• facebook
  • whatsapp
  • telegram

ఒకే భూమి... ఒకే కుటుంబం... భవిత ఉజ్జ్వలం!

భారతదేశం డిసెంబరు ఒకటో తేదీన జీ20 కూటమి అధ్యక్ష బాధ్యతలను చేపట్టబోతోంది. ప్రపంచంలోని వర్ధమాన దేశాల ఆందోళనలు, ప్రాధాన్యాల గురించి మాట్లాడేందుకు ఈ అరుదైన అవకాశాన్ని భారత్‌ వినియోగించుకోనుంది. ఈ వేదిక ఏర్పాటైన పధ్నాలుగేళ్ల కాలంలో- తొలిసారిగా ‘ఇండొనేసియా-ఇండియా-బ్రెజిల్‌ జీ20 త్రిభుజి (ట్రోయికా) మధ్యలో ఉన్న భారత్‌కు ఈ అవకాశం లభించింది. సుమారు 140 కోట్ల జనాభాతో వేగంగా అభివృద్ధి చెందుతున్న అయిదో పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌- సమకాలీన వాస్తవాలపై ఈ వేదికద్వారా ప్రపంచానికి మార్గనిర్దేశం చేయగల ఆర్థిక, సాంఘిక, రాజకీయ సత్తా కలిగి ఉంది.

సమ్మిళిత, సమాన, సుస్థిరాభివృద్ధి ఆధారిత అంతర్జాతీయ అజెండాను ముందుకు నడిపించే సువర్ణావకాశాన్ని జీ20 అధ్యక్ష హోదా- భారత్‌కు కల్పిస్తోంది. అందులో భాగంగా భారత్‌ పర్యావరణ హితకరమైన జీవనశైలి (లైఫ్‌స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌-లైఫ్‌), డిజిటల్‌ మౌలిక వసతులు, మహిళా సాధికారత, సాంకేతికత ఆధారంగా జరిగే అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. భిన్నమైన అభిప్రాయాలు, ధోరణులు పెరిగిపోతున్న ప్రస్తుత ప్రపంచంలో ఈ ప్రాథమ్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం అంత తేలికైన పనేమీ కాదు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాలు, భారీ రుణ సంక్షోభంతో పలు దేశాలకు విస్తరిస్తున్న ఆర్థిక మాంద్యం ప్రభావంతో వర్ధమాన దేశాలు సతమతమవుతున్నాయి. ఈ పరిణామాలపై ఆందోళనలు వెలువడుతున్న తరుణంలోనే భారత్‌ జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలు చేపడుతోంది. కొవిడ్‌ మహమ్మారి దశాబ్దాల ప్రపంచ పురోగతిని దెబ్బ తీసింది. మహమ్మారిని ఎదుర్కొనేందుకు తక్షణ చర్యలు చేపట్టాల్సి రావడంతో ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యా(ఎస్‌డీజీ)లకు గండి పడింది. ఈ పరిస్థితుల్లో భారతదేశం ప్రతిపాదిస్తున్న పరస్పర అనుసంధానత, బాధ్యతల భాగస్వామ్య విధానమైన ‘ఎకానమీ విజన్‌’ ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకొంది. ఇదే ప్రధాన లక్ష్యంగా జీ20కి నాయకత్వం వహించే కాలంలో భారత్‌- ‘వసుధైక కుటుంబం’ లేదా ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ సూత్రాన్ని అనుసరించనుంది.

అందివచ్చిన అవకాశం

భారతీయ ఉపనిషత్తులు, పురాతన సంస్కృత గ్రంథాల ఆధారంగా సూత్రీకరించిన ‘ప్రపంచ కుటుంబ’ తత్వాన్ని 2014లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ప్రస్తుత పరిస్థితుల్లో జీ4 కూటమి పోషించాల్సిన విస్తృత పాత్ర గురించి కూడా ప్రధాని వివరించారు. వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే విపత్తులతో గొలుసుకట్టు పరిణామాలు సంభవించి, మానవాళి మనుగడకే ముప్పు తెస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో ఈ సందేశానికి మరింత ప్రాధాన్యం పెరిగింది. పౌర సమాజంలోని అత్యంత సూక్ష్మ విభాగాల నుంచి అతి పెద్ద వ్యవస్థల వరకు అన్నీ పరస్పర అనుసంధానత కలిగి ఉండాల్సిన వాస్తవాన్ని ఇది కళ్లకు కడుతోంది. సమాన బాధ్యతలు, చొరవ- భవిష్యత్తుకు ఏ విధంగా దోహదపడతాయనే విషయాన్ని ఈ సందేశం ప్రపంచ నాయకులకు, పౌరులకు స్పష్టం చేస్తోంది. జీ20 లోగో సైతం ఇదే సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ లోగోలో కనిపించే భారత జాతీయ పుష్పంలో భూమండలం చిత్రం- అవరోధాల మధ్య అభివృద్ధికి గుర్తుగా నిలుస్తుంది. భారతదేశం భూగోళంపట్ల అనుసరించే సానుకూల వైఖరిని ప్రతిబింబిస్తుంది. లోగోలో కనిపించే కాషాయ, శ్వేత, హరిత వర్ణాల సమ్మేళనం సాంస్కృతిక విలువల్లో కనిపించే భిన్నత్వానికి, సమ్మిళితత్వానికి చిహ్నంగా ఉంటుంది. భారత్‌ సుదీర్ఘ కాలంగా సార్వజనీన సామరస్యం, సహకార సిద్ధాంతాన్ని ప్రపంచానికి బోధిస్తోంది. ఈ సూత్రాలకు అత్యంత సన్నిహితంగా ఉండే రీతిలోనే పర్యావరణహితకర జీవనశైలి (లైఫ్‌) భావనను 2021 నవంబరులో గ్లాస్గోలో జరిగిన కాప్‌-26 సదస్సులో ప్రధాని మోదీ ప్రతిపాదించారు. గత నెలలో గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం వద్ద ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ సమక్షంలో దీన్ని ఒక ఉద్యమంగా ప్రకటించారు. ‘వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ప్రజాస్వామికంగా పోరాడటం, ప్రతీ ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు ఈ పోరాటంలో భాగస్వాములు కావడం’ అనే నినాదాలను ఈ ఉద్యమం ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు.

బాధ్యత అందరిదీ...

భారతదేశం డిజిటల్‌ రంగంలో ప్రపంచానికి ఒక నమూనాగా దారి చూపగల స్థాయిలో ఉంది. ప్రభుత్వ డిజిటల్‌ మౌలిక వసతులు, ఆర్థిక సమ్మిళితత్వం, పలు రంగాల్లో మానవతా దృక్పథంతో కూడిన సాంకేతిక ఆధారిత పరిష్కారాలపై దేశానికి గల నమ్మకాన్ని ఈ డిజిటల్‌ విజయ గాథ చాటిచెబుతుంది. భారత్‌- ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్‌ లావాదేవీలను (2022లో 4800 కోట్లు) నమోదు చేసింది. ప్రపంచంలో అతి పెద్ద బయోమెట్రిక్‌ ఐడీ వ్యవస్థ (ఆధార్‌)ను కలిగి ఉంది. మహిళా సాధికారత, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల దిశగా పురోగతి, విపత్తులవల్ల సంభవించే నష్టాన్ని తగ్గించడం, ఆహార భద్రత, పోషకాహార పంపిణీ, బహుళార్థక సంస్కరణలు వంటి సంక్లిష్ట విభాగాల్లో సైతం ప్రపంచానికి పరిష్కారాలను అందించాలని భారతదేశం భావిస్తోంది. జీ20లో చేపట్టనున్న అంశాల జాబితాలో రుణ సంక్షోభం కూడా ఒకటని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇప్పటికే ప్రకటించారు. భూగోళంలోని దక్షిణాది దేశాల ప్రయోజనాలు కాపాడటంతో పాటు వర్ధమాన ప్రపంచం ఆందోళనలనూ పరిగణనలోకి తీసుకొనేలా సమర్థ నాయకత్వాన్ని అందించగలుగుతుంది. దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా శక్తిమంతమైన రాజకీయ అస్తిత్వం ఉన్న భారత్‌- నిస్సందేహంగా శాంతియుత, సుసంపన్న ప్రపంచం కోసం దౌత్యం నిర్వహించే స్థాయి కలిగి ఉంది. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ సిద్ధాంతంతో అందరితో కలిసి అడుగేయాల్సిన తరుణమిది. అందరి భాగస్వామ్యం గల ధరణి పట్ల మనందరం బాధ్యత వహించాలనే శక్తిమంతమైన సందేశాన్ని జీ20 అధ్యక్ష కాలంలో భారతదేశం ప్రపంచానికి అందించగలదనే ఆశలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

పర్యావరణానికి ‘ప్రాచీన’ రక్షణ

వ్యక్తిగత, సామాజిక స్థాయుల్లో వినియోగం, ఉత్పత్తి ధోరణుల్లో మార్పును తీసుకురావడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ స్థిరత్వ విధానాలను ‘లైఫ్‌’ ప్రోత్సహిస్తుంది. భారతీయ ప్రాచీన నాగరికతలో భూమితో మానవులకు తరతరాలుగా ఉన్న పవిత్రమైన అనుబంధం స్పష్టమవుతోంది. భారతీయ పురాతన విధానాల్లో పర్యావరణ పరిరక్షణకు దోహదపడగల సామరస్య సిద్ధాంతాలు, సంప్రదాయాల విలువను ప్రపంచానికి తెలియజేేసేందుకు జీ20 నాయకత్వం ఒక అవకాశంగా నిలుస్తుంది. ప్రాచీన కాలం నుంచి భారతీయ సమాజం అనుసరించిన సుస్థిరత్వానికి పట్టం కట్టే విధానాలే- వాతావరణ మార్పులు, అభివృద్ధి అజెండాల గురించి మాట్లాడేందుకు అవసరమైన ప్రత్యేకతలను ఇండియాకు సంతరింపజేస్తున్నాయి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ గల్ఫ్‌తో చైనా చెట్టపట్టాల్‌

‣ భూతాపం... పుడమికి శాపం!

‣ సేద్యంలో డ్రోన్ల విప్లవం

‣ అమెరికా - పాక్‌ అవకాశవాద పొత్తు

Posted Date: 18-11-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం