• facebook
  • whatsapp
  • telegram

పాతాళ జలం... ప్రాణాంతకం!

భూగర్భంలో హానికారక రసాయనాలు

ప్రపంచవ్యాప్తంగా భూగర్భజలాల్లో హానికారక (ఆర్సెనిక్‌) రసాయనాలు పెరుగుతూ ఉండటం అత్యంత సమస్యాత్మకంగా  మారింది. కలుషితమైన భూగర్భజలాలను దీర్ఘకాలం వినియోగించడంవల్ల దాదాపు 108దేశాల ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆర్సెనిక్‌ ప్రభావంతో తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో బంగ్లాదేశ్‌, భారత్‌, చైనా, నేపాల్‌, కంబోడియా, వియత్నాం, మయన్మార్‌, లావోస్‌, ఇండొనేసియా, అమెరికా అగ్రభాగంలో ఉన్నాయి. అర్జెంటీనా, చిలీ, హంగరీ, కెనడా, పాకిస్థాన్‌, మెక్సికో, దక్షిణాఫ్రికావంటి దేశాలు తరవాతి శ్రేణిలో ఉన్నాయి. దీని ప్రభావంవల్ల ప్రపంచవ్యాప్తంగా 50కోట్ల మంది ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో ఆసియాలో సుమారు 18కోట్ల మంది ఉన్నారు. హానికారక రసాయనాలు అధికంగా ఉండే అవక్షేప నిక్షేపాలు, అగ్నిపర్వత శిలలు, నేలలు, బొగ్గు మొదలైనవి శిథిలం కావడం, కరగడంద్వారా భూగర్భ జలాల్లోకి ఈ రసాయనాలు ప్రవేశిస్తున్నాయి. బంగారం, బొగ్గు తవ్వకాలు, పెట్రోలియం వెలికితీయడం, శిలాజ ఇంధనాలను దహనం చేయడంవల్ల; వ్యవసాయంలో వినియోగించే శిలీంధ్రనాశకాలు, కలుపు సంహారకాలు, పురుగుమందుల పిచికారీ వంటి మానవ సంబంధ కార్యక్రమాలవల్ల కూడా హానికారక రసాయనాలు భూగర్భ జలాల్లోకి చేరుతున్నాయి.

ఆర్సెనిక్‌ ఖనిజాలున్న అవక్షేపాలు హిమాలయ నదుల ద్వారా దిగువన ఉన్న డెల్టా ప్రాంతాలకు చేరడంవల్ల దేశంలో అధిక మోతాదులో రసాయనాలు ఉన్న భూగర్భజలాలను 90శాతం ఒండ్రు భూభాగాలైన ఉత్తర, వాయవ్య ప్రాంతాల్లో గుర్తించారు. మిగిలిన 10శాతం సల్ఫైడ్‌ ఖనిజాలు (ఉదాహరణకు కర్ణాటకలోని బంగారు గనులున్న ప్రాంతాలు), ఆమ్ల అగ్నిపర్వతాలు (ఉదాహరణకు ఛత్తీస్‌గఢ్‌లోని కోత్రి పగులుకు చెందిన ఆమ్ల అగ్నిపర్వతం) ఉన్న ప్రాంతాల్లో నెలకొన్నాయి. జాతీయ భూగర్భజల సంస్థ (2018) నివేదిక ప్రకారం బావుల లోతు భూపరితలం నుంచి 100 మీటర్ల కన్నా ఎక్కువ ఉన్న చోట్ల లీటరు భూగర్భజలంలో హానికారక రసాయనం 0.01 మిల్లీ గ్రాములకన్నా తక్కువగా, అదే బావుల లోతు 100 మీటర్లకంటే తక్కువగా ఉన్న చోట్ల 0.01 మిల్లీ గ్రాములకన్నా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇసుక పొరలకంటే మట్టి పొరలు ఉన్న చోట్ల నీరు తక్కువగా ఉంటుంది. దానివల్ల ఆర్సెనిక్‌ మూలాలు సరిగ్గా పలచబడక- కాలుష్యం పెరుగుతుంది.  భూగర్భజలాలను అధికంగా వెలికి తీయడమూ కాలుష్యానికి ఒక ప్రధానమైన కారణం.

జాతీయ తాగు నీటి ప్రమాణాల సంస్థ ప్రకారం లీటరు తాగు నీటిలో 0.01 మిల్లీ గ్రాముల కన్నా ఎక్కువగా హానికారక రసాయనాలు ఉండరాదు. అవి అధిక మోతాదులో ఉన్న నీటిని తాగితే వచ్చే దీర్ఘకాలిక అనారోగ్యాన్ని ‘ఆర్సెనికోసిస్‌’గా వ్యవహరిస్తారు. ముఖ్యంగా చర్మం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండెకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో పాటు ప్రాణాంతకమైన క్యాన్సర్లు రావడానికీ ఆస్కారముంది. కేంద్రీయ జల సంఘం 2019లో చేసిన ఒక అధ్యయనం ప్రకారం- తెలుగు రాష్ట్రాలతో సహా సుమారు 20రాష్ట్రాల్లో లీటరు భూగర్భజలంలో 0.01 నుంచి 0.05 మిల్లీ గ్రాముల వరకు హానికారక రసాయనాలు ఉంటున్నాయి. పది రాష్ట్రాల్లో (అసోం, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, హరియాణా, ఝార్ఖండ్‌, కర్ణాటక, పంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, పశ్చిమ్‌ బంగ) 0.05 మిల్లీ గ్రాముల కన్నా ఎక్కువ మోతాదులో ఉన్నట్లు వెల్లడైంది. దేశంలో అయిదు కోట్ల మందికి పైగా ఆర్సెనిక్‌ కాలుష్య ప్రభావానికి గురవుతున్నారు. ఇలాంటి కాలుష్య భూగర్భజలాలను పంట పొలాల్లో వినియోగిస్తే మొక్కల ఆకులు, పండే పంటలు విషతుల్యమవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కేంద్రీయ జల సంఘం ఆర్సెనిక్‌ మూలాలు బహిర్గతమైన ప్రాంతాల్లో భూగర్భజలాలను తాగడానికి, పంట సాగుకు వినియోగించవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

ఆర్సెనిక్‌ కాలుష్య తీవ్రత ప్రభావాన్ని తగ్గించడానికి పలు ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. నీటి మట్టాలు పెరిగే విధంగా వాన నీటిని భూగర్భంలో ఇంకేలా చేయాలి. భూఉపరితల, భూగర్భజలాలను శాస్త్రీయ పద్ధతిలో వినియోగించాలి. అంటే నీటిని అదేపనిగా తోడేయడం కాకుండా, రీఛార్జికీ ప్రాధాన్యమివ్వాలి. దానివల్ల హానికారక రసాయనాల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఆర్సెనిక్‌ మూలాలు ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వాలు- తాగడానికి, పంట సాగుకు సురక్షితమైన ఉపరితల నీటిని అందించాలి. హానికారక రసాయనాల కాలుష్యానికి కారణాలేమిటి, దానివల్ల సంభవించే సమస్యలు, అనుసరించాల్సిన నివారణ పద్ధతుల మీద విస్తృతమైన అవగాహన కల్పించాలి. శాస్త్రీయ పద్ధతుల ద్వారా ఆర్సెనిక్‌ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలి.

- ఆచార్య నందిపాటి సుబ్బారావు
(ఆంధ్ర విశ్వవిద్యాలయ భూవిజ్ఞానశాస్త్ర విశ్రాంత ఆచార్యులు)

 

Posted Date: 20-04-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం