• facebook
  • whatsapp
  • telegram

పేదలకు దక్కని ఉచిత న్యాయం

భారత రాజ్యాంగం స్వతంత్ర న్యాయ వ్యవస్థను ఏర్పరచింది. చట్టం ముందు అందరూ సమానులేనని ఉద్ఘాటించింది. కానీ, పేదలకు న్యాయం అందించడంలో మన వ్యవస్థ ఘోరంగా విఫలమవుతోంది. ముఖ్యంగా ఉచిత న్యాయ సేవలు దేశీయంగా అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి.

న్యాయం పొందడం పౌరులందరి ప్రాథమిక హక్కు అని రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. పేదలకు ఉచిత న్యాయ సేవలు అందించడం ద్వారా సమానత్వ సూత్రాన్ని పాటించాలని 39(ఎ) రాజ్యాంగ అధికరణ ప్రబోధిస్తోంది. దీనికోసం అవసరమైతే తగిన చట్టాలు చేయాలని, పథకాలు చేపట్టాలని ప్రభుత్వానికి నిర్దేశిస్తోంది. పేదలకు ఉచిత న్యాయ సేవలు అందించకపోతే వారికి అన్యాయం జరిగి యావత్‌ ప్రజాస్వామ్య పునాదులు బలహీనపడతాయి. వారికి ఉచిత న్యాయ సేవలు అందించి సమానత్వం సాధించాలని 1958లోనే 14వ న్యాయ సంఘం (లా కమిషన్‌) సిఫార్సు చేసింది. ఆ దిశగా చర్యలు తీసుకున్న మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. ఆ తరవాత తమిళనాడు, మహారాష్ట్రలూ ఉచిత న్యాయ సేవల పథకాలను ప్రవేశపెట్టాయి.

సామరస్య పరిష్కారం

ఉచిత న్యాయ సేవలను 1976లో తెచ్చిన 42వ రాజ్యాంగ సవరణ తప్పనిసరి చేసింది. దానికోసం 39(ఎ) అధికరణను ప్రవేశపెట్టారు. న్యాయ సహాయ పథకం అమలుకు 1980లో జస్టిస్‌ పి.ఎన్‌.భగవతి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పరచారు. కోర్టు దాకా వెళ్ళకుండానే వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి లోక్‌ అదాలత్‌లను నెలకొల్పారు. అవి ఇచ్చే తీర్పులు, చేసే తీర్మానాలకు చట్టబద్ధత కల్పించడానికి పార్లమెంటు 1987లో న్యాయ సేవల ప్రాధికార సంస్థల చట్టాన్ని ఆమోదించింది. బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించడానికీ ఆ చట్టం వీలు కల్పించింది. 1987నాటి చట్టంలోని మూడో సెక్షన్‌ కింద 1995లో జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ (నల్సా)ను నెలకొల్పారు.

ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఒక న్యాయ సేవల కమిటీ ఉంది. హైకోర్టుల్లో అలాంటి కమిటీలు 39 పనిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 37 రాష్ట్ర న్యాయ సేవల సంస్థలు రంగంలో ఉన్నాయి. జిల్లాల స్థాయిలో 673, తాలూకా స్థాయిలో 2,351 సంస్థలు సేవలు అందిస్తున్నాయి. పదేళ్ల అనుభవం కలిగిన 33,556 మంది న్యాయవాదులు, 24,704 మంది పారా లీగల్‌ వలంటీర్లు ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నారు. న్యాయ సాధన గురించి అవగాహన పెంచడానికి దేశమంతటా పాఠశాలల్లో 22,321 క్లబ్‌లను ఏర్పాటు చేశారు. వాటిలో పెద్దయెత్తున అవగాహనా సదస్సులను నిర్వహించారు. బడుగు వర్గాల్లో తమ చట్టపరమైన హక్కుల గురించి చైతన్యం పెంచడానికి భారత రాష్ట్రపతి నిరుడు అక్టోబరు రెండున జాతీయ స్థాయి కార్యక్రమం ప్రారంభించారు. 17 జిల్లాలను న్యాయ సహాయ మండలి పథకం అమలుకు ఎంపిక చేశారు. 13 జిల్లాల్లో గతేడాది చివరి నుంచి ఆ పథకం అమలును ప్రారంభించారు. లోక్‌ అదాలత్‌, మధ్యవర్తిత్వ ప్రక్రియలు 1982లో మొట్టమొదట గుజరాత్‌లో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అవి దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఇప్పటిదాకా జాతీయ లోక్‌ అదాలత్‌ల ముందుకు 3.26 కోట్ల కేసులు వచ్చాయి. వాటిలో 1.27 కోట్ల కేసులు పరిష్కారమయ్యాయి. ప్రజాహిత సేవల కోసం 402 శాశ్వత లోక్‌ అదాలత్‌లను నెలకొల్పారు. వాటిలో 348 ఇప్పటికీ క్రియాశీలంగా ఉన్నాయి.

న్యాయపరమైన అవగాహన పెంచడం ద్వారా మహిళా సాధికారత సాధించడానికి జాతీయ మహిళా కమిషన్‌తో కలిసి ‘నల్సా’ పనిచేస్తోంది. నిర్ణీత ఆదాయం ఉన్నవారు మాత్రమే ప్రస్తుతం ఉచిత న్యాయ సహాయం పొందడానికి అర్హులు. ఈ ఆదాయ పరిమితిని పెంచే అధికారం రాష్ట్రాలకు ఉంది. షెడ్యూల్డ్‌ తెగలు, కులాల వారు, మహిళలు, పిల్లలు, దివ్యాంగులకు ఎలాంటి ఆదాయ పరిమితీ వర్తించదు. ఉచిత న్యాయ సహాయానికి పార్లమెంటు చేసిన చట్ట ఫలితమే ఇదంతా. కానీ, ఎన్ని చట్టాలు చేసి, ఎన్ని కమిటీలను ప్రాధికార సంస్థలను ఏర్పాటుచేసినా పేదలకు పూర్తి న్యాయం జరుగుతోందని చెప్పలేం. వారికి న్యాయవాదిని నియమించుకొనే స్తోమత లేకపోవడమే ప్రధాన కారణం. దీనివల్లనే అమాయకులకూ శిక్షలు పడుతున్న దారుణ స్థితి నెలకొంది. లోక్‌ అదాలత్‌లకు నిజమైన అధికారాలు లేకపోవడం, పారా లీగల్‌ వలంటీర్ల సేవలను సరిగ్గా ఉపయోగించుకోలేక పోవడం, న్యాయవాదులు చిత్తశుద్ధితో పేదలకు సేవలు అందించకపోవడమే దీనికి కారణం.

చట్టాల సమర్థ అమలు కీలకం

నేడు ప్రపంచం అన్ని విధాలుగా మారిపోయింది. సామాజిక, సాంకేతిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. మారిన కాలానికి దీటుగా తానూ మారక తప్పదని న్యాయ వ్యవస్థ గుర్తిస్తోంది. దానికి అనుగుణంగా ‘నల్సా’ ఆన్‌లైన్‌ పోర్టల్‌ పలు భారతీయ భాషల్లో సేవలు అందిస్తోంది. న్యాయ వ్యవస్థపై అవగాహన పెంచడానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఒకరు లఘు చిత్రోత్సవాన్ని ప్రారంభించారు. ఆ పోటీలో పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. అందరికీ సమ న్యాయం కోసం కొత్త చట్టాలు చేసే బదులు ఇప్పుడున్న చట్టాలనే సమర్థంగా అమలు చేయాలి. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాలను సమర్థంగా ఉపయోగించుకొని సత్వర న్యాయాన్ని సుసాధ్యం చేయాలి. ప్రభుత్వాలు దీనికి మరిన్ని నిధులు కేటాయించాలి. ఉచిత న్యాయ సహాయమనేది తమ బాధ్యత అని న్యాయవాదులు గుర్తెరగాల్సిన అవసరం ఉంది. చట్టాల గురించి, పౌరులకు న్యాయం పొందే హక్కు గురించి చైతన్యం పెంచడానికి సంపన్న దేశాలు రెండేళ్లు లేదా అయిదేళ్ల ప్రణాళికలను చేపడుతున్నాయి. భారత్‌ సైతం అయిదేళ్ల ప్రణాళికను చేపట్టాల్సిన అవసరం ఉంది.

కొరవడిన అవగాహన

హుసేనారా ఖాటూన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ కేసులో పేదలు, బడుగు వర్గాలకు ఉచిత న్యాయం పొందే హక్కు ఉందని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది. 14, 22(1) రాజ్యాంగ అధికరణల ప్రకారం తమకు సంక్రమిస్తున్న హక్కుల గురించి ప్రజల్లో అవగాహన పెంచాలని సుఖ్‌దాస్‌ వర్సెస్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌ కేసులో జస్టిస్‌ పి.ఎన్‌.భగవతి ఉద్ఘాటించారు. నిజానికి రాజ్యాంగం, చట్టాలు తమకు ప్రసాదించిన హక్కులు, సౌకర్యాల గురించి విద్యావంతులకు సైతం సరైన అవగాహన కొరవడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కోర్టు ఫీజుల భారాన్ని భరించలేక పేదలు న్యాయ వ్యవస్థ గుమ్మం తొక్కడానికి వెనకాడే పరిస్థితి ఉండకూడదని స్టేట్‌ ఆఫ్‌ హరియాణా వర్సెస్‌ దర్శనా దేవి కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

- పీవీఎస్‌ శైలజ

(సహాయ ఆచార్యులు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ న్యాయ కళాశాల, హైదరాబాద్‌)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భూసార రక్షణతో ఆహార భద్రత

‣ అప్పుల కుప్పలు... భావి తరాలకు తిప్పలు!

‣ ఆవిష్కరణలకు ప్రోత్సాహం... ప్రగతికి మార్గం

‣ ఒకే భూమి... ఒకే కుటుంబం... భవిత ఉజ్జ్వలం!

Posted Date: 18-11-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం