• facebook
  • whatsapp
  • telegram

భాగ్యనగరం... హరిత శోభితం!

ఘనమైన చరిత్ర కలిగిన భాగ్యనగరం ఎన్నో అంశాల్లో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ముఖ్యంగా పచ్చదనం పెంపుదలలో విశిష్టంగా నిలుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ప్రపంచస్థాయి పురస్కారాలను హైదరాబాద్‌ నగరం సొంతం చేసుకుంది.

హైదరాబాద్‌ జనాభా ప్రస్తుతం సుమారు కోటి. 2041 నాటికి ఇది 1.90 కోట్లకు చేరుతుందని అంచనా. ప్రపంచంలోని చాలా నగరాలు కాలుష్యంతో సతమతమవుతుంటే, భాగ్యనగరం మాత్రం పచ్చదనంతో పరిఢవిల్లుతోంది. ఈ క్రమంలో ప్రపంచ స్థాయి హరిత నగర పురస్కారాన్ని ఇటీవల సొంతం చేసుకుంది. దానితోపాటు లివింగ్‌ గ్రీన్‌ ఫర్‌ ఎకనమిక్‌ రికవరీ అండ్‌ ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌ అవార్డునూ దక్కించుకుంది. దేశంలో ఈ అవార్డులకు ఎంపికైన ఏకైక నగరంగా హైదరాబాద్‌ నిలిచింది. ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ ప్రొడ్యూసర్స్‌(ఏఐపీహెచ్‌) ఆధ్వర్యంలో గత నెల 14న దక్షిణ కొరియాలో జరిగిన కార్యక్రమంలో ఈ రెండు పురస్కారాలను అందించారు. లివింగ్‌ గ్రీన్‌ ఫర్‌ ఎకనమిక్‌ రికవరీ అండ్‌ ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌ విభాగంలో హైదరాబాద్‌ బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్‌) పచ్చదనంలో మేటిగా ఎంపికైంది.

కోట్ల సంఖ్యలో మొక్కలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం 2015-16లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం అనతి కాలంలోనే రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చింది. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో ప్రస్తుతం 24శాతం ఉన్న పచ్చదనాన్ని 33శాతానికి పెంచాలనే లక్ష్యంతో ఇది ముందుకు సాగుతోంది. హరితహారం స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు సారథ్యంలో హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ), హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ) భాగ్యనగరంతో పాటు ఔటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ పచ్చదనాన్ని పెంచాయి. ఫలితంగా హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి పురస్కారం దక్కింది. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన హరితహారం ప్రపంచంలో ఇప్పటిదాకా పచ్చదనాన్ని పెంపొందించేందుకు చేపట్టిన మూడో అతి పెద్ద కార్యక్రమం. మొదటిది గ్రీన్‌ వాల్‌ ఆఫ్‌ చైనా. గోబి ఎడారి విస్తరించకుండా 4,500 కిలోమీటర్ల మేర హరిత కుడ్యం ఏర్పాటు చేశారు. రెండోది... అమెజాన్‌ నది వెంట 100 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం. ఆ తరవాత మూడోది తెలంగాణకు హరితహారం. ప్రపంచంలోనే అతి ఎక్కువ చెట్లు ఉన్న పచ్చని ప్రముఖ నగరాల్లో ఒకటిగా హైదరాబాదును ఇటీవల పచ్చదనం పెంపునకు కృషి చేసే ఆర్బర్‌ డే ఫౌండేషన్‌ ప్రకటించింది.

హరితహారంలో భాగంగా నగరంలో రోడ్ల పక్కన, 24 చెరువుల ప్రాంతాలు, కాలనీల వీధులు, పలు సంస్థల ప్రాంగణాలు, ఔటర్‌ రింగ్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో కోట్ల సంఖ్యలో మొక్కలు నాటారు. ఇవే కాకుండా 1087 అర్బన్‌ పార్కులలోనూ పచ్చదనం పెంచారు. నగరంలోని 29 ఫ్లైఓవర్ల కింద ఉన్న ఖాళీ స్థలాల సుందరీకరణకు మొక్కలు నాటడంతోపాటు 100 దట్టమైన వనాలు ఏర్పాటు చేశారు. దీంతో ఆక్రమణలు, అక్రమ పార్కింగ్‌ల నివారణకు, వ్యర్థాలు చేరకుండా చూడటానికి అవకాశం దక్కింది. భాగ్యనగరంలో గత రెండేళ్లలో 406 పార్కులను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. 2015 నుంచి ఇప్పటిదాకా నగరంలో 6.20 కోట్ల మొక్కలను నాటి పెంచుతున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని మియావాకి తరహాలో (తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలను అడవి మాదిరిగా పెంచే జపాన్‌ పద్ధతి) హరితవనంగా తీర్చిదిద్దిన ఘనత రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌కు దక్కుతుంది. నగరంలో ప్రత్యేకంగా ఆరు వందలకుపైగా నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. 45 ప్రాంతాలను మియావాకి తరహాలో తీర్చిదిద్దడానికి 9.95 లక్షల మొక్కలను నాటారు. అర్బన్‌ ఫారెస్టు పార్కులను నడక, సైక్లింగ్‌ ట్రాకులతో యోగా, విశ్రాంతి ప్రాంతాలలో ఏర్పాటు చేయడంతో నగరవాసులకు అవి ఎంతో ఉపయోగకరంగా మారాయి. పట్టణ ప్రగతి కార్యక్రమంలో గుర్తించిన ప్రకృతి వనాల్లో వాకింగ్‌ ట్రాక్‌లు, కూర్చోవడానికి బెంచీలు, ఓపెన్‌ జిమ్‌లను సైతం ఏర్పాటు చేశారు.

అభివృద్ధి పనుల్లో భాగంగా ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపట్టినప్పుడు అప్పటికే అక్కడ ఉన్న చెట్లను పరిరక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు. స్థిరాస్తి రంగంలో కొత్త లేఅవుట్లకు అనుమతులు మంజూరు చేసే సమయంలోనే 15శాతం విస్తీర్ణాన్ని పచ్చదనం కోసం కేటాయించేలా చూస్తున్నారు. పారిశ్రామిక వాడల ఏర్పాటు ప్రాంతాల్లోనూ ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన హరిత నిధి ఏర్పాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌ కుమార్‌ తొలుత స్పందించారు. ఆ స్ఫూర్తితో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, ఉద్యోగ సంఘాలు, ప్రజాప్రతినిధులు సైతం తమ జీతాల నుంచి కొంత మొత్తంలో నగదు అందించడానికి ముందుకు రావడంతో హరిత నిధి ఆలోచన ఫలప్రదమైంది. తెలంగాణ మున్సిపల్‌ చట్టంలో భాగంగా గ్రీన్‌ సెల్‌ను ఏర్పాటు చేసి బడ్జెట్‌లో 10శాతం నిధులను నర్సరీల్లో మొక్కల పెంపకం, హరిత వనాల ఏర్పాటుకు కేటాయిస్తున్నారు. ఇది దేశంలోనే ఆదర్శవంతమైన నిర్ణయం.

నగరానికి మణిహారం

నగరంలో గత ఆర్థిక సంవత్సరంలో రూ.384.80 కోట్లతో పార్కులను అభివృద్ధి చేశారు. మరో రూ.134.23 కోట్లతో 57 థీమ్‌ పార్కులు (రకరకాల ఆకృతుల్లో ఉండేవి) ఏర్పాటయ్యాయి. ఇవే కాకుండా పిల్లలకోసం 18 పంచతంత్ర పార్కులు, 74 ప్రాంతాల్లో ఓపెన్‌ జిమ్‌లు సైతం అందుబాటులోకి వచ్చాయి. మహానగరం చుట్టూ ఔటర్‌ రింగురోడ్డు 158 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దీని పరిధిలో మూడు వరసల్లో వివిధ రకాల ఎత్తుల్లో ఆకర్షణీయమైన మొక్కలు వాహనదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నగరానికి పచ్చని మణిహారంగా ఓఆర్‌ఆర్‌ భాసిస్తోంది. ఇదే కాకుండా జాతీయ, ప్రాంతీయ రహదారుల పరిధిలో 881 కిలోమీటర్ల పొడవున మొక్కల పెంపకం సాగుతోంది. నగరంలో 111 ప్రాంతాల్లో ఆక్సిజన్‌ను అందించేలా ఏర్పాటైన వనాలు (లంగ్‌ స్పేసెస్‌) నగర వాసులకు ఉత్తేజాన్ని, ప్రకృతి పట్ల అవగాహనను పెంచుతున్నాయి.

పెరిగిన పచ్చదనం

భాగ్యనగర వాసులు స్వచ్ఛందంగా ఇళ్లలో పెంచుకునేలా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలు ఉచితంగా మొక్కలు పంపిణీ చేశాయి. హైదరాబాద్‌లో దాదాపు 976 పార్కులు ఉన్నాయి. వాటిలో 760 పార్కులను కాలనీ సంక్షేమ సంఘాలు స్వచ్ఛందంగా దత్తత తీసుకొని మొక్కల నిర్వహణను చూసుకుంటున్నాయి. ఔటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ కూడా మొక్కలు నాటడంతోపాటు ప్రత్యేకంగా అర్బన్‌ పార్కులను ఏర్పాటు చేశారు. ఫలితంగా 2011లో నగరంలో 33.15 చదరపు కిలోమీటర్ల మేర ఉన్న మొక్కలు, చెట్ల విస్తీర్ణం 2021 నాటికి 81.81 చదరపు కిలోమీటర్లకు చేరింది. హైదరాబాద్‌లో 2011 నుంచి అటవీ విస్తీర్ణం 147శాతం పెరిగిందని ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిరుడు విడుదల చేసిన నివేదిక తెలిపింది. మిగతా నగరాలతో పోలిస్తే పచ్చదనం పెరుగుదల భాగ్యనగరంలో గరిష్ఠ స్థాయిలో ఉందని అది వెల్లడించింది.

- డాక్టర్‌.ఎన్‌.యాదగిరిరావు

(అదనపు కమిషనర్‌, హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సమస్యల ఊబిలో రేపటి పౌరులు

‣ భద్రతతోనే మహిళా సాధికారత

‣ వణికిస్తున్న ప్రకృతి విపత్తులు

‣ జీ20 నాయకత్వం బృహత్తర అవకాశం

‣ ద్వైపాక్షిక బంధానికి కొత్త చివుళ్లు

‣ నీరుగారుతున్న సహ చట్ట స్ఫూర్తి

Posted Date: 26-11-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాష్ట్రీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం