింది. అధునాతన ఆయుధాలతో దాడి చేసిన పాక్‌ను మన సాయుధ బలగాలు గొప్ప పోరాట పటిమతో చిత్తు చేశాయి. ఆ యుద్ధంలో మనం స్వాధీనం చేసుకున్న పాక్‌ భూభాగాలను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలు, తాష్కెంట్‌ ఒప్పందం మూలంగా తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది. బంగ్లాదేశ్‌ విమోచనకు 1971లో జరిగిన యుద్ధంలోనూ భారత సైన్యం చేతిలో పాకిస్థాన్‌ ఘోరంగా ఓడిపోయింది. భారత వాయు, నౌకా సేనల ధాటికి పాక్‌ విలవిల్లాడింది. చరిత్రలో ఎన్నడూ ఎరగని విధంగా 93వేల మంది పాక్‌ సైనికులు భారత సైన్యానికి లొంగిపోయారు. పాక్‌ రెండు ముక్కలై బంగ్లాదేశ్‌ స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. పాక్‌ జైళ్లలో మగ్గుతున్న భారత యుద్ధ ఖైదీలను వదిలేసి, మనకు లొంగిపోయిన వేలమంది పాక్‌ సైనికులను 1972 సిమ్లా ఒప్పందం పేరిట తిరిగి అప్పగించాం. భారత్‌ చేతిలో పదేపదే చావు దెబ్బలు తిన్నా పాకిస్థాన్‌ బుద్ధి మారలేదు. 1999లో పాక్‌ సైనికులు కశ్మీరీ తీవ్రవాదుల ముసుగులో జమ్మూకశ్మీర్‌లోని కార్గిల్‌ జిల్లాలో, లద్దాఖ్‌లో ఎత్తయిన పర్వతాలను ఆక్రమించారు. భారత సైన్యం, వాయుసేన కలిసికట్టుగా పోరాడి పాక్‌ ముష్కరులను కార్గిల్‌ నుంచి తరిమేశాయి. ఇటీవల లద్దాఖ్‌లో చొచ్చుకొచ్చిన చైనా సేనలనూ దీటుగా తిప్పికొట్టాయి.

 

విపత్తుల వేళ అండ

స్వాతంత్య్రం వచ్చాక 1950 కొరియా యుద్ధంలో భారత దళాలు వైద్య సహాయం అందించాయి. ఐక్యరాజ్య సమితి తరఫున అనేక దేశాల్లో శాంతి భద్రతల రక్షణ విధులను నిర్వహించాయి. సమితి ఇంతవరకు నిర్వహించిన 71 శాంతి రక్షక కార్యకలాపాల్లో భారత్‌ 49 సార్లు పాల్గొంది. వాటిలో 140 మంది సైనిక సిబ్బందిని కోల్పోయాం. కాంగోలో సమితి తరఫున విధులు నిర్వహిస్తూ మరణించిన కెప్టెన్‌ గురుబచన్‌ సింగ్‌ సలారియాకు భారతదేశ అత్యున్నత సైనిక పురస్కారమైన పరమ వీర చక్రను ప్రదానం చేశారు. స్వదేశంలో భూకంపాలు, వరదలు, సునామీల వంటి ఉత్పాతాల వేళ పౌర యంత్రాంగానికి సైన్యం అండగా నిలుస్తోంది. త్రివిధ బలగాలలో  భారత్‌కు మొత్తం 14.5 లక్షల సైనిక బలం ఉంది. దేశ భద్రత విషయంలో ఇంటా బయటా ఎదురవుతున్న సవాళ్లను భారత సైన్యం దీటుగా ఎదుర్కొంటోంది. ఆత్మనిర్భరత సాధనకు త్రివిధ సాయుధ బలగాలు సొంతంగా అధునాతన ఆయుధాలను సమకూర్చుకోవడానికి, ప్రపంచంలో ధీరోదాత్త సేనగా రాణించడానికి సమాయత్తమవుతున్నాయి.

 

సవాళ్లను ఎదుర్కొంటూ...

ప్రస్తుతం వాస్తవాధీన రేఖ వెంట భారత్‌, చైనా దళాలు ఢీ అంటే ఢీ అనే వాతావరణం కొనసాగుతోంది. చైనా చొరబాట్లను నివారించడంలో భారత సేనలు తగ్గేదే లేదంటున్నాయి. పాకిస్థాన్‌, మయన్మార్‌లలోని ఉగ్రవాదుల స్థావరాలను మన దళాలు ధ్వంసం చేశాయి. స్వదేశంలో తీవ్రవాదులపై పోరాటం, ఖలిస్థాన్‌ వాదులపై ఆపరేషన్‌ బ్లూస్టార్‌, సియాచిన్‌లో పాక్‌ పీచమణచడం, శ్రీలంకలో భారత శాంతిసేన కార్యకలాపాలు, యెమెన్‌ నుంచి భారతీయుల తరలింపు వంటి క్లిష్టమైన సవాళ్లను మన సాయుధ బలగాలు సమర్థంగా ఎదుర్కొన్నాయి.

 

ధీరులకు సత్కారం

‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో మేటి యోధులకు ప్రత్యేకంగా పతకాలు ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి 25 ఏళ్లకు ఒకసారి ప్రత్యేక పతకాలను అందించే సంప్రదాయం 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మొదలైంది. 1997 ఆగస్టు 15న స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల సందర్భంలోనూ ఇలాంటి పతకాలను ప్రదానం చేశారు. తిరిగి ఇప్పుడు 75 ఏళ్లయిన సందర్భంగా పోరాట వీరులను సత్కరించనున్నారు.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ విపత్తుల ముట్టడిలో కన్నీళ్ల సాగు

‣ ఉరుముతున్న ఆర్థిక సంక్షోభం

‣ ‘సీపెక్‌’కు నిధుల కటకట

‣ జీవవైవిధ్యం... మనుగడకు ఆధారం!

‣ కష్టాల కడలిలో లంక ఎదురీత

Posted Date: 02-08-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం