• facebook
  • whatsapp
  • telegram

లింగ సమానత్వం... ప్రగతికి మార్గం!

మహిళలపై దుర్విచక్షణ దేశానికి చేటు

మహిళలను అవమానించే కుసంస్కారం కొంతమందిని అప్పుడప్పుడూ ఆవహిస్తోంది. ఇకపై దాన్ని పూర్తిగా వదిలేయాలి. స్త్రీల గౌరవానికి భంగం కలిగే ఒక్కమాట కూడా మాట్లాడకూడదు - ప్రధాని నరేంద్ర మోదీ

ఒక దేశ పురోగతిని ప్రభావితం చేసే అంశాల్లో లింగ సమానత్వం ముఖ్యమైంది. మానవ వనరుల్లో సగభాగమైన మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్న దేశాలు ఆర్థికంగానే కాకుండా సంతృప్తి సూచీలోనూ అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. లింగ దుర్విచక్షణ కనబరుస్తున్న దేశాలు చతికిలపడుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వేదిక నివేదిక-2022 ప్రకారం లింగ సమానత్వ సూచీలో భారత్‌ 146 దేశాల్లో 135వ స్థానంలో నిలిచి అపఖ్యాతిని మూటగట్టుకుంది. స్త్రీ పురుషుల సమానత్వ మదింపు కోసం నిర్దేశించిన నాలుగు అంశాల్లో అవకాశాలు, ఆర్థిక భాగస్వామ్యంలో 143, రాజకీయ సాధికారత, అధికారంలో 48, విద్యాభ్యాసంలో 107వ స్థానంలో నిలిచిన భారత్‌కు మనుగడ, వైద్యంలో అట్టడుగున 146వ స్థానం దక్కింది. సమానత్వ సూచీలో 135వ స్థానంలో ఉన్న భారత్‌ వెనక కేవలం 11 దేశాలు మాత్రమే ఉండటం మన వెనకబాటుతనాన్ని సూచిస్తోంది. బంగ్లాదేశ్‌, నేపాల్‌ వంటి చిన్న దేశాలు సైతం స్త్రీ, పురుష సమానత్వంలో మార్గదర్శకంగా వ్యవహరిస్తున్నాయి.

సంకుచిత స్వభావం

లింగ సమానత్వం దేశ గుణాత్మక వికాసానికి సంకేతం. సంకుచిత స్వభావాన్ని అధిగమించి ఉన్నతంగా ఆలోచించలేని బలహీన వ్యవస్థలో నేటికీ మహిళలకు నిజమైన గౌరవం దక్కడం లేదు. సెలవు అనేదే లేకుండా జీవితాంతం శ్రమించాల్సిన ఇంటిపని బాధ్యతలకు ద్వితీయశ్రేణి ప్రాధాన్యం ఇచ్చి, వాటిని ఆడవారికి కట్టబెట్టడం నిస్సందేహంగా తప్పిదమే. వంటపని చేసే మగవారిని చిన్నచూపు చూసే వ్యవస్థ పాకశాస్త్ర నైపుణ్యంలో నలభీముల ఖ్యాతిని చూసి మురిసిపోవడం విడ్డూరం! సామాజిక పురోభివృద్ధిలో పురుషులతో సమానంగా బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళలను అభినందించడం మాని లింగ దుర్విచక్షణ ప్రదర్శించడం ఆమోదయోగ్యం కాదు. పెంపకంలో అబ్బాయిలు, అమ్మాయిలనే తేడాలు, బాలికలను మించి మగపిల్లలకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి పోకడలు- వేళ్లూనుకున్న లింగ దుర్విచక్షణకు నిలువెత్తు నిదర్శనాలు. ఉద్యోగినుల పట్ల చిన్నచూపు, బాధ్యతల పేరిట మానసిక క్షోభను మహిళలు సముద్రమంతటి సహనంతో భరిస్తున్నారు. ఉపాధి సంస్థలు, రహదారులు, వాహనాలు, బహిరంగ ప్రదేశాల్లో లైంగిక హింసను ఎదుర్కోవడం వారికి జీవితకాల శిక్షగా పరిణమిస్తోంది.

వ్యక్తుల జీవించే హక్కును గౌరవిస్తూ ఆడ, మగ అనే భేదం లేకుండా అందరికీ వికాస అవకాశాలు దక్కే పరిస్థితులను కల్పించడమే లింగ సమానత్వం. ప్రత్యేక అవసరాలు, మినహాయింపులను పరిగణించడం కూడా లింగ సమానత్వంలో అంతర్భాగం. దుర్విచక్షణ లేని సమాజ నిర్మాణం కుటుంబంతోనే మొదలు కావాలి. స్త్రీలను చిన్నచూపు చూసే సమాజంలో తనకు ఆడబిడ్డ వద్దని భీతిల్లకుండా- మహిళలందరి పట్ల గౌరవంతో మెలగాలని దంపతులు తీర్మానించుకున్నప్పుడే లింగ సమానత్వానికి బీజం పడుతుంది. అమ్మాయిలు, అబ్బాయిలనే వ్యత్యాసాలు చూపకుండా అందరికీ ప్రాధాన్యం ఇచ్చినప్పుడు పిల్లల్లో ఎక్కువ, తక్కువనే భావనలు కలగవు.

సాధికారతే ధ్యేయం కావాలి

‘వాడు మగాడు, నువ్వు ఆడపిల్లవు’ అంటూ తేడాచూపే తల్లిదండ్రులందరూ దుర్విచక్షణకు ఆజ్యం పోస్తున్న ప్రగతి నిరోధకులే! ఆడపిల్లల చేష్టలు, మగపిల్లల పనులంటూ ముద్ర వేయకుండా అంగీకార యోగ్యతను బట్టి వ్యవహారాల దక్షతను నిర్ణయించాలని విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు నూరిపోయాలి. సమర్థత, నైపుణ్యాలతో దుర్విచక్షణను కట్టడి చేయవచ్చని విద్యార్థులకు తెలిసిరావాలి. సీసీ కెమెరాలు, క్రమశిక్షణాయుత నిబంధనల ద్వారా వ్యాపార కేంద్రాలు మహిళల గౌరవానికి ఊతమివ్వాలి. కార్యాలయాల్లో ఆడవారిపై పెత్తనం చలాయించే స్వభావానికి తెర పడాల్సిందే. ఆడవారు మగవాడి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే నిస్సహాయులనే సత్యదూర అభిప్రాయాన్ని సినిమాలు, టీవీలు, మీడియా వ్యాపింపజేయడం గర్హనీయం. ‘పురుషులు మాత్రమే’ అనే భ్రమలు తొలగించి స్త్రీల సమర్థతను నిరూపిస్తున్న ఉదంతాలు అనేకం ఉన్నా- చలన చిత్రాల్లోని నృత్యాల అనుకరణ, అవహేళన సంభాషణల ద్వారా మహిళల విలువను తక్కువ చేస్తున్న వీడియోలు విషం చిమ్ముతున్నాయి. కేవలం ప్రశంసల కోసం నిర్మిస్తున్న చౌకబారు వీడియోల్లో మహిళలూ పాత్రలు పోషించడం విచారకరం. మహిళా సంస్కరణాభిలాషులు చొరవ చూపి స్త్రీ జాతి ప్రతిష్ఠను కాపాడుకోవడంలో అతివల బాధ్యతలను గుర్తుచేయడం అవసరం. అధికార పగ్గాలు చేపట్టే నేతలు తమ గెలుపునకు సగభాగం కారణమైన మహిళల రుణం తీర్చుకోవడానికి ఆరోగ్యం, విద్య, వైద్యం, ఉపాధి తదితర రంగాల్లో దీర్ఘకాలిక సాధికారతను సాధించే పథకాలను ప్రవేశపెట్టాలి. చట్టాలు తమ హక్కుల పరిరక్షణకు ఉపయోగపడుతున్నాయనే విశ్వాసాన్ని మహిళల్లో కలిగించే బాధ్యతా ప్రభుత్వాలదే. లింగ సమానత్వం ఒకరి దయాదాక్షిణ్యాల మీద కాకుండా, మానవీయ నిబద్ధతపై నిర్మితం కావాలి.

ఆ దేశాల తీరు స్ఫూర్తిదాయకం

వెనకబాటుతనంతో సతమతమవుతున్న భారత్‌కు భిన్నంగా లింగ సమానత్వాన్ని పాటిస్తున్న దేశాలు ప్రగతిశీల మార్గంలో ముందుకు సాగుతున్నాయి.

ఫిన్లాండ్‌లో స్త్రీ, పురుషుల వేతనాలు సమానం. ప్రభుత్వం గృహిణులకు జీవనభృతి, గర్భిణులకు ప్రసవం వరకు ఉచిత వైద్యం అందజేస్తోంది. ఉద్యోగినులైన తల్లుల శిశువుల కోసం ఉచిత సంరక్షణ కేంద్రాలు నిర్వహిస్తోంది. ఫిన్లాండ్‌ వాసులు లైంగిక దుర్విచక్షణకు దూరంగా సంతృప్తికరమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.

ఉద్యోగం చేస్తూ పిల్లల్ని చదివించాలనుకొనే తల్లులకు నార్వే ప్రభుత్వం ‘ఇంటి నుంచే పని’ వెసులుబాటు కల్పిస్తోంది. సంస్థల మేనేజ్‌మెంట్‌ బోర్డుల్లో అధిక శాతం మహిళలే ఉండాలనేది నిబంధన. ఏటా ‘షి కాన్ఫరెన్స్‌, హర్‌ స్పేస్‌’ పేరిట మహిళా సదస్సులు, నాయకత్వ సమావేశాలు నిర్వహిస్తారు.

‘మెటర్నిటీ లీవ్‌’ను ‘పేరెంటల్‌ లీవ్‌’గా మార్చిన స్వీడన్‌, పిల్లల బాధ్యత తల్లులది మాత్రమే కాదు, తండ్రులది కూడా అని స్పష్టం చేసింది. అక్కడ తల్లిదండ్రులిద్దరికీ 480 రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇస్తారు. వాటిని బిడ్డకు ఆరేళ్లు వచ్చేంతవరకు అవసరాన్నిబట్టి వాడుకోవచ్చు.

ఐస్‌లాండ్‌లో 80శాతం మహిళలు ఉత్పత్తి రంగంలో ఉన్నారు. ఆడవారికంటే మగవారికి ఎక్కువ వేతన చెల్లింపు అక్కడ నేరం. పౌరులకు ఏడాదిపాటు ‘పేరెంటల్‌ లీవ్‌’ దొరుకుతుంది. నర్సరీ నుంచే అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం నింపడం ఆ దేశ ప్రత్యేకత.

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ జీవవైవిధ్య నెలవులు

‣ మారుతున్న కదన వ్యూహం

‣ ద్వంద్వ ప్రమాణాలపై భారత్‌ గళం

‣ తీర ప్రాంతాలు అతలాకుతలం

‣ ఉగ్రవాద నిరోధం పేరిట కపటనాటకం

Posted Date: 24-08-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం