• facebook
  • whatsapp
  • telegram

సాగు బాగుకు సాంకేతిక సోపానం

రేపటి సేద్యంలో అంకురాలే కీలకం

‘ఒన్‌ లైఫ్‌-ఒన్‌ మిషన్‌’ నినాదంతో వ్యవసాయ పరిశోధనలు ముందుకు సాగాలని ముఖ్యంగా యువ పరిశోధకులు సేద్యంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకురావాలని రెండేళ్ల నాడే ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఇది సాధ్యమైతేనే దేశంలోని చిన్న, సన్నకారు రైతులకు సాంకేతికత ఫలాలు అందుబాటులోకి వస్తాయి. అత్యాధునిక సాంకేతికత సాగు ప్రపంచాన్ని సరికొత్తగా ఆవిష్కరిస్తోంది. ఎల్లలు లేని సాంకేతికత మునుముందు సేద్యాన్ని మరింత సులభతరం చేయనుందనేది సుస్పష్టం. రోబోటిక్‌ వ్యవసాయంతో విశ్వవ్యాప్తంగా వ్యవసాయ రంగ రూపురేఖలు మారనున్నాయి. అందుకు రైతుల్ని సంసిద్ధం చేయడం ద్వారా భవిష్యత్‌ సవాళ్లను అధిగమించి సాంకేతిక ఫలాలను పొందే అవకాశముంది.

వ్యవసాయ యాంత్రీకరణ వైపు...

మనలాంటి పెద్ద దేశంలో సంప్రదాయ వ్యవసాయం ఒక్క రాత్రిలో మార్పు చెందేది కాదు. ఇప్పటికీ రైతులకు నిత్యం ఎదురయ్యే సవాళ్లకు తగిన పరిష్కారాల్ని చూపడంలో ప్రభుత్వాలు సతమతమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాంకేతిక ఫలాలను చిన్న రైతులకు చేరువ చేయగలిగితే ఈ సమస్యలకు చక్కని పరిష్కారాలు లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ యాంత్రీకరణ కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో, భారత్‌ కూడా ఆధునికతను అందిపుచ్చుకొనే దిశగా సాగుతోంది. ముఖ్యంగా మనదేశానికి చెందిన అంకుర సంస్థలెన్నో సాగు సాంకేతికతను ఒడిసిపడుతూ ఈ రంగంలో పురోగమిస్తున్న ఎన్నో కంపెనీలకు దీటుగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో అంకుర సంస్థలు క్షేత్రస్థాయిలో చిన్న, సన్నకారు రైతులదాకా సాగు సాంకేతికతను అందుబాటులోకి తెచ్చే రోజు త్వరలోనే సాకారం కావచ్చు. ఇందుకు ప్రభుత్వాలు మరింత చొరవ చూపాల్సి ఉంటుంది. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఓటీ) పరిజ్ఞానంతో ఇజ్రాయెల్‌ అనూహ్య ప్రగతిని అందిపుచ్చుకొంటోంది. ముఖ్యంగా వ్యవసాయంలో ఐఓటీ, కృత్రిమ మేధ ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. నిత్యం పొలానికి వెళ్ళి పంట ఎదుగుదలను పర్యవేక్షించడం శ్రమతో కూడిన పని. ఇలాంటి సంప్రదాయ పద్ధతులకు ఐఓటీ ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని సూచిస్తోంది. దీనిద్వారా గాలిలో తేమ శాతం, ఉష్ణోగ్రత, మొక్కలకు సమయానుకూలంగా అందించాల్సిన పోషకాలు, వాటి మోతాదుల వివరాలు తెలుస్తాయి. పొలంలో ఏర్పాటు చేసే సెన్సర్లు కచ్చితత్వంతో పంటకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని మొబైల్‌ఫోన్‌కు అందిస్తాయి. పశువులు సగటున రోజుకు ఎంత గడ్డి/దాణా తింటున్నాయి, నిత్యం ఇచ్చే పాల దిగుబడి వివరాలనూ సెన్సర్ల సాయంతో పొందవచ్చు. యాంత్రీకరణ ద్వారా పంట ఎదుగుదల సమాచారాన్ని గుర్తించడంతోపాటు, అవసరమైనప్పుడల్లా మొక్కలకు సరిపడా నీటిని విడుదల చేయవచ్చు. వీటికి అదనంగా డ్రోన్లు, రోబోలు పంట ఎదుగుదలను అంచనా వేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. పంట ప్రతి దశలో రోబోలు పర్యవేక్షణ బాధ్యతల్ని నిర్వర్తిస్తాయి. ఇటువంటి సాంకేతికతను అందిపుచ్చుకొని ఇప్పటికే పలు అంకుర సంస్థలు రైతులకు సేవలు అందిస్తున్నాయి. బల్గేరియాకు చెందిన అగ్రీలా సంస్థ ఈ సాంకేతికతను ఉపయోగించి పంటలకు సంబంధించిన పూర్తి వివరాలను సెన్సర్ల సాయంతో అందించే ఏర్పాటు చేస్తోంది. కెనడాకు చెందిన ఫార్మర్స్‌ హైవ్‌ అనే సంస్థ హరిత గృహాలు, పండ్ల తోటల్లో ఐఓటీ ద్వారా పంటలను పర్యవేక్షించే సాంకేతికతను రైతులకు అందిస్తోంది. సుదూర పర్యవేక్షక సెన్సర్ల ద్వారా కచ్చితమైన సమాచారాన్ని అందించడం దీని ప్రత్యేకత. వ్యవసాయంతో సాంకేతికతను ఉపయోగించడంలో కృత్రిమ మేధ పాత్రను విస్మరించలేం. ప్రస్తుతం పంట అన్ని దశల్లో కృత్రిమ మేధ అద్భుత ఫలితాలను అందిస్తోంది. పంటకు ఆశించే చీడపీడలను, పశువులకు సోకే సీజనల్‌ జబ్బులను సకాలంలో గుర్తించి సరైన చర్యలు చేపట్టడం ఎంతో అవసరం. అలాగే వాతావరణ సమాచారాన్ని విశ్లేషించి ముందుగానే తగిన సూచనలు అందించడం, పంట దిగుబడులు, ధరల సమాచారాన్ని క్రోడీకరించి ముందస్తుగా వివరాలు అందించడం కృత్రిమ మేధతోనే సాధ్యం. అమెరికాకు చెందిన అర్వ ఇంటెలిజెన్స్‌ అనే అంకుర సంస్థ కృత్రిమ మేధ సాయంతో భూసారం ఆధారంగా పంటల ఎంపిక, పోషకాల యాజమాన్యం, పంటలపై వాతావరణ ప్రభావం, దిగుబడి అంచనాలు, కోతలు తదితర అంశాలపై రైతులకు సేవలు అందిస్తోంది. భారత్‌, ఇజ్రాయెల్‌, బెల్జియం వంటి దేశాల అంకుర సంస్థలు మొక్కలకు ఆశించే చీడపీడలను గుర్తించే యాప్‌లను రూపొందించాయి. కృత్రిమ మేధతో పనిచేసే ఇలాంటి యాప్‌లు పంట పర్యవేక్షణ చేపట్టి చీడపీడలను గుర్తించి మొబైల్‌ ద్వారా రైతులకు సమాచారం అందిస్తాయి.

ఉష్ణోగ్రతల నియంత్రణ

మొత్తంగా పంట పరిశీలన, సమర్థ యాజమాన్యంలో రోబోటిక్స్‌ సేవలు వ్యవసాయ రూపురేఖల్ని మార్చేస్తున్నాయి. మొక్కలకు అవసరమైన సూర్యరశ్మి, నీరు, వాతావరణం, పోషకాలను సకాలంలో తగినంత అందించేలా ఉష్ణోగ్రతల్ని నియంత్రించడం ఎంతో ముఖ్యం. ప్రధానంగా పొలాలు, హరిత గృహాల్లో సాగు చేసే పంటలకు అవసరమైన ఉష్ణోగ్రతల్ని అందించాలంటే నియంత్రిత వాతావరణ పరిస్థితులు కల్పించాలి. ఈ విషయంలో ఇజ్రాయెల్‌ సాంకేతికత అత్యున్నతమైనది. మనదేశానికి చెందిన ఇక్రిశాట్‌ హైదరాబాద్‌ కేంద్రం జన్యుపరంగా అద్భుతాలు సృష్టించింది. సేద్యంలో ఆధునిక సాంకేతిక సమాచారాన్ని రైతులకు చేరవేయడం, రోబోలు, యంత్రాలను సెన్సర్ల సాయంతో మరింత వేగంగా, నైపుణ్యంతో పని చేయించేలా 5జీ సాంకేతికతను ఉపయోగించుకుని సేద్యాన్ని అత్యాధునికతవైపు మళ్ళించడంపై అంకుర సంస్థలు దృష్టి పెడుతున్నాయి. మార్కెటింగ్‌సహా మేలైన సాగు పద్ధతులు, యాజమాన్యంపై దృష్టి పెడుతున్న అంకుర సంస్థలు దేశంలో మరింతగా విస్తరిస్తేనే- సగటు రైతుల ప్రాథమిక సమస్యలకు కొంతమేర పరిష్కారం దొరకవచ్చు. యువ పరిశోధకులు ఈ దిశగా దృష్టి పెట్టి దేశీయ రైతులకు అండగా నిలిస్తే వ్యవసాయం వర్ధిల్లుతుంది.

రోబో సాయం

అంకుర సంస్థల ఆవిష్కరణలతో సాగులో రోబోలు రంగ ప్రవేశం చేశాయి. ఇజ్రాయెల్‌, జపాన్‌, దక్షిణ కొరియా, తైవాన్‌, కెనడా, అమెరికా, రష్యా, ఐరోపా దేశాలకు చెందిన పలు కంపెనీలు వ్యవసాయ క్షేత్రాల పర్యవేక్షణకు రోబోల సాయం తీసుకుంటున్నాయి. పలువురు రైతులు ఇంట్లో కూర్చుని పొలాన్ని పర్యవేక్షించుకునేందుకు రోబోలను ఉపయోగించి ఆటొమేషన్‌ ద్వారా వ్యవసాయం చేస్తున్నారు. మొక్కలు నాటడం, చీడపీడలను గుర్తించడం, మందులు చల్లడం, కలుపు తీయడం, పండ్లు కోయడం... ఇలా సేద్యంలో ప్రతి పనినీ రోబోలు చక్కబెడుతున్నాయి. పశుపోషణలోనూ యంత్రాల సాయంతో రోబోలు పలు పనుల్ని నిర్వర్తిస్తున్నాయి. ముఖ్యంగా డ్రోన్లు పొలంలోని ప్రతి మూలకూ వెళ్ళి పంటకు నీటి లభ్యత, చీడపీడలు, కలుపు పరిస్థితి, పత్రహరిత స్థాయి, పరపరాగ సంపర్కం వంటి అంశాలను పరిశీలించి- నీరు, ఎరువులు, కలుపు మందులను సకాలంలో అందించేందుకు ఉపకరిస్తున్నాయి. ఈ విషయంలో మన దేశానికి చెందిన ఈక్వినాక్స్‌ అంకుర సంస్థ పలు రకాల సేవలు అందిస్తోంది. కెనడాకు చెందిన నెక్సస్‌ రోబోటిక్స్‌ అల్గారిథమ్స్‌ కెమెరాల సాయంతో చేలో కలుపు మొక్కకు, పైరుకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించి పంటకు నష్టం వాటిల్లకుండా కలుపును తొలగించేందుకు దోహదపడుతోంది.

- అమిర్నేని హరికృష్ణ
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉగ్రవాదంపై ఉక్కుపాదం

‣ మయన్మార్‌లో అరాచకం

‣ లింగ సమానత్వం... ప్రగతికి మార్గం!

‣ జీవవైవిధ్య నెలవులు

Posted Date: 26-08-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం