• facebook
  • whatsapp
  • telegram

పంటకాలువల నిర్వహణలో అశ్రద్ధ

అస్తవ్యస్తంగా నీటిపారుదల వ్యవస్థ

ఆధునిక భారతదేశంలో ఆహార భద్రత, వరదల నియంత్రణలో పంటకాలువలది ప్రధాన పాత్ర. కానీ, ఆ వ్యవస్థపై రైతులు నమ్మకం కోల్పోతున్నారు. ఏటా కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వాలు ప్రాజెక్టులను నిర్మిస్తున్నా- ఉపరితల జలాలు పూర్తిగా సద్వినియోగం కావడంలేదు. ఆయకట్టును తడపాలంటే ఆ వ్యవస్థ ఆధునికీకరణ ముఖ్యం. అది గ్రహించినా- మేజర్‌, మైనర్‌, డిస్ట్రిబ్యూటరీ కాలువలను బాగు చేసేందుకు ప్రభుత్వ పరంగా ఆశించిన స్థాయిలో ముందడుగు పడటంలేదు. ఫలితంగా జలాశయాల్లో నీరున్నా అది పూర్తిస్థాయిలో రైతులకు చేరడంలేదు... లేదా వృథా అవుతోంది.

భారీ వ్యయం... ఎంతో సమయం

బోర్ల ద్వారా కాకుండా కాలువల కింద వ్యవసాయం చేసే రైతులకు సాగువ్యయం ఎంతో తగ్గుతుంది. ఉత్తర్‌ ప్రదేశ్‌లో 50 ఏళ్ల కిందట ప్రణాళికలు వేసి... 1978లో నిర్మాణం ప్రారంభించిన సరయూ కాలువను 2021లో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ప్రారంభంలో రూ.100 కోట్లలోపు ఉన్న ఆ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం... పనులు పూర్తయ్యే నాటికి రూ.10,000 కోట్లకు చేరింది. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు పరిధిలో రెండు, మూడు దశల డిస్ట్రిబ్యూటరీల పనులు కొనసాగుతున్నాయి. తెలంగాణలో 1983లోనే బీజం పడిన శ్రీశైలం ఎడమ కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) ఇప్పటికీ పూర్తికాలేదు. ఖర్చు అంచనా మాత్రం రెట్టింపయింది. ఇలా దశాబ్దాల పాటు వేల కోట్ల రూపాయలు వ్యయం చేసి, వందల ఎకరాలు సేకరించి పెట్టినా... వాటి లక్ష్యాలు పూర్తిస్థాయిలో నెరవేరడం లేదు. నిర్వహణ అధ్వానంగా ఉండటంవల్ల భారత్‌లో కాలువల్లో ప్రవహించే నీటిలో కేవలం 40 శాతమే పంటపొలాలకు చేరుతోంది. ప్రస్తుతం అధికశాతం కాలువల్లో పూడిక పేరుకుపోవడం, లైనింగ్‌ దెబ్బతినడం, గుర్రపుడెక్క పెరగడం వంటి సమస్యలు తిష్ఠ వేశాయి. దాంతో వాటి సామర్థ్యంలో సగం కంటే తక్కువ నీటినే అవి తరలిస్తున్నాయి. కాలువల నిర్వహణ సరిగ్గా లేక గేట్లు బిగుసుకుపోవడం పరిపాటి అయింది. కట్టలకు గండ్లు పడుతూ జలం వృథా అవుతోంది. తుంగభద్ర ఎగువ కాలువ సామర్థ్యం 4000 క్యూసెక్కులైతే ఇప్పుడది 1800 క్యూసెక్కుల ప్రవాహానికే పరిమితమైంది. సరైన ప్రణాళిక, నిధులు లేక నీరు పారే సమయానికి యంత్రాంగం కాలువలను సన్నద్ధం చేయలేకపోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో పంట కాలువల మరమ్మతులకు ఈ ఏడాది అధికారులు రూ.44.6 కోట్లకు ప్రతిపాదనలు పంపితే రూ.15 కోట్లకే ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈలోగా వర్షాలు రావడంతో ఆ పనులు సైతం ముందుకు సాగలేదు.

కాలువలపై కల్వర్టులు, వంతెనలు ఉండటం లేదు. కాలువ గట్లపైనే ట్రాక్టర్లు వెళ్తున్నాయి. పట్టిసీమ కాలువ గట్లపై యథేచ్ఛగా తిరిగిన ఇసుక లారీలు కట్టలను ధ్వంసం చేశాయి. అధిక బరువున్న మైనింగ్‌ లారీలు తిరగడంతో ఎక్కడికక్కడ లైనింగ్‌ దెబ్బతిని, ఆ కాంక్రీటు పెచ్చులే నీటి ప్రవాహనికి అడ్డుగా మారాయి. నాగార్జునసాగర్‌, శ్రీశైలం, శ్రీరాంసాగర్‌ వంటి ప్రధాన కాల్వల హెడ్‌రెగ్యులేటరీలు మొదలు పంటభూముల్లోకి విస్తరించిన మైనర్‌, డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్వహణ సరిగ్గా లేక కట్టలు బలహీనమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో వీటన్నింటినీ చూసుకోవాల్సిన నీటి వినియోగ సంఘాలు (డబ్ల్యూయూఏ) అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేకపోతున్నాయి. డబ్ల్యూయూఏలలో రాజకీయ, సామాజికవర్గాల జోక్యం పెరిగి, అసలు పనులు పక్కకుపోతున్నాయని ప్రతిసారీ కాగ్‌ నివేదిక ఎండగడుతూనే ఉంది. సాగునీటి సంఘాలు లేని చోట ఏఈ ఆధ్వర్యంలో వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, లష్కర్లు మేజర్‌ కాలువల నిర్వహణ చూస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయడంలేదు.

ఆధునికీకరణే పరిష్కారం

ఎన్నో అడ్డంకులను దాటుకొని నీరు చేను వరకు వచ్చినా- మురుగు నీటి వ్యవస్థ సరిగ్గాలేక భూమి మడుగులా మారుతోంది. పొలాలను తడిపాక డ్రైనేజీలోంచి దిగువకు చేరాల్సిన నీరు చాలా చోట్ల పంట భూముల్లోనే తిష్ఠ వేస్తోంది. డ్రెయిన్లలో పేరుకున్న పూడికతో ప్రవాహం ముందుకు సాగడం లేదు. ఏడాదంతా భూమిలో నీటి నిల్వతో లవణీయత పెరిగి, భూసారం దెబ్బతింటోంది. విస్తారమైన నీటిపారుదల ఉన్న పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ ప్రదేశ్‌లతోపాటు తొమ్మిది రాష్ట్రాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలోని ఒక్క నీరా వ్యాలీలో 89 వేల ఎకరాలు సాగుకు పనికిరాకుండా పోయాయి. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడులలోనూ లక్షల ఎకరాల భూమి నిస్తేజంగా మారింది. ఈ ప్రభావంతోనే రైతులు స్వచ్ఛందంగా పంట విరామం ప్రకటించాల్సి వస్తోంది. దేశంలో మొత్తం సాగు భూమిలో 4.41శాతం చౌడుబారింది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక దేశంలో ఏటా 10శాతం చౌడుభూములు పెరుగుతున్నాయని హిమాచల్‌ప్రదేశ్‌ కృషి విద్యాలయ పరిశోధన వెల్లడించింది. దేశంలో కాలువల కింది భూములు త్వరగా చౌడుగా మారుతున్నట్లు గుర్తించిన ఐకార్‌- కేంద్ర భూ లవణీయత పరిశోధన సంస్థ ఆయా రాష్ట్రాల విశ్వవిద్యాలయాలతో కలిసి పరిశోధన చేపట్టింది. కాలువల సామర్థ్యాన్ని పెంచడానికి, నీటి సమర్థ వినియోగానికి ఆధునికీకరణ ఎంతో కీలకమని నాగార్జునసాగర్‌ ఎడమకాలువపై ప్రపంచబ్యాంకు నిధులతో చేపట్టిన పనులు రుజువు చేస్తున్నాయి. 32.5శాతం ప్రవాహ సామర్థ్యాన్ని కోల్పోయిన కాలువను ఆధునికీకరించారు. ప్రభుత్వాలు సమయానికి నిధులు అందిస్తూ, నిర్వహణకు ముందుకొస్తేనే రైతులకు కాలువలపై నమ్మకం పెరుగుతుంది. నిర్వహణలో స్థానిక రైతులను భాగస్వాములుగా చేయాలి. సీడబ్ల్యూసీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవాలి. కాలువలు, డ్రెయిన్లు సామర్థ్యం మేర సేవలందిస్తేనే రైతులకు సాగు నీరందించే లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరుతుంది.

ఆందోళనకరంగా భూగర్భజల వినియోగం

వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం దేశంలో ఇప్పటికీ 64శాతం సాగు భూమికి బోర్లు, బావులే ఆధారం. సాగుభూమిలో 23శాతానికి కాలువలు, 13శాతానికి చెరువులు, ఇతర వనరులే ఆధారం. సాగు, ఇతర అవసరాల కోసం భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కోసం దేశంలో ప్రభుత్వాలు ఏటా లక్ష కోట్ల రూపాయలకు పైగా వెచ్చిస్తున్నా ప్రయోజనం కనిపించడంలేదు.

పంజాబ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆ రాష్ట్రంలో చేసిన ఓ అధ్యయనంలో- గడిచిన 60 ఏళ్లలో కాలువలపై ఆధారపడిన భూములు 59శాతం నుంచి 28శాతానికి పడిపోయాయని లెక్కగట్టింది. అదే సమయంలో గొట్టపు బావులతో సాగు చేసే భూమి 41శాతం నుంచి 72శాతానికి పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనూ నాగార్జున సాగర్‌ కాలువల పరిధిలో అయిదేళ్లుగా బోర్ల సంస్కృతి యథేచ్ఛగా విస్తరిస్తోంది. ఆందోళన కలిగించే ఈ పరిణామాలతో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి సంస్థలు ముందుకొచ్చి ప్రాజెక్టులు, కాలువల ఆధునికీకరణకు ప్రాధాన్యమిస్తున్నాయి.

- బండపల్లి స్టాలిన్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ స్వరాజ్యం నుంచి సురాజ్యం వైపు...

‣ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం

‣ కుదరని కూర్పు

‣ పరిశోధనలే దన్నుగా పురోగమనం

Posted Date: 15-08-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం