• facebook
  • whatsapp
  • telegram

ద్వంద్వ ప్రమాణాలపై భారత్‌ గళం

ఉగ్రవాదంపై సమష్టి పోరు కీలకం

‘ఐరోపా బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచం బాధ మాత్రం ఐరోపాది కాదు అన్నట్లు ఉంటుంది వారి ధోరణి’- భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ వ్యంగ్య విమర్శ ఇది. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధంలో భారత్‌ అనుసరిస్తున్న తటస్థ వైఖరిని పాశ్చాత్య దేశాలు ఖండించడాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలపై అమెరికా, ఐరోపాలతోపాటు ఐక్యరాజ్యసమితి వైఖరి భిన్నమేమీ కాదు. పాశ్చాత్య దేశాలు మొదటి నుంచీ తమకు ప్రమాదం తెచ్చిపెట్టే అల్‌ఖైదా, ఇస్లామిక్‌ స్టేట్‌ వంటి గ్రూపుల గురించే మథనపడుతున్నాయి. భారత్‌పై నిత్యం తుపాకీ ఎక్కుపెట్టే లష్కరే తొయిబా, జైషే మహమ్మద్‌ల గురించి పట్టించుకోవడం లేదు. ఇటీవలి కాలంలో మాత్రం భద్రతామండలి ఆంక్షల కమిటీలో పాక్‌ ప్రేరేపిత గ్రూపులపై చర్యకు భారత్‌ డిమాండ్‌ను అమెరికా సమర్థిస్తోంది. జూన్‌లో లష్కరే తొయిబా ఉప నాయకుడు అబ్దుల్‌ రహమాన్‌ మక్కీని, ఆగస్టులో జైషే మహమ్మద్‌ అధిపతి మసూద్‌ అజహర్‌ సోదరుడు అబ్దుల్‌ రవూఫ్‌ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటింపజేయాలని భారత్‌, అమెరికాలు ప్రయత్నించాయి. ఆ యత్నాలకు చైనా గండి కొట్టింది. అబ్దుల్‌ రపూఫ్‌ అజహర్‌ 1999లో ఇండియన్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానం హైజాక్‌, 2001లో భారత పార్లమెంటుపై దాడి, 2016లో పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై దాడి వంటి ఉగ్ర చర్యలకు సూత్రధారి. లష్కర్‌ నేత మక్కీ 26/11 ముంబయిపై ఉగ్రదాడి, 2000 డిసెంబరులో ఎర్రకోటపై దాడితోపాటు జమ్మూకశ్మీర్‌లో అనేక ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించాడు. వారిని అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించాలనే ప్రతిపాదనను సాంకేతిక కారణాలు చూపుతూ చైనా అడ్డుకుంది.

ఐరాస ప్రధాన కార్యదర్శి తాజా నివేదికా ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌, లెవాంట్‌-ఖొరసాన్‌ (ఐసిల్‌-కె) ఉగ్రసంస్థ వల్ల మధ్యాసియా, దక్షిణాసియాలకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించినా పాక్‌ అండతో భారత్‌పై గురిపెట్టిన ఉగ్రసంస్థల గురించి పట్టించుకోలేదు. దీన్ని ఐరాసలో భారత ప్రతినిధి రుచిరా కంబోజ్‌ తప్పుపట్టారు. ఐసిల్‌, అల్‌ఖైదా, వాటి అనుబంధ సంస్థలు ఆఫ్రికాలోనూ బలపడుతూ స్త్రీలు, పిల్లలు, ఐరాస శాంతిసేనలపై దాడులకు తెగబడుతున్నాయన్నారు. ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఒక్కతాటిపై నిలబడాలి తప్ప కొన్ని సంస్థలను నిషేధించి, మిగతా వాటిని వదిలేయడం సరికాదని స్పష్టం చేశారు. ఉగ్రవాద చర్యలతో అంతర్జాతీయ శాంతి సుస్థిరతలకు వాటిల్లుతున్న ప్రమాదం అనే అంశంపై సమితి భద్రతా మండలి సమావేశంలో రుచిర ప్రసంగించారు. కొన్ని సంస్థలు, వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటించి ఆంక్షలు విధిస్తున్న భద్రతామండలి అదే ప్రమాణాన్ని ఇతరులకు వర్తింపజేయడం లేదన్నారు. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు, కుటిల రాజకీయాలు భద్రతా మండలి ఆంక్షలకు విలువ లేకుండా చేస్తున్నాయని రుచిర విమర్శించారు. దావూద్‌ ఇబ్రహీం పేరును నేరుగా ప్రస్తావించకుండా- భారత్‌లో విధ్వంసాలకు, నేరాలకు పాల్పడినవారికి పొరుగు దేశం ఆశ్రయమిస్తున్నా ప్రపంచ దేశాలు పట్టించుకోవడం లేదన్నారు. ఇలాంటి పరిణామాలను అడ్డుకోకపోవడం వల్ల భద్రతా మండలి విశ్వసనీయత క్షీణించిందన్నారు.

అఫ్గాన్‌ నుంచి అమెరికా సేనలు నిష్క్రమించినది మొదలు ఉగ్రవాదంపై అంతర్జాతీయ పోరు నీరుగారిపోయింది. అల్‌ఖైదా నాయకుడు అల్‌ జవహరీ ఇటీవల అమెరికా దాడిలో హతమారిపోవడం ఉగ్రవాదంపై పోరును బలహీనపరచవచ్చు. ఈ దాడి తాలిబన్ల హయాములో జరగడం, భారత్‌తో పాటు మరికొన్ని దేశాలు తాలిబన్‌ సర్కారుతో దౌత్య సంబంధాలను ప్రారంభించడం పరిస్థితిలో గుణాత్మక మార్పును తీసుకురావచ్చు. ఆగస్టు నెల వరకు తాత్కాలికంగా భద్రతా మండలి అధ్యక్ష పదవిని నిర్వహిస్తున్న చైనాను మక్కీ, అజహర్‌లపై చర్యలకు ఒప్పిద్దామన్నా లద్దాఖ్‌ సరిహద్దులో ఉద్రిక్తతలు ఆ ప్రయత్నానికి అడ్డుపడవచ్చు. మక్కీ, అజహర్‌లను అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించాలని అమెరికా, భారత్‌ ఉమ్మడిగా ప్రతిపాదించడం చైనాకు మింగుడుపడటం లేదనుకోవాలి. చైనాపై అంతర్జాతీయ ఒత్తిడి తీసుకురావాలన్నా పరిస్థితి అనుకూలంగా లేదు. ఉక్రెయిన్‌, తైవాన్‌ సంక్షోభాలు, ఆహార, ఇంధన కొరతల మీద దృష్టి కేంద్రీకరించిన ప్రపంచానికి, కొద్దిమందిని అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించడం గురించి పట్టించుకునే తీరిక ఉండకపోవచ్చు. ఐరాస భద్రతా మండలిలోని మొత్తం 15 సభ్య దేశాల్లో ఒక్క చైనా తప్ప మిగిలిన 14 దేశాలు భారత్‌-అమెరికా సంయుక్త ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. భద్రతా మండలి తీర్మానాన్ని ఒక్క దేశం సమ్మతించకపోయినంత మాత్రాన మొత్తంగా బుట్టదాఖలు చేయడం సబబు కాదు. ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోకుండా ఐరాస నిబంధనలను సవరించేందుకు భారత్‌ కృషి చేయాలి.

- ఆర్య
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ తీర ప్రాంతాలు అతలాకుతలం

‣ ఉగ్రవాద నిరోధం పేరిట కపటనాటకం

‣ ఘనవ్యర్థాల విషవలయంలో పర్యావరణం

‣ అడుగడుగునా ఆంక్షల అడ్డంకి

‣ వరద విధ్వంసం... అభివృద్ధికి విఘాతం

‣ భారత్‌ - రష్యాల వాణిజ్య వృద్ధి

Posted Date: 22-08-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం