• facebook
  • whatsapp
  • telegram

ఈడీ... రాజకీయ అస్త్రమా?

దర్యాప్తులో నిష్పాక్షికతే ప్రామాణికం కావాలి

అక్రమ ధనాన్ని సక్రమమైందిగా చలామణీ చేయడం దేశానికి సామాజికంగా, ఆర్థికంగా పెను నష్టం కలిగిస్తుందని, ఉగ్రవాదం వంటి తీవ్ర నేరాలనూ పెంచిపోషిస్తుందని భారత సుప్రీంకోర్టు హెచ్చరించింది. అక్రమ ధన చలామణీ నిరోధ చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనలు రాజ్యాంగ బద్ధమేనని ఈ ఏడాది జులై 30న తీర్పు చెప్పిన సందర్భంలో సర్వోన్నత న్యాయస్థానం పై విధంగా స్పందించింది.  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తును ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ నాయకులు పి.చిదంబరం, కార్తీ చిదంబరం, జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వంటివారు పీఎంఎల్‌ఏపై వ్యక్తం చేసిన అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది. అక్రమ ధన చలామణీ ద్వారా సంపాదించిన స్థిర, చరాస్తులను జప్తు చేయడానికి, నేరస్తులను కఠినంగా శిక్షించడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని సూచించింది. కాంగ్రెస్‌ అధినేత సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌ సహా అనేక ప్రముఖ రాజకీయ నాయకులు ఈడీ దర్యాప్తును ఎదుర్కొంటున్నారు. మొత్తం 122 మంది తాజా, మాజీ పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు అక్రమ ధన చలామణీ ఆరోపణలను ఎదుర్కొంటున్నారని 2021 ఆగస్టులో ఈడీ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి, పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ పేర్లు కూడా ఉన్నాయి. వేర్వేరు పార్టీలకు చెందిన 10 మంది మాజీ ముఖ్యమంత్రులు ఈడీ చిట్టాలో ఉన్నారు.

భారత్‌లో అక్రమ ధన విజృంభణ

భారత్‌లో గడచిన పదేళ్లలో ఎన్నడూ లేనంతగా 2021-22లో ఈడీకి 1,180 అక్రమ ధన చలామణీ ఫిర్యాదులు, 5,313 విదేశ మారక ద్రవ్య చట్టాల ఉల్లంఘన ఫిర్యాదులు అందాయి. 2012-13తో పోలిస్తే ఇప్పుడు ఇలాంటి కేసులు ఎంతగానో పెరిగిపోయాయి. సామాన్య మానవులకు అక్రమ ధన చలామణీ గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, అది నిజానికి అంతర్జాతీయ సమస్య. చట్టవిరుద్ధంగా, నేరపూరితంగా సంపాదించిన సొమ్మును వేర్వేరు దేశాల గుండా బదిలీ చేసి, సక్రమ ధనంగా చలామణీ చేస్తుంటారు. పన్ను ఎగవేతదారులు, అవినీతిపరులు, ఆయుధాలు-మాదక ద్రవ్యాల దొంగ రవాణాదారులు, చట్టబద్ధ వ్యాపారాలు చేస్తున్నట్లు కనిపిస్తూనే దొంగచాటు లావాదేవీలు జరిపేవారు అక్రమ ధన చలామణీకి పాల్పడతారు. దేశం నుంచి ధనరాశులు చట్టవిరుద్ధ మార్గాల్లో తరలిపోవడం భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు గొడ్డలిపెట్టు వంటిది. ఈ ధనంపై పన్నుల ఆదాయం రాదు కాబట్టి- ప్రజా సంక్షేమం కోసం వెచ్చించడానికి ప్రభుత్వాల వద్ద నిధులు లేకుండా పోతున్నాయి. అక్రమ ధనం ఉగ్రవాదుల కార్యకలాపాలకు, ఆయుధ కొనుగోళ్లకు, ఉపయోగపడుతోంది. మాఫియా ముఠాల విజృంభణకు తోడ్పడుతోంది. ఎన్నికల్లో అక్రమాలకు ఆజ్యం పోస్తోంది. అక్రమ ధన పరిమాణం ప్రపంచ జీడీపీలో అయిదు శాతం వరకు ఉంటుందని అంచనా. అది పేద దేశాలకు అందే ఆర్థిక సహాయంకన్నా 20 నుంచి 40 రెట్లు హెచ్చు. భారత్‌, చైనా, బ్రెజిల్‌ వంటి దేశాలే కాదు... అమెరికా, ఐరోపా, జపాన్‌ వంటి సంపన్న దేశాలూ అక్రమ ధన బెడదను ఎదుర్కొంటున్నాయి. అక్రమ ధనమంటే లూటీ అయిన ప్రజాధనమే. విదేశాలకు తరలిపోయిన అక్రమ ధనం చాలా సందర్భాల్లో పెట్టుబడుల రూపంలో మళ్ళీ స్వదేశానికి తిరిగివస్తోంది. ఎక్కువ మొత్తం వేరే దేశాల్లో చట్టబద్ధమైన వ్యాపారాల్లోకి ప్రవహిస్తోంది. దీనికి డొల్ల కంపెనీలు, ట్రస్టులు, పన్ను నుంచి మినహాయింపునిచ్చే దేశాల్లో బ్యాంకు ఖాతాలు, నగదు బహుమతులు, ప్రభుత్వ బాండ్లు, ప్రభుత్వాలు తరచూ ప్రకటించే క్షమాభిక్ష పథకాలు తోడ్పడుతున్నాయి. ఇలా స్వైర విహారం చేసే అవినీతిపరులు, నేరస్తులకు సామాజిక, రాజకీయ జవాబుదారీతనం ఉండదు. వారు రాజకీయ, ఆర్థిక వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకోవడం పౌరులకు, చట్టబద్ధ వ్యాపారాలకు ఎంతో నష్టదాయకంగా పరిణమిస్తోంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం 2019లో కొన్ని సవరణల ద్వారా పీఎంఎల్‌ఏ చట్ట నిబంధనలను మరింత కఠినతరం చేసింది. అయితే, ఎఫ్‌ఐఆర్‌ మాదిరిగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్‌ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఈసీఐఆర్‌)ను నిందితుడికి ఇవ్వనక్కర్లేదని, కేసులను వెనకటి తేదీ నుంచీ నమోదు చేయవచ్చని, ఎఫ్‌ఐఆర్‌ లేకుండానే సోదాలు, స్వాధీనాలు జరపవచ్చని కొన్ని నిబంధనలను ప్రవేశపెట్టడంపై విమర్శలు రేగుతున్నాయి. పోలీసుల ముందు చేసిన నేరం ఒప్పుకోలు ప్రకటనలకు కోర్టులో విలువ ఉండదు. కానీ, ఈడీ ముందు చేసిన ఒప్పుకోలు ప్రకటనలు మాత్రం కోర్టులో చెల్లుతాయనడంపైనా గగ్గోలు రేగింది. అయితే, ఈ సవరణలు రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు తేల్చింది.

భావి కార్యాచరణ ఏమిటి?

భారతదేశంలో అక్రమ ధన చలామణీ నేరం జరిగిన అయిదేళ్లకు కానీ దాన్ని గుర్తించలేకపోతున్నాం. డబ్బు ఆగమేఘాలపై ఎల్లలు దాటుతుంది కాబట్టి కేసుల దర్యాప్తు మరింత వేగంగా జరగాలని సుప్రీంకోర్టు సూచించింది. దర్యాప్తు పూర్తయి న్యాయస్థానాల ముందుకు వచ్చిన తరవాత- కేసుల భారం వల్ల కోర్టులు వీటి విచారణను త్వరగా పూర్తిచేయలేకపోతున్నాయి. దేశవిదేశాల్లో డబ్బు ప్రవాహ గతిని కనిపెట్టి, దర్యాప్తు సంస్థలు పరస్పర సహకార సమన్వయాలతో అక్రమ ధన చలామణీకి అడ్డుకట్ట వేయాలి. ఇతర దేశాలతో పరస్పర న్యాయసహాయ ఒప్పందాలు కుదుర్చుకోవాలి. కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ కక్ష సాధింపు సాధనాలుగా ఉపయోగిస్తున్నారనే అభిప్రాయాన్ని తొలగించేలా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నడుచుకోవాలి. 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ విదేశాల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని వెనక్కు రప్పిస్తానని మాట ఇచ్చారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగానైనా ఆయన తన మాట నిలబెట్టుకోవాలి. అందుకు ఈడీని సమర్థంగా, నిష్పాక్షికంగా ఉపయోగించాలి.

ప్రత్యర్థులను వేధించేందుకే...

గతంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థుల మీద సీబీఐని ప్రయోగిస్తోందంటూ ఆరోపణలు వచ్చేవి. 2015 నుంచి తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలు సీబీఐ దర్యాప్తునకు అనుమతి నిరాకరించాయి. సీబీఐ దర్యాప్తునకు ఒప్పుకోని రాష్ట్రాల్లో రాజకీయ ప్రత్యర్థులపై ఈడీని ప్రయోగిస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో ప్రభుత్వాల ఏర్పాటుకు ముందు ఈడీ ప్రతిపక్ష నాయకులను ప్రశ్నించింది. తాజాగా నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక ఆస్తుల కేసులో సోనియా, రాహుల్‌ గాంధీలపై ఈడీ గురిపెట్టింది. ఈడీ చిట్టాలో భారతీయ జనతా పార్టీవారు ఎవరూ లేకపోవడం గమనార్హం. ఇతర పార్టీల నుంచి భాజపాలో చేరినవారిపై ఉన్న కేసులను ఈడీ పక్కనపెట్టేస్తోంది. 2002 నుంచి ఈడీ మొత్తం 5,422 కేసులు నమోదు చేయగా, వాటిలో 98శాతం నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేళ్లలోనే నమోదయ్యాయి. అయితే, శిక్ష పడినవారు మాత్రం కేవలం 25 మంది. దీన్నిబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తన రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికే ఈడీని ఉసిగొల్పుతోందా అన్న ప్రశ్న తలెత్తుతోంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పెరగని పంట ఉత్పాదకత

‣ ఇంధన విపణిలో కొత్త భాగస్వామ్యాలు

‣ భారత వాణిజ్య రంగానికి ఆశాకిరణం

‣ పంటకాలువల నిర్వహణలో అశ్రద్ధ

Posted Date: 15-08-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం