• facebook
  • whatsapp
  • telegram

ఘనవ్యర్థాల విషవలయంలో పర్యావరణం

సమర్థ నిర్వహణే సమస్యకు పరిష్కారం

రెండు దశాబ్దాలుగా ఘన వ్యర్థాల సమస్య పెనుభూతమై బెంబేలెత్తిస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలు ఏటా పలురకాల పథకాలు ప్రకటిస్తున్నా- ఆచరణలో ఏ మాత్రం ప్రభావం కనిపించడం లేదు. ఘన వ్యర్థాలను రూపుమాపాలన్న దృఢ సంకల్పం కొరవడుతోంది. రోజురోజుకీ తీవ్రమవుతున్న ప్లాస్టిక్‌, ఎలెక్ట్రానిక్స్‌ తదితర ఘన వ్యర్థాలు మానవ ఆరోగ్యానికి, పర్యావరణ సంరక్షణకు పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. ప్లాస్టిక్‌, ఎలెక్ట్రానిక్స్‌ వ్యర్థాలకు ఆస్పత్రులు, గృహ వ్యర్థాలు తోడై- వాటి సేకరణ, శుద్ధి, నిర్మూలన అలవికాని సవాళ్లుగా పరిణమిస్తున్నాయి. వలసలతో విస్తరిస్తున్న పట్టణాలు, జీవన శైలిలో వచ్చిన మార్పులు, వస్తు వ్యామోహం, వినియోగ సంస్కృతి ఘన వ్యర్థాలు కొండల్లా పేరుకుపోవడానికి కారణమవుతున్నాయి. మామూలుగా అన్ని రకాల సమస్యలనూ కప్పిపెట్టే ప్రభుత్వాలు సైతం ఘన వ్యర్థాల సమస్యపై తీవ్ర స్థాయిలో దృష్టి సారించక తప్పని అనివార్యత ఏర్పడింది.

చెత్త విశ్వరూపం

మానవులు నేల మీద, కాలువలు, చెరువులు, నదుల్లో పారేస్తున్న చెత్తలో 80 శాతం సముద్రాల్లోకి చేరిపోతూ జలాలను కలుషితం చేస్తూ, జలచరాలకు ప్రాణగండం తెచ్చిపెడుతోంది. ప్రస్తుతం ప్రపంచం ఏడాదికి 40 కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ చెత్తను విడుదల చేస్తోందని, ఇది 2040కల్లా మూడు రెట్లు పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి పర్యావరణ రక్షణ సంస్థ అంచనా వేసింది. ప్రపంచంలో నిమిషానికి 10 లక్షల ప్లాస్టిక్‌ సీసాలను, ఏడాదికి అయిదు లక్షల కోట్ల ప్లాస్టిక్‌ సంచులను వాడుతున్నారు. వీటిలో సగం ఒక్కసారి వాడి పారేసే సంచులే. వీటిలో 85 శాతాన్ని చెత్తకు నిర్దేశించిన కేంద్రాల్లో పారేస్తున్నారు. మొత్తం ప్లాస్టిక్‌లలో 10 శాతాన్ని మాత్రమే పునర్వినియోగానికి పనికొచ్చేలా (రీసైక్లింగ్‌) చేయగలుగుతున్నారు. భారత్‌లోని పురపాలక సంఘాల పరిధిలో 2019-20లో రోజుకు సుమారు లక్షన్నర టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పన్నమయ్యాయి. మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌, పశ్చిమ్‌ బెంగాల్‌, తమిళనాడు, కర్ణాటక, దిల్లీ వంటి రాష్ట్రాలు ఘన వ్యర్థాలను అత్యధికంగా ఉత్పత్తి చేసినట్లు తేలింది. భారతదేశంలో ప్రతిరోజూ వెలువడే పురపాలక ఘన వ్యర్థాల్లో 60 శాతం వరకూ ఈ ఆరు రాష్ట్రాలే కీలకంగా నిలుస్తున్నాయి. పురపాలికల పరిధిలో ఉత్పత్తయ్యే చెత్తలో మూడోవంతును మాత్రమే శుద్ధి చేసి పునర్వినియోగానికి పనికొచ్చేలా మారుస్తున్నారు. 40 శాతం ఘన వ్యర్ధాలను డంపింగ్‌ యార్డ్‌ గోతుల్లోకి విసిరేస్తున్నారు. దేశంలో ఉత్పత్తయ్యే అన్ని రకాల ఘన వ్యర్థాలు 2031లో 16.5 కోట్ల టన్నులకు, 2050లో 43.6 కోట్ల టన్నులకు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం లెక్కకట్టింది. భారత్‌ ఇప్పటికే 20 లక్షల టన్నుల అత్యంత ప్రమాదకరమైన ఎలెక్ట్రానిక్‌ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుండటం ఆందోళనకరం.

దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నుంచి 88 శాతం, పట్టణాల్లో 24 శాతం ఘన చెత్తను సేకరించడమే లేదు. దాంతో చెత్తాచెదారాన్ని ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారు. ప్రైవేటు స్థలాలకూ ఈ బెడద తప్పడం లేదు. స్థానిక సంస్థలు ప్రజల నుంచి చెత్త పన్నును వసూలు చేస్తున్నా ఆ నిధులను వ్యర్థాల సేకరణ, పునర్వినియోగానికి వెచ్చించడం లేదు. దేశంలో చెత్తను శుద్ధి చేసి, పునర్వినియోగానికి పనికొచ్చేలా మార్చే కర్మాగారాలను నెలకొల్పినా- వాటిని సరిగా ఉపయోగించడం లేదు. ప్రమాదకరమైన వ్యర్థాలను వెలువరించే పరిశ్రమలు భారత్‌లో 69 వేల వరకు ఉన్నాయి. ఇవన్నీ కలిసి 2020లో 87.82 లక్షల టన్నుల ప్రమాదకర వ్యర్థాలను ఉత్పత్తి చేశాయి. వాటిని శుద్ధి చేయడానికి అనుమతి పొందిన పరిశ్రమలు 2,111 ఉన్నాయి. ఏడాదికి 79.65 లక్షల టన్నుల వ్యర్థాలను శుద్ధి చేసే సామర్థ్యం వాటికి ఉన్నా... 12.95 లక్షల టన్నులను మాత్రమే శుద్ధి చేశాయి. వ్యర్థాలను పంట కాలువల్లోకి సైతం యథేచ్ఛగా విడుదల చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు కూడా ఈ దారుణానికి పాల్పడుతున్నాయి. ఇలాంటి కలుషిత జలాలను కాలువల పక్కన నివసించేవారు తాగుతున్నారు. తాగునీటిని కలుషితం కానివ్వరాదని సుప్రీంకోర్టు, హైకోర్టులు తీర్పులు ఇచ్చినా, ప్రభుత్వాలు వాటిని అమలు చేయడం లేదు. 

జనచైతన్యం కీలకం

ఘన వ్యర్థాలు, కలుషిత జలాల శుద్ధి, పునర్వినియోగానికి ప్రభుత్వాలు మరింతగా నిధులు కేటాయించాలి. ప్రైవేటు సంస్థలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదు. 2016 ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ నిబంధనల్లో సెక్షన్‌-6 ప్రకారం ప్లాస్టిక్‌ చెత్త సేకరణ, శుద్ధి, నిర్మూలన కార్యక్రమాలను నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్రాలు, స్థానిక సంస్థలదే. ఈ కార్యక్రమాన్ని అవి స్వయంగా కాని, ఇతర సంస్థలను వినియోగించి కాని నిర్వహించవచ్చు. కానీ, ఈ పని సక్రమంగా జరగడం లేదు. పురపాలక సంఘాల పరిధిలో వెలువడే ఘన వ్యర్థాల్లో 50 నుంచి 55 శాతాన్ని మళ్ళీ వినియోగానికి పనికివచ్చేలా చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వ్యర్థాల శుద్ధి, పునర్వినియోగ కర్మాగారాలను అనవసరమైన చోట్ల నిర్మించడం, వాటికి సంస్థాగతంగా సహాయ సహకారాలు అందించకపోవడం వంటి సమస్యల కారణంగా ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదని పార్లమెంటరీ స్థాయీసంఘం స్పష్టం చేసింది. ఇటువంటి లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉంది. అనేక సంపన్న దేశాల్లో 100 శాతం ఘన వ్యర్థాలను శుద్ధి చేస్తున్నారు. భారత్‌ కూడా ఆ స్థాయిని అందుకోవాలి. మన దేశంలో, ముఖ్యంగా పట్టణాల్లో సైతం ఘన వ్యర్థాలను తడి, పొడి చెత్తగా విభజించి సేకరించే పని సక్రమంగా జరగడం లేదు. మహానగరాల్లో పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నా, చిన్న పట్టణాలకు వచ్చేసరికి అంతులేని నిర్లక్ష్యం తాండవిస్తోంది. ఫలితంగా గోతుల్లోకి విసిరేసిన చెత్త- దీర్ఘకాలంలో విషపూరిత వాయువులను, ఇతర హానికర రసాయనాలను వాతావరణంలోకి, నేలలోకి విడుదల చేస్తోంది. తీవ్ర కాలుష్యానికి కారణమవుతోంది. ఈ అంశాలపై జన చైతన్యం పెంచాలి. ప్రభుత్వాలు చెత్త సేకరణ, శుద్ధి బాధ్యతను ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు అప్పజెప్పి చేతులు దులిపేసుకొంటే కుదరదు. వివేకంగా పెట్టుబడి పెట్టి సమర్థంగా వ్యర్థాల నిర్మూలన, పునర్వినియోగాలను చేపట్టాలి.

జీవజాలానికి హాని

ప్లాస్టిక్‌ పూర్తిగా మట్టిలో కలిసిపోవడానికి 500 నుంచి 1000 ఏళ్ల వరకు పడుతుంది. అదే కాగితమైతే ఆరు వారాల నుంచి ఏడాది కాలంలో మట్టిలో కలిసిపోతుంది. సిగరెట్‌ ఫిల్టర్లు నశించిపోవడానికి ఏడాది నుంచి పదేళ్ల వరకు పడుతుంది. అల్యూమినియం డబ్బా పూర్తిగా శిథిలం కావడానికి 40 నుంచి 100 ఏళ్లు పడితే, వాడేసిన బ్యాటరీకి 500 నుంచి 1000 సంవత్సరాలు పడుతుంది. నేలలో, నీటిలో కలిసిన ప్లాస్టిక్‌ రేణువులు పంటలు, పశువులు, చేపల్లోకి చేరిపోతూ ఆహారాన్ని కలుషితంగా మారుస్తున్నాయి. ఫలితంగా మనుషులతోపాటు ఇతర జీవులకూ హాని వాటిల్లుతోంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అడుగడుగునా ఆంక్షల అడ్డంకి

‣ వరద విధ్వంసం... అభివృద్ధికి విఘాతం

‣ భారత్‌ - రష్యాల వాణిజ్య వృద్ధి

‣ ఆరోగ్య సిరులు చిరుధాన్యాలు

‣ భవిష్యత్తుపై కోటి ఆశలతో...

‣ శాంతి జాడ ఎండమావే!

‣ ఈడీ... రాజకీయ అస్త్రమా?

Posted Date: 19-08-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం