• facebook
  • whatsapp
  • telegram

నదుల్లో గరళప్రవాహం

పునరుజ్జీవం తక్షణావసరం

 

 

భారత్‌లో నీటి కొరత క్రమంగా అధికమవుతోంది. దేశీయంగా దాదాపు 60 కోట్ల మంది నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారని నాలుగేళ్ల క్రితమే నీతి ఆయోగ్‌ నివేదిక వెల్లడించింది. ప్రపంచ నీటి నాణ్యత సూచీలోనూ భారత్‌ 122 దేశాల సరసన 120వ స్థానంలో నిలుస్తోంది. ఈ దుస్థితి తొలగిపోవాలంటే భారత్‌లో అత్యధిక జనాభాకు జీవనాధారంగా ఉన్న నదుల పునరుజ్జీవం తప్పనిసరి. నదీ జలాల పరిరక్షణ, పంపిణీ సక్రమంగా లేకపోతే నీటి సంక్షోభాలు తలెత్తి సామాజిక ఆర్థిక వ్యవస్థలు అస్తవ్యస్తం అవుతాయి. దేశ ఆహార భద్రతపైనా ప్రభావం పడుతుంది. అడవుల క్షీణత, వరదలు, కొండచరియలు విరిగి పడటం, పట్టణీకరణ, పారిశ్రామిక, మానవ వ్యర్థాలు కలవడం, ఆక్రమణలు వంటి కారణాలతో నదులు కాలుష్యానికి గురవుతున్నాయి.

 

కఠిన చర్యలు తీసుకోవాలి

భారత్‌లో ప్రధానమైన గంగానది కలుషిత కాసారంగా అపకీర్తిని మూటగట్టుకొంటోంది. గంగానదిలోకి రోజూ వందలాది పరిశ్రమల నుంచి కోట్ల లీటర్ల వ్యర్థాలు విడుదల అవుతున్నాయని పలు పరిశీలనలు వెల్లడిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో గంగానది నీరు భార లోహాలతో నిండిపోతున్నట్లు ఇటీవల విజ్ఞానశాస్త్ర, పర్యావరణ నివేదిక హెచ్చరించింది. దేశీయంగా 323 నదులు ఇప్పటికే తీవ్ర కశ్మలం బారిన పడినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. మహారాష్ట్రలో 53, అస్సామ్‌లో 44, మధ్యప్రదేశ్‌లో 22, కేరళలో 21, కర్ణాటకలో 17 నదులు ఆ జాబితాలో ఉన్నాయి. తెలంగాణలో మూసీ, మానేరు, గోదావరి, కిన్నెరసాని నదులు, ఆంధ్రప్రదేశ్‌లో తుంగభద్ర, గోదావరి, కృష్ణా, నాగావళి కాలుష్యం బారిన పడినట్లు నివేదిక వెల్లడించింది. దేశీయంగా పట్టణాల నుంచి రోజూ దాదాపు ఏడు వేల కోట్ల లీటర్లకు పైగా మురుగు నీరు వెలువడుతోంది. 2050 నాటికి అది పన్నెండు వేల కోట్ల లీటర్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం మూడు వేల కోట్ల లీటర్ల కశ్మల జలం మాత్రమే శుద్ధికి నోచుకొంటోంది. తగినన్ని శుద్ధి ప్లాంట్లు లేకపోవడంతో మురుగు నీరు నేరుగా నదుల్లోకి చేరుతోంది. దాంతో అవి కాలుష్యం కాటుకు గురవుతున్నాయి. జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద పాలకులు మురుగు నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నారు. వాటిని మరింతగా పెంచాల్సిన అవసరం ఉంది. నిపుణులైన సిబ్బంది లేమి వల్ల మురుగు నీటి సమర్థ నిర్వహణ సాధ్యపడటంలేదు. కేంద్రం 19 వేల కోట్ల రూపాయలతో యమున, కృష్ణా, కావేరి, మహానది, బ్రహ్మపుత్ర వంటి 13 నదులను కాలుష్యం బారి నుంచి బయట పడేయాలని నిర్ణయించింది. నమామి గంగే కార్యక్రమం ద్వారా గంగానది, దాని ఉపనదుల ప్రక్షాళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నదుల పరిరక్షణ కోసం బహుముఖ విధానాలను అవలంబించాల్సిన అవసరం ఉంది. నీటి వృథాను తగ్గించడం, మురుగు నీటి శుద్ధి, పునర్వినియోగంతో పాటు నదుల పునరుజ్జీవ కార్యక్రమాలు జోరందుకోవాలి. నదుల నీటిని కలుషితం చేసే వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి. కశ్మల జలాన్ని, ప్రమాదకర రసాయనాలను నేరుగా నదుల్లోకి వదులుతున్న కర్మాగారాలకు భారీగా జరిమానాలను విధించాలి. నదుల సమీపంలోని అక్రమ నిర్మాణాలు వాటి ప్రక్షాళనకు అవరోధంగా మారుతున్నాయి. నదీతీరాల్లో ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొస్తున్న భవంతులను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. వాటి పరీవాహకంలో అక్రమ పారిశ్రామిక కార్యకలాపాలనూ నిషేధించాలి.

 

జవాబుదారీతనం ముఖ్యం

ప్రమాదకర రసాయనాలు, వ్యర్థ జలాలను వెలువరించే పరిశ్రమలన్నీ తప్పనిసరిగా శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలి. అవి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. వాటిలో పర్యావరణ హితకరమైన సాంకేతికతలను వినియోగించడమూ తప్పనిసరి. శుద్ధిచేయని వ్యర్థాలను నదుల్లోకి విడుదల చేయడాన్ని ప్రభుత్వాలు సమర్థంగా నియంత్రించగలగాలి. వ్యర్థ జలాల శుద్ధి కేంద్రాల ఏర్పాటుపై అయిదేళ్లకోసారి పురపాలక సంస్థలు, కాలుష్య నియంత్రణ మండళ్లతో పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రాంతాల వారీగా సమీక్ష జరిపి, తగిన ప్రణాళికలు రూపొందించాలి. ఇప్పటికే ఉన్న మురుగు నీటి శుద్ధి ప్లాంట్లను నూతన సాంకేతికతతో పునరుద్ధరించడమూ తప్పనిసరి. వ్యర్థ జలాల నిర్వహణ సిబ్బందికీ తగిన శిక్షణ అందించాలి. నదుల పరిరక్షణ కోసం ఆయా రాష్ట్రాల్లోని వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని, జవాబుదారీతనాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. వరద నీటి కట్టడి కోసమూ ప్రత్యేక చర్యలు చేపట్టాలి. నదులకు ఇరువైపులా 500 మీటర్ల దాకా మొక్కలను పెంచాలి. చిన్న, మధ్యతరహా నీటి వనరులను అభివృద్ధి చేసి, జీవ వైవిధ్య పార్కులకు రూపకల్పన చేయడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. మానవ వ్యర్థాలు నదుల్లో కలవకుండా నియంత్రించడమూ కీలకం. నదుల కాలుష్యం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజల్లో విస్తృతంగా అవగాహన పెంచాలి. నదీగర్భాల్లో అక్రమ ఇసుక తరలింపును నిరోధించాలి. దేశ సామాజిక, ఆర్థికాభివృద్ధి సాకారం కావాలంటే నదుల పునరుజ్జీవం అత్యంత కీలకం.

 

- ఎ.శ్యామ్‌కుమార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ చైనా యుద్ధోన్మాద విన్యాసాలు

‣ సాగు బాగుకు సాంకేతిక సోపానం

‣ ఉగ్రవాదంపై ఉక్కుపాదం

‣ మయన్మార్‌లో అరాచకం

‣ లింగ సమానత్వం... ప్రగతికి మార్గం!

‣ జీవవైవిధ్య నెలవులు

Posted Date: 26-08-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం