• facebook
  • whatsapp
  • telegram

శాశ్వత సభ్యత్వం ఇంకెప్పుడు?

సంస్కరణలకు దూరంగా భద్రతామండలి

సమకాలీన భూభౌగోళిక రాజకీయాలకు అనుగుణంగా ఐక్యరాజ్య సమితి భద్రతామండలి (యూఎన్‌ఎస్‌సీ)లో సంస్కరణలు చేపట్టాలని ఇండియా సహా కొన్ని దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. చాలా ఏళ్లుగా అది నిరాదరణకు గురవుతోంది. కీలక వర్ధమాన దేశాలకు శాశ్వత సభ్యత్వ హోదా కల్పించే విషయంపై ముందడుగు పడటంలేదు. ఫలితంగా ఆధునిక ప్రపంచంలో ఐరాస ఒకింత తన ప్రాభవాన్ని కోల్పోతోంది. మానవాళి మనుగడకు ముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదం, పర్యావరణ మార్పులు, మహమ్మారుల వంటి సవాళ్లను సమర్థంగా ఎదుర్కోలేక పోతోంది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి హోదాలో పనిచేస్తున్న రుచిరా కంబోజ్‌ ఇటీవల ఈ విషయాన్ని స్పష్టీకరించారు. సత్వరం సంస్కరణల బాట పట్టకపోతే- కొన్ని అంతర్జాతీయ కూటములు ఐరాసను మించి ప్రపంచంపై తమ ప్రభావాన్ని చూపుతాయని హెచ్చరించారు. భద్రతామండలితో పోలిస్తే ఆ కూటములే ఎక్కువ పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుతంగా ఉన్నాయని చురకలంటించారు.

స్వీయ ప్రయోజనాలకే పెద్దపీట

రెండో ప్రపంచ యుద్ధం తరవాత ప్రపంచ శాంతి, భద్రతల కోసం పాటుపడేందుకు ఐరాసతోపాటే భద్రతామండలి అవతరించింది. అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లకు అందులో శాశ్వత సభ్యత్వముంది. ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా భద్రతామండలి మారడంలేదు. ఆఫ్రికా నుంచి ఒక్క దేశానికీ అందులో శాశ్వత సభ్యత్వం లేదు. గ్లోబల్‌ సౌత్‌గా పిలిచే లాటిన్‌ అమెరికా, ఆసియా, ఆఫ్రికా, ఓషియానాలకు మండలిలో సముచిత ప్రాతినిధ్యం లేకపోవడాన్ని ఇండియా చాలాసార్లు ప్రశ్నించింది. శాశ్వత సభ్యత్వ దేశాలు స్వీయ ప్రయోజనాలకో, తమ మిత్రపక్షాల అవసరాలకో మాత్రమే పెద్దపీట వేస్తున్నాయి. ఇజ్రాయెల్‌-పాలస్తీనా సంక్షోభం విషయంలో అమెరికా తన మిత్ర దేశమైన ఇజ్రాయెల్‌కు అనుకూలంగా 16 సార్లు వీటో అధికారాన్ని ఉపయోగించింది. పాకిస్థాన్‌ కొమ్ముకాస్తూ ఉగ్రవాదులపై చర్యల విషయంలో చైనా ఎప్పటికప్పుడు అడ్డుపుల్లలు వేస్తోంది. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం దక్కించుకొనేందుకు తనకు అన్ని అర్హతలూ ఉన్నాయని ఇండియా ఎన్నో ఏళ్లుగా బలంగా వాదిస్తోంది. తనలాంటి అగ్రగామి వర్ధమాన దేశాలకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా మండలిని విస్తరించాలని పట్టుపడుతోంది. ఇండియా, బ్రెజిల్‌, జర్మనీ, జపాన్‌ కలిసి జీ-4 కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. అగ్ర రాజ్యాలతో సమానంగా నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత్‌కు సభ్యత్వం దక్కకుండా పాకిస్థాన్‌, చైనాలు కుట్రలు పన్నుతున్నాయి. బ్రెజిల్‌ విషయంలో అర్జెంటీనా; జర్మనీ అంశంలో ఇటలీ; స్పెయిన్‌, జపాన్‌ విషయంలో ఆస్ట్రేలియా బహిరంగంగానే తమ నిరసనను తెలియజేస్తున్నాయి. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వానికి ఏయే అర్హతలు ఉండాలన్నది ఐరాస చార్టర్‌లో లేకపోవడమూ జీ-4 దేశాలకు సమస్యగా మారుతోంది. నిజానికి 1950లో అమెరికా, 1955లో సోవియట్‌ భద్రతామండలిలో శాశ్వత సభ్యదేశంగా చేరాలని భారత్‌ను ఆహ్వానించాయి. అప్పటి ప్రచ్ఛన్న యుద్ధ తరహా రాజకీయాల కారణంగా వాటి ఆహ్వానాన్ని ఇండియా తిరస్కరించింది. ఆ తరవాత పరిస్థితులు మారాయి. ప్రస్తుతం శాశ్వత సభ్యత్వానికి కావాల్సిన అన్ని అర్హతలు భారత్‌కు ఉన్నాయి. ఇండియా శాంతి కాముక దేశం. ఐరాస వ్యవస్థాపక సభ్య దేశాల్లో ఒకటి. భద్రతామండలిలో ఇప్పటిదాకా ఎనిమిది సార్లు తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నికైంది. ప్రపంచ జనాభాలో ఆరింట ఒక వంతు భారత్‌లో నివసిస్తోంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మరో సానుకూలాంశం. అనేక దేశాలకు విశ్వసనీయ భాగస్వామిగా ఇండియా కొనసాగుతోంది. ఐరాస శాంతిపరిరక్షణ కార్యక్రమాలకు అత్యధికంగా సైనికులను సమకూరుస్తున్న దేశాల్లో భారత్‌ ఒకటి. ఇప్పటిదాకా శాంతిపరిరక్షక కార్యక్రమాల్లో అత్యధిక సంఖ్యలో భారతీయ సైనికులే ప్రాణాలు అర్పించారు. కొవిడ్‌ సమయంలో 150కి పైగా దేశాలకు భారత్‌ నుంచి టీకాలు, ఔషధాలు, ఇతర వైద్య పరికరాలు సరఫరా అయ్యాయి. బలమైన సైన్యం, అణ్వాయుధ సామర్థ్యం, రాజకీయ స్థిరత్వం వంటివన్నీ ఇండియాకు ఉన్నా... శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్‌ నెరవేరడం లేదు.

అంతర్జాతీయ అంశాలపై దృష్టి

భద్రతామండలిలో ఇండియా ప్రవేశాన్ని వీటో చేయగల అధికారం చైనాకు ఉంది. అంతర్జాతీయ వేదికలపై తనకున్న విశేష అధికారాన్ని భారత్‌తో పంచుకొనేందుకు డ్రాగన్‌ సమ్మతించే పరిస్థితులు కనిపించడంలేదు. అమెరికా సైతం భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి సుముఖంగా ఉన్నా, వీటో అధికారాన్ని పంచుకోవడానికి మొగ్గుచూపడం లేదు. అంతమాత్రాన దిల్లీ పూర్తిగా డీలా పడిపోవాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ అంశాలపై మరింత ఎక్కువగా దృష్టి సారించాలి. వివిధ దేశాలతో వాణిజ్య సంబంధాలను పటిష్ఠం చేసుకోవాలి. చైనాకు దీటుగా గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగడానికి కృషి చేయాలి. మానవాభివృద్ధి సూచీలో బాగా మెరుగుపడటమూ తప్పనిసరి. ఆయుధ దిగుమతులపై ఆధారపడటాన్నీ గణనీయంగా తగ్గించుకోవాలి. మండలిని సంస్కరించక తప్పని పరిస్థితులను ఇండియా సృష్టించినప్పుడు అందులో శాశ్వత సభ్యత్వం సాధించడం తేలికవుతుంది.

- మండ నవీన్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ చుక్కాని కరవైన హస్తం పార్టీ

‣ ప్రమాదంలో పాల ఉత్పత్తి

‣ నదుల్లో గరళప్రవాహం

‣ చైనా యుద్ధోన్మాద విన్యాసాలు

‣ సాగు బాగుకు సాంకేతిక సోపానం

Posted Date: 03-09-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం