• facebook
  • whatsapp
  • telegram

అమెరికా - పాక్‌ అవకాశవాద పొత్తు

అవసరమైతే ఆలింగనం చేసుకోవడం, ఆ తరవాత పక్కకు నెట్టివేయడం అమెరికా నైజం. అవసరమైతే మళ్ళీ ఆప్యాయంగా హత్తుకోవడానికీ అగ్రరాజ్యం వెనకాడదు. దాన్ని తనకు అనుకూలంగా మలచుకోవడంలో పాకిస్థాన్‌ సఫలమవుతోంది.

ఒకవైపు అమెరికాకు సహకరిస్తూనే, మరోవైపు అగ్రరాజ్య ప్రయోజనాలను దొంగచాటుగా దెబ్బతీయడంలో పాకిస్థాన్‌ ఆరితేరింది. అఫ్గాన్‌లో తాలిబన్లపై పోరులో అమెరికాకు అన్నివిధాలా వత్తాసు ఇస్తున్నట్లే ఇచ్చి, వెనక నుంచి వారిని ఎగదోసిన చరిత్ర పాక్‌ది. అందుకే అమెరికా సేనలు అఫ్గాన్‌ నుంచి అవమానకర రీతిలో వెనుదిరగాల్సి వచ్చింది. డొనాల్డ్‌ ట్రంప్‌ హయాములో పాక్‌ తోక కత్తిరించినా, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ ఆ సర్పానికి మళ్ళీ పాలు పోస్తున్నారు. ఆయనకు పాక్‌ సైన్యం అవసరం వచ్చిపడింది మరి! అఫ్గాన్‌లో దాగిన అల్‌ఖైదా అధినేత ఐమన్‌ అల్‌ జవాహిరిని డ్రోన్‌ దాడిలో హతమార్చడానికి అమెరికాకు పాకిస్థాన్‌ తోడ్పడింది. పాక్‌ భూభాగం మీదుగా ఆ డ్రోన్‌ను ఎగరనివ్వడమే కాదు, జవాహిరి ఆచూకీని పసిగట్టడంలోనూ అమెరికాకు ఇస్లామాబాద్‌ సహకరించిందని గూఢచార వర్గాల అంచనా. అందుకే పాకిస్థానీ ఎఫ్‌16 యుద్ధ విమానాల ఆధునికీకరణకు అమెరికా 45 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఉగ్రవాద నిర్మూలన కోసమే ఈ చర్య తీసుకున్నామని బైడెన్‌ సెలవిచ్చారు. అంతలోనే పాకిస్థాన్‌కు తన అణ్వస్త్రాలపై అదుపు లేదు కాబట్టి అది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశమని ఆయనే స్వయంగా వ్యాఖ్యానించారు. అలాగని పాక్‌పై ఆయన ఎలాంటి చర్యలూ తీసుకోరు.

సిపెక్‌ ప్రాజెక్టు కోసం చైనా నుంచి భారీగా రుణాలు తీసుకోవడంతోపాటు ఉగ్రవాదులకు ఆయుధాలు, నిధులు సమకూరుస్తూ దివాలా తీసిన పాకిస్థాన్‌ను ఆదుకొనే ప్రయత్నాలను బైడెన్‌ ప్రారంభించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ఇటీవల పాక్‌కు 110 కోట్ల డాలర్ల తక్షణ రుణం ప్రకటించడం వెనక అమెరికా ప్రోద్బలం ఉంది. తాజాగా ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) గ్రే లిస్ట్‌ నుంచి పాకిస్థాన్‌ను తొలగించడమూ అమెరికా పుణ్యమేనన్నది జగమెరిగిన సత్యం. అక్రమ ధన చలామణీని, ఉగ్రవాదులకు నిధుల ప్రవాహాన్ని నిరోధించని దేశాలను ఎఫ్‌ఏటీఎఫ్‌గ్రే లిస్టులో చేరుస్తారు. నాలుగేళ్లుగా ఆ జాబితాలో ఉన్న పాకిస్థాన్‌ను రేపోమాపో బ్లాక్‌ లిస్టులోకి తెస్తారని ఇటీవలి వరకు ఊహాగానాలు వినిపించేవి. అదే జరిగితే ఉత్తర కొరియా, ఇరాన్‌, మయన్మార్‌లతో పాటు పాకిస్థాన్‌ సైతం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి ఏకాకి అయి ఉండేది. వాషింగ్టన్‌ అడ్డు చక్రం వేయడంతో పాక్‌ ఆ ప్రమాదం నుంచి బయటపడింది.

పాక్‌పై అమెరికాకు అభిమానం పుట్టుకురావడానికి కారణం ఉక్రెయిన్‌ యుద్ధమే. తనకు బద్ధ శత్రువులైన అల్‌ఖైదా, ఐసిస్‌ ఉగ్రవాదులను పాక్‌ సాయంతో ఉక్రెయిన్‌లో రష్యాపైకి ఉసిగొల్పాలని అమెరికా చూస్తోంది. మధ్యాసియాలోని ముస్లిం రిపబ్లిక్‌లను, లేదా అక్కడి ఉగ్రవాద శక్తులను రష్యాపైకి ఉసిగొల్పడానికీ పాక్‌ పనికొస్తుంది. తన మాట వినకుండా రష్యా నుంచి చమురు తెచ్చుకుంటున్న భారత్‌పైనా ఒత్తిడి పెంచడానికి పాక్‌ను అమెరికా పావుగా ఉపయోగించుకొంటోంది. దాయాది దేశం మొదటి నుంచీ అమెరికా, నాటోలకు పరోక్ష సేనగా నిలుస్తోంది. అఫ్గాన్‌పై సోవియట్‌ యూనియన్‌ దండెత్తినప్పుడు ముజాహిదీన్‌లకు పాక్‌ శిక్షణ, ఆయుధాలనిచ్చి సోవియట్లపై పోరాటానికి దింపింది. ఇరాక్‌, సిరియాలలోనూ కిరాయి సేనగా పనిచేసింది. ఇప్పుడు ఉక్రెయిన్‌కూ ఉగ్రవాదులను పంపడానికి పాక్‌కు అమెరికా తాయిలాలు ఇస్తోందని సైనిక నిపుణులు చెబుతున్నారు.

రష్యా సైతం ఏమీ తక్కువ తినలేదు. అగ్రరాజ్యం శిక్షణ ఇచ్చి, చివరకు నట్టేట ముంచిన అఫ్గాన్‌ ప్రత్యేక దళాలను ఉక్రెయిన్‌పై పోరుకు దించాలనుకొంటోందని ముగ్గురు మాజీ అఫ్గాన్‌ సైన్యాధికారులు వెల్లడించారు. అఫ్గాన్‌ ప్రభుత్వం తరఫున తాలిబన్లపై పోరాటానికి గతంలో అమెరికా మెరికల్లాంటి స్థానిక యోధులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చింది. నిరుడు అఫ్గాన్‌ నుంచి నిష్క్రమించేటప్పుడు వారికి అమెరికాలో స్థిరపడే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చింది. కానీ, వారిని గాలికి వదిలేసింది. తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చాక ఆ పూర్వ కమాండోలను వేటాడి చంపుతున్నారు. దాంతో చాలామంది పొరుగున ఉన్న ఇరాన్‌కు పారిపోయారు. ఆ మాజీ అఫ్గాన్‌ కమాండోలకు నెలకు 1500 డాలర్ల వేతనమిస్తామని, వారికి వారి కుటుంబాలకు భద్రమైన నెలవుల్లో స్థిరపడే అవకాశం కల్పిస్తామని రష్యా ప్రతిపాదిస్తోంది. ఏతావతా అగ్రరాజ్యం, క్రెమ్లిన్‌ స్వీయ ప్రయోజనాలకోసం ఎంతకైనా సిద్ధపడుతున్నాయి.

- ఆర్య

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ తైవాన్‌తో ఉపయుక్త బంధం

‣ తరిగిపోతున్న వన్యప్రాణి జనాభా

‣ బ్రెజిల్‌ పీఠంపై మరోసారి లూలా

‣ ఆర్థిక ఉత్తేజానికి సత్వర పెట్టుబడులు

Posted Date: 05-11-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం