• facebook
  • whatsapp
  • telegram

మయన్మార్‌లో అరాచకం

సైనిక సర్కారు నిరంకుశత్వం

 

 

దాదాపు ఏడాదిన్నరగా మళ్ళీ సైనిక ప్రభుత్వ నిరంకుశ పాలనలో మగ్గుతున్న మయన్మార్‌లో పరిస్థితులు ఇప్పుడప్పుడే మెరుగుపడే సూచనలు కనిపించడం లేదు. పౌర ప్రభుత్వం ఏర్పాటు కాకుండా అడ్డుపడి పాలన పగ్గాలను చేతుల్లోకి తీసుకున్న సైన్యం- రోజురోజుకీ రెచ్చిపోతోంది. ప్రజాస్వామ్య పోరాట యోధురాలు, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్‌ శాన్‌ సూకీకి వివిధ కేసుల్లో పదకొండేళ్ల జైలుశిక్ష పడేలా చేసిన జుంటా (సైనిక ప్రభుత్వం), తాజాగా అవినీతి అభియోగాలపై ఆమెకు మరో ఆరేళ్ల కారాగారవాసం ఖరారయ్యేలా చేసింది. ముందస్తు సమాచారం లేకుండా గత నెలలో నలుగురు కీలక రాజకీయ నేతలకు మరణశిక్ష అమలు చేయడమూ ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతి కలిగించింది. వీటన్నింటికితోడు ఆత్యయిక స్థితినీ పొడిగించడంతో సంక్షుభిత మయన్మార్‌లో పౌర ప్రభుత్వ స్థాపనపై ఆశలు ఆవిరవుతున్నాయి.

 

హక్కులను కాలరాస్తూ...

తమకు గిట్టనివారిని దశాబ్దాలపాటు కారాగారాల్లో, గృహ నిర్బంధంలో ఉంచడం మయన్మార్‌లో సైనిక సర్కారుకు అలవాటే. సూకీనీ ఇదే తరహాలో 15 ఏళ్లకు పైగా నిర్బంధించింది. ఎట్టకేలకు 2010లో విముక్తి పొందిన సూకీ తన నేతృత్వంలోని నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ (ఎన్‌ఎల్‌డీ) పార్టీ సాయంతో మయన్మార్‌లో ప్రజాస్వామ్య స్థాపనకు కృషి చేశారు. 2015 నాటి ఎన్నికల్లో పార్టీకి ఘన విజయం సాధించిపెట్టి పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2016 నుంచి 2021 వరకు విదేశాంగ మంత్రిగా సేవలందించారు. ఆమెకు లభిస్తున్న ఆదరణతో కంగారుపడ్డ జుంటా, దేశంపై తమ పట్టు సడలకుండా కుట్ర పన్నింది. 2020 నాటి ఎన్నికల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన నేతలు 2021 ఫిబ్రవరిలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సమావేశం కాబోతుండగా తిరుగుబాటు చేసింది. సూకీతోపాటు అనేక మంది ప్రజాప్రతినిధులపై ఇష్టారీతిన అభియోగాలు మోపి జైళ్లకు పంపింది. ప్రజాస్వామిక నిరసనలపై ఉక్కుపాదం మోపింది. గత 18 నెలల్లో వందల మంది ప్రాణాలను బలితీసుకుంది. మానవ హక్కులను కాలరాస్తోందంటూ జుంటాపై ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా చాలా ఒత్తిడి ఉండటంతో మరణశిక్షల వైపు వెళ్ళకపోవచ్చన్న అంచనాలు తలకిందులయ్యాయి. మరోవైపు- తమ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నవారి పోరాటం కారణంగా అస్థిర పరిస్థితులు నెలకొన్నాయని చెబుతూ దేశంలో ఆత్యయిక స్థితిని మరో ఆరు నెలలపాటు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు- జుంటా నిరంకుశత్వానికి వ్యతిరేకంగా మయన్మార్‌లో సాయుధ పోరాటాలు ఊపందుకుంటున్నాయి. మయన్మార్‌ జాతీయ ప్రజాస్వామ్య కూటమి సైన్యం, టాంగ్‌ జాతీయ విమోచన సైన్యం, ఆరాకన్‌ ఆర్మీ వంటి సంస్థలు ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కృషి చేస్తున్నాయి. దీంతో పెద్దయెత్తున హింస చెలరేగుతోంది. ఈ పరిస్థితులన్నీ దేశంలో అంతర్యుద్ధానికి దారితీసే ముప్పుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మయన్మార్‌లో బహుళ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థకు తాము అనుకూలమని సైన్యం చెబుతోంది. కానీ, ఎవరు సర్కారును ఏర్పాటు చేసినా తమ చెప్పుచేతల్లోనే ఉండాలంటూ ఆమోదంయోగ్యం కాని షరతులు విధిస్తోంది. ఈ విషయంలో తమ మాట నెగ్గేలా, ప్రజాస్వామ్య శక్తులకు ముకుతాడు వేసేలా రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ చట్టానికి సవరణ చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. సైన్యం గద్దెనెక్కాక మయన్మార్‌లో 10 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. దేశ ఆర్థిక పరిస్థితి నానాటికీ క్షీణిస్తోంది.

 

భారత్‌ వ్యూహాత్మక మౌనం

ఇంత జరుగుతున్నా మయన్మార్‌ విషయంలో అంతర్జాతీయ సమాజం చోద్యం చూస్తోంది. జుంటా చర్యలను ఖండిస్తూ పలు దేశాలు తూతూమంత్రపు ప్రకటనలతో సరిపెడుతున్నాయి. భద్రత, వాణిజ్య అంశాల కారణంగా ఇండియా కూడా వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌ (ఎన్‌ఎస్‌సీఎన్‌) చీలిక వర్గాలు మయన్మార్‌ కేంద్రంగా ఉంటూ ఈశాన్య రాష్ట్రాల్లో విద్రోహచర్యలకు పాల్పడుతున్నాయి. వాటికి ముకుతాడు వేయాలంటే జుంటాతో ఇండియాకు స్నేహపూర్వక సంబంధాలు అవసరం. భారత్‌కు అవసరమైన సహజవాయువు, పెట్రోలియం తదితరాలు ఆ దేశంలో పుష్కలంగా ఉన్నాయి. పౌర ప్రభుత్వ ఏర్పాటు విషయంలో జుంటాపై ఒత్తిడి తెస్తే, అది చైనా చెప్పుచేతల్లోకి వెళ్ళే ముప్పుండటం మరో ఆందోళనకర అంశం. దీంతో మయన్మార్‌లోని ప్రజాస్వామ్య అనుకూల శక్తులు, సైనిక సర్కారుతో సంబంధాలను సమతుల్యం చేసుకునేందుకు ఇండియా ప్రయత్నిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో తలదాచుకుంటున్న వేలమంది మయన్మార్‌ పౌరులు కూడా తమ దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఇండియా నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ తరుణంలో అంతర్జాతీయ సమాజం చొరవ చూపి అక్కడ ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కృషి చేయాల్సిన అవసరం ఉంది.

 

- నవీన్‌కుమార్‌ గౌడ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ లింగ సమానత్వం... ప్రగతికి మార్గం!

‣ జీవవైవిధ్య నెలవులు

‣ మారుతున్న కదన వ్యూహం

‣ ద్వంద్వ ప్రమాణాలపై భారత్‌ గళం

‣ తీర ప్రాంతాలు అతలాకుతలం

‣ ఉగ్రవాద నిరోధం పేరిట కపటనాటకం

Posted Date: 24-08-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం