• facebook
  • whatsapp
  • telegram

శాంతి జాడ ఎండమావే!

ఐరాస కార్యకలాపాలపై వ్యతిరేకత

 

 

కల్లోలిత దేశాల్లో శాంతిస్థాపనే లక్ష్యంగా ఐక్యరాజ్య సమితి చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. కొన్నిచోట్ల సంబంధిత కార్యకలాపాలు ఏళ్ల తరబడి కొనసాగుతుండటంతో స్థానికుల్లో అసంతృప్తి గూడుకట్టుకుంటోంది. తీవ్ర ఆగ్రహజ్వాలలూ వ్యక్తమవుతున్నాయి. మధ్య ఆఫ్రికా దేశమైన డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ది కాంగో(డీఆర్‌సీ)లో ఐరాస శాంతిపరిరక్షకుల మోహరింపును వ్యతిరేకిస్తూ ఇటీవల స్థానికులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. వాటిలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు శాంతిపరిరక్షకులు. అందులో ఇద్దరు మన దేశానికి చెందిన బీఎస్‌ఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుళ్లు. దేశంకాని దేశంలో వారు అమరులు కావడం దిగ్భ్రాంతి కలిగించింది. పశ్చిమాఫ్రికా దేశం మాలిలోనూ ఐరాస శాంతి కార్యక్రమంపై తీవ్ర వ్యతిరేకత తలెత్తింది. శాంతిపరిరక్షకుల మోహరింపుపై అక్కడి ప్రభుత్వమే నిరసన తెలుపుతోంది. ఈ క్రమంలో ఐరాస శాంతి కార్యకలాపాల చట్టబద్ధత, వాటి భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

 

ఆయా దేశాల్లో వేర్వేరు పక్షాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్నప్పుడు- పరిస్థితులను అదుపులో ఉంచడంకోసం ప్రత్యేక బృందాలతో కూడిన కార్యక్రమాలను భద్రతామండలి ప్రారంభిస్తుంటుంది. వాటి నిర్వహణ బాధ్యతను ఐరాస సచివాలయం చూసుకుంటుంది. దౌత్యమార్గాల్లో వైరిపక్షాల మధ్య సయోధ్య కుదర్చడం, కాల్పుల విరమణ వంటి ఒప్పందాలను పర్యవేక్షించడం వంటివి ఆ కార్యక్రమాల ప్రధాన కర్తవ్యాలు. శాంతికి విఘాతం కలిగించే ప్రభుత్వేతర సాయుధ శక్తుల ఆట కట్టించేందుకూ సంబంధిత బలగాలు దోహదపడతాయి. ఐరాస శాంతి కార్యక్రమాలు ప్రధానంగా మూడు సూత్రాల ఆధారంగా పనిచేస్తాయి. అవి- వైరిపక్షాలు లేదా ఆతిథ్య దేశాల సమ్మతి, నిష్పక్షపాతం, పరిమిత స్థాయిలో బలప్రయోగం. 1948 నుంచి ఇప్పటివరకు ఐరాస క్షేత్రస్థాయిలో 71 శాంతి కార్యక్రమాలు చేపట్టింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 13 కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వాటిలో సుమారు 81,820 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటివరకు 119 దేశాలు ఐరాస శాంతిపరిరక్షణకు తమ సిబ్బందిని పంపించాయి. 49 కార్యక్రమాల్లో భారతీయ సిబ్బంది సేవలందించారు. విధి నిర్వహణలో మన దేశానికి చెందిన 175 మంది శాంతిపరిరక్షకులు అమరులయ్యారు. ఐరాస సభ్యదేశాల్లో మరే దేశమూ ఇంతగా తన బలగాలను త్యాగం చేయలేదు.

 

అత్యంత విజయవంతమైనవిగా ఒకప్పుడు ప్రశంసలు పొందిన ఐరాస శాంతి కార్యక్రమాలు ఇటీవలి కాలంలో ప్రభావరహితంగా కనిపిస్తున్నాయి. కాంగోలో పదుల సంఖ్యలోని సాయుధ ముఠాలకు అడ్డుకట్ట వేసి, పౌరులకు భద్రత కల్పించాలన్న లక్ష్యంతో 1999లో ఐరాస కార్యక్రమం ప్రారంభమైంది. 2010లో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా 16 వేల మందికిపైగా సిబ్బందిని మోహరించారు. ఇన్నేళ్లు గడచినా ఆ దేశంలో పరిస్థితులు కుదుటపడలేదు. అత్యంత కీలకమైన ఎం23 అనే ముఠాకు ఐరాస కార్యక్రమం తొలినాళ్లలో మెరుగ్గానే అడ్డుకట్ట వేసినా... ఇటీవల దాని కార్యకలాపాలు బాగా పుంజుకొన్నాయి. భద్రత కరవై ప్రజలు వలసబాట పడుతున్నారు. ఏళ్ల తరబడి దేశంలోనే ఉంటున్నా, అత్యాధునిక ఆయుధ సామగ్రిని కలిగి ఉన్నా తమకు రక్షణ కల్పించలేకపోతుండటంతో- ఐరాస శాంతిపరిరక్షకులపై ప్రధానంగా తూర్పు కాంగోవాసుల్లో విశ్వాసం సన్నగిల్లింది. దీనికితోడు పేదరికంలో మగ్గుతున్న కాంగో మహిళలపై శాంతిపరిరక్షకులు లైంగిక దోపిడికి పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. దాంతో ఐరాస  కార్యక్రమానికి వ్యతిరేకంగా అక్కడ నిరసనలు తలెత్తాయి. మాలిలోనూ దాదాపుగా అదే పరిస్థితి నెలకొంది. అక్కడ 2020లో పాలనాపగ్గాలు దక్కించుకున్న సైనిక ప్రభుత్వం- ఐరాస కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తోంది. 2013లో ప్రారంభమైన ఆ ఆపరేషన్‌ వల్ల తమ దేశంలో హింస ఏమాత్రం తగ్గలేదని అది వాదిస్తోంది. మాలిలో శాంతిపరిరక్షక బలగాల కదలికలను వెంటనే నిలిపివేయాలని ఐరాసకు ఇటీవల స్పష్టం చేసింది కూడా.

 

ఐరాస ప్రత్యేక కార్యక్రమాలు విజయవంతం కావాలంటే స్థానిక ప్రభుత్వాలతోపాటు ప్రజల మద్దతు అత్యావశ్యకం. దాన్ని గుర్తించకుండా కేవలం స్థానిక సర్కార్ల సమ్మతితో- కాంగో, మాలి తదితరాల్లో సాయుధ ముఠాలపై పోరుకోసం శాంతిపరిరక్షకులను పంపారు. ఐరాస శాంతి కార్యక్రమాల ప్రాథమిక సిద్ధాంతాలకు అది విరుద్ధం. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వాల అనుమతి కంటే ప్రజల సమ్మతిని ప్రాధాన్యాంశంగా తీసుకోవాలి. తమకు వ్యతిరేకంగా పనిచేసే సాయుధ వర్గాలపై తీవ్రవాద, ఉగ్రవాద శక్తులుగా ప్రభుత్వాలు ముద్ర వేసి- శాంతిపరిరక్షకుల సహాయంతో వారిని అణచివేసేందుకు ప్రయత్నించే ముప్పుంది. ఆతిథ్య దేశాల్లోని ప్రభుత్వాల చేతుల్లో ఐరాస శాంతిపరిరక్షకులు ఆయుధాలుగా మారకూడదు. పూర్తిగా బలప్రయోగానికి దిగకుండా సాయుధ ముఠాలతో రాజకీయ సంప్రతింపులకూ మార్గాలు తెరిచి ఉంచాలి.

 

- ఎం.నవీన్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఈడీ... రాజకీయ అస్త్రమా?

‣ పెరగని పంట ఉత్పాదకత

‣ ఇంధన విపణిలో కొత్త భాగస్వామ్యాలు

‣ భారత వాణిజ్య రంగానికి ఆశాకిరణం

‣ పంటకాలువల నిర్వహణలో అశ్రద్ధ

Posted Date: 15-08-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం