• facebook
  • whatsapp
  • telegram

ఆర్థిక ఉత్తేజానికి సత్వర పెట్టుబడులు

 

 

ప్రైవేటు పెట్టుబడులను ఆకట్టుకోవడంలో ప్రభుత్వం సఫలం కాలేకపోతోంది. ‘మేక్‌ ఇన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌’ పథకాలు సైతం ఆశించిన స్థాయిలో ఫలితాలనివ్వడంలేదు. ఈ తరుణంలో పెట్టుబడిదారుల్లో నమ్మకం పాదుగొల్పడానికి ప్రభుత్వ వ్యయం గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉంది. గతానుభవాలు సైతం ఇదే సరైనదని రుజువు చేస్తున్నాయి.

 

కొవిడ్‌, ఉక్రెయిన్‌ యుద్ధం వంటి పరిణామాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంలోకి జారిపోతోంది. ఈ సమయంలో భారతదేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రవాహం రెండింతలై 8,300 కోట్ల డాలర్లకు చేరడం నిజంగా పన్నీటి జల్లు లాంటి వార్త. ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) చేపట్టడం, ప్రభుత్వపరమైన నియమనిబంధనల పాటింపును వేగవంతం చేయడం, దేశంలో వ్యాపార సౌలభ్యం పెరగడం వంటివి దీనికి కారణాలు. నాణేనికి రెండో వైపు చూద్దాం. భారతదేశం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడవలసి వస్తోంది. ఇది స్వాగతించాల్సిన అంశం కాదు. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ను మరింత పటిష్ఠంగా అమలు చేయడం ద్వారా స్వదేశంలో ఉత్పత్తి పెంచి దిగుమతులను తగ్గించుకోవాలి. మరోవైపు స్థూల మూలధన నిర్మాణంలో విదేశీ పెట్టుబడుల వాటా 3.8శాతం (2014-15) నుంచి 2.4శాతానికి (2019-20) క్షీణించిందని ‘నేషనల్‌ ఎకౌంట్స్‌ స్టాటిస్టిక్స్‌’ వెల్లడించడం గమనించాల్సిన విషయం. అంతర్జాతీయ వాణిజ్య సౌలభ్య సూచీలో 2014లో 142వ స్థానంలో ఉన్న భారతదేశం 2022 వచ్చేసరికి 63వ స్థానానికి ఎగబాకింది. అయినా విదేశీ పెట్టుబడులు ఆ స్థాయిలో పెరగకపోవడం ఆందోళనకరం. 2015-16లో 13.1శాతంగా ఉన్న పారిశ్రామికోత్పత్తి వృద్ధిరేటు 2019-20లో 2.4శాతానికి తగ్గిపోయింది. భారత్‌ గణనీయంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించినా దానివల్ల ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలేవీ పుంజుకోలేదన్నమాట. మేక్‌ ఇన్‌ ఇండియా, ఆత్మ నిర్భర్‌ భారత్‌ పథకాలు స్వదేశంలో ఉత్పాదక యంత్రాల తయారీకి పెద్దయెత్తున ఊతమివ్వలేకపోయాయని అర్థమవుతోంది. ప్రభుత్వం ఎన్ని ప్రోత్సాహకాలిచ్చినా- స్వదేశీ పెట్టుబడులు ఆశించిన రీతిలో పెరగడం లేదు. గత నెలలో కార్పొరేట్‌ అధిపతులతో జరిపిన సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ అంశంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

కానరాని విశ్వసనీయత

ఇక్కడ గుర్తుంచుకోవలసిన అంశం ఏమిటంటే- లాభాలు వస్తాయంటే తప్ప ప్రైవేటు పెట్టుబడిదారులు జేబు నుంచి పైసా బయటకు తీయరని. మున్ముందు ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుందన్న నమ్మకం కలగకపోతే ఎవరూ పెట్టుబడులు పెట్టడానికి ముందుకురారు. సరిగ్గా ఆ నమ్మకమే ఇప్పుడు ప్రైవేటు పెట్టుబడిదారులకు లోపించింది. 2014-15 నుంచి 2018-19 వరకు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు రూ.4.32లక్షల కోట్ల రూపాయల మేరకు పన్ను మినహాయింపులు ఇచ్చింది. ఇప్పటికే రంగంలో ఉన్న కంపెనీలకు 2019లో కార్పొరేట్‌ పన్నును 30శాతం నుంచి 22శాతానికి తగ్గించింది. కొత్త కంపెనీలకైతే 25శాతం నుంచి 15శాతానికి తగ్గించింది. అయినా ప్రైవేటు పెట్టుబడులు పెరగలేదు. పన్నుల కోతవల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయింది. ఉపాధి అవకాశాలూ పెరగలేదు. కొవిడ్‌, అంతర్జాతీయ పరిణామాల వల్ల మున్ముందు గడ్డు స్థితులు తప్పవనే భయంతోనే ప్రైవేటు పెట్టుబడిదారులు ముందుకురావడం లేదు. సంపన్నులకు, కంపెనీలకు పన్నులు తగ్గిస్తే వారు ఎక్కువ పెట్టుబడులు పెడతారని, దానివల్ల సామాన్య ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే నమ్మకం వమ్మయింది. ఉన్నత శ్రేణి నుంచి ప్రయోజనాలు బొట్టుబొట్టుగా  దిగువ శ్రేణికి అందుతాయనే ‘బిందు ధార’ ఆర్థిక సూత్రమది. సమీప భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయనే నమ్మకం కార్పొరేట్‌ సంస్థలకు కలగకపోతే- ప్రభుత్వం ఎన్ని రాయితీలిచ్చినా, వ్యాపార సౌలభ్యాన్ని పెంచినా ప్రయోజనం ఉండదు.

 

పరిష్కారం ఏమిటి?

ఆదాయం పై నుంచి కిందకు దిగుతుందనే సూత్రం బదులు ప్రభుత్వమే వ్యయాన్ని పెంచితే ఆర్థికాభివృద్ధి పుంజుకొని, కొత్త పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ‘బిరబిరా ముందుకు’ వస్తాయనే సూత్రం మేలనే వాదం బలపడుతోంది. ప్రైవేటు పెట్టుబడులను పెంచడానికి ‘బిందు ధార’ కన్నా ‘బిరబిరా ముందుకు’ సిద్ధాంతం ఉపకరిస్తుందన్నమాట. ప్రభుత్వ వ్యయాన్ని పెంచకుండా కంపెనీలకు, సంపన్నులకు ఎన్ని పన్ను రాయితీలిచ్చినా వృథాయే. 1997 తూర్పు ఆసియా ఆర్థిక సంక్షోభంలో భారత్‌కు ‘బిరబిరా ముందుకు’ సూత్రం ఎంతో అక్కరకొచ్చింది. అప్పటి వాజ్‌పేయీ ప్రభుత్వం స్వర్ణచతుర్భుజి, ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన వంటి పథకాలతో మౌలిక వసతుల నిర్మాణంపై భారీగా వ్యయం చేయడంతో జనం చేతిలో బాగా డబ్బు ఆడింది. వస్తుసేవలకు గిరాకీ పెరిగి, దాన్ని తీర్చడానికి ప్రైవేటు పెట్టుబడులు ముందుకొచ్చి ఉత్పత్తిని పెంచాయి. నాటి మౌలిక వసతులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. బిరబిరా పెట్టుబడుల ప్రవాహం 1950-70 మధ్యకాలంలోనూ దేశాన్ని ఆదుకుంది. 2008 ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించింది. స్వదేశీ, విదేశీ పెట్టుబడులను పెంచడానికి ఈ సిద్ధాంతం ఇప్పుడూ ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. ప్రభుత్వ వ్యయం పెంచడం అవసరమే. ఉత్పాదక కార్యకలాపాలపైన, మౌలిక వసతుల విస్తరణమీద వ్యయాన్ని పెంచడం ద్వారానే ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపు తీసుకురాగలుగుతాం. ప్రభుత్వ నిధులు అవినీతికి, దుబారాకు గురికాకుండా జాగ్రత్త వహించాలి. ఉత్పత్తిని పెంచే కార్యకలాపాలకే ప్రభుత్వ పెట్టుబడులను ప్రవహింపజేయాలి. ఉత్పత్తి పెరిగినప్పుడు ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. ఫలితంగా వస్తుసేవలకు గిరాకీ పెరిగి దాన్ని తీర్చడానికి స్వదేశీ, విదేశీ పెట్టుబడులు బిరబిరమంటూ వచ్చిపడతాయి. ‘ఆలస్యం అమృతం విషం’ కాబట్టి ఈ చర్యలను వేగంగా చేపట్టాలి.

 

సమర్థ చర్యలు అవసరం

ప్రభుత్వం పెట్టుబడుల వ్యయాన్ని పెంచడం ద్రవ్యోల్బణానికి, అధిక విత్త లోటుకు దారితీస్తుందనే ఆర్థికవేత్తలూ ఉన్నారు. రిజర్వు బ్యాంకు ద్రవ్య సరఫరాను తగ్గించడానికి వడ్డీ రేట్లను పెంచినా ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉందని గమనించాలి. ఆహార, ఇంధన ధరలను తగ్గించడానికి ప్రభుత్వం సమర్థ చర్యలు తీసుకుంటే ద్రవ్యోల్బణం దారికి వస్తుంది. ప్రభుత్వ పెట్టుబడి వ్యయం పెరిగితే విత్తలోటు పెరుగుతుందనేది నిజమే కానీ, అదే సమయంలో ఆర్థిక కార్యకలాపాలు, వాటితో పాటు ప్రభుత్వానికి పన్నుల రూపేణా ఆదాయం పెరిగి విత్తలోటు అదుపులోకి వస్తుందని మరచిపోకూడదు. సాధారణంగా పొదుపు చర్యలకు ప్రాధాన్యమిచ్చే ఐఎంఎఫ్‌ కూడా ఈసారి వర్ధమాన దేశాల్లో ప్రభుత్వ పెట్టుబడులు పెరిగితే ఆర్థికాభివృద్ధి ఊపందుకొంటుందని సిఫార్సు చేస్తోంది. భారతదేశం ఈ సిఫార్సును పాటించాలి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆఫ్రికాబంధం... బహుళ ప్రయోజనకరం!

‣ చమురు ధరల పోటుతో భారత్‌కు తీరని చేటు

‣ స్కూలు నుంచే సైన్యంలోకి!

‣ అదనంగా నేర్చుకో.. అవకాశాలు అందుకో!

Posted Date: 04-11-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం