• facebook
  • whatsapp
  • telegram

ఉగ్రవాదంపై ఉక్కుపాదం

కశ్మీర్‌లో గ్రామ రక్షణ బృందాల బలోపేతం

 

 

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులపై పోరులో స్థానికులను భాగస్వాములను చేస్తున్న గ్రామ రక్షణ పథకం- మొదటి నుంచీ రాజకీయ కారణాలతో ఆటుపోట్లకు గురవుతోంది. ఈ క్రమంలో పథకాన్ని బలోపేతం చేసే దిశగా ఇటీవల మళ్ళీ కొన్ని అడుగులు పడ్డాయి. 1990వ దశకంలో కశ్మీరీ హిందువులు, సిక్కులపై పాక్‌ ఉగ్రవాదుల దాడులు పెరిగి దోడా, రాజౌరి, ఉద్ధంపూర్‌, పూంఛ్‌, కథువా జిల్లాల్లో సమస్య పెచ్చరిల్లింది. అప్పటికే 1947, 1965, 1971 యుద్ధాల్లో సరిహద్దు గ్రామాల్లోని మాజీ సైనికోద్యోగులకు 2,500 రైఫిళ్లు అందించి మంచి ఫలితాలు సాధించిన నేపథ్యం- 1995లో జమ్మూకశ్మీర్‌ గ్రామ రక్షణ సంఘాల (వీడీసీ) ఏర్పాటుకు స్ఫూర్తినిచ్చింది. ఆ సంవత్సరం చినాబ్‌ లోయలో మారుమూల పర్వత ప్రాంతాల్లోని పల్లె ప్రజలను రక్షించడానికి తొలి వీడీసీని ఏర్పాటు చేశారు. క్రమంగా 10 జిల్లాలకు వీడీసీ పథకాన్ని వర్తింపజేశారు. అప్పట్లో కేంద్రంలో పి.వి.నరసింహారావు ప్రభుత్వం అధికారంలో ఉండేది. తరవాత వీడీసీలను పర్వత ప్రాంతాలతోపాటు మైదానాలకూ విస్తరించారు. 1990 దశకంలో ఏర్పడిన నాలుగు వేల పైచిలుకు వీడీసీలలో మొత్తం 26,567 మంది స్థానిక ప్రజలు, పోలీసు సిబ్బంది సభ్యులుగా ఉన్నారు. గ్రామాల రక్షణతోపాటు సరిహద్దులకు కాపలా కాయడం, పాక్‌ నుంచి చొరబడే ఉగ్రవాదులను ఎదుర్కోవడం వంటి బాధ్యతలను వీడీసీలకు అప్పగించారు. భారత సైన్యం వీడీసీ సభ్యులకు గూఢచర్య సమాచార సేకరణ పద్ధతులను నేర్పుతూ, ఆయుధ ప్రయోగంలో శిక్షణ కల్పించింది.

 

ఈ పథకాన్ని భాజపా సమర్థించగా- నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు వ్యతిరేకించాయి. వీడీసీ సభ్యులు తుపాకులను దుర్వినియోగం చేస్తున్నారని, వారిపై గతంలో 160 కేసులు ఉన్నాయని ఆ పార్టీలు ఆరోపించాయి. రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో తమ ప్రత్యర్థులపైకి వీడీసీ సభ్యులను ఉసిగొల్పుతున్నారనే ఆరోపణలూ వెలువడ్డాయి. వీడీసీ సభ్యులు అత్యాచారాలకు పాల్పడుతున్నారని, వ్యక్తిగత కక్ష సాధింపునకు ప్రభుత్వమిచ్చిన ఆయుధాలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు పెరిగాయి. దీంతో వీడీసీలను రద్దు చేయాలంటూ పలు పక్షాలు డిమాండ్‌ చేశాయి. సరిహద్దుకు అవతల ఉన్న తమ యజమానులను సంతుష్టపరచడానికే కొన్ని పక్షాల నాయకులు ఇలాంటి డిమాండ్లు చేస్తున్నారంటూ భాజపా ప్రత్యారోపణలకు దిగింది. జమ్మూకశ్మీర్‌లో 1995 తరవాత వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు వీడీసీలను రద్దు చేశాయి. మరోవైపు వీడీసీ సభ్యులకు జీతభత్యాలు చెల్లించనందువల్ల చాలామంది ఆ సంఘాల నుంచి వైదొలగారు. కొన్నేళ్ల క్రితం కశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలు తగ్గుముఖం పట్టినప్పుడు వీడీసీల అవసరం తీరిపోయింది కాబట్టి వాటిని రద్దు చేయడం మంచిదని పౌర హక్కుల సంఘాలు డిమాండ్‌ చేశాయి. కానీ, జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసినప్పటి నుంచి మళ్ళీ ఉగ్రదాడులు పెరగడంతో వీడీసీల అవసరం తెలిసివస్తోంది. ప్రస్తుతం ఉగ్రవాదులపై పోరులో సైన్యానికి, పోలీసులకు వీడీసీలు తోడ్పడుతున్నాయని జమ్మూకశ్మీర్‌ భాజపా నాయకులు ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిసినప్పుడు గుర్తు చేశారు. వీడీసీలను తక్షణం బలోపేతం చేయాలన్నారు. తదనుగుణంగా ఎన్డీయే ప్రభుత్వం ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒక ఉత్తర్వు జారీ చేసింది. గ్రామ రక్షణ సంఘం (వీడీసీ) పథకం స్థానంలో గ్రామ రక్షణ గార్డుల పథకం (వీడీజీ) చేపడుతున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నది. వీడీజీ సర్వీసు నిబంధనలను, సౌకర్యాలను మెరుగుపరచింది.

 

వీడీజీ సభ్యులు యూనిఫారాలు లేని సైనికులని కేంద్ర హోంశాఖ అభివర్ణిస్తోంది. వీడీసీ సభ్యులకు ఇచ్చిన పాయింట్‌ 303 రైఫిళ్లే ఆ సభ్యుల సంతానానికి సంక్రమించాయి. తండ్రుల బాటలో వీడీసీ సభ్యులుగా మారిన వారసులు ఇప్పటికీ పాత రైఫిళ్లనే వాడక తప్పడం లేదు. తాజా ఉత్తర్వుతో గ్రామ రక్షణ గార్డులు (వీడీజీ)గా మారిన ఈ సభ్యులకు అధునాతన ఆయుధాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. సరిహద్దు ప్రాంతాల్లో ఒక్కో వీడీజీ బృందంలో 15 మంది సభ్యులు ఉంటారు. ఈ దళాలకు సైన్యం, సీఆర్పీఎఫ్‌, రాష్ట్ర పోలీసు శాఖ మాజీ ఉద్యోగులు నాయకత్వం వహిస్తారు. వీడీజీ దళాలు జిల్లా ఎస్పీ, సీనియర్‌ ఎస్పీల పర్యవేక్షణలో పనిచేస్తాయి. వీడీజీ బృంద నాయకులకు నెలకు రూ.4,500 చొప్పున, సభ్యులకు రూ.4,000 చొప్పున వేతనం చెల్లించాలని కేంద్ర హోం శాఖ తాజా ఉత్తర్వు నిర్దేశిస్తోంది. వీడీజీలు పాక్‌ ప్రేరిత ఉగ్రవాదానికి ముకుతాడు వేయడానికి అమోఘంగా తోడ్పడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. రక్షణ బృందాలతో దీర్ఘకాలంలో ఎలాంటి ఫలితాలు సిద్ధిస్తాయో వేచిచూడాలి.

 

- వరప్రసాద్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మయన్మార్‌లో అరాచకం

‣ లింగ సమానత్వం... ప్రగతికి మార్గం!

‣ జీవవైవిధ్య నెలవులు

‣ మారుతున్న కదన వ్యూహం

‣ ద్వంద్వ ప్రమాణాలపై భారత్‌ గళం

‣ తీర ప్రాంతాలు అతలాకుతలం

‣ ఉగ్రవాద నిరోధం పేరిట కపటనాటకం

Posted Date: 24-08-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం