• facebook
  • whatsapp
  • telegram

పాలనలో తగ్గుతున్న జనభాగస్వామ్యం

అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం

 

 

ఆదిమ సమాజాల్లో సైతం ప్రజాస్వామ్య ఆనవాళ్లు ఉన్నా, దేశకాల పరిస్థితులను బట్టి ప్రజాస్వామ్యం రూపాంతరం చెందుతూ వస్తోంది. పాలకుల నిరంకుశ పోకడలపై పోరాటం నుంచి ఆధునిక ప్రజాస్వామ్యం ఉద్భవించింది. ముఖ్యంగా ఫ్రెంచి, అమెరికన్‌ విప్లవాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఊపిరిపోశాయి. 19వ శతాబ్దం చివరి నుంచి ఐరోపాలో ప్రజాస్వామ్యం వికసించనారంభించింది. 20వ శతాబ్దం నుంచి ప్రపంచంలో పలు ప్రాంతాలకు ప్రజాస్వామ్య పాలన విస్తరించింది. చట్టబద్ధపాలన, వాక్‌ స్వాతంత్య్రం, పత్రికా స్వేచ్ఛ, వయోజన ఓటు హక్కు, స్వేచ్ఛగా న్యాయంగా ఎన్నికలు జరిపించడం, విధాన రూపకల్పనలో పౌర సమాజానికి సముచిత పాత్ర, ప్రజాస్వామ్య ప్రమాణాల పాటింపు అనేవి ఆధునిక ప్రజాస్వామ్య విశిష్ట లక్షణాలు. కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ మానవ వ్యక్తిత్వం వికసించడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించగలిగేది ప్రజాస్వామ్యం ఒక్కటే. అందువల్ల ఏటా సెప్టెంబరు 15వ తేదీని అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవంగా జరపాలని 2007లో ఐక్యరాజ్యసమితి నిశ్చయించింది. ఆ రోజు ప్రజల్లో ప్రజాస్వామ్య ఆవశ్యకత గురించి చైతన్యం పెంచడానికి అన్ని దేశాలు, సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది.

 

ప్రమాద సంకేతాలు

ప్రస్తుతం వివిధ కారణాల వల్ల ప్రపంచమంతటా ప్రజాస్వామ్యం ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం పోనుపోను తగ్గిపోతోంది. ప్రపంచ ప్రజాస్వామ్య సూచీ ప్రకారం 2020లో 49.4శాతం ప్రపంచ జనాభా ఏదో ఒక రూపంలో ప్రజాస్వామ్య పాలనలో ఉండగా... 2021కల్లా ఇది 45.7శాతానికి తగ్గింది. 37.1శాతం ప్రపంచ ప్రజలు నిరంకుశ ప్రభుత్వాల ఏలుబడిలో ఉన్నారు. దశాబ్దం క్రితం వరకు ప్రజాస్వామ్య దేశాలుగా కనిపించిన తుర్కియే, హంగరీ వంటివి క్రమంగా నియంతృత్వ పాలనలోకి జారిపోతున్నాయి. మన పొరుగునే మయన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి సైనిక నియంతృత్వం అధికారంలోకి వచ్చింది. పరిణతి చెందిన ప్రజాస్వామ్యాలైన అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి దేశాల్లోనూ సామాజిక, ఆర్థిక అంతరాలు పెచ్చుమీరుతూ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా తయారయ్యాయి. ఆ దేశాల్లో ఆర్థిక అసమానతలు, జాతి దుర్విచక్షణ, వలసదారులపై అసహనం, విద్వేషంతో హింసకు పాల్పడటం వంటివి ఎక్కువయ్యాయి. ప్రజల్లో పొటమరిస్తున్న పెడ ధోరణులను సొమ్ము చేసుకునే నాయకులు పాశ్చాత్య ప్రజాస్వామ్యాల్లో క్రమంగా పెరుగుతున్నారు. తమ దేశాలను పీడిస్తున్న అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికి వారు జనాకర్షక నినాదాలతో ముందుకొస్తున్నారు. పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాల్లో నేడు కేవలం ఒక శాతం అతిసంపన్నుల చేతిలో 60శాతం నుంచి 70శాతం దాకా సంపద పోగుపడిందని ‘ఆక్స్‌ఫామ్‌’ సంస్థ అసమానతల నివేదిక వెల్లడించింది. అసమానతలను తొలగించి ప్రజలకు సమాన రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక సాధికారతను సమకూర్చకపోతే ప్రజాస్వామ్యం క్రమంగా కృశించిపోతుందని హెచ్చరించింది.

 

భారత్‌లో ఓటర్లకు గతంలో నిరంకుశ పాలకులను అధికారం నుంచి సాగనంపిన చరిత్ర ఉంది. ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొన్నా, ఆ తరవాత రాజకీయాలేమీ పట్టనట్లు తమ దైనందిన జీవితాల్లో నిమగ్నమైపోవడం భారతీయులకు అలవాటు. ఇది ప్రజాస్వామ్య పటిష్ఠతకు ఏమాత్రం దోహదం చేయదు. విధాన రూపకల్పన మొదలు పరిపాలన వరకు ప్రతి దశలో పౌరులు చురుగ్గా పాలుపంచుకున్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం జవజీవాలతో తొణికిసలాడుతుంది. ప్రజా ప్రతినిధులు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించడం లేదు. పార్లమెంటు, శాసనసభల్లో కూలంకషంగా చర్చలు జరపకుండానే బిల్లులను ఆమోదించేయడం దీనికి నిదర్శనం. శాసన నిర్మాణంలో పార్లమెంటు స్థాయీ సంఘాలు, సలహా సంఘాల భాగస్వామ్యం రోజురోజుకూ కుంచించుకుపోతోంది. వ్యవసాయ చట్టాల గురించి ఇక్కడ చెప్పుకోవాలి. వ్యవసాయం రాష్ట్రాల జాబితాలోని అంశమే అయినా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలతో సమగ్రంగా చర్చించకుండానే హడావుడిగా వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది. దీని మీద రైతులు సుదీర్ఘంగా ఉద్యమించడంతో సాగు చట్టాలను వెనక్కుతీసుకోక తప్పలేదు.

 

పెరిగిన ఆంక్షలు

ఇటీవలి కాలంలో వాక్‌ స్వాతంత్య్రం, పత్రికాస్వేచ్ఛ మీద ఆంక్షలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వ సంస్థల్లో అసహనం పెరిగిపోతోంది. ఏలినవారికి గిట్టని పాత్రికేయులు, పౌర ఉద్యమకారులు, రాజకీయ ప్రత్యర్థులపైన కేంద్ర చట్టాలను నిరంకుశంగా ప్రయోగిస్తున్నారు. ప్రత్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారు. మతపరంగా అసహనం పెరుగుతోంది. విద్వేష నేరాలు ఎక్కువవుతున్నాయి. రాజ్యాంగ విలువల పట్ల విధేయత కన్నా వ్యక్తిగత విధేయతకే పాలకులు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ప్రభుత్వ విధానాల్లో  లొసుగులను వ్యతిరేకించడం ప్రజాస్వామ్య హక్కు అయినా, అలా ఎదురుచెప్పేవారికి ద్రోహులుగా ముద్రవేస్తున్నారు. మన రాజకీయ పార్టీల వ్యవహార శైలిలో తక్షణం పారదర్శకతను పునరుద్ధరించాలి. ప్రజాస్వామ్య ప్రక్రియ దెబ్బతింటే నష్టం రాజకీయ రంగానికి మాత్రమే పరిమితం కాబోదు. ప్రజల జీవనాధారాలూ దెబ్బతింటాయి. ఆర్థిక అనిశ్చితి, అసమానతలు పెరిగినప్పుడు ప్రజలను ఉద్ధరిస్తామంటూ నిరంకుశ నాయకులు బయలుదేరతారు. ఈ ప్రమాదాన్ని శాశ్వతంగా నివారించాలంటే ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడిఉండాలి. ఆ విలువలకు భంగం కలిగించే నాయకులను, భావజాలాలను అసలు సహించకూడదు. మాధ్యమాలు, పౌర సమాజం, రాజకీయ పార్టీలు ప్రజలను నిరంతరం చైతన్యవంతులను చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పదికాలాలపాటు పరిరక్షించాలి.

 

దృష్టి మరల్చేయత్నం...

ప్రజలు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు అతివాద, మితవాద రాజకీయ శక్తుల ప్రభావంలో పడతారని చరిత్ర చెబుతోంది. హిట్లర్‌, ముస్సోలినీలు తమ ఫాసిస్టు అజెండాతో రెండో ప్రపంచ యుద్ధం తెచ్చిపెట్టారు. ఇలాంటి అతి, మితవాద నాయకులు తాము మాత్రమే ప్రజా సమస్యలను పరిష్కరించగలమని జనాన్ని నమ్మిస్తారు. తమ కష్టాలన్నింటికీ విదేశీయులో, వలసదారులో, కొన్ని మైనారిటీ వర్గాలో కారణమని ప్రజలను రెచ్చగొడతారు. ఓటర్లు వారి మాయలో పడటం ఇటీవలి కాలంలో ఎక్కువవుతోంది. అమెరికాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుయాయులు ఏకంగా అమెరికా పార్లమెంటు (కాంగ్రెస్‌) భవనంపైనే దండెత్తిన సంగతి తెలిసిందే. వాతావారణ మార్పులు బూటకమని వాదించడం, ఆర్థిక అసమానతల నుంచి, పెరుగుతున్న రుణ భారం నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికి వలసదారులపై విరుచుకుపడటం ట్రంప్‌ రాజకీయ శైలి. 2024 ఎన్నికల్లో మళ్ళీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలని ట్రంప్‌ ఉవ్విళ్లూరుతున్నారు. సమాజంలో ఆర్థిక, సాంఘిక అసమానతలు పెరిగిపోవడం భవిష్యత్తులో ప్రజాస్వామ్యానికి ముప్పుతెచ్చిపెడుతుంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సాగురంగానికి నీటి కొరత ముప్పు

‣ అభివృద్ధి పథంలో భారత్‌

‣ సంక్లిష్ట సమయంలో స్నేహ మంత్రం

‣ పటిష్ఠ నిఘా... దేశానికి రక్షాకవచం

‣ సాగరయుద్ధంలో స్వదేశీఅస్త్రం

‣ శాశ్వత సభ్యత్వం ఇంకెప్పుడు?

‣ చుక్కాని కరవైన హస్తం పార్టీ

Posted Date: 16-09-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం