• facebook
  • whatsapp
  • telegram

అప్పుల కుప్పలు... భావి తరాలకు తిప్పలు!

 

 

భారతదేశ రుణభారం 2022 చివరికల్లా జీడీపీలో 84శాతానికి చేరుకొంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) అంచనా. 2016లో ఇది 68.9శాతమే. నేడు భారతదేశ విత్తలోటు జీడీపీలో 10శాతం. అందులో 6.5శాతానికి కేంద్ర ప్రభుత్వం, మిగిలినదానికి రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యులు. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఆర్థిక స్తోమతను బట్టి వ్యవహరించకపోతే భావి తరాలకు అప్పుల కొండ- గుదిబండలా మారనుంది.

 

విత్తలోటు జీడీపీలో మూడు శాతానికి మించకుండా ఉంటేనే భారత్‌ ఆర్థిక సుస్థిరతను సాధించగలుగుతుంది. రుణభారం, విత్తలోటుపరంగా అనేక వర్ధమాన దేశాలు భారత్‌ కన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయి. మన రాష్ట్రాలు విచక్షణారహితంగా అప్పులు చేస్తున్నాయని పలు రిజర్వు బ్యాంకు అధ్యయనాలు పేర్కొన్నాయి. రాష్ట్రాలు బడ్జెట్‌కు వెలుపల భారీగా అప్పులు చేస్తున్నాయని, కరెంటు బకాయిలూ పెరిగిపోతున్నాయని కేంద్ర ప్రభుత్వం వాపోతోంది. ప్రతి ఆర్థిక సంవత్సరారంభంలో కేంద్రం నిర్దేశించే రాష్ట్రాల నికర రుణసేకరణ పరిమితికి లోబడే రుణాలు సేకరిస్తున్నారా లేదా అన్నది తెలపాలని కోరింది. 2022 మార్చికి ముందు రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లు తమకు రాబోయే ఆదాయాన్ని హామీగా చూపి రూ.47,316 కోట్ల మేరకు అప్పులు తెచ్చినట్లు జూన్‌లో ధర్మశాలలో జరిగిన ఓ సమావేశంలో కేంద్ర ఆర్థిక కార్యదర్శి వెల్లడించారు. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో జరిగిన ఆ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం హాజరయ్యారు. రాష్ట ప్రభుత్వాల అజమాయిషీలోని సంస్థలకు సొంత ఆదాయ వనరులు లేకున్నా అప్పులు తెస్తున్నాయి. ఆ రుణాలకు రాష్ట్ర ప్రభుత్వాలు హామీదారులుగా ఉంటున్నాయి. తెలంగాణ మొత్తం రూ.1.35 లక్షల కోట్ల రుణాలకు హామీదారుగా ఉంది. అది 2022-23లో తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 11శాతానికి సమానం. తరవాత ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌ భారీ రుణాలకు హామీదారులుగా నిలుస్తున్నాయి. విద్యుదుత్పత్తి సంస్థలకు రాష్ట్రాల డిస్కమ్‌లు రూ.1.10లక్షల కోట్ల మేరకు బకాయి పడ్డాయని ధర్మశాల సమావేశంలో వెల్లడైంది. దీన్ని బట్టి రాష్ట్రాల ఆర్థిక స్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

దుబారా అవుతున్న కష్టార్జితం

రాజకీయ పార్టీలు పన్ను చెల్లింపుదారుల కష్టార్జితాన్ని అనుత్పాదక పథకాలు, ఉచిత వరాలపై దుబారా చేస్తున్నాయి. 2022 ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ ఓటర్లకు పోటాపోటీగా ఉచిత వరాలు ప్రకటించాయి. రాజస్థాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులను నూతన పింఛను పథకం (ఎన్‌పీఎస్‌) నుంచి పాత పింఛను విధానానికి మారుస్తానని అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం వాగ్దానం చేసింది. అనేక రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికలకు పాత పింఛను విధాన పునరుద్ధరణ హామీని గెలుపు అస్త్రంగా ప్రయోగించడానికి సన్నద్ధమవుతున్నాయి. పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం ధనిక, మధ్యతరగతి, పేదలనే తేడా లేకుండా అన్ని వర్గాలకూ 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సరఫరా చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. తెలంగాణలో రూ.12,000 కోట్ల రైతుబంధు పథకాన్ని కౌలు రైతులకు, పట్టా లేని మహిళా రైతులకు, పోడు వ్యవసాయదారులకు వర్తింపజేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వం చేస్తున్న అప్పులు 2022-23కల్లా రూ.4,39,394 కోట్లకు చేరతాయని అంచనా. 2021-22 సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్ర రుణభారం సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయలు. ఇది కాకుండా వివిధ ప్రభుత్వ సంస్థలు చేసిన రుణాలు అదనం. వైకాపా ప్రభుత్వం భారీగా అప్పులు తెచ్చి రాజ్యాంగ విరుద్ధమైన రీతిలో ఖర్చు చేస్తోందని కంప్ట్రోలËర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) 2020-21 నివేదిక ఆక్షేపించింది. దీనివల్ల ఆర్థిక క్రమశిక్షణ లోపించి ప్రజాధనం దుర్వినియోగమవుతుందని హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో చూపని రుణాలు 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.86,260 కోట్లకు చేరుకున్నాయని కాగ్‌ నివేదిక వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ కోశసంబంధ బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ చట్ట నిబంధనలను పాటించడం లేదని వ్యాఖ్యానించింది. వైకాపా సర్కారు తీసుకొచ్చిన అప్పుల్లో అధిక భాగాన్ని రెవిన్యూ లోటును భర్తీ చేయడానికి ఉపయోగించింది. ఫలితంగా ఉత్పాదక ఆస్తులను సృష్టించలేకపోతోంది.

 

రాష్ట్రాలు కుదేలు

కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి తీసుకొచ్చిన విధానాలు రాష్ట్రాలను ఆర్థికంగా దుర్బల స్థితిలోకి నెట్టాయి. వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) అమలులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాలు సొంతంగా పన్నుల ఆదాయాన్ని పెంచుకోలేకపోతున్నాయి. అదే సమయంలో కేంద్రం తన ఆదాయాన్ని విస్తరించుకోగలుగుతోంది. దీన్ని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. కేంద్రం జీఎస్‌టీ పరిధికి వెలుపల వివిధ సర్‌ఛార్జీలు, సెస్సులు విధిస్తూ, తద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకోవడం లేదు. 2014-15 నుంచి 2019-20 వరకు రాష్ట్రాలకు ఆర్థిక సంఘం అంచనా వేసినదానికన్నా రూ.7.97 లక్షల కోట్లు తక్కువ ఆదాయం వచ్చింది. కానీ, కేంద్రానికి సెస్సులు, సర్‌ఛార్జీల ఆదాయం మాత్రం దాదాపు రెట్టింపైంది. కేంద్ర పన్నుల్లో 41శాతాన్ని రాష్ట్రాలతో పంచుకోవాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసినా, 2020-21లో వాస్తవంగా పంచినది 29 శాతమే. ఆంధ్రప్రదేశ్‌తో సహా కొన్ని రాష్ట్రాల పన్ను ఆదాయం క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. సెస్సులు, సర్‌ఛార్జీలు తాత్కాలికంగానే విధించాలని, అవసరమైతే వాటిని కేంద్రం, రాష్ట్రాలు పంచుకోవాలని, ఆదాయం తరిగిపోతున్న రాష్ట్రాలకు కేంద్రం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం సూచించింది. ఏతావతా కేంద్రం, రాష్ట్రాలు పన్నుల ఆదాయాన్ని న్యాయంగా పంచుకొని దేశాభివృద్ధిలో సమాన భాగస్వాములు కావాలి. అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక స్తోమతను గుర్తెరిగి ఎన్నికల వాగ్దానాలు చేయాలి.

 

ఆర్థిక క్రమశిక్షణ

రాష్ట్రాల అప్పులకుప్పలను తీర్చలేక భావితరాలు నానా తిప్పలూ పడకతప్పదు. ప్రస్తుతం శ్రీలంక నెత్తిన ఆరు లక్షల కోట్ల రూపాయల రుణభారం ఉంది. చిత్రమేమిటంటే మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌లు అంతకన్నా ఎక్కువగా రూ.6.50 లక్షల కోట్ల రుణభారం మోయడం. పశ్చిమ్‌ బెంగాల్‌పై రూ.5.60లక్షల కోట్లు, గుజరాత్‌పై నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పుల భారం ఉంది. ఈ ఏడాది మార్చి నెలాఖరుకు అన్నిరకాల అప్పులనూ కలిపి చూస్తే ఆంధ్రప్రదేశ్‌పై మొత్తం చెల్లింపుల భారం రూ.7.76లక్షల కోట్లకు చేరినట్లు అంచనా. ఆర్థిక క్రమశిక్షణను గాలికి వదిలేసి ఓటర్లను ప్రసన్నులను చేసుకోవడానికి తలకు మించిన అప్పులు చేసిన ఈ రాష్ట్రాలు శ్రీలంకలా ప్రమాదకర స్థితిలోకి జారిపోనున్నాయా అనే ఆందోళన వ్యక్తమవుతోంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆవిష్కరణలకు ప్రోత్సాహం... ప్రగతికి మార్గం

‣ ఒకే భూమి... ఒకే కుటుంబం... భవిత ఉజ్జ్వలం!

‣ గల్ఫ్‌తో చైనా చెట్టపట్టాల్‌

‣ భూతాపం... పుడమికి శాపం!

‣ సేద్యంలో డ్రోన్ల విప్లవం

‣ అమెరికా - పాక్‌ అవకాశవాద పొత్తు

Posted Date: 18-11-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం