• facebook
  • whatsapp
  • telegram

ఉగ్రవాద నిరోధం పేరిట కపటనాటకం

పాకిస్థాన్‌ కుటిల వ్యూహాలు

ఆర్థిక చర్యల లక్ష్య దళం (ఎఫ్‌ఏటీఎఫ్‌) జారీ చేసిన హెచ్చరిక జాబితా నుంచి వైదొలగడానికి పాకిస్థాన్‌ చేపడుతున్న చర్యలపై భారత ప్రభుత్వం దృష్టి సారించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఉగ్రవాద సంస్థలకు నిధుల ప్రవాహాన్ని అడ్డుకోవడం, మనీలాండరింగ్‌ను నిరోధించడమే ఎఫ్‌ఏటీఎఫ్‌ లక్ష్యాలు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దాయాది దేశం 2018 నుంచి ఈ హెచ్చరిక జాబితా(గ్రే లిస్ట్‌)లో కొనసాగుతోంది. 2008 నుంచి 2012 వరకు ఇదే స్థితిలో ఉండేది. గతంలో జాబితాలో కొనసాగిన ఫలితంగా పాకిస్థాన్‌ భారీ నష్టాన్ని చవిచూసింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంకు వంటి ఆర్థిక సంస్థలు ఎఫ్‌ఏటీఎఫ్‌కు అనుబంధంగా ఉన్నందువల్ల అంతర్జాతీయ రుణాలను పొందడంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంది. ఉగ్రవాద సమూహాలతో సంబంధాలున్న వ్యక్తుల ఆస్తుల జప్తు, ఆ సంస్థల ఆర్థిక వనరులపై నిరంతర విచారణ, ఎఫ్‌ఏటీఎఫ్‌ సూచించిన చర్యలను అమలు చేయడం, ఐరాస పేర్కొన్న సంస్థల అగ్రనాయకులు, కమాండర్లను అదుపులోకి తీసుకోవడం వంటి చర్యల ద్వారా ఆ దేశం ఈ జాబితా నుంచి వైదొలగడానికి అవకాశం ఉంది. అయితే, సీమాంతర ఉగ్రవాద నిరోధక చర్యలు చేపట్టడంలో పాక్‌ చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని భారత్‌ భావిస్తోంది.

డ్రాగన్‌ చేయూత

పశ్చిమ దేశాలు, అమెరికాతో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ఎఫ్‌ఏటీఎఫ్‌ హెచ్చరిక జాబితా నుంచి వైదొలగాల్సిన అవసరం పాక్‌కు ఉంది. పాకిస్థాన్‌తో ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలున్న చైనా ఇందుకోసం దౌత్యపరంగా ప్రయత్నిస్తోంది. ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక వనరులు అందకుండా చేయడానికి 27 అంశాల కార్యాచరణ ప్రణాళికను 2018లో ఎఫ్‌ఏటీఎఫ్‌ పాక్‌కు అందజేసింది. ఇందులోని 26 అంశాలను పూర్తి చేసిన తరవాత- 2021లో మనీలాండరింగ్‌ను అరికట్టడానికి మరో ఏడు అంశాలతో కార్యాచరణ ప్రణాళికను అందించింది. 2022 జూన్‌లో బెర్లిన్‌లో జరిగిన ప్లీనరీలో- పాకిస్థాన్‌ తీసుకుంటున్న చర్యలపై ఎఫ్‌ఏటీఎఫ్‌ సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఉగ్ర బృందాలకు ఆర్థిక సాయాన్ని నిరోధించడంలో సఫలమైనట్లు నిజనిర్ధారణ బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తరవాత హెచ్చరిక జాబితా నుంచి తొలగించవచ్చని పేర్కొంది. ఐరాస నిషేధించిన లష్కరే తొయిబా, జైషే మహ్మద్‌, అల్‌ఖైదా, హక్కానీ నెట్వర్క్‌, జమాత్‌ ఉద్‌ దవా, ఫలాహ్‌-ఇ- ఇన్సానియత్‌ ఫౌండేషన్‌, ఇస్లామిక్‌ స్టేట్‌లకు ఆర్థిక సాయం అందడాన్ని నిరోధించిందని నిర్ధారించడానికి నిపుణుల బృందాన్ని క్షేత్రస్థాయి పరిశీలనకు పంపించాలని నిర్ణయించింది. ప్రస్తుతానికి క్షేత్రస్థాయి పర్యటన చేపట్టలేదు. ఈ జాబితా నుంచి బయటపడిన వెనువెంటనే ఆర్థిక ప్రయోజనాలు పొందలేకపోయినా, క్రమంగా ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ), ఐరోపా సమాఖ్య (ఈయూ)ల నుంచి ఆర్థిక సాయం లభించే అవకాశముంది. ఇది పాక్‌ ఆర్థిక వ్యవస్థ మెరుగు పడటానికి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ద్రవ్యమారక నిల్వలు పెరగడానికి ఉపకరిస్తుంది.

ఉగ్రసంస్థలకు ఆర్థిక సాయాన్ని నిరోధించడంలో పాకిస్థాన్‌ తీసుకుంటున్న చర్యలు సందేహాస్పదంగా ఉన్నందువల్ల రానున్న అక్టోబరు వరకు హెచ్చరిక జాబితా నుంచి తొలగే అవకాశం లేదని భారతదేశం భావిస్తోంది. ఉగ్రవాదం నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలని 2018 నుంచే పాకిస్థాన్‌పై తీవ్ర ఒత్తిడి వస్తున్నా- 2008 నాటి ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ను 2022 ఏప్రిల్‌లో అరెస్టు చేసింది. ఆ దాడుల నిర్వాహకుడు సాజిద్‌ మజీద్‌ మీర్‌ చనిపోయినట్లు తొలుత ప్రకటించి, అతన్ని 2022 ఏప్రిల్‌ 21న అరెస్టు చేసి, మే నెల 16న దోషిగా నిర్ధారించింది. ఈ దాడుల కమాండర్‌ జాకీర్‌ రెహ్మాన్‌ లఖ్వీ, ఎల్‌ఈటీ మిలిటెంట్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌ మక్కీలను కూడా అరెస్టు చేసింది. అక్రమ చొరబాట్లు, ఆయుధాలు, అత్యాధునిక పేలుడు పరికరాలను జమ్మూకశ్మీర్‌లోకి పంపిస్తున్నందు వల్ల ఉగ్రవాద నిరోధంపై పాక్‌ నిబద్ధతను భారత్‌ సందేహిస్తోంది. 2022 జులై 16న ఎల్‌ఈటీకి చెందిన మూడు బృందాలను పోలీసులు పట్టుకొని, ఏడుగురిని అరెస్టు చేశారు. పాకిస్థాన్‌ నుంచి 20 డ్రోన్ల ద్వారా జారవిడిచిన భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. జులై 22న ఇండో-పాక్‌ అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్‌ డ్రోన్‌ను సరిహద్దు భద్రతా దళం గుర్తించి కాల్పులు జరిపింది. ఎఫ్‌ఏటీఎఫ్‌ హెచ్చరిక జాబితా నుంచి వైదొలగడానికి ప్రయత్నిస్తూనే ఉగ్రవాద సంస్థలకు తోడ్పాటు అందిస్తున్న పాక్‌- భవిష్యత్తులో సరిహద్దులో అలజడులను తీవ్రతరం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నిలువరించడమే కీలకం

ఐరాసలో అమెరికా విదేశాంగ కార్యదర్శి బ్లింకెన్‌తో పాక్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో మే నెలలో సమావేశమైన తరవాత హెచ్చరిక జాబితా నుంచి తొలగించే చర్యలు ఊపందుకున్నాయి. ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభంలో భారత వైఖరి మింగుడుపడని అమెరికా- ఉపఖండంలో కొన్ని అంశాల్లో పాక్‌ ద్వారా ఇండియాపై ఒత్తిడి తేవడానికి చేస్తున్న ప్రయత్నంగా దీన్ని భావించాల్సి వస్తోంది. పాక్‌ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా 2023 ఫిబ్రవరి వరకు ఎఫ్‌ఏటీఎఫ్‌ హెచ్చరిక జాబితా నుంచి బయటపడకపోవచ్చు. ఎఫ్‌ఏటీఎఫ్‌ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయితే ఆ దేశానికి మార్గం సుగమమవుతుంది. 2023 అక్టోబరులో ప్యారిస్‌లో జరిగే ప్లీనరీలోనే పాక్‌ను హెచ్చరిక జాబితా నుంచి తొలగించాలా, లేదా అనేది నిర్ణయించే అవకాశం ఉంది. వివిధ మార్గాల ద్వారా ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దాయాది దేశాన్ని నిలువరించడానికి ఇండియా తన ప్రయత్నాలను ముమ్మరం చేయాలి. పాక్‌ తీసుకున్న ప్రస్తుత చర్యలు శాశ్వతంగా ఉండాలని, కంటి తుడుపు చర్యలు కావని అమెరికా, పాశ్చాత్య దేశాల నుంచి హామీ పొందాలి. కశ్మీర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో పాక్‌ ప్రాయోజిత ఉగ్రవాద చర్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఉగ్రచర్యలు పెచ్చరిల్లకుండా ఇండియా తన భద్రతా సంస్థలను అప్రమత్తం చేయాల్సిన అవసరముంది.

ఆర్థిక చర్యల తీరిలా...

ఎఫ్‌ఏటీఎఫ్‌ అంటే?

హవాలా విధానంలో ద్రవ్య సరఫరా, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం నిరోధానికి ప్యారిస్‌ కేంద్రంగా ఆర్థిక చర్యల లక్ష్య దళం (ఎఫ్‌ఏటీఎఫ్‌) ఏర్పాటైంది. ఇందులో ప్రస్తుతం 37 దేశాలు, ఐరోపా కమిషన్‌, గల్ఫ్‌ సహకార మండలి సభ్యులుగా ఉన్నాయి. ఈ సంస్థ కార్యకలాపాల పర్యవేక్షణ, పరిశీలనకు 31 అంతర్జాతీయ, ప్రాంతీయ సంస్థలు ఉన్నాయి. 2010లో భారత్‌ ఇందులో సభ్యత్వం పొందింది.

హెచ్చరిక జాబితా?

మనీ లాండరింగ్‌, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయాన్ని నిరోధించే చర్యలపై ఒక దేశాన్ని అధిక పర్యవేక్షణలో ఉంచడానికి ఎఫ్‌ఏటీఎఫ్‌ హెచ్చరిక జాబితా (గ్రే లిస్ట్‌)లో ఆ దేశాన్ని చేరుస్తుంది. అనంతరం కొన్ని కార్యాచరణ ప్రణాళికలను అందించి, వాటి అమలు తీరును పర్యవేక్షిస్తుంది. ఈ జాబితాలో ఉన్న దేశం కార్యాచరణ ప్రణాళికల అమలులో విఫలమైతే దాన్ని నిషేధిత జాబితా (బ్లాక్‌ లిస్ట్‌)లో చేరుస్తుంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఘనవ్యర్థాల విషవలయంలో పర్యావరణం

‣ అడుగడుగునా ఆంక్షల అడ్డంకి

‣ వరద విధ్వంసం... అభివృద్ధికి విఘాతం

‣ భారత్‌ - రష్యాల వాణిజ్య వృద్ధి

Posted Date: 19-08-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం