• facebook
  • whatsapp
  • telegram

జీ20 నాయకత్వం బృహత్తర అవకాశం

డిసెంబరు-2022 నుంచి జీ-20 కూటమికి భారత్‌ నేతృత్వం వహిస్తుంది. దేశాలు, ప్రజల మధ్య సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించే చరిత్రాత్మక అవకాశం మనదేశానికి దక్కింది. హరిత అభివృద్ధి, డిజిటల్‌ రూపాంతరీకరణ, మహిళా కేంద్రిత అభివృద్ధి, పట్టణ మౌలిక వసతుల విస్తరణలకు జీ20 ప్రాధాన్యమిచ్చేలా భారత్‌ చొరవ తీసుకోవాల్సిన తరుణమిది.

ఇవి యుద్ధానికి రోజులు కావని, ప్రపంచ దేశాలు ఆర్థిక, సామాజిక సమస్యల పరిష్కారంపై సకల శక్తియుక్తులు కేంద్రీకరించాలన్న భారత్‌ పిలుపును ఇటీవలి జీ20 సంయుక్త ప్రకటనలో పొందుపరచారు. కొవిడ్‌, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల    సరఫరా గొలుసులు విచ్ఛిన్నమై, ప్రపంచ దేశాలు ఆహార ఇంధన కొరతలతో సతమతమవుతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల అన్ని దేశాలూ అల్ప అభివృద్ధి రేటుతో సరిపెట్టుకోవలసిన దుస్థితిలోకి జారిపోతున్నాయి. ఈ సంక్షోభం నుంచి బయటపడటమే ముఖ్యమని, యుద్ధాలతో పరిస్థితిని మరింత దిగజార్చుకోకూడదని భారత్‌ స్పష్టంచేస్తోంది. జీ20 అధ్యక్ష హోదాలో ప్రపంచ ఆర్థిక రథాన్ని మళ్లీ పట్టాలెక్కించడం ద్వారా 2030 కల్లా ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యా(ఎస్డీజీ)ల సాధనలో సభ్యదేశాలకు ఇండియా ప్రేరణగా నిలవగలుగుతుంది. ప్రపంచంపై పెరిగిపోయిన రుణ భారాన్ని తగ్గించి, ఎస్డీజీల అమలుకు ఎక్కువ నిధులు కేటాయించేలా ఒప్పించేందుకు భారత్‌ కృషి చేయాలి.

సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు

సమ్మిళిత అభివృద్ధి సాధనకు ఎస్డీజీలు బలమైన సాధనాలు. పేదలు, బలహీన వర్గాలకు అవి వరప్రసాదాలు. 2030కల్లా ఎస్డీజీలను సాధించాలని ప్రపంచ దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నా కొవిడ్‌ వల్ల అది నెరవేరేలా కనిపించడం లేదు. లక్ష్య సాధనకు ప్రపంచం 2078 వరకు ఆగాల్సి వచ్చేట్లుంది. 2015-19 మధ్యకాలంలో భారత్‌ ఎస్డీజీల అమలుపై పెట్టిన శ్రద్ధను బట్టి చూస్తే, మిగతా ప్రపంచంకన్నా ముందే, అంటే 2059కల్లా ఎస్డీజీలను సాధించగలుగుతుందని భావించవచ్చు. ఎస్డీజీల సాధనకు పునాదిగా ఉపయోగపడే తొమ్మిది కార్యక్రమాలకు భారత్‌ ప్రాధాన్యం ఇచ్చేట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. మొదటగా సమగ్ర శిశు అభివృద్ధి కార్యక్రమం (ఐసీడీఎస్‌), జాతీయ పౌష్టికాహార కార్యక్రమం కింద పోషక విలువల వృద్ధికి కృషి చేయాలి. సవరించిన క్షయ నివారణ కార్యక్రమం కింద వ్యాధికి చికిత్సను విస్తరించాలి. జాతీయ ఆరోగ్య కార్యక్రమం కింద కుటుంబ నియంత్రణ సేవలను ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. నవజాత శిశువులకు ఇంటి వద్ద సంరక్షణ సేవలు అందించడం, టీకా కార్యక్రమాలను విస్తరించడం వంటివి కీలకం. జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ కార్యక్రమం కింద హెచ్‌ఐవీ  నిరోధక వ్యూహాల అమలు తప్పనిసరి. వ్యవసాయ పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన కింద నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించి, జాతీయ ఆహార భద్రతా పథకాన్ని పకడ్బందీగా చేపట్టాలి. దీంతోపాటు గర్భిణులకు కాల్షియం, సూక్ష్మపోషకాల మాత్రలను, బాలలకు కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని అందించాలి. ఉపాధ్యాయులు మెరుగైన బోధనా పద్ధతులను అనుసరించడం అవసరం. ప్రపంచం పరిమిత వనరులతోనే ఆశించిన లక్ష్యాలను సాధించక తప్పదు కాబట్టి, తక్కువ వ్యయంతో ఎక్కువ ఫలితాలను అందించే కార్యక్రమాలను మొదట చేపట్టడం ముఖ్యం. జీ20 అధ్యక్ష హోదాలో అభివృద్ధి కార్యక్రమాల ప్రాధాన్య క్రమాన్ని మనదేశం నిర్ణయించాలి. ఒకప్పుడు ఆహార లోటును ఎదుర్కొన్న భారత్‌ నేడు ఆహార మిగులును సాధించింది. గడచిన మూడేళ్లలో ‘ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న పథకం’ ద్వారా అన్నార్తులను ఆదుకున్న భారతదేశం ఇతర దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. రైతుల నుంచి సేకరించిన ఆహార ధాన్యాలతో నిల్వలు ఏర్పాటు చేసి జాతీయ ఆహార భద్రతను సాధిస్తోంది. రైతులకు కనీస మద్దతు ధర, పంటల బీమా వంటి సౌకర్యాలను అందిస్తోంది. ఆహార భద్రతలో తాను గడించిన అనుభవం, నైపుణ్యాలను భారత్‌- ఆఫ్రికా, ఆసియా దేశాలతో పంచుకోవాలి. వాతావరణ మార్పులను నిరోధించడానికి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకూ బహుళపక్ష వేదికల సంస్కరణ అత్యంత కీలకమవుతుంది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)లను పునర్‌ వ్యవస్థీకరించడం ద్వారా అవి సమర్థంగా పనిచేసేలా చూడాలి.

అధ్యక్ష హోదాలో కృషి

శిలాజ ఇంధనాలను పరిహరించి వాతావరణ మార్పుల నిరోధానికి భారత్‌ మార్గదర్శకత్వం వహించాలి. వాతావరణ మార్పులు కలిగించే నష్టాలను ఎదుర్కొని హరిత ఇంధనాల వైపు పురోగమించడం కోసం వర్ధమాన దేశాలకు నిధులు సమకూరుస్తామని సంపన్న దేశాలు వాగ్దానం చేశాయి. ఆ హామీ సక్రమంగా అమలయ్యేలా జీ20 అధ్యక్ష హోదాలో భారత్‌ చర్యలు తీసుకోవాలి. నిరుడు ‘కాప్‌-26’ వాతావరణ సదస్సులో ప్రధాని మోదీ- 2070 కల్లా కర్బన ఉద్గారాల విడుదల, వాటి తగ్గుదల సమానంగా ఉండేలా నెట్‌ జీరో లక్ష్యాన్ని సాధిస్తామని ప్రకటించారు. 2030కల్లా పునరుత్పాదక ఇంధన వనరులతో 500 గిగావాట్ల విద్యుదుత్పాదన సామర్థ్యాన్ని సంపాదిస్తామన్నారు. కర్బన ఉద్గారాలను 100 కోట్ల టన్నుల మేర తగ్గిస్తామని చెప్పారు. సగందాకా ఇంధన అవసరాలకోసం పునరుత్పాదక వనరులపైనే ఆధారపడతామన్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో కర్బన వినియోగం 45 శాతానికి మించకుండా జాగ్రత్త పడతామని వెల్లడించారు. జీ20 అధ్యక్ష హోదాలో ఐరోపా సమాఖ్య (ఈయూ), జపాన్‌, అమెరికాలతో కలిసి సౌర, పవన, హైడ్రోజన్ల ద్వారా విద్యుదుత్పాదనలో కొత్త శిఖరాలను అందుకోవాలి. భారత్‌ అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, డిజిటల్‌ ప్రజాస్వామ్యంగా ఆవిర్భవించాలనుకుంటున్న సమయంలో జీ20 అధ్యక్ష పదవిని చేపట్టడం విశేషం. ఊపు తగ్గుతున్న ప్రపంచార్థికం తిరిగి కోలుకునేలా చేయడానికి, రుణభారంలో కూరుకుపోయిన 70 దేశాలను సముద్ధరించడానికి, కొవిడ్‌ వల్ల దుర్భర దారిద్య్రంలోకి జారిపోయిన కోట్ల మందికి చేయూత ఇవ్వడానికి, వాతావరణ మార్పుల నిరోధానికి ఇండియా కృషి చేయాలి. ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల అమెరికా-ఈయూ, రష్యా-చైనా కూటముల మధ్య వైరం ముదురుతున్నందు వల్ల శాంతి సామరస్యాల కోసం అవిరళ కృషి జరపాలి.

వర్ధమాన దేశాలకు స్ఫూర్తి

భారత్‌లో మొబైల్‌, డేటా విప్లవం- స్మార్ట్‌ ఫోన్ల వినియోగ విజృంభణకు కారణమైంది. ఆన్‌లైన్‌ ద్వారా కొవిడ్‌ టీకాల కార్యక్రమం, ఆయుష్మాన్‌ భారత్‌ పథకాలు విజయవంతమయ్యాయి. యూపీఐ ద్వారా చెల్లింపులు, జన్‌ధన్‌ ఖాతాలు, ఆధార్‌, మొబైల్‌ ద్వారా అర్హులకు నేరుగా నగదు బదిలీ వంటి అంశాల్లో భారత్‌ విజయాల నుంచి వర్ధమాన దేశాలు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. వ్యవసాయదారులకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న ఈ-మండీలు ఇతర దేశాలకు అనుసరణీయం!
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ద్వైపాక్షిక బంధానికి కొత్త చివుళ్లు

‣ నీరుగారుతున్న సహ చట్ట స్ఫూర్తి

‣ ఒప్పంద సేద్యంలో లొసుగుల రాజ్యం

‣ మడ అడవులకు మరణ శాసనం

‣ ఇరాన్‌ మహిళ స్వేచ్ఛానినాదం

‣ చట్టం... రైతు చుట్టం కావాలి!

Posted Date: 26-11-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం