• facebook
  • whatsapp
  • telegram

మిగ్‌ పాపం ఎవరిది?

కూలుతున్న యుద్ధ విమానాలు

 

 

భారత వైమానిక దళానికి చెందిన మిగ్‌-21 విమానాలు తరచూ ప్రమాదాలతో వార్తల్లో నిలుస్తున్నాయి. 1971 యుద్ధంలో ఇండియాకు అద్భుత విజయాన్నందించిన ఈ రష్యన్‌ ఫైటర్‌జెట్లు ఇప్పుడు అపకీర్తి మూటగట్టుకుంటున్నాయి. వాస్తవానికి ఆ విమానాలను తప్పుపట్టడం సమస్యను పక్కదారి పట్టించడమే. దశాబ్దాలుగా సరికొత్త విమానాల సేకరణలో మన పాలకులు, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల పైలట్లు ప్రాణాలు కోల్పోతున్నారు. భారత వాయుసేన (ఐఏఎఫ్‌) 1960ల్లో మిగ్‌-21 కొనుగోలు చేపట్టే నాటికి ప్రపంచ వ్యాప్తంగా అది ఒక కలల యుద్ధ విమానం. సూపర్‌సోనిక్‌ వేగంతో ప్రయాణించే మిగ్‌-21 సాంకేతికతను దొంగిలించడానికి ఇజ్రాయెల్‌ ఏకంగా ‘ఆపరేషన్‌ డైమండ్‌’ చేపట్టింది. ఓ ఇరాక్‌ పైలట్‌ను మభ్యపెట్టి ఆ జెట్‌ను అపహరించింది. మిగ్‌-21 రకం విమానాలను భారత్‌ 800కు పైగా వాయుసేనలోకి తీసుకొంది. వాటిలో చాలా వరకు హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో రష్యా నుంచి అనుమతులు తీసుకొని తయారు చేశారు. 1985లో సోవియట్‌ యూనియన్‌ మిగ్‌-21లను తమ దళం నుంచి తొలగించింది. బంగ్లాదేశ్‌ వంటివీ పక్కన పెట్టాయి. భారత్‌ వాయుసేనలో మాత్రం ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి.  

 

విడిభాగాల కొరత

పురాతన విమానాలను ఆయా దేశాలు వాయుసేనలో కొనసాగించడం కొత్తేమీ కాదు. ప్రచ్ఛన్న యుద్ధం నాటి బి-52 దీర్ఘ శ్రేణి బాంబర్లను అమెరికా ఇప్పటికీ వినియోగిస్తోంది. ఎఫ్‌-16, ఎఫ్‌-15 విమానాలూ అదే కోవకు వస్తాయి. వాటిలో కాలానుగుణంగా ఆధునికీకరణలు చోటు చేసుకున్నాయి. ఆ స్థాయిలో కాకపోయినా భారత్‌ సైతం మిగ్‌-21ను బైసన్‌ వెర్షన్‌ పేరిట ఆధునికీకరించింది. వాటికీ పరిమితులు ఉంటాయి. మిగ్‌-21ల విషయంలో ఆందోళన అవసరం లేదని నిరూపించేందుకు ఎయిర్‌ మార్షల్స్‌గా ఉన్న సమయంలో ఆర్‌కేఎస్‌ బధౌరియా, బీఎస్‌ ధనోవాలు వాటిని నడిపారు. ఇతర ఫైటర్లతో పోలిస్తే బైసన్‌ విమానాలు మెరుగ్గానే ఉంటాయని విశ్రాంత ఎయిర్‌ మార్షల్‌, సెంటర్‌ ఫర్‌ ఎయిర్‌ పవర్‌ స్టడీస్‌ డైరెక్టర్‌ అనిల్‌ చోప్రా విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఐఏఎఫ్‌ వద్ద తగినన్ని స్క్వాడ్రన్లు (సేనాదళాలు) లేవు. వాస్తవానికి 42 స్క్వాడ్రన్ల బలగాలు అవసరమని గతంలోనే ప్రభుత్వం అంగీకరించింది. వాటిని సమకూర్చే యత్నాలు నత్తనడకన సాగాయి. ఇండియా 2022 నాటికి పూర్తిస్థాయి స్క్వాడ్రన్లను సమకూర్చుకొంటుందని 2009 ఫిబ్రవరిలో నాటి రక్షణ మంత్రి ఏకే ఆంటొనీ రాజ్యసభలో వెల్లడించారు. అది వాస్తవ రూపం ధరించలేదు. 2012 నాటికి భారత్‌ కొనుగోలు చేసిన వివిధ రకాల 872 మిగ్‌ విమానాల్లో 482 నేల కూలగా, 171 మంది పైలట్లు, 39 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆంటొనీ రాజ్యసభలో వెల్లడించారు. అప్పట్లో అత్యధికంగా మిగ్‌-21లే ప్రమాదాలకు గురయ్యాయి. గత 19 నెలల్లో ఆరు మిగ్‌-21లు కూలిపోయాయి. అయిదుగురు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. భారత వాయుసేనలో మిగ్‌-21 విమానాలు ఎక్కువగా ఉన్నాయి. వాటితోనే గస్తీ, శిక్షణ నిర్వహిస్తుండటంతో మిగ్‌-21లే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయన్నది నిపుణుల విశ్లేషణ. మిగ్‌-21ల తయారీ నిలిపివేసి దశాబ్దాలు అవుతోంది. దాంతో విడిభాగాల కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం భారత్‌ వద్ద సుమారు 70కు పైగా మిగ్‌-21లు ఉన్నాయి. ఒక్కసారిగా వాటిని తొలగిస్తే స్క్వాడ్రన్ల సంఖ్య 30 లోపునకు తగ్గుతుంది. అందుకే ప్రత్యామ్నాయం దొరికే దాకా వాటిని కొనసాగిస్తోంది. 2025 నాటికి మిగ్‌-21లను పూర్తిగా తొలగిస్తారనే వార్తలొస్తున్నాయి. 2013లోనూ ఇలాంటి ప్రచారం జరిగింది.  

 

తయారీలో మందకొడితనం

వాయుసేన స్క్వాడ్రన్ల సంఖ్య తగ్గకుండా చూసేందుకు ఉద్దేశించిన కీలక ఫైటర్‌జెట్ల కొనుగోళ్లు 2000 సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో పట్టాలకెక్కలేదు. 2014లో చివరి దాకా వచ్చిన 126 రఫేల్‌ విమానాల ఒప్పందాన్ని మోదీ సర్కారు పక్కన పెట్టి, మళ్ళీ బేరమాడి 36 విమానాల కొనుగోలుతో సరిపెట్టింది. ఆ తరవాత 114 విమానాల కొనుగోలు తెరపైకి వచ్చినా ముందుకు సాగడంలేదు. మరోవైపు తేజస్‌ ప్రాథమిక, తుది కార్యకలాపాలకు అనుమతుల్లో జాప్యం వాయుసేనపై ప్రభావం చూపుతోంది. 2021లో 83 తేజస్‌ విమానాల కోసం హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హాల్‌)కు కాంట్రాక్టు కట్టబెట్టారు. 2028-29 తుది గడువుగా విధించారు. వాటి నిర్మాణం కోసం రెండో కార్ఖానా సైతం తెరిచారు. ఉత్పత్తిని రెట్టింపు చేసి ఏటా 16 తేజస్‌ విమానాలను నిర్మిస్తామని హాల్‌ చెబుతోంది. తేజస్‌కు విదేశీ ఆర్డర్లు లభిస్తేనే ఉత్పత్తి మరింత వేగవంతమయ్యే అవకాశం ఉంది. పైగా అమెరికా ఇంజిన్లు, ఇజ్రాయెల్‌ బీవీఆర్‌ క్షిపణులు, రాడార్లు, యూకే ఎజెక్షన్‌ సీట్‌, వివిధ దేశాల ఇతర పరికరాల సరఫరాలో సమస్యలు తలెత్తకుండా ఉంటేనే నిర్ణీత సమయానికి వాటిని అందించడం సాధ్యమవుతుంది. దీన్నిబట్టి గతేడాది వాయుసేన చీఫ్‌ వీఆర్‌ చౌధరి చెప్పినట్లు- భారత్‌ 42 స్క్వాడ్రన్లను సమకూర్చుకోవడానికి మరో ఒకటిన్నర దశాబ్దం పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

 

- ఫణికిరణ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పశ్చిమాసియాలో ఆధిపత్య పోరు

‣ బ్రిటన్‌ ప్రధాని ఎన్నికపై ఉత్కంఠ

‣ లాటిన్‌ అమెరికాలో డ్రాగన్‌ పాగా

‣ కదన రంగాన కొదమ సింహాలు

‣ విపత్తుల ముట్టడిలో కన్నీళ్ల సాగు

Posted Date: 02-08-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం