• facebook
  • whatsapp
  • telegram

అభివృద్ధి పథంలో భారత్‌

అయిదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భావం

 

 

బ్రిటిష్‌ వలస పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లయిన సందర్భంలో మనం ఆర్థికంగా బ్రిటన్‌ను మించిపోవడం కాకతాళీయమే కావచ్చు. కానీ, అది భారతీయులందరూ గర్వించదగిన విజయం. భారత్‌ నేడు బ్రిటన్‌ను తోసిరాజని ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. నేడు బ్రిటన్‌, ఐరోపా దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినందువల్ల అక్కడ ద్రవ్యోల్బణం విజృంభిస్తూ ప్రజల జీవన వ్యయాన్ని విపరీతంగా పెంచేసింది. సరిగ్గా ఈ సమయంలోనే భారత్‌ ఆర్థిక పునరుత్థానం అపూర్వ పరిణామం. ఇంతకాలం భారతదేశ ఆర్థిక విధానాలను తప్పుపడుతూ వచ్చిన పాశ్చాత్య ఆర్థికవేత్తలు బ్రిటన్‌, ఐరోపా దేశాలు ఆర్థిక సంక్షోభంలోకి జారిపోనున్నాయనే సంగతిని ముందుగానే పసిగట్టలేకపోయారు. ఐరోపా వాసులకు జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లే రోజులు గతించాయని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ ఇటీవల హెచ్చరించారు. భారత్‌కు మాత్రం జీవితం నిత్య కల్యాణం పచ్చ తోరణంలా గడిచే శుభఘడియలు ఇప్పుడు మొదలవుతున్నాయి.

 

ఉజ్జ్వల భవిత వైపు

భారత్‌ బ్రిటన్‌ను మించిపోయి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందనే వార్తను మొట్టమొదట ప్రకటించిన బ్లూమ్‌బర్గ్‌ సంస్థ ఒకప్పటి వలస ప్రభువులను వలస ప్రభుత్వ పాలితులు అధిగమించారని వ్యాఖ్యానించింది. రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించిన బ్రిటన్‌ నేడు చిన్న దీవిగా కుదించుకుపోయింది. గ్రేట్‌ బ్రిటన్‌ కాస్తా లిటిల్‌ బ్రిటన్‌గా తయారైంది. 1947నాటికి బ్రిటిష్‌ వలస పాలకులు పీల్చిపిప్పిచేసిన భారతదేశం ఇప్పుడు పునర్‌ వైభవాన్ని సంతరించుకోవడం నిజంగా విస్మయానందాలను కలిగిస్తోంది. బ్రిటిష్‌ వలస పాలన పరమార్థం భారతదేశ సిరిసంపదలను లూటీచేయడమే. అపార సంపద మన గడ్డ నుంచి బ్రిటన్‌కు బదిలీ అయింది. స్వాతంత్య్రం వచ్చాక పలు ప్రభుత్వాలు సోవియట్‌ శైలి ప్రభుత్వ నియంత్రణను దేశంపై రుద్ది భారతీయుల వ్యవస్థాపక సామర్థ్యాన్ని నీరుగార్చాయి. ప్రజల ఉత్సాహాన్ని, ఆశలను ఆంక్షల చట్రంలో చిదిమేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత తప్పులను సరిదిద్ది దేశార్థికాన్ని ఉన్నత శిఖరాలకు పరుగులు తీయించే విధానాలను చేపట్టారు. 2014లో తొలిసారి ప్రధాని పదవిని చేపట్టగానే భారతీయుల ఆశలు, ఆశయాలు నెరవేరే ఉజ్జ్వల భవిష్యత్తుకు బాటలు వేశారు. ఎనిమిది సంవత్సరాల్లో ప్రధాని మోదీ స్థిరంగా తీసుకొచ్చిన మార్పులు సమకాలీన ప్రపంచంలో భారతదేశానికి ప్రముఖ స్థానం కట్టబెట్టాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రస్తుత ధరల ప్రకారం భారతదేశ జీడీపీ 13.5 శాతం వృద్ధిరేటు సాధించి ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. ప్రజల కొనుగోలు శక్తి ఆధారంగా లెక్కిస్తే భారత్‌ ఇప్పటికే ప్రపంచంలో అమెరికా, చైనాల తరవాత మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. భారత్‌ మరో 25 ఏళ్లలో నూరో స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకొంటుంది. అప్పటికి ఇండియా మరింత బలీయంగా, సుసంపన్నంగా అవతరిస్తుంది. నేడు భారత్‌ ప్రపంచంలో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ డేటా వినియోగదారు. ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్యలో రెండో స్థానం ఆక్రమిస్తోంది. అంతర్జాతీయ చిల్లర వర్తక సూచీలో రెండో స్థానం సాధించింది. భారత్‌ నేడు ప్రపంచంలో మూడో అతిపెద్ద ఇంధన వినియోగదారు. ఇంధనం ఎక్కువగా వాడుతున్నామంటే ఆర్థికాభివృద్ధి జోరుగా సాగుతోందని అర్థం. ఈ ఏడాది 50 లక్షల కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు సాధించి అంతర్జాతీయ వాణిజ్యంలో తన వాటా పెంచుకొంటోంది. ఒకప్పుడు పీఎల్‌ 480 పథకం కింద ఆహారంకోసం అమెరికాపై ఆధారపడిన భారత్‌- నేడు తానే పేద దేశాలకు తిండి గింజలు అందిస్తోంది.

 

సాకారం కానున్న స్వప్నం

భారత్‌లో వంద కోట్ల డాలర్ల విలువైన కంపెనీలు 100 వరకు ఉన్నాయి. గత ఎనిమిదేళ్లలో ప్రారంభమైన యూనికార్న్‌ సంస్థల విలువ రూ.12 లక్షల కోట్లు. ఒకప్పుడు వందల సంఖ్యలో ఉన్న అంకుర సంస్థలు ప్రధాని మోదీ హయాములో డెబ్భై వేలకు పైగా పెరిగాయి. ప్రధాని మోదీ ప్రారంభించిన డిజిటల్‌ ఇండియా విప్లవం ఈ విజయాలకు మూలం. 2014లో దేశంలో 6.5 కోట్లుగా ఉన్న బ్రాడ్‌బ్యాండ్‌ చందాదారుల సంఖ్య 78 కోట్లను మించిపోయింది. భారత్‌లో దుర్భర దారిద్య్రం, వినియోగ వ్యత్యాసాలు బాగా తగ్గిపోయినట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) ఇటీవల వెల్లడించింది. రాయితీపై వంట గ్యాస్‌ సిలిండర్‌ అందించడం, గ్రామాల్లో ప్రతి ఇంటికీ తాగునీటి సరఫరా, స్వయం ఉపాధికి ముద్ర రుణాల ద్వారా పేదరికం స్థాయులను తగ్గించి ఉపాధి అవకాశాలు పెంచడం మోదీ ప్రభుత్వ ఘనత. ప్రధాని ‘ఏక్‌ భారత్‌, శ్రేష్ఠ్‌ భారత్‌’ కలను నిజం చేయడానికి ప్రభుత్వం, ప్రజలు కలిసికట్టుగా కృషి చేస్తున్నారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా, అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జంట విజయాలు సొంతం చేసుకున్న భారతదేశం- ప్రధాని మోదీ కలగన్నట్లు అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి రెట్టించిన ఉత్సాహంతో కృషి చేయాల్సి ఉంది. రానున్న రెండేళ్లలోనే ఈ స్వప్నం సాకారమవుతుందనడంలో సందేహం లేదు.

 

సంక్షోభమే అవకాశం

కొవిడ్‌ వల్ల కుదేలైన ఆర్థిక రథాన్ని మళ్లీ గాడిన పెట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన విధానాలను అవలంబించారు. ఉపాధి అవకాశాలను అందించే మౌలిక వసతుల ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టారు. ఉత్పాదకతతో ముడిపెట్టిన ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) కింద రెండు లక్షల కోట్ల రూపాయల నిధులను పరిశ్రమలకు అందించి- స్వదేశంలో ఉత్పత్తి వృద్ధికి తద్వారా ఉపాధికి ఊతమిచ్చారు. ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థగా భారత్‌ను నిలిపారు. ఇండియాలోని అతిపెద్ద సాంకేతిక నిపుణుల బలగాన్ని అంకురాలు, యూనికార్న్‌ సంస్థలను స్థాపించేలా ప్రోత్సహించారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పరిశ్రమలతో అనుసంధానమయ్యారు. ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజనను చేపట్టి మూడింట రెండు వంతుల జనాభాకు ఉచిత రేషన్‌ ఇచ్చారు. ప్రపంచంలో అతిపెద్ద కొవిడ్‌ టీకా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తిచేశారు. సంక్షోభాన్ని అవకాశంగా మలచుకోవడంలో ప్రధాని మోదీ నేర్పరితనం ప్రదర్శించారు. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ కొవిడ్‌ కుదుపుల నుంచి వేగంగా తేరుకొని శీఘ్ర అభివృద్ధి వైపు పరుగులు తీస్తోంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పటిష్ఠ నిఘా... దేశానికి రక్షాకవచం

‣ సాగరయుద్ధంలో స్వదేశీఅస్త్రం

‣ శాశ్వత సభ్యత్వం ఇంకెప్పుడు?

‣ చుక్కాని కరవైన హస్తం పార్టీ

‣ ప్రమాదంలో పాల ఉత్పత్తి

‣ నదుల్లో గరళప్రవాహం

‣ చైనా యుద్ధోన్మాద విన్యాసాలు

‣ సాగు బాగుకు సాంకేతిక సోపానం

Posted Date: 05-09-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం