• facebook
  • whatsapp
  • telegram

ఇరాన్‌ మహిళ స్వేచ్ఛానినాదం

 

 

ఇరాన్‌లో హిజాబ్‌ వ్యతిరేక ప్రదర్శనలకు దిగుతున్న  ఆందోళనకారులకు మరణశిక్షలు విధిస్తున్నారు. దీంతో ఆ దేశంపై ఆంక్షల తీవ్రత పెరిగింది. తాజాగా తమ ఆంక్షల జాబితాను విస్తరించినట్లు ఐరోపా సమాఖ్య ప్రకటించింది.

 

తలపై హిజాబ్‌ను సరిగ్గా ధరించలేదని 22 ఏళ్ల మహాసా అమీనీని గత సెప్టెంబరులో ఇరాన్‌ పోలీసులు హతమార్చడంపై నిరసనలు పెల్లుబికాయి. ఆ ఆగ్రహ జ్వాల చల్లారకపోగా పలు నగరాలు, పట్టణాలకు పాకింది. షియాల ఆధిక్యంగల ఇరాన్‌లో అమీనీ- సున్నీ ముస్లిములైన కుర్దు తెగకు చెందిన యువతి. ఆమె పార్థివ దేహాన్ని కుర్దిస్థాన్‌ రాష్ట్రంలోని సాకెజ్‌ నగరంలో ఖననం చేశారు. అమీనీ మరణానంతరం 40వ రోజు నివాళులు అర్పించడానికి పెద్ద సంఖ్యలో జనం హాజరై ఆమె తల్లిదండ్రులకు తమ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా హింసాయుత దాడి చోటుచేసుకొని పలువురు మరణించారు, అనేకులు గాయపడ్డారు. దాడి వెనక ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థ ‘ఐసిస్‌’ హస్తముందనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అమెరికా వత్తాసుతో సిరియాలో కుర్దులు తమపై పోరాడుతున్నారనే దుగ్ధతో ఐసిస్‌ ఈ దురాగతానికి పాల్పడినట్లు కనిపిస్తోంది. దాడికి తామే కారణమని ఐసిస్‌ ప్రకటించాక సాకెజ్‌ నగరంలో అమీనీ మృతిపై నిరసనలు మరింత ఉద్ధృతమయ్యాయి. నగర వనితలు తలపై నుంచి హిజాబ్‌ వస్త్రాలను తొలగించి బహిరంగంగా తగలబెట్టారు. ఇరాన్‌ ఇస్లామిక్‌ పాలకులు విధించిన నియంత్రణలను ఉల్లంఘించిన మొట్టమొదటి నగరం సాకెజ్‌. అక్కడి ప్రజా ప్రదర్శనలను అణచివేయడానికి ప్రభుత్వం పెద్దయెత్తున దమనకాండకు దిగింది. ఇరాన్‌లో మృతులకు 40వ రోజు శ్రద్ధాంజలి ఘటించడం ఆనవాయితీ. సాకెజ్‌ నగరంలో నివాళులు అర్పించడానికి జనం పెద్దయెత్తున తరలివచ్చి నిరసన తెలిపారు. కుర్దులు సున్నీలు కావడంతో షియా ప్రాబల్య ఇరాన్‌ వారిని వేధిస్తోందని, అమీనీ మృతికి ఈ ద్వేషమే కారణమనే భావన బలపడిందనే అభిప్రాయాలున్నాయి.

 

ఇరాన్‌, ఇరాక్‌, సిరియా, తుర్కియే వ్యాప్తంగా ఉండే కుర్దులంతా కలిసి సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకోవాలనేది చిరకాల స్వప్నం. వేర్పాటువాదం బలంగా ఉన్న కుర్దు ప్రాంతాల్లోనే కాకుండా ఇస్ఫహాన్‌, జాహీడాన్‌ నగరాల్లో కూడా మహిళలపై పాలకుల నిర్బంధాలపై నిరసన నివురుగప్పిన నిప్పులా వ్యాపించి ఉంది. కళా, సాంస్కృతిక కేంద్రమైన ఇష్పహాన్‌లో వేల మంది పర్షియా యూదులు నివసిస్తున్నారు. ఈ నగరంలోని మహిళలు కూడా వీధులకెక్కి అమీనీ మృతికి నిరసన తెలిపారు. అమీనీతోపాటు వందలమంది ప్రదర్శకుల మృతికి కారణమైనవారిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మొదటి నుంచీ ప్రశాంతతకు పెట్టింది పేరైన ఇస్ఫహాన్‌లో యూదుల ప్రార్థనా మందిరాలు 13 ఉన్నాయి. ఇక్కడ ఎన్నడూ ఎలాంటి అలజడీ జరగకపోవడం వల్ల అయతుల్లా ఖొమైనీ ఇస్ఫహాన్‌లో యూదులు నివసించడాన్ని కొనసాగనిచ్చారు. కానీ, తాజా నిరసనల వెనక అమెరికా, యూదు శక్తుల హస్తం ఉందని ప్రస్తుత ఇరాన్‌ మతాధినాయకుడు అయతుల్లా అలీ ఖమేనే ఆరోపించడం గమనార్హం. అయితే, ఆయన పర్షియా యూదులను ప్రస్తావించలేదు. ఇరాన్‌లో ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లు, ప్రదర్శనలకు అమెరికాయే ప్రధాన కారణమంటున్నారు. కుర్దులకు ప్రధానంగా అమెరికా నుంచి ఆర్థిక, ఆయుధ సహకారాలు అందుతాయని ఇక్కడ గమనించాలి.

 

అనేక నగరాలు, పట్టణాల్లో నిరసనలు పెల్లుబికినా ఇరాన్‌ ప్రభుత్వం ప్రధానంగా ఇస్ఫహాన్‌, సాకెజ్‌, జాహీడాన్‌లపైనే దృష్టి కేంద్రీకరించింది. జాహీడాన్‌లో నిరసనకారులను పెద్దయెత్తున ఊచకోత కోస్తున్నట్లు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు వెల్లడించాయి. ఇరాన్‌లో సున్నీ ముస్లిములు అధికంగా నివసించే ప్రాంతాల్లో జాహీడాన్‌ ఒకటి. ఇరాన్‌లోని సిస్తాన్‌, బెలూచీ ప్రాంతానికి జాహీడానే రాజధాని. అమీనీ మృతిపై ఆందోళనలు ప్రారంభమయ్యాక అత్యధిక సంఖ్యలో ప్రదర్శకులు మరణించినదీ అక్కడే. శుక్రవారాల్లో అక్కడి మసీదుల ముందు పెద్దయెత్తున సైనికులను, పోలీసులను మోహరిస్తున్నారు. దేశమంతటా పెద్దసంఖ్యలో నిరసనకారులు మరణించగా, వేలమందిని జైళ్లలో కుక్కినట్లు తెలుస్తోంది. అమీనీ మరణానంతరం ఇరాన్‌లో మతాచార పరాయణులకు, ఉదారవాదులకు మధ్య విభజన రేఖ ప్రస్ఫుటమైంది. జాహీడాన్‌, ఇస్ఫహాన్‌, సాకెజ్‌ వంటి నగరాల్లోని సున్నీలకు, ఇతర మైనారిటీ వర్గాలకు ఉదారవాదులు మద్దతు ప్రకటిస్తున్నారు. దీంతో శాంతిభద్రతలను పునరుద్ధరించడం ఇరాన్‌ ఇస్లామిక్‌ ప్రభుత్వానికి సవాలుగా మారింది.

 

- బిలాల్‌ భట్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ చట్టం... రైతు చుట్టం కావాలి!

‣ పర్యావరణ పరిరక్షణ... పుడమికి సంరక్షణ!

‣ పొరుగుపై చైనా దూకుడు

‣ జీ20 అధ్యక్షత... భారత్‌పై గురుతర బాధ్యత!

‣ కశ్మీర్‌పై అమెరికా ద్వంద్వ వైఖరి

Posted Date: 18-11-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం