• facebook
  • whatsapp
  • telegram

పంట వ్యర్థాల దహనానికి విరుగుడు

పంజాబ్‌లో వరిపంట వ్యర్థాల దహనాన్నినివారించడానికి శాస్త్రవేత్తలు పలు ప్రత్యామ్నాయాల్నిసూచిస్తున్నారు. అందుకోసం స్వల్ప వ్యవధిలో సాగయ్యే వరి రకాలను ఉత్పత్తి చేస్తున్నారు. దానివల్ల రబీ సాగుకు ముందు పంట వ్యర్థాల నిర్వహణకు సరిపడా సమయం ఉంటుందని చెబుతున్నారు.

పంజాబ్‌ సహా ఇతర ప్రాంతాల్లో పంట కోతల అనంతరం వరి వ్యర్థాలను తగలబెడుతున్నారు. దానివల్ల శీతాకాలంలో ఉత్తర భారతదేశంలో వాయుకాలుష్యం తీవ్రమవుతోంది. పంజాబ్‌లో పూసా-44 వరి రకాన్ని అధికంగా సాగుచేస్తున్నారు. దాని పంటకాలం 155 రోజులు. దానివల్ల ఖరీఫ్‌ వరి అవశేషాలను తొలగించి, రబీ పంటకు భూమిని సిద్ధం చేయడానికి చాలా తక్కువ సమయమే ఉంటోంది. దాంతో రైతులు వరి వ్యర్థాలను దహనం చేయడంవైపు మొగ్గు చూపుతున్నారు. పైగా దాన్ని తేలికైన విధానంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో వరి వ్యర్థాల నిర్వహణకు మరింత సమయం ఉండేలా స్వల్పకాలంలో సాగుచేసే వరి వంగడాలను తీసుకొచ్చేందుకు భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐఏఆర్‌ఐ) కృషి చేస్తోంది.

పంజాబ్‌లో ఇప్పటికే పీఆర్‌-126, పూసా బాస్మతి-1509, 1692 రకాలను ఐఏఆర్‌ఐ విడుదల చేసింది. వాటి పంటకాలం 120 రోజులే. పంజాబ్‌లో మొత్తం వరి విస్తీర్ణం 31 లక్షల హెక్టార్లు. ఈ రకాలను ప్రస్తుతం అయిదారు లక్షల హెక్టార్లలోనే సాగు చేస్తున్నారు. ఒక నెల పంట వ్యవధి తగ్గితే హెక్టారుకు టన్ను దిగుబడి కోసుకుపోతుంది. అయితే, స్వల్పకాలిక రకాలను సాగుచేయడం వల్ల పంట అవశేషాల నిర్వహణకు 25 రోజుల సమయం ఉంటుందని ఐఏఆర్‌ఐ సంచాలకులు ఏకే సింగ్‌ చెబుతున్నారు. సాగునీటితోపాటు ఇతర ఖర్చులు సైతం తగ్గుతాయని వెల్లడిస్తున్నారు. స్వల్పకాలిక వరిరకాలు సాగుచేస్తే సెప్టెంబరు మధ్యలో లేదా అక్టోబరు చివరికల్లా పంట నూర్పిళ్లు పూర్తవుతాయి. రబీలో గోధుమ వేసేందుకు పొలాలను సిద్ధం చేయడానికి దాదాపు ఒక నెల సమయం ఉంటుంది. అదే దీర్ఘకాలిక వరి వంగడాలను సాగుచేస్తే నవంబరు మొదటి వారంలో నూర్పిళ్లు పూర్తవుతాయి. దానివల్ల వెంటనే రబీ పంట వేయడానికి రైతులు వరి అవశేషాలను కాలుస్తున్నారు. దీర్ఘకాలిక వరి వంగడాలను పండించకుండా పంజాబ్‌ రైతులను నియంత్రించడానికి పూసా-44 రకం విత్తనోత్పత్తిని ఐఏఆర్‌ఐ నిలిపివేసింది. ఇప్పుడు రైతుల వద్ద ఉన్న విత్తనాలతోనే ఆ రకాన్ని సాగుచేస్తున్నట్లు ఏకే సింగ్‌ చెప్పారు. ప్రస్తుతం పంజాబ్‌లో అధిక శాతం పూసా-44 రకాన్నే సాగుచేస్తున్నారు. రాబోయే రెండు మూడేళ్లలో ఇది మరింత తగ్గుతుందని ఆయన వెల్లడించారు.

ఒక్క పంజాబ్‌లోనే ఏటా రెండు కోట్ల టన్నుల వరి అవశేషాలు వెలువడతాయని అంచనా. హరియాణాలో అవి 70 లక్షల టన్నుల దాకా ఉంటాయి. వాటిని దహనం చేయడంవల్ల కార్బన్‌ మోనాక్సైడ్‌, మీథేన్‌ వంటి హానికర వాయువులు వాతావరణంలో కలుస్తున్నాయి. అవి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అందువల్ల వరి అవశేషాలను కాల్చడానికి బదులుగా ఇతర పద్ధతులను పాటించాలని నిపుణులు చూచిస్తున్నారు. అందుకోసం హ్యాపీ సీడర్‌ మెరుగైన ప్రత్యామ్నాయం అని చెబుతున్నారు. దీన్ని ట్రాక్టరుకు అమర్చుకోవచ్చు. కోత అనంతరం నేలపై మిగిలిపోయిన వరి వ్యర్థాలను అది సేకరిస్తుంది. ఆ యంత్రంలోని సీడ్‌డ్రిల్‌ గోధుమలను మట్టిలో విత్తుతుంది. ఆపై విత్తిన ప్రదేశంలో గడ్డిని రక్షక కవచంగా పరుస్తుంది. ఈ విధానం నేలలో తేమను కాపాడుతుంది. గోధుమ పంటలో కలుపు మొక్కలను సైతం నివారిస్తుంది. అలాగే డీకంపోజర్‌ సాయంతో పంట అవశేషాలు మట్టిలోనే కుళ్ళిపోయేలా చేయవచ్చు. పంట అవశేషాల నిర్వహణలో హరియాణా కొంత ముందంజలో ఉంది. వరిగడ్డితో విద్యుత్తును తయారుచేసే కేంద్రాలను అక్కడ నెలకొల్పారు. హరియాణా సర్కారు తీసుకున్న చర్యల వల్ల 30శాతం దాకా పంట వ్యర్థాల దహనం తగ్గినట్లు పరిశీలనలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఏటా 50 కోట్ల టన్నుల పంట అవశేషాలు ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా. వాటిలో పశుగ్రాసం, గృహ, పారిశ్రామిక అవసరాలకు వినియోగించగా 14.2 కోట్ల టన్నుల మేర మిగిలిపోతున్నాయి. అందులో దాదాపు 9.2 కోట్ల టన్నుల అవశేషాలను కాలుస్తున్నారు. చైనా, జపాన్‌, మలేసియా వంటి దేశాల్లో పంట అవశేషాలతో విద్యుత్తు, కంపోస్ట్‌ ఉత్పత్తి చేస్తున్నారు. భారత్‌లోనూ అలాంటి విధానాలను అందిపుచ్చుకోవాలి. బహుముఖ ప్రత్యామ్నాయాలను అనుసరించినప్పుడే పంట వ్యర్థాల దహనాన్ని నివారించడం సాధ్యమవుతుంది.

- సాయిగ్రీష్మ
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పీడన గుప్పిట్లో స్త్రీ

‣ భాగ్యనగరం... హరిత శోభితం!

‣ సమస్యల ఊబిలో రేపటి పౌరులు

‣ భద్రతతోనే మహిళా సాధికారత

Posted Date: 26-11-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం