• facebook
  • whatsapp
  • telegram

మాల్దీవులతో స్నేహబంధం

సొలిహ్‌ పర్యటనలో కీలక ఒప్పందాలు

 

 

హిందూ మహాసముద్రంలోని ద్వీప సముదాయ దేశం మాల్దీవులతో ఇండియా సంబంధాలు కొన్నేళ్లుగా బలపడుతున్నాయి. ఉగ్రవాదంపై పోరు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా కట్టడి సహా పలు అంశాల్లో రెండు దేశాలు పరస్పర సహకారంతో ముందుకు సాగుతున్నాయి. కొవిడ్‌ విజృంభణ సమయంలో మాలేకు అండగా నిలిచిన దిల్లీ- అక్కడ మౌలిక సదుపాయాల కల్పనకూ ఎప్పటికప్పుడు చేయూతనందిస్తోంది. తాజాగా భారత్‌లో పర్యటించిన మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం సొలిహ్‌- ప్రతి క్లిష్ట సమయంలో తమకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మరే ఇతర దేశంతో పోల్చిచూసినా ఇండియాయే తమకు అత్యంత ముఖ్యమని తేల్చిచెప్పారు.

 

గతంలో ఒడుదొడుకులు

మాల్దీవులతో ఇండియాకు చారిత్రకంగా, సాంస్కృతికంగా బలమైన సంబంధాలు ఉన్నాయి. 1965లో బ్రిటిష్‌ దాస్యశృంఖలాలను తెంచుకోగానే ఆ ద్వీప సమాహారాన్ని స్వతంత్ర దేశంగా గుర్తించిన అతికొన్ని దేశాల్లో భారత్‌ ఒకటి. ఆరు లక్షల లోపే జనాభా ఉన్న మాల్దీవులు ఆహార భద్రత కోసం దిల్లీపైనే ఆధారపడుతుంటుంది. మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగమే ప్రధాన ఊతం. ఏటా ఆ దేశానికి వెళ్ళే పర్యాటకుల్లో ఆరు శాతానికి పైగా భారతీయులే. రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న స్నేహబంధం 2013లో చైనా అనుకూల వాది అబ్దుల్లా యమీన్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక కుదుపులకు లోనైంది. డ్రాగన్‌ నుంచి యమీన్‌ భారీగా రుణాలు తీసుకున్నారు. భారత వ్యతిరేక విధానాలను అవలంబించారు. 2018లో సొలిహ్‌ పాలనా పగ్గాలు చేపట్టాక పరిస్థితుల్లో మళ్ళీ మార్పు వచ్చింది. హిందూ మహాసముద్రంలో భారత్‌ సైనిక బలగాలను మోహరిస్తోందని ఆరోపిస్తూ యమీన్‌ నేతృత్వంలో ప్రతిపక్షాలు ‘భారత్‌ వెళ్ళిపోవాలి (ఇండియా ఔట్‌)’ పేరుతో మాల్దీవుల్లో పెద్దయెత్తున దుష్ప్రచారం నిర్వహించాయి. వాటి వెనక డ్రాగన్‌ హస్తం ఉందన్నది జగమెరిగిన సత్యం. ఆ దుష్ప్రచారంపై సొలిహ్‌ సర్కారు నిషేధాజ్ఞలు విధించింది. ఇస్లామిక్‌ దేశమైన మాల్దీవులు- ఇండియాలో హిజాబ్‌ వివాదంపై పలు దేశాలు మొసలి కన్నీరు కార్చినప్పుడు నిగ్రహం పాటించింది. మహమ్మద్‌ ప్రవక్తపై నుపుర్‌ శర్మ వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో ఒకింత అసంతృప్తిని వెలిబుచ్చినా, ఆమెపై భాజపా సస్పెన్షన్‌ వేటుతో సంతృప్తి చెందింది.

 

సొలిహ్‌ తాజా పర్యటనలో ఇండియా, మాల్దీవుల మధ్య ఆరు కీలక ఒప్పందాలు కుదిరాయి. సైబర్‌ భద్రత, గృహ నిర్మాణం, విపత్తు నిర్వహణ, మౌలిక వసతుల కల్పన వంటి రంగాల్లో పరస్పర సహకారం పెంపుదలకు అవి దోహదపడనున్నాయి. మాల్దీవుల్లో మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం దిల్లీ అదనంగా పది కోట్ల డాలర్ల లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ను ప్రకటించింది. ఆ దేశ నౌకాదళ సామర్థ్యాలను బలోపేతం చేసేలా శత్రువులపై దాడులకు అవసరమైన మరో నౌకను అందించేందుకు ముందుకొచ్చింది. మాల్దీవుల రాజధాని మాలేను పొరుగున ఉన్న దీవులతో అనుసంధానించే 6.74 కిలోమీటర్ల వంతెన, కాజ్‌వే నిర్మాణానికి ఉద్దేశించిన ‘గ్రేటర్‌ మాలే అనుసంధాన ప్రాజెక్టు’ (జీఎంసీపీ)కు మోదీ, సొలిహ్‌ ఇటీవల శంకుస్థాపన చేశారు. అది భారత్‌ ప్రాయోజిత ప్రాజెక్టు. అంచనా వ్యయం 50 కోట్ల డాలర్లు. అందులో 10 కోట్ల డాలర్లను గ్రాంటు రూపంలో, మిగతా మొత్తాన్ని లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌గా దిల్లీ సమకూరుస్తుంది.

 

ఎండీపీలో అంతర్గత కలహాలు

ప్రాంతీయ శాంతి, సుస్థిరతలకు ఇండియా, మాల్దీవుల బంధం చాలా కీలకం. అందుకే ‘పొరుగుకు తొలి ప్రాధాన్యం’ విధానంలో మాలేకు దిల్లీ ప్రత్యేక స్థానం కల్పిస్తోంది. అక్కడ ఎలాంటి సంక్షోభం తలెత్తినా తక్షణం స్పందిస్తోంది. ఇకపైనా అదే వైఖరిని కొనసాగించాలి. భారత్‌ భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాలేను చైనా వాడుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి. సొలిహ్‌ నేతృత్వంలోని మాల్దీవియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ (ఎండీపీ) అధికారంలో కొనసాగినన్నాళ్లూ ఇరు దేశాల మైత్రీబంధం బలంగా ఉంటుందనడంలో సందేహం లేదు. వచ్చే ఏడాది అధ్యక్ష పీఠానికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎండీపీలో అంతర్గత కలహాలు మొదలయ్యాయి. మాజీ అధ్యక్షుడు మహమ్మద్‌ నషీద్‌ నేతృత్వంలోని వర్గం రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో సొలిహ్‌ బరిలో దిగకూడదని పట్టుపడుతోంది. స్వలింగ సంపర్క ఆరోపణలపై నషీద్‌ సోదరుడు అహ్మద్‌ నజీమ్‌ను ఇటీవల పోలీసులు అరెస్టు చేయడం ఇరువర్గాల మధ్య మరింత అగ్గి రాజేస్తోంది. ఇది క్రమంగా దిల్లీకి ప్రతికూలాంశంగా మారే ముప్పు లేకపోలేదు. ఎండీపీ అంతర్గత గొడవలు సొలిహ్‌ భారత పర్యటనలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. నషీద్‌ సైతం భారత అనుకూలవాదే. తమ దేశ మొత్తం రుణాల్లో దాదాపు 70శాతం చైనా నుంచి తీసుకున్నవేనంటూ ఇటీవల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని తీర్చడంలో సాయం చేయాలని దిల్లీని అభ్యర్థించారు. అవసరమైతే సొలిహ్‌, నషీద్‌ల మధ్య సయోధ్య కుదర్చడం ద్వారా ఎండీపీలో కుమ్ములాటలకు దిల్లీ పరిష్కార మార్గం చూపాలి. మాల్దీవులతో బంధం చిరకాలం కొనసాగేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

 

- ఎం.నవీన్‌ కుమార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మూడో ప్రపంచ యుద్ధ భయం!

‣ మిగ్‌ పాపం ఎవరిది?

‣ పశ్చిమాసియాలో ఆధిపత్య పోరు

‣ బ్రిటన్‌ ప్రధాని ఎన్నికపై ఉత్కంఠ

‣ లాటిన్‌ అమెరికాలో డ్రాగన్‌ పాగా

‣ కదన రంగాన కొదమ సింహాలు

‣ విపత్తుల ముట్టడిలో కన్నీళ్ల సాగు

Posted Date: 09-08-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం