• facebook
  • whatsapp
  • telegram

పొరుగుపై చైనా దూకుడు


చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ మహా సభలు డ్రాగన్‌ చరిత్రను కొత్త మలుపు తిప్పనున్నాయి. ఈ మహాసభల్లో చేసిన నిర్ణయాలు భవిష్యత్తులో డ్రాగన్‌ దుందుడుకు విధానాలకు ఆజ్యం పోసేలా ఉన్నాయి.

చైనా కమ్యూనిస్టు మహాసభల్లో ఆ దేశ మాజీ అధ్యక్షుడు హూ జింటావోను కొందరు సిబ్బంది బలవంతంగా బయటకు తీసుకెళ్ళిపోయిన దృశ్యాలు అందర్నీ నిర్ఘాంతపరచాయి. అత్యున్నత విధాన నిర్ణాయక సంఘమైన పొలిట్‌ బ్యూరో స్థాయీసంఘం (పీఎస్‌సీ)లోని మొత్తం ఏడుగురు సభ్యులూ జిన్‌పింగ్‌కు తిరుగులేని విధేయులే. బయటి ప్రపంచానికి ద్వారాలు తెరవాలని 1978లో నిర్ణయించి 1980 నుంచి చేపట్టిన సంస్కరణలకు ఇక తలుపులు మూసేసినట్లేనని ఇటీవల ముగిసిన 20వ పార్టీ మహాసభలు రూఢి చేస్తున్నాయి.  పొలిట్‌ బ్యూరో స్థాయీసంఘ సభ్యులందరూ చైనాలో విద్యాభ్యాసం పూర్తి చేసినవారే. సంస్కరణలను, ప్రజలకు మరింత స్వేచ్ఛ ఇవ్వడాన్నీ వారు గట్టిగా వ్యతిరేకిస్తారు. విదేశాల్లో విద్యాభ్యాసం చేసి ఉదారవాద భావజాలాన్ని ఒంటపట్టించుకున్నవారిని పొలిట్‌ బ్యూరో నుంచి సాగనంపారు. ఇక పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల ఏకైక అర్హత జిన్‌పింగ్‌ పట్ల అపార విధేయత. జిన్‌పింగ్‌ మాదిరే వీరినీ యువరాజులుగా చైనీయులు వర్ణిస్తారు. వీరు మరెవరో కాదు... కమ్యూనిస్టు పార్టీ నాయకుల కుమారులు. 1927లో చాంగ్‌ కైషేక్‌ ప్రభుత్వం చైనా నగరాల్లోని కమ్యూనిస్టులను ఊచకోత కోసినప్పుడు, అక్కడి నుంచి పరారైన మావో సేటుంగ్‌కు ఒక రాష్ట్రంలోని కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఆశ్రయమిచ్చారు. ఆ నాయకుడి కుమారుడే జిన్‌పింగ్‌. 1949లో చైనా కమ్యూనిస్టు పార్టీ విప్లవం విజయవంతమైనప్పుడు చాంగ్‌ కై షేక్‌ ఇప్పటి తైవాన్‌కు పరారై ప్రవాస ప్రభుత్వం ఏర్పరచారు.

సవాళ్లెన్నో...

ఉక్రెయిన్‌ యుద్ధంలో గట్టి ఎదురుదెబ్బలతో రష్యా మునుపటి వైభవ, ప్రాబల్యాలను కోల్పోతున్న సమయంలో చైనా దూకుడు పెంచడం కాకతాళీయం కాదు. చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ మహాసభలు ముగిసిన వెంటనే చైనా, రష్యాలు చేయీచేయి కలిపి పనిచేయసాగాయి. తైవాన్‌ త్వరలోనే చైనాలో విలీనమవుతుందని రష్యా అధినేత పుతిన్‌ అనుచరుడు, రష్యా చమురు సంస్థ రాన్‌ నెఫ్ట్‌ సీఈఓ ఇటీవల వ్యాఖ్యానించడాన్ని ఈ కోణం నుంచే చూడాలి. ఉక్రెయిన్‌ యుద్ధంతో బలహీనపడిన రష్యా ఇకనుంచి చైనాకు జూనియర్‌ భాగస్వామిగా వ్యవహరించబోతున్నదని అర్థమవుతోంది. ఇది భారత్‌కు ఏమాత్రం మంచిది కాదు. చైనా ఆధిపత్య శక్తిగా ఆవిర్భవిస్తుందని, అమెరికాను నేరుగా ఢీకొనే సత్తాను ప్రదర్శిస్తుందని నిశ్చితంగా చెప్పలేం. ప్రస్తుతానికి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా చైనా అవతరించడం నిజమే కానీ, అదే సమయంలో వ్యవస్థాపరమైన లోపాలు చాలా ఉన్నాయి. జీడీపీ గణనీయంగా వృద్ధి చెందినా చైనా ఇప్పటికీ అల్పాదాయ దేశమే. ఈ స్థాయి నుంచి మధ్యాదాయ దేశంగా, అధికాదాయ దేశంగా ఎదగడం తేలిక కాదు. సింగపూర్‌, దక్షిణ కొరియాలు అధికాదాయ దేశాలుగా ఎదగగలిగినా, అవి చాలా చిన్న దేశాలని గుర్తుంచుకోవాలి. 2049కల్లా చైనాను అజేయ ఆర్థిక, సైనిక శక్తిగా తీర్చిదిద్దాలని జిన్‌పింగ్‌ అభిలషించడం బాగానే ఉన్నా, అప్పటికి చైనాలో వృద్ధుల జనాభాయే ఎక్కువగా ఉంటుంది. ఒక్క కొవిడ్‌ కేసూ ఉండకూడదనే జీరో కొవిడ్‌ విధానంతో జిల్లాల్లో, నగరాల్లో వరసపెట్టి లాక్‌డౌన్‌లను విధించడం దేశ ఆర్థిక ప్రగతికి బ్రేకులు వేస్తోంది. చైనా ఇప్పటికీ ఎగుమతులపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థగా కొనసాగడం మరో పెద్ద లోపం. చైనా కంపెనీలు, రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. పాశ్చాత్య దేశాలతో లడాయి పెట్టుకుంటే చైనాకు పెట్టుబడులు తగ్గిపోయి ఆర్థికాభివృద్ధి కుంటువడుతుంది. మరోవైపు అలీబాబా, టెన్సెంట్‌ వంటి బడా టెక్‌ కంపెనీలపై జిన్‌పింగ్‌ అణచివేత ధోరణి అవలంబించడమూ పెట్టుబడుల ప్రవాహాన్ని దెబ్బతీస్తోంది. ఈ కారణాల వల్ల చైనా స్టాక్‌ మార్కెట్‌ గడచిన 18 నెలల్లో 1.5 లక్షల కోట్ల డాలర్ల మేర విలువ కోల్పోయింది.

తైవాన్‌పై తకరారు

తైవాన్‌పై డ్రాగన్‌ దండయాత్రకు దిగితే చైనాతోపాటు మొత్తం ఆసియా దేశాలకు ఆరు లక్షల కోట్ల డాలర్ల మేర ఆర్థికనష్టం సంభవిస్తుందని అంచనా. ప్రపంచంలో కంప్యూటర్‌ చిప్స్‌కు ప్రధాన సరఫరాదారు తైవానే కావడం దీనికి కారణం. చైనాకు చిప్‌ల ఎగుమతిపై అమెరికా ఇటీవల నిషేధం విధించింది. ఇటువంటి నష్టాల నుంచి తప్పించుకోవడానికి స్వదేశంలోనే చిప్‌ల ఉత్పత్తిని పెంచాలని చైనా నడుంకట్టింది. సాధారణంగా నియంతలందరూ తామేం చేసినా చప్పట్లు కొట్టేవారినే సలహాదారులుగా, అనుచరులుగా నియమించుకుంటారు. దాంతో తప్పటడుగు వేయకముందే హెచ్చరించి గాడినపెట్టగల హితైషులు, నిపుణులు కరవవుతారు. తైవాన్‌ విషయంలో జిన్‌పింగ్‌ కూడా తప్పటడుగు వేస్తారా అన్నది కీలక ప్రశ్న. సముద్రాలపై తిరుగులేని ఆధిపత్యం సాధించడానికి అమెరికాకన్నా మూడు రెట్లు ఎక్కువగా డ్రాగన్‌ తన నౌకాదళంపై ఖర్చు చేస్తోంది. దురదృష్టమేమంటే, చైనా ఎంత బలీయమైతే అంతగా భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతుంది. భారత్‌ను తన పక్కలో బల్లెంగా పరిగణిస్తున్న చైనా- తైవాన్‌ తరవాత తన దృష్టిని భారత్‌పైకే మళ్ళించవచ్చు. అదే జరిగితే రష్యా మనకు అండగా నిలిచే అవకాశాలు తక్కువ. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్‌ తన భావి వ్యూహాలను రూపొందించుకోవాలి.

కనుసన్నల్లో...

శాంతికి కట్టుబడి ఉన్నామని గడచిన 20 ఏళ్ల నుంచి ఉద్ఘాటిస్తూ వచ్చిన చైనా కమ్యూనిస్టు పార్టీ ఇకనుంచి కయ్యానికి కాలు దువ్వుతున్న ఇతర దేశాలను గట్టిగా ఎదుర్కోవాలని తాజాగా నిర్ణయించింది. 1945లో చైనా కమ్యూనిస్టు పార్టీ తమ తిరుగులేని అధినాయకుడిగా మావోను ఎన్నుకున్న ప్రదేశంలోనే తాజాగా పొలిట్‌ బ్యూరో సమావేశం కావడం, జిన్‌పింగ్‌ను నేతగా ఎన్నుకోవడం విశేషం. జిన్‌పింగ్‌ను మూడోసారి కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. 2012లో జిన్‌పింగ్‌ తొలిసారి పగ్గాలు చేపట్టినప్పుడు సంస్కరణలకు ప్రాధాన్యమిచ్చారు. తాజా పార్టీ మహాసభల్లో ఆ పంథాకు నీళ్లు వదిలారు. భవిష్యత్తులో దేశార్థికంతోపాటు అన్ని రంగాలపై పార్టీకి తిరుగులేని ఆధిక్యం కట్టబెట్టే నిర్ణయాలను తీసుకున్నారు. 2035కల్లా చైనాను ఆధునిక సోషలిస్టు రాజ్యంగా, మధ్యాదాయ దేశంగా, చైనా త్రివిధ సాయుధ బలగాలను అత్యాధునికంగా తీర్చిదిద్దుతానని జిన్‌పింగ్‌ ప్రకటించారు. 2049లో చైనా విప్లవ శతజయంత్యుత్సవం జరిగే నాటికి చైనా అంతర్జాతీయంగా అపార పలుకుబడిగల బలీయ దేశంగా ఎదుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. దీనర్థం- చైనా మరింత దూకుడుగా వెళుతుందని, రష్యాకు మద్దతు ఇస్తూనే అమెరికా నాయకత్వంలోని పాశ్చాత్య దేశాలను గట్టిగా సవాలు చేస్తుందని. స్వదేశంలో పార్టీపైన, ప్రభుత్వంపైన జిన్‌పింగ్‌ సర్వంసహాధిపత్యం సాధించారు. ఆ రెండు యంత్రాంగాల్లోని నాయకులందరూ జిన్‌పింగ్‌ కనుసన్నల్లో మెలగేవారే.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ జీ20 అధ్యక్షత... భారత్‌పై గురుతర బాధ్యత!

‣ కశ్మీర్‌పై అమెరికా ద్వంద్వ వైఖరి

‣ మార్కెట్‌ వ్యూహాలతో లాభసాటి సేద్యం

‣ సుస్థిరాభివృద్ధికి సైన్సే సోపానం

‣ ఉపప్రణాళికల అమలులో లొసుగులెన్నో!

‣ పేదలకు దక్కని ఉచిత న్యాయం

Posted Date: 18-11-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం